Sunday, March 19, 2017

సంధుల విఙ్ఞానము..11  యడాగమ సంధి.అకార సంధి

2.యడాగమ సంధి

సూత్రం--"సంధిలేని చోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు"

సంధి రెండు అచ్చుల మద్య జరగని సందర్భములో (ఎలాంటి అచ్ సంధి అయినా ఆ రెండు పదాలలో ఉండే) అచ్చుల మద్య యట్ అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది  "యట్" అనేది టిత్తు కనుక పరపదములోని మొదటి అచ్చుకు వచ్చి చేరుతుంది "యట్" అనే దానిలో "య్ " అనేది మాత్రమే మిగులుతుంది .ఆగమము అనగా ఒక అక్షరం అధికంగా  వచ్చి చేరటం .

ఉదాహరణ
మా+అమ్మ...మాయమ్మ...అకారసంధి జరగలేదు
మీ+ ఇల్లు  .,మీయిల్లు...ఇకార సంధి జరగలేదు
మా+ఊరు....మాయూరు   అకార సంధి జరగలేదు

వివరణ ...
మూడు ఉదాహరణలలోను పూర్వపదం చివర ఆ..,ఈ...ఆ అనే అచ్చులు ధీర్ఘములుగానున్నవి. అందువలన సంధి జరగలేదు.హ్రస్వ అకారమునకు మాత్రమే అకారసంధిలో అచ్చు పరమైతే సంధి జరుగుతుంది  ..సంధి జరగలేదుకావున యడాగమము వచ్చినది
యడాగమము రానిచో అర్ధాలు సరిగానుండవు
మమ్మ..మిల్లు..మూరు  అవుతాయి  ఇవి అర్ధరహితము కదా..
అకార..ఇకార..,ఉకార సంధులలో పూర్వ పదం చివర ధీర్ఘాచ్చులు ఉన్నయెడల సాదారణముగా సంధి జరగదు..హ్రస్వాచ్చులు ఉన్నా కొండొకచో సంధి జరగదు..యడాగమం రావటానికి  సంధి జరిగినదా లేదా అనేది గమనించ వలసిన విషయము.

3.అకార సంధి (అత్త్వసంధి)

సూత్రం...."అత్తునకు సంధి బహుళముగానగు"

"అత్తు" అనగా హ్రస్వ అకారము.,బహుళమనగా ఒకసారి సంధి జరగటం ఒకసారి సంధి జరగక పోవటం ఒకసారి విభాషగా సంధి జరగటం..ఒకసారి మరోరకముగా జరగటం
ఉదా..,,
మేన+అల్లుడు...మేనల్లుడు...సంధి జరిగిన రూపము
మేనయల్లుడు..,యడాగమము వచ్చిన రూపము

పుట్టిన+ఇల్లు .,,పుట్టినిల్లు  సంధి జరిగిన రూపము
పుట్టినయిల్లు..యడాగమము వచ్చిన రూపము

చూడక+ఉండెను..చూడకుండెను..సంధి జరిగిన రూపము
చూడకయుండెను...యడాగమము వచ్చిన రూపము
-------------------------------------------------------------------------------
అయితే  "చూడకుండెను"....."చూడక యుండెను" అనే రెండు పదములను గైకొని మనమిక్కడ కాసేపాగి గణముల గురించి ముచ్చటించు కుందాము...."
చూడకుం/డెను  ----- UIU/II ---ర గణము /లల  (లా)
చూడక /యుండెను-UII/UII..భ గణము/భ గణము

మాతయు /"చూడకుం/డెను"గ/ మన్నుతి/నంగను/వెన్నదొం/గ, నే
మాతయు/ నొర్చునా/సుతుడు/------/-------/--------/----

చోరుడు/మన్నుయున్/తినగ /"చూడక /యుండెను"/వెన్నదొం/గ, నే
మారిచి/మాతకున్/----------/--------/--------/------/---

పైన ఉదహరించిన ఉత్పలమాల పద్య పాదాలు రెండు గమనించినచో...

--------/"చూడకుం/డెను"గ /-------/------/-------/---
ర గణము మరియు రెండు లఘువులకు ఒక అక్షరం  చేర్చి  న గణము గాను(రెండు పదాల మద్యన సంధి కూర్చి)

------/--------/------/"చూడక/యుండెను"/------/---
రెండు భ గణాలుగా(రెండు పదాల మద్యన యడాగమము చేర్చి)      రెండు పద్య పాదాలలోను ఒకే అర్ధమున్న  పదాన్ని వాడుకోవటం జరిగినది

కవి మిత్రులకు పద్యరచనా సమయంలో  సంధుల విఙ్ఞానము ఏవిధంగా ఉపయోగపడునో తెలియ చేయుటకే పై ఉదాహరణలు చూపటం జరిగినది గమనించ గలరు.
----------------------------------------------------------------------------------

(పాల్గొనే మిత్రులందరకు నాదో చిన్న విన్నపము..,,చదివిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కో సంధికి  ఒక ఉదాహరణ వ్రాయవలసినదిగా కోరుచున్నాను)

సశేషం.....రేపు కలుద్దామా?


No comments:

Post a Comment