Sunday, January 7, 2018

పొడుపు కథలు

1)ఆ.వె
మూడు శిరములున్ను ముదమొప్ప పదికాళ్లు
గల్గు; తోక ల్రెండు కన్ను లారు
చెలగి కొమ్ము ల్నాల్గు చేతులు రెండయా,
దీని భావమేమి తిరుమలేశ. ?
(జవాబు..,,అరకదున్నే రైతు)

2. ఆ.వె
రుధిర వర్ణ మదియె రూపమివ్వగ లేము
అప్పు యడగ తగును గొప్ప గాను
ఇట్టి దాని పైన నీగైన వాలదు
దీని భావమేమి తిరుమలేశ ?

(జ. నిప్పు)

3.ఆ.వె
చూడ గలము మనము జాడ సోకినగాని
వొంటి గొకడు రాడు జంట వలయు
పట్టి కొడద మన్న పట్టు చిక్కడెపుడు
దీని భావమేమి తిరుమలేశ ?

(జ. పొగ)

4.ఆ.వె
త్రాగి మురియు నొకడు త్రాగనేరడొకడు
తలకు బట్టు నొకరు దాచ రెవరు
శుభమశుభములైన చోటిడు నందరు
దీని భావమేమి తిరుమ లేశ ?

5)ఆ.వె1/12/2017
నాట్య మాడు నచట నవనిపై తిరగడు
పట్టు లేదు నిలువ పడడు వాడు
పడిన లేచి తిరిగి  పయనమై పోవును
దీని భావమేమి తిరుమలేశ ?
(జ. మేఘం)

6.ఆ.వె  2/12/2017
కాళ్ళు కళ్ళు లేవు కదలాడు నేడ్చును
పరుల బాగు కోరి పతన మగును
దారి జూప నొకరు దశదిశమారును
దీని భావమేమి తిరుమలేశ ?
(జ. మేఘం)

7.ఆ.వె..3/12/2017
నీదు స్పర్శ దగల నిముషమాగగలేను
నీరు గార్చు నన్ను  నీదు పొందు
నిలువ లేని వేళ నినుగొని పోయెద
దీని భావమేమి తిరుమలేశ

(జ. కొవ్వొత్తి)

8)ఆ.వె-4/12/2017
నల్లగున్న నేమి నాజూకు చిన్నదే
లేటు వయసు నందు ఘాటు సొగసు
శిరము నొకటె గాని చెవులు నాలుగు నుండు
దీని భావమేమి తిరుమలేశ ?

(జ. లవంగం)

9)ఆ.వె 5/12/2017
పెరుగు సమయ మందు దరిశనమీయక
ధనము తెచ్చి పెట్టు ధరణి కొచ్చి
దోయి పాపల బెంచు నూయలొకటి గట్టి
దీని భావమేమి తిరుమలేశ ?

(జ.వేరుశనగ కాయి)

10)ఆ.వె 6/12/2017
పుడమిపై పెరుగును పుటక నిచట గాదు
కాండమాకు లేక కాయు పంట
పండి వచ్చి సేయు మెండుగా నెయ్యము
దీని భావమేమి తిరుమలేశ ?

(జ.  ఉప్పు

11)ఆ.వె  7/12/2017
వెలుగు వెలుగె కాని వెలయును తిమిరాన
పట్టు బెండ కాయ పదిల మొప్ప
చిన్న గీత పిదప శిరమెక్కి పోవును
దీని భావమేమి తిరుమలేశ ?

(జ.,కాటుక)

12)ఆ.వె 8/12/2017
నటన జూసి చూపు నయనంబులేలేవు
పలక తీరు పడతి పదిల మెపుడు
సాధు సంతు గూడ సంబరముగ జూచు
దీని భావమేమి తిరుమలేశ ?

(జ.అద్దం)

13)ఆ.వె 9/12/2017
పసి తనమున గూడ పదిమంది గోరును
పెద్ద దైన పిదప గద్దె జేరు
గట్టి దెబ్బలు తిని కడకెటు బోవునో ?
దీని భావ మేమి తిరుమలేశ ?
(జ..టెంకాయ)

14)ఆ.వె 10/12/2017
పువ్వు ముడవ దతివ పుడమిపై నేనాడు
పండు ఘనత మిన్న పండగేను
చచ్చి పోయి గూడ చావ జూపునటది
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ. చింత చెట్టు)

15)ఆ.వె 11/12/2017
తనువు బట్టు నొకడు తన్నుచు గీకుచు
వలువ గట్టు నొకడు చలువ  చేసి
బాదు కూడు బెట్టి బూది బూయుచొకడు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ. మద్దెల)

16)ఆ.వె12/12/2017
నార బట్ట గట్టి నలుదిశల దిరుగు
వలువలూడ బెరుక విలువ బెరుగు
నాణ్యమైన పనులు నాతి జేయునుచాల
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ. టెంకాయ)

17)ఆ.వె  13/12/2017
మూడుకన్నులున్న ముక్కంటి గాదట
ఏక ఛత్రము మున్న నేలడెచట
నీరు కూడు నొసగు నేకకాలమువాడు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..ముంజి కాయ)

18),ఆ.వె  14/12/2017
ఇంపుగిరువు రేగి సొంపుసరసమాడి
ముదమున తరలొచ్చు మువ్వురిటకు
కాంత యొలక బోయు శాంతము నేరక
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..చేద-చాంతాడు బొక్కెన)

19)ఆ.వె 15/12/17
అమ్మ కొమ్మ యాలి యాడుబిడ్డలునైన
వలదు యనరు వారు కలననైన
కలిమి కన్న మిన్న కలిగియున్ననుచాలు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ.,పసుపు కుంకుమలు)

20)ఆ.వె 16/12/2017
రంగు వస్త్రములను రంజుగా దొడగును
రూపమేది నొసగు రోయ దెపుడు
అంతమైన నేమి సొంత లాభము లేదు
దీని భావమేమి తిరుమలేశ ?

(జ. మైనపొత్తి)

21)ఆ.వె 17/12/2017

కడుపు లోని దంత కక్కుచు తిరుగును
నిండు కున్న యంత గుండు సున్నె
నాలుకున్న గాని నమలనే నేరడు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..కలము)

22)ఆ.వె 18/12/2017
పైన గనిన యంత పాటవం గనరాదు
పగిలి ననుక జూడ పసిడి సమము
వేయినొక్క తీరు వేషము లేయును
దీని భావ మేమి తిరుమలేశ ?
(జ. పత్తి కాయ.)

23)ఆ.వె  19/12/2017
తెల్ల ముత్యము కడు చల్లని పానకం
పుట్టు నపుడె చచ్చి భుక్తమగును
పుట్టి పెరిగి మనల బ్రోచును పలుతీరు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ.తాటిచెట్టు)

24)ఆ.వె 19/12/2017
ముందు వెనుక నడచు ముద్దుగుమ్మలు రెండు
రెండు సిగలు గలుపు దండు నొకటి
ఊగు తూగ నడక యూరేగు చుండును
దీని భావ మేమి తిరుమలేశ ?
(జ.కావిడి)

25)ఆ.వె20/12/2017
కాలి సాగ డతడు కాయము గట్టిది
పుడమి లోన వాని పొడవు జాన
బరువు మోయ గలడు బ్రతుకంత జనులకై
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ. పొయ్యి)

26
ఆ.వె..20/12/17
నీట నాన గొట్టి మోటుగా మెలిపెట్టి
సాగ బెట్టు పట్టి సారె గట్టి
తట్టు కట్టె బట్టి  తగలెట్టు ననుబెట్టి
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ.,మట్టి కుండ)

27 ఆ వె 21/12/2015
ఆ.వె
ముక్క చెక్క లవియె చక్కగా నమరంగ
పూసు కొనియు పూత పుడమి నొదులు
వేట, మూట,బాట లాటలా జేయును
దీని భావ మేమి తిరుమలేశ ?
(జ..నావ)

28)దీని భావ మేమి తిరుమలేశ ?
ఆ.వె 22/12/17
నిలువ లేక తాను కలువంగ నొకరితో
ఒక్క రేయి కులికి  చక్కనవును
తిరిగి జనన మొసగు తిరిగితానటునిటు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..పెరుగు)

29 )ఆ.వె--23/12/17
పరుగు లిడుచు తాను పాతాళమునుజేరు
పావని గొనివచ్చు చావ గలిగి
వచ్చి పోవునపుడు వడలంత గాయాలె
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..చేద)

30)ఆ వె   24/12/17
ఒంటి కన్ను నాకు జంటగ నొకరుండ
నడక జరుగు నపుడె నాది భువిని
జంట లేని యపుడు జాగారమే నాకు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..సూది..జంట దారం)

31.ఆ.వె 24/12/17
శుద్ధ స్నాన మొసగి శుద్ధిగా జేసియు
కడుపు నిండుగనిడి కనుల కద్దు
బరువు తరుగ నాది మరలి చూడరెవరు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ.విస్తరాకు)

32.ఆ.వె 25/12/17
నిప్పు మీద బెట్టి నిలబెట్టి నిలువునా
చంపు నన్ను మీదు నింప మనసు
హాయి నొసగు నేమి యాత్మ నాదియు మీకు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ.. అగరు బత్తి)


33)ఆ.వె27/12/17
నేను లేక నిలను నేరవు తిరగను
తిరుగ వడుపు నిచ్చి మరలు నేను
నేను లేక యున్న నిన్ను కానరెవరు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..తాడు బొంగరం)

34)ఆ.వె  28/12/17
కుదురుగుండు నతివ కుచ్చిళ్ళు జీరాడ
పనికి ఘనము నెపుడు పడతి పగలు
తలపరెవరు రేయి తాకగ జంకును
దీని భావ మేమి తిరుమలేశ

జ.చీపురు

35)ఆ వె
నీదు బిడ్డ నేను నేరక నిరికితి
పట్ట నొకడు నన్ను గట్టి పట్టు
ధీటు గాడ నైతి చేటుగ జంపను
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ...గొడ్డలి కర్ర)

36)ఆ.వె 29/12/17
పంట నూర్చ నమ్మ జంటనందులుగొనె
కాడి బట్టి యొకటి కదల దెపుడు
కాడి చుట్టు నొకటె కదలాడి నూర్చును
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ .,,తిరగలి)

37)ఆ.వె 30/12/17
కడుపు నింపు నాది గట్టిగా గొట్టియూ
ఒత్తి చూచు మీర లొక్క సారి
చాచి కాలు చేయి చావబాదుదురేల ?
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..బంతి)
38)ఆ.వె..30/12/17
తిండి, పూజ ,పడక,తీరును గననీరు
కొట్ట,మెడను గట్ట కోరు మమ్ము
మమ్ము విడచి పోయి మరలి రారెవ్వరూ
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ.చెప్పులు)

39)ఆ.వె
కదల కాళ్ళు లేవు కంటినీరొలికించు
కసిరి గొడితి మేమి కంపు కంపే
వన్నెలాడి కెన్ని వలువలో జూడగా
దీని భావమేమి తిరుమలేశ

(జ. ఉల్లిపాయ)

40)ఆ.వె
తప్పు జేయకున్న తలతోక నరికియు
బొక్కబోర్ల బెట్టి బూది పూసి
తోడు నొకరి నిచ్చి తోయును మురిపాన
దీని భావమేమి తిరుమ లేశ?

(జ.. తాంబూలము)

41)ఆ.వె
తెల్ల దొరను బట్టి నల్లదొరగ జేయ
తనువు జంపు కొనును తరుణి యొకటి
తరుణి తప్పు జేయ తానొచ్చి సరిజేయు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..పెన్సిల్..ఎరేజర్)

42)ఆ.వె
లేప చాప తాను లేడిలా పరుగెత్తు
నడక నందె హొయలు నాట్య గత్తె
నిలుప నొంక దొకటి చలనము నేరదు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..పడవ)

43)ఆ.వె
ఒకరు బుట్టి మారె నొకరిగా జూడగా
వారు గనెను చితికి మారు బిడ్డ
ముదము మీర మనకు మువ్వురూ ఘనులైరి
దీని భావ మేమి తిరుమలేశ

జ..పాలు.. పెరుగు..వెన్న

44)ఆ.వె
ఒంపు దూలమొకటి వంగెడి వాసముల్
కొప్పు నొకటె పిలక కప్పు నలుపు
చూరు నీరు గారు జోరు బెంచగ వాడు
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..గొడుగు

45)ఆ.వె
కనగ వచ్చు నపుడు ఘన మేళ తాళముల్
వచ్చి జొచ్చినకడ చచ్చి పోవు
చచ్చి బ్రతుకు గాని గుచ్చిచూడగ లేము
దీని భావమేమి తిరుమలేశ ?

(జ,,వర్షపు నీరు)

46)ఆ.వె
కాళ్ళు కలిగి యున్న కదలదు యేనాడు
చేతులున్న గాని చేయ రాదు
ఘనుల కొరకు నిదియె ఘనకీర్తి బడసెను
దీని భావ మేమి తిరుమలేశ?

(జ..కుర్చి)

47).ఆ.వె
బొక్క లోన దూరి ముక్కలు గలిపెద
మూట గట్ట నన్ను  పట్టు నొకరు
రంగు రంగు కైన  దంగక దొరికెద
దీని భావ మేమి తిరుమలేశ ?

(జ..దారము)

48)ఆ.వె
నీదు శక్తి నన్ను నింపుగా నడిపించు
ఒక్క రిద్ద రైన లెక్క జేయ
విడుము దారి యనుచు వడిగనే బోయెద
దీని భావ మేమి తిరుమలేశ ?
(జ..సైకిల్)

49)
ఆ.వె
తెల్లనైన పుటకె నల్లనమ్మకునైన
సకల జనుల గాచు శక్తి నొసగి
పుట్టు నొకరె గాని గిట్టును నల్వురై
దీని భావ మేమి తిరుమలేశ

(జ..పాలు..పెరుగు..వెన్న...నెయ్యి)

50)
ఆ.వె
రామకోటి నున్న రామనామము గాదు
నూయి లోన గలను చేయి లోన
బలప మందు నున్న బడికిపోయెరుగను
దీని భావమేమి తిరుమలేశ ?

(జ.కోయిల)