Sunday, March 19, 2017

సంధుల విఙ్ఞానము.,15..అపదాది స్వర సంధి

5.అపదాది స్వర సంధి

"అంద్వవగాగమంబులందప్ప నపదాది స్వరంబు పరమగునప్పుడచ్చునకు సంధి యగు"

(అందు+అవక్+ ఆగమంబులు  .,అంద్వాగమంబులు)

పదము కానిది అపదము.,దానిలో నున్నఅచ్చు ఆదిస్వరము అది "అపదాదిస్వరము"
అందు అవక్ వంటి ఆగమాలు తప్పించి మిగిలిన పదాలుకాని ఆజాది ఆగమాలు ప్రత్యయాలు గాని పూర్వపదమందలి అచ్చుకు పరమైతే సంధి నిత్యముగా జరుగుతుంది.
అందు..,అవక్  వంటి పదాలు పరమైతే యధాసంభవాలుగా అంటే సంధి జరిగితే సంధి రూపము...సంధి జరగని యెడల యడాగమము వస్తుందని అర్ధము.

అంద్వాగమంబులు తప్పించి మిగిలిన పదాలకుదాహరణ
మూర+ఎడు...మూరెడు(అ+ఎ..,ఎ)
వీసె+ఎడు....వీసెడు  (ఎ+ఎ..,ఎ)
అర్ధ+ఇంచు..,అర్ధించు(అ+ఇ.,ఇ)
నిర్జి+ఇంచు...నిర్జించు(ఇ+ఇ.,,ఇ)
పై ఉదాహరణలయందు..సంధి నిత్యముగా జరిగి పరస్వరం ఆదేశమైనది.

అంద్వాగమంబులు  అయితే యథాసంభవాలు..సంధి జరగవచ్చు లేదా  యడాగమము రా వచ్చు
ఉదాహరణలు
1.రాముల+అందు...రాములందు(అ+అ,,అ)  అకార సంధి
రాములయందు....(అ+అ..య్) యడాగమమొచ్చిన రూపము

2.హరి+అందు.,హరియందు...సంధి లేదు  యడాగమమే అవశ్యం
3.తొమ్మిది+అవది..తొమ్మిదవది..(ఇ+అ,.అ)ఇకార సంధి
తొమ్మిదియవది,.,,యడాగమము వచ్చిన రూపము.

6.ద్విరుక్తటకారసంధి.

కుఱు..చిఱు...కడు...నిడు.,.నడు...శబ్దములందలి   ఱ..,డ  లకు అచ్చు పరమగునప్పుడు  ద్విరుక్త టకారంబగు

ఱ..డ   లు అనగా   బండిరాకు(శకటరేఫకు) డకారానికని అర్ధము.
ద్విరుక్త టకారమనగా  రెండుసార్లు చెప్పబడిన  టకారమని  అనగా "ట్ట"  అని అర్ధం.
కుఱు..చిఱు  అనే శబ్దాలలోని" ఱ"  (శకటరేఫ)కు కడు,,,నడు...నిడు,..శబ్దాలలోని డకారమునకు  గాని అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారం  (ట్ట) ఆదేశంగా వస్తుందని సూత్రార్ధము.
కుఱు+ఉసురు..,కుట్టుసురు (ఱ్+ఉ+ఉ..ట్ట్+ఉ,.ట్టు)
చిఱు+అడవి.....చిట్టడవి..(ఱ్+ఉ+అ...ట్ట్+అ...ట్ట)
కడు+ఎదురు...కట్టెదురు..(డ్+ఉ+ఎ...ట్ట్+ఎ..ట్టె)
నడు+అడవి...నట్టడవి...(డ్+ఉ+అ..,ట్ట్+అ...ట్ట)
నిడు+ఊర్పు...నిట్టూర్పు..(డ్+ఉ+ఊ...ట్ట+ఊ...ట్టూ)

పై ఉదాహరణలు గమనించినచో  ద్విరుక్త టకారము ఆదేశమైనపిమ్మట  నిత్యసంధి అయిన ఉకార సంధి ప్రతిచోట జరిగినది,,మిత్రులు గమనించ గలరు

అయితే ఈ సంధిని ఫ్రౌఢ వ్యాకరణం.."చిఱు"  అనే పదానికి బదులుగా  "చిట్టి "  అనే పదాన్ని తీసుకున్నది

చిట్టి+అడవి  చిట్టడవి,,,ఇకార సంధి
చిట్టి+ఆముదము...చిట్టాముదము
చిట్టి+ ఉడుకు..చిట్టుడుకు

కాని.,సాదారణముగా ద్విరుక్తటకార సంధికి  బాలవ్యాకరణాన్నే ప్రామాణికంగా తీసుకుంటారందరు..కుఱు చిఱు నడు నిడు సూత్రమే మిగిలిపోయింది.
ఏలననగా
చిట్టి+చాప ..చిట్టిచాప...చిటిచాప
చిట్టి+పాప  చిట్టిపాప    చిటిపాప
చిట్టి+తాళము..చిట్టితాళము...చిటితాళము  అనేరూపాలున్నాయి..హల్లుపరమైనప్పుడు  ద్విరుక్త టకారములోని ఒక ట లోపించినది....అదీ  బాల వ్యాకరణములోని "అక్కడాదులజడ్డకు లోపంబు బహుళంబుగానగు"  అనే సూత్రము వలననే సిద్దిస్తుంది.

అయితే  మనమిక్కడ గమనించ వలసిన ముఖ్యాంశమొకటున్నది..
కుఱు...,చిరు ...నడు.,,నిడు  అనే పదాలున్నాయా? లేవు కదా? కడు   అనే పదమున్నది వాటి పూర్తి రూపాలిలా ఉంటాయి
"కుఱుచ" బుద్ధి ..."చిఱుత" ప్రాయము...."నడుము"సన్నన
"నిడుద"(పొడవు)మిక్కిలి ...."కడు"సామార్ధ్యము
ఇవి అసలు శబ్దాలు   వీటిని సమానం చేసే సమయంలో ఒక్క కడ శబ్దానికి తప్ప మిగిలిన వాటికి అంత్య వర్ణం లోపిస్తుంది.అలా లోపించిన వాటినే మనం తీసుకుంటాము
అవే  కఱు..చిఱు  నడు..నిడు.....శబ్దాలు .

సశేషం   రేపుకలుద్దామా..... 
సంధుల విఙ్ఞానము.,14  ఇకార సంధి(మరికొన్ని రూపాలు)

c)"మద్యమ పురుష క్రియలయం దిత్తునకు సంధి యగు"
నీవు..,మీరు  అనేవి మద్మ పురుష వాచకాలు..కావున ఈ పురుషలలో ఉండే క్రియలు  మద్యమ పురుష క్రియలు

మద్యమ పురుషార్ధములో క్రియాపదమందిలి ఇత్తునకు(హ్రస్వ ఇకారమునకు అచ్చులు పరమయితే సంధి నిత్యముగా జరుగునని సూత్రార్ధము....,,
మనమిక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి  ఏమంటే
క్రియా పదాల హ్రస్వ ఇకారానికి సంధి "వైకల్పికం"గా వస్తుంది   కాని
మద్యమ పురుష క్రియా పదములందుదిత్తునకు సంధి "నిత్యము"
(దయచేసి తేడా గమనించగలరు)

చదివితివి+అప్పుడు(ఇ+అ--అ)...చదివితివప్పుడు
చూచితివి +ఇపుడు(ఇ+ఇ--ఇ)...చూచితివిపుడు
పోయితిరి+ఎపుడు(ఇ+ఎ--ఎ)..,పోయితిరెపుడు

"నీవు" చదివితివప్పుడు..."మీరు" పోయితిరెప్పుడు
ఇవన్నీ మద్యమ పురుష క్రియలు..

d)క్త్వార్ధంబున ఇత్తునకు సంధి లేదు

క్త్వార్ధము..అనగా భూతకాల అసమాపక క్రియ

క్త్వార్ధాన్ని ఇచ్చే క్రియా పదము చివర హ్రస్వమైన ఇకారము ఉండగా అచ్చు పరమైనచో సంధి జరుగదు అని  సూత్రార్ధము..
సంధి జరుగనిచో  యడాగమము..వచ్చును

వచ్చి+ఇచ్చెను... వచ్చియిచ్చెను.,  ఇ+ఇ సంధి లేదు  కావున యడాగమము.
"వచ్చి"..ఈ పదము  భూతకాల అసమాపక క్రియ  కావున సంధిలేదు..సంధి లేనిచోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు...ఈ సూత్రముచే  యడాగమము వచ్చి
వచ్చి+య్+ఇచ్చెను....వచ్చియిచ్చెను అయినది

e)" ఇఁకాదులకు దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు"

(ద్రుత ప్రకృతికం---నకారము చివరగల పదము)
ఇఁక.,,ఇఁగ...,ఎట్టకేలకు...,ఎట్టకేని,, ఇలాంటి వాటిని  ఇకాదులంటారు...వీటికి సంధి వైకల్పికము..మిగిలిన వాటికి  సంధిలేదు.
ప్రధమేతర అనే సూత్రములో చెప్పబడిన ద్రుత ప్రకృతికాలకు..ఇకాదులలోని ద్రుతప్రకృతికాలకు తప్పించి మిగిలిన ద్రుతప్రకృతికాలకు సంధి లేదని సూత్రార్ధము.
ఈ క్రింది ఉదాహరణలు  ఇఁకాదులు కాదు  ..కావున వీటిలోని ద్రుతానికి అచ్చు పరమైతే  లోపం రాక సంధిలేక పర అచ్చులో సంయోగమౌతాయి.

వచ్చున్+ఇప్పుడు..వచ్చునిప్పుడు..
చూడన్+అయితి.,చూడనయితి
ఉండెడిన్+అతడు..ఉఆడెడినతడు...

,ఈ మూడు ఉదా....లోకూడాసంధిలేదు  ద్రుతం పరచ్చులో కలసిపోయింది.
కావున,,ఇఁకాదులలోని ద్రుతమునకు అచ్చు పరమైనచో సంధి వికల్పము
1.ఇఁకన్+ఏమిటి.,,,ఇఁకేమిటి....(సంధి జరిగిన రూపము)
ఇఁకనేమిటి ... (ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)
2.ఎట్టకేలకున్+అయినది.,ఎట్టకేలకైనది(సంధి జరిగిన రూపము)
ఎట్టకేలకునయినది(ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)
3.ఎట్టకేనికిన్+ఇది..,ఎట్టకేనికిది(సంధి జరిగిన రూపము)
ఎట్టకేనికినిది...(ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)

సశేషం...రేపు కలుద్దామా?


సంధుల విఙ్ఞానము.,13. ఇకార సంధి..15/3/17

4..ఇకార సంధి

A)సూత్రము:-"ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగానగు"

ఏమి..మఱి..కి(.షష్టీ విభక్తి)..అది..అవి.,ఇది,,ఇవి.,ఏది.,ఏవి..అనేవి ఏమ్యాదులు
"ఇత్తు " అనగా  హ్రస్వమైన ఇకారము
"వైకల్పికము"  అనగా  ఒకసారి సంధి జరుగుట ఒకసారి సంధి జరుగక పోవుట

ఏమి మొదలైన పదాల చివర నున్న హ్రస్వ ఇకారమునకు అచ్చులు పరమైనచో సంధి వికల్పముగా జరుగునని సూత్రార్ధము..సంధి జరుగని యెడల యడాగమము వస్తుంది కదా.
ఏమి+అంటివి
ఏమంటివి....(ఇ+అ---అ) సంధి జరిగిన రూపము
ఏమియంటివి..(ఇ+అ..య)  సంధి లేమి యడాగమము

మఱి+ఏమి.,,మఱేమి(ఇ+ఏ--ఏ)  సంధి జరిగిన రూపము.
మఱి+ఏమి,,మఱియేమి  (ఇ+ఎ--యే) సంధి లేమి యడాగమము

హరికిన్+ఇచ్చె
హరికిచ్చె..(కిన్+ఇ---ఇ)   సంధి జరిగిన రూపము(సంధిలో ద్రతము జారిపోయినది
హరికినిచ్చె..(న్+ఇ,,,ని)  సంధి జరుగక ద్రుతం సంయోగము

సంధి జరుగక  యడాగమము రాదు ఎందువలననగా ద్రుతం పొల్లుహల్లు కావున అచ్చుతో సంయోగము చెంది  "హరికినిచ్చె" అయినది.

B) సూత్రము:- "క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు" ("క్రియ " అనగా చేసే పనిని గూర్చి తెలియ జేయు పదము )
క్రియా పదాలు హ్రస్వమైన ఇకారాంతములై వాటికి అచ్చులు పరం అయితే  సంధి వైకల్పికంగా వస్తుంది  అని సూత్రార్ధం.

వచ్చిరి+అప్పుడు
వచ్చిరప్పుడు...,,(&ఇ+అ..అ)..సంధి జరిగినది
వచ్చిరియప్పుడు.,సంధిలేక  యడాగమము వచ్చినది

వచ్చితిమి+ఇప్పుడు
వచ్చితిమిప్పుడు  (ఇ+ఇ.,ఇ  )..సంధి జరిగినది
వచ్చితిమియిప్పుడు (ఇ+ఇ--య )  సంధిలేక  యడాగమము వచ్చినది
అయితే ఈ ఇకార సంధి ప్రధమ పురుష, ఉత్తమ పురుష క్రియా పదాలలో మాత్రమే వస్తుంది.
(వాడు,,, అది..వారు  ప్రదము పురుష
నేను   .,మేము...మనము..,ఉత్తమ పురుష)

వచ్చిరి+అప్పుడ..వచ్చిరప్పుడు  "వచ్చిరి"  క్రియా పదము
"క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు" ఈ సూత్రముతో సంధి జరిగినది

వచ్చిర్+అప్పుడు.,వచ్చిరప్పుడు(ర్+అ..ర) సంధి లేదు  (పొల్లు హల్లు అయిన ర్  లో అ  సంయోగము చెంది "ర" అయినది)

వచ్చిరి+అప్పుడు.,వచ్చిరి+య్+అప్పుడు.,,వచ్చిరియప్పుడు  యడాగమము వచ్చిన రూపము
***********************************************--*******
(** వసరమొచ్చింది కావున "పురుష వాచకాలు"(persons)అనగా నేవో   చూద్దాము---"పురుషలు  మూడు రకాలు
"నామ యుష్మదస్మదర్ధములందుం బ్రదమ మద్యమోత్తమంబులగు"
నామార్ధములో.,,.ప్రధమ పరుష క్రియ.,ఎక్కడో ఉన్న వారి గురించి
యుష్మదర్ధంలో...మద్యమ పురుష క్రియ..ఎదురుగా ఉన్న వారిని గురించి
అస్మదర్ధంలో...,ఉత్తమ పురుష క్రియ..తనను గురించి  తెలియచేస్తుంది
వాడు..,అది...వారు......ప్రధమ పురుష
నీవు..,మిరు..,,,,.మద్యమ పురుష
నేను  మేము   మనము....ఉత్తమ పురుష
"తానుత్తమ..ఎదుట మద్యమ...ఎక్కడో  ప్రధమ"
******************************************************-**
ఇకార సంధి రూపాలు మరికొన్ని రేపు ముచ్చటించుకుందాము

సశేషం...రేపు కలుద్దామా?





సంధుల విఙ్ఞానము.,12,అకారసంధి విశేషాలు..14/3/17

అకారసంధి(అత్వసంధి)లోమరికొన్ని విశేషాలు గమనిద్దాము

A)"బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు"
బహుళము  అనే పదము వాడుట వలన "స్త్రీలను" అనే బహువచన రూపముతోననియు,తత్సమ శబ్దాలకు సంబోధన చివరగా గల శబ్దాల యందలి అచ్చులకు అచ్చులు పరమైతే సంధి జరగదు అని అర్ధం  సంధి జరుగనిచో  యడాగమం వస్తుంది కదా.

(తత్సమ శబ్దమనగా సంస్కృత శబ్దము కాదు కాని సంస్కృత శబ్దము వంటి  శబ్దమని అర్ధము)

ఉదా.,,
అమ్మ+ఇచ్చెను.,అమ్మయిచ్చెను (స్త్రీ వాచకమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది)

దూత+ఇతడు,,దూతయితడు  (తత్సమ శబ్దమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది)

చెలువుడ+ఉందము..చెలువుడయిందము("చెలువుడ" సంబోధన శబ్దమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది)

వీటికి సంధి జరిగినచో...
మమ్మిచ్చెను..
దూతితడు
చెలువుడిందము  అనే దుష్టరూపపదాలొస్తాయి.

B)వెలయాల్వాదుల సంధి లేమి బహుళంబుగానగు

వెల+ఆలు.,...,,అకారసంధి జరగాలి కాని బహుళముగా అకారసంధి జరుగునని చెప్పినందున బహుళములో సంధి రాకపోవటం కూడా భాగమైనందున సంధిలేక యడాగమమొచ్చి

వెల+య్+ఆలు...వెలయాలు  అయినది...

ఓకవేళ సంధి జరిగితే "వెలాలు" అనెడి అనిష్ట రూపం వస్తుంది

C)శ్రేష్టతా వాచకంబులగు "నార్యాంబాద్యర్ధక" శబ్దంబుల పరంబులగుచో ఆన్ని యచ్చులకు సంధి నిత్యము
(ఆర్య+అంబ+ఆది+అర్ధక...ఆర్యాంబాద్యర్ధక)

ఈ  సూత్రము నిత్యవిధిని తెలియజేయుచున్నది.అట్లు తెలియజేయకున్నచో  బహుళమో  వికల్పమో వచ్చినచో
రామ+అయ్య.,,రామయ్య....రామయయ్య  అనే రెండు రూపాలుగా  అవుతుంది

శ్రేష్టతా వాచకాలు:-గొప్పను సూచించే శబ్దాలు..,
శ్రేష్టత్వాన్ని సూచించే  ఆర్య అంబ  మున్నగు శబ్దాలు  అన్ని అచ్చులకు పరమైన సంధి నిత్యముగా జరుగునని అర్థము .

రామ+అయ్య..,రామయ్య(అ+అ)   అకారసంధి నిత్యము

సోమి+అయ్య.,సోమయ్య(ఇ+అ)ఇకారసంధి నిత్యము

సీత+అమ్మ.,,,.,సీతమ్మ   (అ+అ)   అకారసంధి నిత్యము

లక్ష్మి+అమ్మ...లక్ష్మమ్మ   (ఇ+అ)ఇకారసంధి నిత్యము

**ఆది శబ్దములగు అన్న,, అక్క,,,అప్ప..పరమగునప్పుడు అకార  సంధి నిత్యము
రామ+అన్న..,,రామన్న

సీత+అక్క.,,సీతక్క

వెంక+అప్ప,,,వెంకప్ప

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం...రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము..11  యడాగమ సంధి.అకార సంధి

2.యడాగమ సంధి

సూత్రం--"సంధిలేని చోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు"

సంధి రెండు అచ్చుల మద్య జరగని సందర్భములో (ఎలాంటి అచ్ సంధి అయినా ఆ రెండు పదాలలో ఉండే) అచ్చుల మద్య యట్ అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది  "యట్" అనేది టిత్తు కనుక పరపదములోని మొదటి అచ్చుకు వచ్చి చేరుతుంది "యట్" అనే దానిలో "య్ " అనేది మాత్రమే మిగులుతుంది .ఆగమము అనగా ఒక అక్షరం అధికంగా  వచ్చి చేరటం .

ఉదాహరణ
మా+అమ్మ...మాయమ్మ...అకారసంధి జరగలేదు
మీ+ ఇల్లు  .,మీయిల్లు...ఇకార సంధి జరగలేదు
మా+ఊరు....మాయూరు   అకార సంధి జరగలేదు

వివరణ ...
మూడు ఉదాహరణలలోను పూర్వపదం చివర ఆ..,ఈ...ఆ అనే అచ్చులు ధీర్ఘములుగానున్నవి. అందువలన సంధి జరగలేదు.హ్రస్వ అకారమునకు మాత్రమే అకారసంధిలో అచ్చు పరమైతే సంధి జరుగుతుంది  ..సంధి జరగలేదుకావున యడాగమము వచ్చినది
యడాగమము రానిచో అర్ధాలు సరిగానుండవు
మమ్మ..మిల్లు..మూరు  అవుతాయి  ఇవి అర్ధరహితము కదా..
అకార..ఇకార..,ఉకార సంధులలో పూర్వ పదం చివర ధీర్ఘాచ్చులు ఉన్నయెడల సాదారణముగా సంధి జరగదు..హ్రస్వాచ్చులు ఉన్నా కొండొకచో సంధి జరగదు..యడాగమం రావటానికి  సంధి జరిగినదా లేదా అనేది గమనించ వలసిన విషయము.

3.అకార సంధి (అత్త్వసంధి)

సూత్రం...."అత్తునకు సంధి బహుళముగానగు"

"అత్తు" అనగా హ్రస్వ అకారము.,బహుళమనగా ఒకసారి సంధి జరగటం ఒకసారి సంధి జరగక పోవటం ఒకసారి విభాషగా సంధి జరగటం..ఒకసారి మరోరకముగా జరగటం
ఉదా..,,
మేన+అల్లుడు...మేనల్లుడు...సంధి జరిగిన రూపము
మేనయల్లుడు..,యడాగమము వచ్చిన రూపము

పుట్టిన+ఇల్లు .,,పుట్టినిల్లు  సంధి జరిగిన రూపము
పుట్టినయిల్లు..యడాగమము వచ్చిన రూపము

చూడక+ఉండెను..చూడకుండెను..సంధి జరిగిన రూపము
చూడకయుండెను...యడాగమము వచ్చిన రూపము
-------------------------------------------------------------------------------
అయితే  "చూడకుండెను"....."చూడక యుండెను" అనే రెండు పదములను గైకొని మనమిక్కడ కాసేపాగి గణముల గురించి ముచ్చటించు కుందాము...."
చూడకుం/డెను  ----- UIU/II ---ర గణము /లల  (లా)
చూడక /యుండెను-UII/UII..భ గణము/భ గణము

మాతయు /"చూడకుం/డెను"గ/ మన్నుతి/నంగను/వెన్నదొం/గ, నే
మాతయు/ నొర్చునా/సుతుడు/------/-------/--------/----

చోరుడు/మన్నుయున్/తినగ /"చూడక /యుండెను"/వెన్నదొం/గ, నే
మారిచి/మాతకున్/----------/--------/--------/------/---

పైన ఉదహరించిన ఉత్పలమాల పద్య పాదాలు రెండు గమనించినచో...

--------/"చూడకుం/డెను"గ /-------/------/-------/---
ర గణము మరియు రెండు లఘువులకు ఒక అక్షరం  చేర్చి  న గణము గాను(రెండు పదాల మద్యన సంధి కూర్చి)

------/--------/------/"చూడక/యుండెను"/------/---
రెండు భ గణాలుగా(రెండు పదాల మద్యన యడాగమము చేర్చి)      రెండు పద్య పాదాలలోను ఒకే అర్ధమున్న  పదాన్ని వాడుకోవటం జరిగినది

కవి మిత్రులకు పద్యరచనా సమయంలో  సంధుల విఙ్ఞానము ఏవిధంగా ఉపయోగపడునో తెలియ చేయుటకే పై ఉదాహరణలు చూపటం జరిగినది గమనించ గలరు.
----------------------------------------------------------------------------------

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం.....రేపు కలుద్దామా?


సంధుల విఙ్ఞానము,,10  ఉకార సంధి(ఉత్వసంధి)

1.ఉకారసంధి(ఉత్వసంధి)
సూత్రము --"ఉత్తునకచ్చు పరమగునప్పుడు సంధియగు"
హ్రస్వమగు ఉకారానికి అచ్చు పరమైనప్పుడు అక్కడ సంధి జరుగుతుంది అని సూత్రార్ధము.

"ఉత్తు" అని తపకరణము  చేయుటవలన  హ్రస్వ " ఉ" కారము మాత్రమేనని  ధీర్ఘమైన "ఊ"  ఉండకూడదని భావింపవలయును.  అలాగే  పరపదమునందు అచ్చు అన్నప్పుడు..హ్రస్వ అచ్చైనా  లేదా ధీర్ఘ అచ్చైనా  ఉండ వచ్చు..
ఉదా...,
రాజు+అతడు....రాజతడ  (ఉ+అ=అ)
సోముడు+ఇతడు,,సోముడితడు  (ఉ+ఇ=ఇ)
మనము+ఉంటిమి,,మనముంటిమి (ఉ+ఉ=ఉ)
వాడు+ఎక్కడ ...,వాడెక్కడ..(ఉ+ఎ=ఎ)
ఇతడు+ ఒకడు.,,ఇతడొకడు  (ఉ+ఒ=ఒ
మనసు+ఐన..,మనసైన  ( ఉ+ఐ=ఐ)
సులభము+ ఔను  .,,సులభమౌను  (ఉ+ఔ=ఔ)

ఋ  అనే అక్షరాలు  ర...ల  అనే హల్లుల సమములని బాలవ్యాకరణం చెబుతున్నందున ఇవి పరాలగునప్పుడు సంది జరుగదు(ఉన్నవి ఉన్నటులే ఉఉండును)

అతడు+ఋషి...అతడుఋషి(సంధి జరుగలేదు యధాతధంగా ఉన్నది.)

A).ఉకార వికల్ప సంధి
సూత్రము..."ప్రథమేతర విభక్తి శత్రర్ధ చు వర్ణబులందున్న యు కారమునకు సంధి వైకల్పికముగానగు"

ప్రథమేతర విభక్తులనగా  ప్రథమా విభక్తి కాని ద్వితీయ తృతీయా మొదలైన విభక్తులు ..,ఇవి చాలా వరకు దృతంతాలు
శత్రర్ధ చువర్ణమనగా సంస్కృతం లో "శతృ" ప్రత్యయము వచ్చే చోట్ల  తెలుగులో  చు అనే వర్ణం వస్తుంది. వర్తమాన కాలములోని క్రియా విశేషణార్ధములో ధాతువుకు చు అనే అక్షరం  వస్తుంది .ఇది దృతాంతము  "చూచు" ధాతువు  చు వర్ణము చేరినందన "చూచుచు"...దృతాంతము కనుక  "చూచుచున్"..కావున
ప్రథమా విభక్తి కాక మిగిలిన విభక్తులలో పూర్వపదాంతములోని ఉకారమునకు శత్రర్ధములో వచ్చు  "చు" అనే అక్షరానికి పరపదములో అచ్చు పరమైనచో సంధి వికల్పంగా జరుగుతుంది అని సూత్రార్ధము.

(వికల్పము  లేదా వైకల్పికమనగా ఒకసారి చెప్పిన అంశము జరుగుట లేదా జరుగక పోవుట అని మనము ఇంతకు పూర్వమే తెలుసుకొనినాము)

ఉదాహరణలు

క్రింది ఉదాహరణలలో  ఉకారము మీద ఉన్న ద్రుతము అచ్చు పరమైనప్పుడు సంధి జరిగినచో లోపిస్తుంది అనియు,,సంధి జరుగని యెడల పరపదం అచ్చుతో కలసిపోతున్నదని మనం గ్రహించ వలెను

నన్నున్+అడిగె....నన్నడిగె,,(సంధి జరిగిన రూపం)
నన్నునడిగె(ద్వితీయా విభక్తి...ద్రుతం పర అచ్చుతో కలసింది)

నాకొరకున్+ఇచ్చె..నాకొరకిచ్చె...(సంధి జరిగింది )
నాకొరకునిచ్చె..(చదుర్ధీ విభక్తి.,ద్రుతం పరఅచ్చుతో....)

నాకున్+ఆదరువు...నాకాదరువు.......(సంధి)
నాకునాదరువు......(షష్టీ విభక్తి..ద్రుతం పర అచ్చుతో)

నాయందున్+ఆశ...నాయందాశ...(సంధి)
నాయందునాశ......సప్తమీ....(ద్రుతం పర అచ్చుతో)

వచ్చుచున్ +ఉండును..వచ్చుచుండెను(సంధి)
వచ్చుచునుండెను.....(శత్రర్ధక చు వర్ణము)

చూచుచున్+ఏగెను...., చూచుచేగెను..(సంధి)
చూచుచునేగెను....(శత్రర్ధక చు వర్ణము)

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం......రేపుకలుద్దామా?

సంధుల విఙ్ఞానము.,9  తెలుగు సంధులు

తెలుగు సంధులు

"పూర్వ పర స్వరంబులకు పర స్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు"

పూర్వ పదం చివర ఉన్న అచ్చుకు పర పదము మొదటనున్న అచ్చు పరమైనప్పుడు ఆ రెంటిలోను పరపదము యెక్క అచ్చు ఒక్కటే ఆదేశమగుటను సంధి  అని అంటారని అర్థం .

ఉదా..,
రాముడతడు....రాముడు+ అతడు..(విడదీసిన రూపము)  ఉ+అ.,,అ   (సంధిలో వచ్చిన మార్పు)
రాముడు   పూర్వపదము   అతడు  పరపదము  పూర్వపదము చివరి అక్షరం "డు"  డ్+ఉ=డు.,,డులో ఉన్న ఉ అనేదానిని డ కారోత్తర వర్తి అంటారు.,.,అతడు అనేది పరపదము
పూర్వపదములోని చివరనున్న "ఉ"  అనే అచ్చుకు "అతడు" అనే పరపదములోని "అ "  అనే అచ్చు పరంగానున్నది రెండుపదములలోని అచ్చులు పోయి రెండవపదములోని మొదటి అచ్చు ఒక్కటే ఆదేశముగా రావటమే తెలుగు సంధి లక్షణము..కావున
రాముడ్+ఉ+అతడు........రాముడ్ +(ఉ)+అ+తడు..రాముడ్+అ+తడు....రాముడతడు  అనే రూపము వచ్చినది ఇదియే సఁధి కార్యము

తెలుగులో  అచ్చులకు సంబంధించిన విధానమిలాఉంటూ  ఒక్కో అచ్చుకు సంబంధించి ఒక్కో సంధి ప్రారంభమైనది
తెలుగులో సంధులు  అచ్ సంధులు  హల్ సంధులు అని వ్యాకరణ కర్తలు విడదీయలేదు కాని  మనమలానే అలవాటు పడిపోయినాము.

సంధులలో  బాహ్య సంధులు  అంతర సంధులు అని రెండు రకాలున్నాయి.. వాక్యం లోని పదాలకు మద్య జరుగునవి బాహ్య సంధులు...ఏక పదములో ప్రకృతి  ప్రత్యయాలకు మద్య సమాసగత పదాలకు మద్య జరిగే సంధులను అంతర సంధులు అంటారు
ఉకార సంధుల వంటివి బాహ్య సంధులు  అయితే  స్వర సంధి...టుగాగమసంది అపదాది సంధులు అంతర సంధులు ..సాదారణముగా పదాల కలయికలో ఏదేని మార్పును గమనించినయెడల సంధి జరిగినది,సంధి పొసగినది.. అంటాము  ఎందుచేతననగా "దృత ప్రకృతికాలకు సంధి లేదు" ఏలననగా దృత ప్రకృతికం తరువాత అచ్చుతో కలసిపోతుంది. మార్పు ఉండదుకదా..
కొనెన్+ఇప్పుడు...కొనెనిప్పుడు.,,మార్పులేదు ,అనగా సంధి పొసగ లేదని తెలుసుకోవాలి.

తెలుగు సంధులు
1.ఉకార సంధి........
2.యడాగమ సంధి
3.అకారసంధి          
4.ఇకారసంధి
5.అపదాది స్వరసంధి
6.ద్విరుక్తటకార సంధి
7.టుగాగమ సంధి      
8రుగాగమ సంధి
9.గ స డ ద వాదేశ సంధి
10. ద్రుత-సరళాదేశ సంధి
11.పుంప్వాదేశ సంధి    
12.పుగాగమ సంధి
13.ప్రాతాది సంధి            
14.నుగాగమ సంధి
15.ఇత్వాదేశ సంధి
16.పెన్వాది సంధి
17.ఆమ్రేడిత సంధి
18.ము వర్ణలోప సంధి
19.పడ్వాది సంధి
20.అలిగాగమ సంధి
21.అనుకరణ సంధి
22.వి సంధి
23.పజ్పవర్షాదేష సంధి
24.త్రిక సంధి
25.లు..ల..న..ల సంధి
26.దుగాగమ సంధి
27.అల్లోప సంధి
28.మి కార లోప సంధి

సశేషం.....,రేపు కలుద్దామా?
సంధుల విఙ్ఞానము.,8..విసర్గ సంధి...

7) విసర్గ సంధి
(ఈ సంధి వలన ఏర్పడిన పదములనేకము మనము అనునిత్యము వాడుతుంటాము కావున ప్రత్యేకమైన శ్రద్ధ తో గమనించ వలసినదిగా మిత్రులకు నా విన్నపము)

గమనిక.....సంస్కృతమునందు "స"కారాంత పదములు కలవు అవి సంధి జరుగు సమయమున విసర్గ గానే కాక మరికొన్ని విధములుగా మారును.

a)స కారాంత పదములకు చ..,.ఛ....శ అను వర్ణములు పరమైనప్పుడు స కారం శవర్ణముగా మారును

ఉదా..
మనస్+ శాంతి...మనశ్శాంతి
తపస్+చర్య......తపశ్చర్య
దుస్+చరితము..దుశ్చరితము.,,మున్నగునవి

b)స కారాంత పదములకు.క   ఖ   ప   ఫ  అను వర్ణములు పరమగు నప్పుడు   స కారము విసర్గ ః   గామారును

ఉదా....
ప్రాతస్+కాలము...,ప్రాతఃకాలము
మనస్+ఖేదము....మనఃఖేదము
తేజస్+ పుంజము..తేజఃపుంజము
తపస్+ఫలము.......తపఃఫలము........,మొదలైనవి

c) ఇస్.,,ఉస్ అంతమందు గల ఉపసర్గలు మరియు శబ్దములయెక్క స కారములకు క   ఖ   ప   ఫ   వర్ణములు పరములగు నప్పుడు,,షకారము వచ్చును

ఉదా.,,
నిస్+కారణము....నిష్కారణము
దుస్+కార్యము....దుష్కార్యము
ధనుస్+ఖండము..ధనుష్ఖండము
చతుస్+పదము....చతుష్పదము........మొదలైనవి

d)స కారమునకు "ట" వర్ణము పరమగునప్పుడు షత్వమును షకారము పరమగునప్పుడు షత్వ  మరియు విసర్గలు వచ్చును

ఉదా...
ధనుస్+ టంకారము....ధనుష్టంకారము
చతుస్+షష్టి........,,..,,చతుష్షష్టి

e)అస్ అంతముగా గల పదములకు  క   ఖ   చ  ఛ   ట   ఠ   త   థ   ప   ఫ   శ   ష   స  కాక తక్కిన హల్లులేవేని పరమైనప్పుడు అస్ స్థానమునకు  ఓ కారము వచ్చును

ఉదా...
మనస్+గతి....మనోగతి
తపస్+బలము..,తపోబలము
మనస్+వేదన...,మనోవేదన
మనస్+ రధము..మనోరధము..,,,మున్నగునవి

f)ఇకారాద్యచ్చులు పూర్వమందుగల సకారమునకు  క   ఖ   చ  ఛ   ట   ఠ   త   థ   ప   ఫ   శ   ష   స వర్ణములు తప్ప తక్కిన హల్లులు   అచ్చులేవేని పరమైనప్పుడు రేఫము  వచ్చును

ఉదా..,
బహిస్+అంగము.....బహిరంగము
ఆశీస్+వదము......ఆశీర్వాదము
దుస్+అంతము..,.దురంతము
విస్+ధనులు.......విర్ధనులు
దోస్+బలము......దోర్బలము........మున్నగునవి

సంస్కృత సంధులలో మరెన్నో సంధులు కలవు కాని నేను వాటిని ప్రస్తావించటంలేదు  సామాన్యముగా మనకు కావలసినవనుకున్న అతిముఖ్యమైన వాటినే  ముచ్చటించటం జరిగినది కావున మిత్రులు గమనించ గలరు..

రేపటినుండి  తెలుగు సంధుల ప్రకరణము

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి   ఉదాహరణలు వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం... రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము..,7.,యణాదేశ, వృద్ధి  సంధులు

3)యణాదేశ సంధి

య,,,వ.....ర   లకు యణ్ణులని పేరు..ఈ యణ్ణులు ఆదేశమగుటవలన దీనికి యణాదేశ సంధి అని పేరువచ్చినది

సూత్రము--"ఇ...ఊ..,ఋ   లకు అసవర్ణములైన అచ్చులు  (అసమాన అచ్చులు) పరమైనప్పుడు  క్రమముగా య  వ   ర   లు  ఏకాదేశమగును"

ఇ.,ఉ  ఋ  అనేవి  ఇక్కులు
య,,,వ.....ర   లకు యణ్ణులని పేరు
అసమాన అచ్చులు పరమైతే
ఇ కారమునకు  య  కారము
ఉ కారమునకు వ కారము
ఋ  కారమునకు  రకారము
----    కారమునకు  ల కారము ఆదేశముగా వస్తాయి అనునది సూత్రార్ధము.

(----  టైపు వసతిలేక అక్షరమాలలోని ఋ ౠ ల తదుపరి వచ్చు "అలు అలూ" వ్రాయలేక పోయినందులకు చింతిస్తున్నాను  మిత్రులు గమనించ గలరు)


ఉదా...
అతి+అంతము..........అత్యంతము   (ఇ+అ...య)
దేవీ+ఆలయము......,,,దేవ్యాలయము(ఈ+ఆ.,,య)
మను+అంతరము.......మన్వంతరము(ఉ+అ..,వ)
వధూ+ఆనందము.,....,వధ్వానందము(ఊ+ఆ,,,,వ)
ధాతృ+అంశము...........ధాత్రంశము   (ఋ+అ...ర)
పితృ+ఆఙ్ఞ...................పిత్రాఙ్ఞ          (ఋ+ఆ.,.,,ర)

4)వృద్ధి సంధి.

ఐ ఔ లకు వృధ్ధులని పేరు ఈ వృధ్ధులు ఆదేశముగా వచ్చుటవలన వృధ్ధి సంధి అని పేరు వచ్చినది

సూత్రము--"అకారమునకు ఏ   ఐ  లు పరమగు నప్పుడు "ఐ" కారమును  ఓ    ఔ   పరమగునప్పుడు  " ఔ"  కారమును ఏకాదేశములగును"
అకారాంత..ఆ కారాంత శబ్దాలకు(అ  ఆ  లకు) ఏ ఐ పరమైనప్పుడు  ఐ  కారమును .ఒ   ఔ   లు పరమైనప్పుడు  ఔ  కారమును  ఏకాదేశముగా వచ్చుటను వృద్ధి సంధి అందురు అని సూత్రార్ధము.

ఉదా....
భీష్మ+ఏకాదశి.....భీష్మైకాదశి            (అ+ఏ...ఐ)
మహా+ఐశ్వర్యము....మహైశ్వర్యము(ఆ+ఐ....ఐ)
వన+ఓషధి..,.,వనౌషధి                     (అ+ఓ.....ఔ)
మహా+ఔషధము.....మహౌషధము    (ఆ+ఔ....ఔ)

5.యన్తాదేశ సంధి
6.వాంతాదేశ సంధి
ఇవి పూర్తిగా సంస్కృతమునకు సంబంధించినవి..
పూర్వ పదము చివర     ఏ   ఓ    ఐ   ఔ  లు ఉండి  విటికి అచ్చులు పరమగునప్పుడు   అయ్.,,ఆయ్..,,అవ్   ఆవ్  అనునవి ఆదేశములుగా వచ్చును

హరే+ ఏ.,,హరయే
విష్ణో+ఏ....,విష్ణవే

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)


సశేషం రేపు కలుద్దాం




సంధుల విఙ్ఞానము...6.,సవర్ణ ధీర్ఘ, గుణ  సంధులు

తిరిగి  సంధుల విఙ్ఞానములోనికి వద్దాము....

అయితే  సంస్కృత వ్యాకరణం,తెలుగు వ్యాకరణం వాటి వాటి భాషా మరియాదలను బట్టి  నిర్వచనాలు చెప్పబడ్డాయి....ఇలా చెప్పుకున్న సంధులలో అనేక రకాలున్నప్పటికి ముఖ్యంగా "అచ్ సంధులు" "హల్ సంధులు " అనేవి ముఖ్యమైనవి ...వీటిలో తిరిగి అనేకరకాలుగా వ్యాకరణ కర్తలు శలవిచ్చారు. మనం వాడే తెలుగు భాషలో అనేకమైన సంస్కృత పదాలు ఎంతగానో కలిసి ఇమిడి ఉన్నాయి కావున ముందుగా సంస్కృత సంధులు గురించి తెలుసుకుందాము......

........సంస్కృత సంధులు......

వర్ణాలు గాని పదాలు గాని కలియుటయే సంధి ఇలా కలిసిన సమయంలో అక్షర లోపము  ఆగమము ఆదేశము  మొదలగు వాని వలన  జరిగే మార్పులు  సంధులౌతాయి ఇలా జరిగే సందులు పదాల మద్య సంహిత ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది . సంహిత అనగా అక్షరాల మద్య అర్ధమాత్రా వ్యవధానం కంటే ఎక్కువ వ్యవధానం లేకుండా ఉండే స్థితి ..వ్యవధానమనగా రెండు పదాల మద్య మరొకటేది లేకుండుట,

ఈ సంధులు సంస్కృతం లో స్థూలంగా 3 రకాలు..1)ఆగమ సంధులు...2)ఆదేశ సంధులు...3)ఏకాదేశ సంధులు ...అని మూడు రకాలుగా ఉంటాయి.....

తెలుగు భాషకు సంస్కృత సాంగత్యమధికముగా నుండుటవలన సంస్కృతమునందలి సంధులనేకము తెలుగు భాషలోనికొచ్చినవి..అవి

సవర్ణధీర్ఘ సంధి
గుణ సంధి
యణాదేశసంధి
వృధ్ధిసంధి
అనునాసిక సంధి
విసర్గ సంధి
శ్చుత్వ సంధి
జస్త్వ సంధి .........మున్నగునవి

1) సవర్ణధీర్ఘ సంధి
సవర్ణమనగా సమానమైన అచ్చు అని అర్ధము  సవర్ణమైన అచ్చు ధీర్ఘముగా వచ్చుట వలన దీనికి ఆ పేరు  వచ్చినది

"సూత్రము:-  అ ఇ ఉ ఋ లను అక్షరములకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా ధీర్గము ఏకాదేశమగును",,,,,అనగా
అ  ఆ   లకు  అ  ఆ  లు  పరమైతే....ఆ కారము
ఇ.,,ఈ లకు  ఇ  ఈ  లు  పరమైతే....ఈ కారము
ఉ,,ఊ   లకు  ఉ  ఊ   లు  పరమైతే..ఊ  కారము
ఋ  ౠ  లకు  ఋ  ౠ  లు  పరమైతే.ౠ కారము
నైన సవర్ణ ధీర్ఘాలు  ఆదేశమగునని సూత్రార్ధము
ఉదా..,
శత+ అబ్దము....,.......శతాబ్దము       (అ+అ..ఆ)
మహా+ఆనందము......మహానందము(ఆ+ఆ..ఆ)
ముని+ఇంద్రుడు.... ....మునీంద్రుడు  (ఇ+ఇ..ఈ)
గౌరీ+ఈషుడు............గౌరీశుడు     (ఈ+ఈ.,ఈ)
భాను+ఉదయము... ..భానూదయము(ఉ+ఉ.,ఊ)
పితృ+ఋణము...... ..పితౄణము (ఋ+ఋ..ౠ)

2) గుణ సంధి
ఏ ఓ ఆర్  లకు గుణములను సఙ్ఞ కలదు  ఈ గుణములు ఏకాదేశమగుటవలన దీనికి గుణ సంధి అనే పేరుకలిగినది

సూత్రము--"అ  ఆ అను స్వరంబులకు అసవర్ణములైన ఇ  ఉ,,ఋ   లుపరమగు నప్పుడు క్రమముగా ఏ..,ఓ...ఆర్....లు ఏకాదేశంబగు"  అనగా
అ  ఆ   లకు  ఇ   ఈ  లు  పరమైతే....ఏ కారము
అ   ఆ లకు  ఉ,,ఊ  లు  పరమైతే....ఓ కారము
అ  ఆ     లకు  ఋ ౠ  లు  పరమైతే..ఆర్  అనేవి  ఏకాదేశమగును  అని సూత్రార్ధము

ఉదా..,
దేవ+ఇంద్రుడు..........దేవేంద్రుడు  (అ+ఇ..,ఏ)
మహా+ఈశుడు.........మహేశుడు(ఆ+ఈ....ఏ)
సూర్య+ఉదయము...సూర్యోదయము(అ+ఉ..,ఓ)
గంగా+ఊర్మి.............గంగోర్మి    (ఆ+ఊ.....ఓ)
దేవ+ఋషి...............దేవర్షి     (అ+ఋ....ఆర్)

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం....రేపుకలుద్దామా!.

సంధుల విఙ్ఞానము.,5...విభక్తులు

7)సప్తమీ విభక్తి !
అందున్, నన్--- సప్తమీ విభక్తి.
అధికరణములో  సప్తమీ విభక్తి వచ్చును.,అధికరణమనగా ఆధారము ఈ ఆధారము 3 విధములుగా నుండును

వైషయికము.,,,,అనగా  విషయ సంభంధం
అభివ్యాపకము,,అనగా అంతటా వ్యాపించటం
ఔపశ్లేషికం....,అనగా సమీప సంబంధం

అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.

వైషయికం అంటే విషయ సంబంధం.
ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.

అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం.
ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.

ఔపశ్లేషికం..,అనగా సమీప సంబంధం
ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్ధం.
ఉదా: ఘటంబున జలం ఉంది.

8)సంబోధనా ప్రథమా విభక్తి !
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.

ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది.
ఉదా: ఓ రాముడా - ఓ రాములార

ఓ శబ్దానికి పురుషుని సంబోధించేటప్పుడు 'యి' అనేది, నీచ పురుషుని సంబోధించినప్పుడు 'రి' అనేది, నీచస్త్రీని సంబోధించినప్పుడు 'సి' అనేది అంతాగమాలుగా విభాషగా వస్తాయి.
ఉదా: ఓయి రాముడా! ఓరి దుష్టుడా! ఓసి దుర్మార్గురాలా!
యి  రాని ఎడల  ఓ  రాముడు  ....ఓ దుష్టుడు....
*****ఓరీ...,.ఓసీ  అనేవి మైత్రిని తెలియజేయు ఆ మంత్రణం లోకూడా వస్తాయి..

ఓరి ముద్దు కృష్ణా....పురుష సంబోధనం

ఓసి ముద్దు పాప...స్త్రీ సంభోధనం
**ఓయి.... ఓరి ....ఓసీ  అనే వాటికి ధీర్ఘాలు కూడా ఉన్నాయి

ఓయీ....మూర్ఖ మానవా

ఓరీ......దుష్ట మానవా
ఓసీ.....ఎందు బోతివి.....మున్నగునవి

ఔప విభక్తికాలు

ఇ   టి  తి  ఔపవిభక్తికంబులు
"విభక్తి నిమిత్తకంబులై యాదేశాగమాత్మకాలైన "ఇ..,టి...తి" వర్ణంబులు ఔపవిభక్తికంబులనంబడు"
ఊరు+ని....ఊరిని
మ్రాను+ని...,.మ్రానిని

నోరు+ను...నోటిని
కాడు+ను..,కాటిని

ఏటిని....పగటి....మొదటి.....రెంటిని......మూటిని.....
కంటి.,,,ఇంటి...,మింటి...,పంటి

మున్నగు పదాలు  ఓప విభక్తికాలైన  ఇ.,టి...ని   అనే వర్ణాలు  ఆగమ..ఆదేశాలు గా   రావటం వలన ఏర్పడిన పదాలే...

తిరిగి సంధుల పరిఙ్ఞానములోకి వద్దాము..

సశేషము...రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము,,,4--4/3/2017---,విభక్తులు

4)చతుర్ధీ విభక్తి !
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
"సంప్రదానంబునకుంజతుర్ధి యగు"

త్యాగోద్దేశ్యము గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం.
ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కన్యను తిరిగి పుచ్చుకొనే ఉద్దేశం  లేదు.
ఒకవేళ ఆ ఉద్దేశం  ఉన్నా అవుతుంది,
ఉదా.ప్రధమ స్థానము కొరకు ప్రయత్నించ వలెను..ఇది ఉద్దేశమే కదా

కొఱకు+న్ = కొఱకున్. ద్రుతలోపమున కొఱకు అని నిలిచినది.ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది.అలాగే  "కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.

ఉదా..,  గోపి కై రాము వేచి యుండెను

5)పంచమీ విభక్తి !
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.
ఉదా:
అతివేగము వలన ప్రమాదము జరిగెను(అపాయ)
దొంగ వలన భయము కలిగెను  (భయము)
పాపము వలన ఏవగింపు కలిగెను (జుగుప్స)
నిర్లక్ష్యం వలన జారిపడెను ( ప్రమాదము.)
భార్య వలన ధనము కలిగెను(గ్రహణము=కొనుట ,,ఎరుగుట.వినుట)
అపరిశుబ్రత వలన వ్యాధులు వచ్చును (భవనము..పుట్టుక)
పంటను పక్షుల వలన కాచెను(త్రాణము.కాచుట)
రోగముల వలన మానుకొనెను(విరామము)
చోరుడు శునకము వలన దాగెను(అంతర్ధి-దాగు  మాయమగు...మఱగు)
శోకము వలన వారించె(వారణము-వారించుట)

ఆ)"కంటె వర్ణకంబు అన్యార్ధాది యోగజంబగు పంచమికగు"

అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది.
అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది.
ఉదా: రాముని "కంటె" నన్యుండు దానుష్కుండు లేడు.
          కర్ణుని "కంటె" నన్యుడు దానశీలి లేడు

ఇ)నిర్ధారణ పంచమిలో కూడ కంటె ప్రత్యయం వస్తుంది.
జాతి మొదలగు వాటితో నిర్ధారించేటప్పుడు పచమీ విభక్తి వస్తుంది దానిని నిర్ధారణ పంచమి అంటారు ఆ పంచమికి "కంటె" వస్తుంది

ఉదా:
ఆటవికులకంటే  నాగరికులు వివేకులు (ఆటవికులు నిర్ధారకులు)
 గ్రుడ్డి కంటె మెల్ల మేలు: ఇక్కడ ('గ్రుడ్డి నిర్ధారణము)

ఈ)'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి.
గుణము అంటే స్వభావం క్రియ అంటే పని
ఉదా: "చదువును బట్టి యోగ్యుడగు. "
యోగ్యుడవడానికి కారణము చదువు

వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటె అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.


6)షష్ఠీ విభక్తి  !
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

అ)శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది.
ఉదా: నా యొక్క పుత్రుడు; వాని యొక్క తమ్ముడు.

ఆ)నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది.
 జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు.
ఉదా: పశువుల లోపల గోవు శ్రేష్టమైనది.

షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును


సశేషం--- రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము..,3..విభక్తులు

విభక్తులు

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. విభక్తులు ఏడురకములు  సంబోధనా ప్రధమా విభక్తితో కలసి ఎనిమిది అయినాయి ద్రుతాంతములైన విభక్తులను ద్రుతాంతములుగా చెప్పుటయే భాషా మరియాద. ఈ విభక్తులు (ప్రత్యయాలు) నామవాచకము సర్వ నామముల తరువాతనే ప్రయోగింప బడతాయి..
రాముని"చేత" -----సీత "వలన"----రాణి"కి"చ్చాను  అంటూ ప్రయోగింప బడతాయి.

ఈ విభక్తులు

ప్రత్యయాలు విభక్తి పేరు

1. డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.

2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.

3. చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.

4. కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

5.వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

7.అందున్, నన్--- సప్తమీ విభక్తి.

8.ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.

వివరంగా చూద్దాము

1) ప్రథమా విభక్తి !
డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి.

పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది.
ఉదా: రాముడు, కృష్ణుడు

అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది.
ఉదా: వృక్షము, దైవము

ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది.
ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు

బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది.
ఉదా:  పుస్తకములు....కలములు......నదులు....కొండలు  గోవులు

2)ద్వితీయా విభక్తి !
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి

కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'.

ఉదా: అతడు వంటకము"ను" వండెను.

వండెను అనేదానికి  వంట చేసెను అని అర్ధం..,,
వంట ఫలం..,,చేయుట వ్యాపారం(వ్యాపారం  అనగా పని చేయటం)

కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును.
రావణుడు శివుని "గూర్చి" తపస్సు చేసెను
నీవు ఎందు "గురించి" యోచించు చుంటివి?

పై రెండు వాక్యాలు ఏదో ప్రయోజనమాశించి చేసినవిగా నున్నవి కదా.

3)తృతీయ విభక్తి  !
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
క్రియ యెక్క వ్యాపారానికి(పనికి)ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త.
కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది.

ఉదా: భీముని చేత వంటకము వండబడెను.

"వండబడెను"  అంటె వంట చేయబడింది అని అర్ధమే కదా?.చేయటం అనే పనికి (వ్యాపారానికి ) ఆశ్రయము
భీముడు ఈ విక్యములో  అనుకర్త కావున భీముని "చేత" అని వాక్యనిర్మాణం చేయబడింది.

అ)కరణ,,సహార్ధ..తుల్యార్ధాల యోగంలోను " తోడ"అనే ప్రత్యయం వస్తుంది."
కరణం..(సాధనం) కోల "తోడ" కూల వేసె
సహార్ధం.,(కూడా) అతడు మంది "తోడ" వచ్చెను
తుల్యార్ధయోగం.,(సమానార్ధం)
**రాముని తోడ హరి మిత్రుడు

ఆ)వచ్యర్ధ అముఖ్య కర్మకు తోడ వర్ణకం వచ్చును
అముఖ్య కర్మ అనగా ముఖ్యము కాని కర్మవాచకం
వచ్యర్ధం అనగా వంచించు...పలుకు.,,అను.,,చెప్పు..,అనేవి వచ్యర్ధాలు.,ఇఈ అర్ధాలలో యోగం ఉన్నప్పుడు అముఖ్య కర్మకు "తోడ" వస్తుంది.
**రాము  హరి "తోడ" యిట్లనెను.

ఇ)"ఉపయోగంబునందాఖ్యాతకు తొడవర్ణకంబగు"
ఆఖ్యాత..అనగా చెప్పేవాడు.,
చెప్పే వానికి తో అనే ప్రత్యయం వస్తుంది

రామ, హరి .. కృష్ణుని "తొడ"  వేదములు చదివిరి..
కృష్ణుడు  ఆఖ్యాత  .కృష్ణుడు కూడా చదువుకున్నాడని అర్ధం కాదు. కృష్ణుని వద్ద చదువు కున్నారని అర్ధం..


సశేషం...రేపు కలుద్దామా?

సంధుల విఙ్ఞానము...,2..సంధికార్యమునవచ్చు పదములు

సంధి కార్యమునందు వచ్చే మరి కొన్ని ముఖ్యమైన  పదాలను గురించి తెలుసుకుందాము..

7)పూర్వ పదము...
సంధి జరిగిన రెండు పదములలోని మొదటి పదమును పూర్వపదమందురు
శివ+ ఆలయము....శివాలయము
ఇందు " శివ"  అను పదము పూర్వ పదము

8)పరపదము....
సంధి జరిగిన రెండు పదములలోని రెండవ పదమును పరపదమందురు
శివ+ ఆలయము....శివాలయము
ఇందు " ఆలయము"  అను పదము పర పదము

9)ఆదేశము(శతృవదాదేశః)
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు ఒక అక్షరమును తొలగించి మరో అక్షరము  శతృవు వలే వచ్చి చేరుటను "ఆదేశము" అందురు
సరసము+మాట....సరసపుమాట..,ము అనే అక్షరం స్థానములో   పు  వచ్చి  చేరినది

10)ఆగమము(మిత్రవదాగమః)
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు మిత్రుని వలే మరో అక్షరము అదనముగా వచ్చి చేరుటను ఆగమము అందురు
మా+అమ్మ....మాయమ్మ...య్  అనేది ఆగమముగా చేరినది

11)ఏకాదేశము
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు పూర్వపదము చివర ఉండే అక్షరం గాని పరపదము లోని మొదటి అక్షరం గాని  ఈ రెంటిలో ఒకదానిని గాని రెంటినీ గాని తొలగించి మరొక అక్షరం  ఒక్కటే  వచ్చి చేరటాన్ని  ఏకాదేశము అంటారు
రామ+ఆలయము..రామాలయము
శిల+అభిషేకము...శిలాభిషేకము
(హహ్రస్వ అకారములు  ధీర్ఘములైనవి)

12)నిత్యము
విధించిన సంధి కార్యము తప్పని సరిగా జరుగుటను  నిత్యము అంటారు
సోముడు+ఇతడు...సోముడితడు....తప్పనిసరిగా సోముడితడు అనిమాత్రమే పలుక వలెను
సోముడు ఇతడు అనరాదు.

13)విభాష(వైకల్పికము)
విధించిన సంధి కార్యము ఒక సారి జరుగుట ఒకసారి జరుగకపోవుటను  విభాష.  లేక వైకల్పికము అందురు

14)బహుళము
విధించిన సంధి కార్యము  నిత్యము,నిషేధ,వికల్ప.లేదా అన్యవిధములుగా జరుగుటను బహుళము అందురు

15)ద్విరుక్తము
ఒకే పదము రెండు సార్లు చెప్పబడినచో ద్విరుక్తము
(ఔర+ఔర)

16) సంశ్లేష
సంశ్లేష అనేదానికి మీది హల్లుతో కూడుకొనుట "బాగా కలియుట" అని అర్ధము  ఒక పొల్లు హల్లు మీది హల్లుతో కలియుట
పూచెను+కలువలు...,పూచెన్గలువలు   ఇది సంశ్లేష రూపము

17)ఆమ్రేడితము
  ఒకపదము రెండు సార్లు చెప్పబడినప్పుడు  రెండవసారి చెప్పబడిన పదము ఆమ్రేడితమనబడును..

18)తపరకరణము
అత్తు,ఇత్తు,ఉత్తు  అని ఇలా చెప్పటాన్ని తపరకరణము అంటారు  ఇలా తపరకరణము చేసి చెబితే అది హ్రస్వమైన అక్షరాలను మాత్రమే నిర్ధేశిస్తుంది అని అర్ధము
అత్తు.......అ
ఇత్తు.......,ఇ

19)భృశార్ధం
 మిక్కిలి  చెప్పడానికి భృశార్ధం అంటారు

20)రేఫ....
ర అనే అక్షరాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు  రేఫ  అంటారు
ఱ (బండిరాని)  శకట రేఫ అంటారు   రకారము ఱకారము   అనరాదు

21) అవసానము
"అవసానము"  అనగా చివర  అని అర్ధము వాక్యానికి గాని పదానికి గాని చివర అని అర్ధము..
"వాక్యావసానంబున సంధిలేమి దోషముగాదని ఆర్యులందురు"
అనగా ఒక వాక్యము పూర్తి అయినపిదప మరొక వాక్యము ప్రారంభిచుటకుముందు సంధి లేకపోయినను దోషము కాదు.అని అర్ధము.

22)తత్సమ శబ్దము
సంస్కృత శబ్దము కాదు కాని సంస్కృత శబ్దము వలెనుండునవి తత్సమ శబ్దములు.సంస్కృత పదములకు ప్రత్యయములు(విభక్తులు)చేరుట వలన వచ్చిన పదాలు
దూత..,,రాముడు..,కృష్ణుడు ..

అయితే మనం సంధుల విఙ్ఞానమును చర్చించుకునే సమయంలో విభక్తులను గూర్చి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైననూ గలదు కావున  సూక్ష్మముగా వాటిని గూర్చికూడా తెలుసు కుందాము.

సశేషం....  రేపు కలుద్దామా?

తెలుగు వ్యాకరణం సంధుల విఙ్ఞానము..పరిచ్ఛేదము

సంధుల విఙ్ఞానము.,1  పరిచయం
           
"అచ్చంగా తెలుగు" బృంద సబ్యులకు నమస్కారం !!

ఈ రోజు నుండి "సంధుల విఙ్ఞానము " [సంధి పరిఛ్ఛేదము]  గురించి వివరించాలి అనుకున్నాను.అందరూ విద్యావంతులే కావున ముఖ్యమైన విషయాలు మాత్రమే సరళంగా తెలిపే ప్రయత్నం. నేను అతి సూక్ష్మంగా  విషయ వివరణ చేయ దలచినాను.కావున మిత్రులు అర్దం చేసుకోగలరు. పండితులు,విద్వాంసులు,  గ్రంధ కర్తలు,కవివరేణ్యులు ఏదేని పొరపాటు గ్రహించినచో తెలిపిన యెడల సరిదిద్దు కోగలను,నేను పండితుడనో విద్వాంసుడనో కాను కనీసం తెలుగు ఉపాధ్యాయుడను కూడా కాను. కాని తెలుగు భాషాభిమానిని మనమిత్రులందరకు ,పద్య .,గద్య కవిమిత్రులకు ఎంతో కొంత ఉపయుక్తముగానుండునని యెంచియే ఇట్టి సాహసమునకుపక్రమించితిని మిత్రులందరమూ కలసి ప్రతిరోజు చర్చించు కుందాము రండు...మీ మీ అభిప్రాయాలను వెల్లడించటం ద్వారా నన్నాదరించండి, మీఆశీస్సులందించండి,.... ధన్యోస్మి..

పరిచయం.......

రెండు పదాలు ఒకదానితో మరొకటి కలసిపోయి ఒకే పదముగా మిగిలిపోతాయి అలా కలసినప్పుడు మొదటి పదం చివరలోగాని రెండవపదం మొదటలోగాని మార్పులు సంభవించటం జరుగుతుంది అనగా అక్కడ ఉన్న అక్షరాలు దీర్ఘాలుగా మారటం ..ఉన్నఅక్షరాలు పోవటం .,లేదా వేరే క్రొత్త అక్షరాలు వచ్చి చేరటం జరుగుతుంది  ఇలా ఎందుకు జరిగింది అని మనకు మనం ప్రశ్నించుకుంటే వచ్చే జవాబే "సంధి జరిగింది".,అనేది.  ఎలా జరుగుతుందో తెలియ చేసేదే  ఈ "సంధుల విజ్ఞానము"   లేదా "సంధి పరిచ్ఛేదనము"
 
మనం ఉదా హరణకు ఒక వాక్యం తీసుకుందాము
"లోకేశ్వరుడు ,రంగాచార్యులు ,భ్రమరాంభిక  అయిదేండ్ళు నుండి మిత్రులు.ప్రతిరోజు శివాలయము దర్శిస్తారు"

ఇప్పుడు పైవాక్యం పరిశీలిద్దాము..
"లోక"..."ఈశ్వరుడు" .,,ఇవి రెండు పదాలు..,,ఈ రెండు పదాలు కలిసి పోయి "లోకేశ్వరుడు" అనే ఒకటే పదం ఏర్పడింది
"రంగ",,,"ఆచార్యులు"...ఇవి రెండుపదాలు...."రంగాచార్యులు"   అనే ఒకే పదం ఏర్పడింది
"భ్రమర"...."అంబిక"-----  భ్రరమరాంబిక
"శివ"...,"ఆలయము"------శివాలయము  ఇలా రెండు మూడు పదాలు కలిసి ఏక పదముగా ఏర్పడటాన్ని సంధి జరిగిన రూపము అంటారు

ఇలా సంధి జరిగినప్పుడు  లేదా ఈ సంధుల పరిఙ్ఞానం మనం విశ్లేషించి చెప్పుకునే సందర్భాలలో  వచ్చే కొన్ని అతి ముఖ్యమైన  పదాలను గురించి ముందుగా తెలుసు కుందాము

1)సరళములు..
తేలికగా పలకబడేవి సరళములు..తేలిక అనగా  కొంచం ప్రయత్నముతో అని భావము.,వీటికి  "నాదములు"  అనే పేరుకూడా కలదు.
గ..,జ..,డ.,ద...బ

2)పరుషములు
కఠినముగా పలుకబడే వాటిని పరుషములందురు..,కఠినమనగా గట్టి ప్రయత్నం ...వీటికి  "శ్వాసములు" అనే పేరు కూడా కలదు.
క..,చ...ట...త...ప

3)వర్గయుక్కులు
"యుక్కు"  అనగా జత వర్గాక్షరాలలో  2---4   అక్షరాలు
ఖ..,ఘ...ఛ...ఝ..,ఠ...,ఢ...థ...ధ....ఫ..,భ....ఇవి మొత్తము 10 అక్షరాలు

4)అనునాసికములు
నాసిక  అనగా ముక్కు ముక్కు సహాయముతో పలుకబడును కావున అనునాసికములైనవి
ఙ...ఞ.,,ణ...న.,,మ...ఇవి 5 అక్షరములు

5)ద్రుతం
ద్రుతమనగా  న కారము...అవసరములేనిచోట జారిపోవునదని అర్ధము

6)ద్రుత ప్రకృతికము
ద్రుతము చివరన గల పదాలను  ద్రుతప్రకృతికములు అంటారు
అనెన్.,,,కనెన్....వినెన్...తినెన్...  మున్నగునవి .


సశేషం.....మళ్ళీ కలుద్దాం..