Sunday, March 19, 2017

సంధుల విఙ్ఞానము...,2..సంధికార్యమునవచ్చు పదములు

సంధి కార్యమునందు వచ్చే మరి కొన్ని ముఖ్యమైన  పదాలను గురించి తెలుసుకుందాము..

7)పూర్వ పదము...
సంధి జరిగిన రెండు పదములలోని మొదటి పదమును పూర్వపదమందురు
శివ+ ఆలయము....శివాలయము
ఇందు " శివ"  అను పదము పూర్వ పదము

8)పరపదము....
సంధి జరిగిన రెండు పదములలోని రెండవ పదమును పరపదమందురు
శివ+ ఆలయము....శివాలయము
ఇందు " ఆలయము"  అను పదము పర పదము

9)ఆదేశము(శతృవదాదేశః)
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు ఒక అక్షరమును తొలగించి మరో అక్షరము  శతృవు వలే వచ్చి చేరుటను "ఆదేశము" అందురు
సరసము+మాట....సరసపుమాట..,ము అనే అక్షరం స్థానములో   పు  వచ్చి  చేరినది

10)ఆగమము(మిత్రవదాగమః)
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు మిత్రుని వలే మరో అక్షరము అదనముగా వచ్చి చేరుటను ఆగమము అందురు
మా+అమ్మ....మాయమ్మ...య్  అనేది ఆగమముగా చేరినది

11)ఏకాదేశము
రెండు పదముల మధ్య  సంధి జరుగు నప్పుడు పూర్వపదము చివర ఉండే అక్షరం గాని పరపదము లోని మొదటి అక్షరం గాని  ఈ రెంటిలో ఒకదానిని గాని రెంటినీ గాని తొలగించి మరొక అక్షరం  ఒక్కటే  వచ్చి చేరటాన్ని  ఏకాదేశము అంటారు
రామ+ఆలయము..రామాలయము
శిల+అభిషేకము...శిలాభిషేకము
(హహ్రస్వ అకారములు  ధీర్ఘములైనవి)

12)నిత్యము
విధించిన సంధి కార్యము తప్పని సరిగా జరుగుటను  నిత్యము అంటారు
సోముడు+ఇతడు...సోముడితడు....తప్పనిసరిగా సోముడితడు అనిమాత్రమే పలుక వలెను
సోముడు ఇతడు అనరాదు.

13)విభాష(వైకల్పికము)
విధించిన సంధి కార్యము ఒక సారి జరుగుట ఒకసారి జరుగకపోవుటను  విభాష.  లేక వైకల్పికము అందురు

14)బహుళము
విధించిన సంధి కార్యము  నిత్యము,నిషేధ,వికల్ప.లేదా అన్యవిధములుగా జరుగుటను బహుళము అందురు

15)ద్విరుక్తము
ఒకే పదము రెండు సార్లు చెప్పబడినచో ద్విరుక్తము
(ఔర+ఔర)

16) సంశ్లేష
సంశ్లేష అనేదానికి మీది హల్లుతో కూడుకొనుట "బాగా కలియుట" అని అర్ధము  ఒక పొల్లు హల్లు మీది హల్లుతో కలియుట
పూచెను+కలువలు...,పూచెన్గలువలు   ఇది సంశ్లేష రూపము

17)ఆమ్రేడితము
  ఒకపదము రెండు సార్లు చెప్పబడినప్పుడు  రెండవసారి చెప్పబడిన పదము ఆమ్రేడితమనబడును..

18)తపరకరణము
అత్తు,ఇత్తు,ఉత్తు  అని ఇలా చెప్పటాన్ని తపరకరణము అంటారు  ఇలా తపరకరణము చేసి చెబితే అది హ్రస్వమైన అక్షరాలను మాత్రమే నిర్ధేశిస్తుంది అని అర్ధము
అత్తు.......అ
ఇత్తు.......,ఇ

19)భృశార్ధం
 మిక్కిలి  చెప్పడానికి భృశార్ధం అంటారు

20)రేఫ....
ర అనే అక్షరాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు  రేఫ  అంటారు
ఱ (బండిరాని)  శకట రేఫ అంటారు   రకారము ఱకారము   అనరాదు

21) అవసానము
"అవసానము"  అనగా చివర  అని అర్ధము వాక్యానికి గాని పదానికి గాని చివర అని అర్ధము..
"వాక్యావసానంబున సంధిలేమి దోషముగాదని ఆర్యులందురు"
అనగా ఒక వాక్యము పూర్తి అయినపిదప మరొక వాక్యము ప్రారంభిచుటకుముందు సంధి లేకపోయినను దోషము కాదు.అని అర్ధము.

22)తత్సమ శబ్దము
సంస్కృత శబ్దము కాదు కాని సంస్కృత శబ్దము వలెనుండునవి తత్సమ శబ్దములు.సంస్కృత పదములకు ప్రత్యయములు(విభక్తులు)చేరుట వలన వచ్చిన పదాలు
దూత..,,రాముడు..,కృష్ణుడు ..

అయితే మనం సంధుల విఙ్ఞానమును చర్చించుకునే సమయంలో విభక్తులను గూర్చి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైననూ గలదు కావున  సూక్ష్మముగా వాటిని గూర్చికూడా తెలుసు కుందాము.

సశేషం....  రేపు కలుద్దామా?

1 comment: