సంధుల విఙ్ఞానము.
పరిచయం రెండు పదాలు ఒకదానితో
మరొకటి కలసిపోయి ఒకే పదముగా మిగిలిపోతాయి. అలా కలసినప్పుడు మొదటి పదం చివరలోగాని
రెండవపదం మొదటలోగాని మార్పులు సంభవించటం జరుగుతుంది. అనగా అక్కడ ఉన్న అక్షరాలు దీర్ఘాలుగా
మారటం ఉన్నఅక్షరాలు పోవటం లేదా వేరే క్రొత్త అక్షరాలు వచ్చి చేరటం జరుగుతుంది. ఇలా ఎందుకు జరిగింది అని మనకు
మనం ప్రశ్నించుకుంటే వచ్చే జవాబే "సంధి జరిగింది"అనేది. ఎలా జరుగుతుందో తెలియ చేసేదే ఈ "సంధుల విజ్ఞానము" లేదా "సంధి
పరిచ్ఛేదనము"
మనం ఉదాహరణకు ఒక వాక్యం తీసుకుందాము.
"లోకేశ్వరుడు,
రంగాచార్యులు, భ్రమరాంభిక అయిదేండ్ళు నుండి
మిత్రులు. వారు ప్రతిరోజు శివాలయము దర్శిస్తారు"ఇప్పుడు పైవాక్యం పరిశీలిద్దాము..
"లోక"..."ఈశ్వరుడు" .,,ఇవి
రెండు పదాలు..,,ఈ రెండు పదాలు కలిసి పోయి "లోకేశ్వరుడు" అనే ఒకటే పదం ఏర్పడింది.
"రంగ" "ఆచార్యులు"...ఇవి రెండుపదాలు."రంగాచార్యులు" అనే ఒకే పదం ఏర్పడింది.
"భ్రమర" "అంబిక" భ్రరమరాంబిక
"శివ" "ఆలయము" ..శివాలయము ఇలా రెండు మూడు పదాలు కలిసి ఏక పదముగా ఏర్పడటాన్ని
సంధి జరిగిన రూపము అంటారు. ఇలా సంధి జరిగినప్పుడు లేదా ఈ సంధుల పరిఙ్ఞానం మనం విశ్లేషించి చెప్పుకునే
సందర్భాలలో వచ్చే కొన్ని అతి ముఖ్యమైన పదాలను గురించి ముందుగా తెలుసు కుందాము.
1)సరళములు:- తేలికగా పలకబడేవి సరళములు..తేలిక
అనగా కొంచం ప్రయత్నముతో అని భావము. వీటికి "నాదములు" అనే పేరుకూడా కలదు. గ..,జ..,డ.,ద...బ
2)పరుషములు:-కఠినముగా పలుకబడే వాటిని పరుషములందురు.
కఠినమనగా గట్టి ప్రయత్నం. వీటికి
"శ్వాసములు" అనే పేరు కూడా కలదు. క..,చ...ట...త...ప
3)వర్గయుక్కులు:-"యుక్కు" అనగా జత వర్గాక్షరాలలో 2---4
అక్షరాలు
ఖ..,ఘ...ఛ...ఝ..,ఠ...,ఢ...థ...ధ....ఫ..,భ....ఇవి
మొత్తము 10 అక్షరాలు
4)అనునాసికములు:-నాసిక అనగా ముక్కు ముక్కు సహాయముతో పలుకబడును కావున అనునాసికములైనవి. ఙ...ఞ.,,ణ...న.,,మ...ఇవి 5 అక్షరములు.
5)ద్రుతం:- ద్రుతమనగా నకారము. అవసరములేనిచోట
జారిపోవునదని అర్ధము.
6)ద్రుతప్రకృతికము:- ద్రుతము చివరన గల పదాలను ద్రుతప్రకృతికములు అంటారు.
అనెన్.,,,కనెన్....వినెన్...తినెన్... మున్నగునవి .
సంధికార్యమునవచ్చు పదములు:-
సంధి కార్యమునందు వచ్చే మరి కొన్ని ముఖ్యమైన
పదాలను గురించి తెలుసుకుందాము.
7)పూర్వ పదము;- సంధి జరిగిన రెండు పదములలోని
మొదటి పదమును పూర్వపదమందురు.
శివ+ ఆలయము-శివాలయము.
ఇందు " శివ" అను పదము పూర్వ పదము.
8)పరపదము:- సంధి జరిగిన రెండు పదములలోని
రెండవ పదమును పరపదమందురు.
శివ+ఆలయము-శివాలయము ఇందు
"ఆలయము" అను పదము పరపదము.
9)ఆదేశము:-(శతృవదాదేశః) రెండు పదముల
మధ్య సంధి జరుగు నప్పుడు ఒక అక్షరమును
తొలగించి మరో అక్షరము శతృవు వలే వచ్చి
చేరుటను "ఆదేశము" అందురు.
సరసము+మాట-సరసపుమాట ము అనే అక్షరం
స్థానములో పు వచ్చి
చేరినది.
10)ఆగమము(మిత్రవదాగమః):- రెండు పదముల మధ్య సంధి జరుగు నప్పుడు మిత్రుని వలే మరో అక్షరము
అదనముగా వచ్చి చేరుటను ఆగమము అందురు.
మా+అమ్మ-మాయమ్మ య్ అనేది ఆగమముగా చేరినది.
11)ఏకాదేశము:-రెండు పదముల మధ్య సంధి జరుగు నప్పుడు పూర్వపదము చివర ఉండే అక్షరం
గాని పరపదము లోని మొదటి అక్షరం గాని ఈ
రెంటిలో ఒకదానిని గాని రెంటినీ గాని తొలగించి మరొక అక్షరం ఒక్కటే
వచ్చి చేరటాన్ని ఏకాదేశము అంటారు.
రామ+ఆలయము..రామాలయము.
శిల+అభిషేకము...శిలాభిషేకము (హ్రస్వ
అకారములు ధీర్ఘములైనవి).
12)నిత్యము:-విధించిన సంధి కార్యము
తప్పని సరిగా జరుగుటను నిత్యము అంటారు.
సోముడు+ఇతడు-సోముడితడు, తప్పనిసరిగా సోముడితడు
అనిమాత్రమే పలుక వలెను సోముడు ఇతడు సోముడు యితడు అనరాదు, వ్రాయరాదు.
13)విభాష(వైకల్పికము):-విధించిన సంధి కార్యము ఒక
సారి జరుగుట ఒకసారి జరుగకపోవుటను
విభాష. లేక వైకల్పికము అందురు.
14)బహుళము:-విధించిన సంధి కార్యము నిత్యము, నిషేధ, వికల్ప లేదా అన్యవిధములుగా
జరుగుటను బహుళము అందురు.
15)ద్విరుక్తము:-ఒకే పదము రెండు సార్లు
చెప్పబడినచో ద్విరుక్తము. (ఔర+ఔర=ఔరౌర)
16)సంశ్లేష:- సంశ్లేష అనేదానికి మీది
హల్లుతో కూడుకొనుట "బాగా కలియుట" అని అర్ధము. ఒక పొల్లు హల్లు మీది
హల్లుతో కలియుట
పూచెను+కలువలు...,పూచెన్గలువలు ఇది సంశ్లేష రూపము.
17)ఆమ్రేడితము:-ఒకపదము రెండు సార్లు
చెప్పబడినప్పుడు రెండవసారి చెప్పబడిన పదము
ఆమ్రేడితమనబడును.
18)తపరకరణము:- అత్తు,ఇత్తు,ఉత్తు అని ఇలా
చెప్పటాన్ని తపరకరణము అంటారు. ఇలా తపరకరణము చేసి చెబితే అది హ్రస్వమైన
అక్షరాలను మాత్రమే నిర్ధేశిస్తుంది అని అర్ధము (అత్తు..అ.)(ఇత్తు..ఇ)(ఉత్తు.,ఉ)
19)భృశార్ధం:- మిక్కిలి చెప్పడానికి భృశార్ధం అంటారు.
20)రేఫ:- ర అనే అక్షరాన్ని చెప్పవలసి
వచ్చినప్పుడు రేఫ అంటారు
“ఱ” ని (బండిరాని)
శకట రేఫ అంటారు రకారము
ఱకారము అనరాదు.
21) అవసానము:-"అవసానము" అనగా చివర
అని అర్ధము వాక్యానికి గాని పదానికి గాని చివర అని అర్ధము.
"వాక్యావసానంబున సంధిలేమి దోషముగాదని
ఆర్యులందురు."
అనగా ఒక వాక్యము పూర్తి అయినపిదప మరొక వాక్యము
ప్రారంభిచుటకుముందు సంధి లేకపోయినను దోషము కాదనర్ధము.
22)తత్సమ శబ్దము:- సంస్కృత శబ్దము కాదు కాని
సంస్కృత శబ్దము వలెనుండునవి తత్సమ శబ్దములు. సంస్కృత పదములకు ప్రత్యయములు (విభక్తులు)చేరుట
వలన వచ్చిన పదాలు.(రాముడు..,కృష్ణుడు ..వనము).
అయితే మనం సంధుల విఙ్ఞానమును చర్చించుకునే
సమయంలో విభక్తులను గూర్చి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైననూ గలదు కావున సూక్ష్మముగా
వాటిని గూర్చికూడా తెలుసు కుందాము.
విభక్తులు
విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు
అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య
సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. విభక్తులు
ఏడురకములు సంబోధనా ప్రధమా విభక్తితో కలసి
ఎనిమిది అయినాయి ద్రుతాంతములైన విభక్తులను ద్రుతాంతములుగా చెప్పుటయే భాషా మరియాద.
ఈ విభక్తులు (ప్రత్యయాలు) నామవాచకము సర్వ నామముల తరువాతనే ప్రయోగింప బడతాయి.
రాముని "చేత" సీత "వలన" రాణి"కి"చ్చాను
అంటూ ప్రయోగింప బడతాయి.
ప్రత్యయాలు విభక్తి పేరు
1. డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.
2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి---
ద్వితీయా విభక్తి.
3. చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
4. కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
5.వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.
6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--షష్ఠీ
విభక్తి.
7.అందున్, నన్--- సప్తమీ విభక్తి.
8.ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.
వివరణ:-
1) ప్రథమా విభక్తి:-డు, ము, వు, లు -- ప్రథమా
విభక్తి.
పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు
"డు" వస్తుంది.
ఉదా: రాముడు, కృష్ణుడు
అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు
"ము" వస్తుంది.
ఉదా: వృక్షము, దైవము.
ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు"
వస్తుంది.
ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు
బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా
విభక్త్యర్థంలో "లు" వస్తుంది.
ఉదా:
పుస్తకములు....కలములు......నదులు....కొండలు -- గోవులు
2) ద్వితీయా విభక్తి:-నిన్, నున్, లన్, గూర్చి,
గురించి--- ద్వితీయా విభక్తి
కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ
యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'.
ఉదా: అతడు వంటకము"ను" వండెను. వండెను
అనేదానికి వంట చేసెను అని అర్ధం. వంట
ఫలం..,,చేయుట వ్యాపారం(వ్యాపారం అనగా పని
చేయటం).
కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు
వచ్చును.
రావణుడు శివుని "గూర్చి" తపస్సు
చేసెను.
నీవు ఎందు "గురించి" యోచించు
చుంటివి? ఈ రెండు వాక్యాలు ఏదో ప్రయోజనమాశించి చేసినవిగా నున్నవి కదా.
3) తృతీయా విభక్తి:- చేతన్, చేన్, తోడన్, తోన్---
తృతీయా విభక్తి.
క్రియ యెక్క వ్యాపారానికి(పనికి)ఎవరైతే ఆశ్రయం
అవుతారో వారు కర్త.
కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది.
ఉదా: భీముని చేత వంటకము వండబడెను.
"వండబడెను" అంటె వంట చేయబడింది అని అర్ధమే కదా?.చేయటం అనే
పనికి (వ్యాపారానికి) ఆశ్రయము, భీముడు ఈ వాక్యములో అనుకర్త కావున భీముని "చేత" అని
వాక్యనిర్మాణం చేయబడింది.
అ)కరణ,,సహార్ధ..తుల్యార్ధాల యోగంలోను "
తోడ"అనే ప్రత్యయం వస్తుంది."
కరణం..(సాధనం) కోల "తోడ" కూల వేసె.
సహార్ధం.,(కూడా) అతడు మంది "తోడ"
వచ్చెను.
తుల్యార్ధయోగం.,(సమానార్ధం)
రాముని తోడ సుగ్రీవుడు మిత్రుడు.
ఆ)వచ్యర్ధ అముఖ్య కర్మకు తోడ వర్ణకం వచ్చును.
అముఖ్య కర్మ అనగా ముఖ్యము కాని కర్మవాచకం
వచ్యర్ధం అనగా వంచించు...పలుకు అను, చెప్పు, అనేవి వచ్యర్ధాలు.,ఈ
అర్ధాలలో యోగం ఉన్నప్పుడు అముఖ్య కర్మకు "తోడ" వస్తుంది.
రాము
హరి "తోడ" యిట్లనెను.
ఇ)"ఉపయోగంబునందాఖ్యాతకు
తొడవర్ణకంబగు"
ఆఖ్యాత..అనగా చెప్పేవాడు. చెప్పే వానికి తో అనే
ప్రత్యయం వస్తుంది
రామ, హరి, కృష్ణుని
"తోడ" వేదములు చదివిరి.
కృష్ణుడు ఆఖ్యాత కృష్ణుడు కూడా చదువుకున్నాడని
అర్ధం కాదు. కృష్ణుని వద్ద చదువు కున్నారని అర్ధం.
4) చతుర్ధీ విభక్తి:- కొఱకున్ (కొరకు), కై---
చతుర్ధీ విభక్తి.
"సంప్రదానంబునకుంజతుర్ధి యగు." త్యాగోద్దేశ్యము
గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం.
ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
కన్యను తిరిగి పుచ్చుకొనే ఉద్దేశం లేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నా అవుతుంది,
ఉదా.ప్రధమ స్థానము కొరకు ప్రయత్నించ వలెను.ఇది
ఉద్దేశమే కదా
కొఱకు+న్=కొఱకు. ద్రుతలోపమున కొఱకు అని
నిలిచినది. ఇది కొఱ=ప్రయోజనము, కు=నకు అను అర్ధమున నిలిచినట్లుగ కనబడుతున్నది. అలాగే "కయి' వర్ణకముసైతము క+అయి అనుదాని
విపర్యరూపము.ఇందు అయి అనునది అగు ధాతువు క్త్వార్ధకరూపము.
ఉదా..,హరి కై శివ వేచి యుండెను.
5) పంచమీ విభక్తి:-వలనన్, కంటెన్, పట్టి---
పంచమీ విభక్తి.
అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ,
భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ
విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.
ఉదా:అతివేగము వలన ప్రమాదము జరిగెను.(అపాయ)
దొంగ వలన భయము కలిగెను. (భయము)
పాపము వలన ఏవగింపు కలిగెను. (జుగుప్స)
నిర్లక్ష్యం వలన జారిపడెను. ( ప్రమాదము.)
భార్య వలన ధనము కలిగెను.(గ్రహణము=కొనుట
,,ఎరుగుట.వినుట)
అపరిశుబ్రత వలన వ్యాధులు వచ్చును. (భవనము..పుట్టుక)
పంటను పక్షుల వలన కాచెను.(త్రాణము.కాచుట)
రోగముల వలన మానుకొనెను.(విరామము)
చోరుడు శునకము వలన దాగెను. (అంతర్ధి -దాగు మాయమగు -మఱగు)
శోకము వలన వారించె.(వారణము-వారించుట)
ఆ)"కంటె వర్ణకంబు అన్యార్ధాది యోగజంబగు
పంచమికగు"
అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం
వస్తుంది. అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే
'కంటె' వస్తుంది.
ఉదా: రాముని "కంటె" నన్యుండు
దానుష్కుండు లేడు.
కర్ణుని "కంటె" నన్యుడు దానశీలి లేడు.
ఇ)నిర్ధారణ పంచమిలో కూడ కంటె ప్రత్యయం
వస్తుంది.
జాతి మొదలగు వాటితో నిర్ధారించేటప్పుడు పచమీ
విభక్తి వస్తుంది దానిని నిర్ధారణ పంచమి అంటారు ఆ పంచమికి "కంటె"
వస్తుంది
ఉదా:
ఆటవికులకంటే
నాగరికులు వివేకులు (ఆటవికులు నిర్ధారకులు)
గ్రుడ్డి కంటె మెల్ల మేలు: ఇక్కడ ('గ్రుడ్డి
నిర్ధారణము)
ఈ)'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు
వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి. గుణము
అంటే స్వభావం క్రియ అంటే పని
ఉదా: "చదువును బట్టి యోగ్యుడగు. "
యోగ్యుడవడానికి కారణము చదువు
వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత
రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటె అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ
తెలియును. పట్టి అను వర్ణకము 'పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము'.
6) షష్ఠీ విభక్తి:-కిన్, కున్, యొక్క, లోన్,
లోపలన్--- షష్ఠీ విభక్తి.
అ)శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు
'యొక్క' అనే విభక్తి వస్తుంది.
ఉదా: నా యొక్క పుత్రుడు; వాని యొక్క తమ్ముడు.
ఆ)నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది.
జాతి,
గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు.
ఉదా: పశువుల లోపల గోవు శ్రేష్టమైనది.
షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను
ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును
7) సప్తమీ విభక్తి:-అందున్, నన్--- సప్తమీ
విభక్తి.
అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం
అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు'
అనేది మాత్రం వస్తుంది. వైషయికం అంటే విషయ సంబంధం.
ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.
అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం.
ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.
ఔపశ్లేషికం..,అనగా సమీప సంబంధం
ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే
అచేతన పదార్ధం.
ఉదా: ఘటంబున జలం ఉంది.
8) సంబోధనా ప్రథమా విభక్తి:- ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా
ప్రథమా విభక్తి.
ఆమంత్రణం అంటే పిలవడం, సంబోధించడం. ఇది
ఎవరినయితే సంబోధించడం జరుగుతుందో - ఆ శబ్దానికి 'ఓ' అనేది వస్తుంది.
ఉదా: ఓ రాముడా - ఓ రాములార
ఓ శబ్దానికి పురుషుని సంబోధించేటప్పుడు 'యి'
అనేది, నీచ పురుషుని సంబోధించినప్పుడు 'రి' అనేది, నీచస్త్రీని సంబోధించినప్పుడు
'సి' అనేది అంతాగమాలుగా విభాషగా వస్తాయి.
ఉదా: ఓయి రాముడా! ఓరి దుష్టుడా! ఓసి
దుర్మార్గురాలా!
యి
రాని ఎడల ఓ రాముడు
....ఓ దుష్టుడు....
ఓరీ...,.ఓసీ
అనేవి మైత్రిని తెలియజేయు ఆ మంత్రణం లోకూడా వస్తాయి..
ఓరి ముద్దు కృష్ణా....పురుష సంబోధనం
ఓసి ముద్దు పాప...స్త్రీ సంభోధనం
ఓయి.... ఓరీ ....ఓసీ అనే వాటికి ధీర్ఘాలు కూడా ఉన్నాయి
ఓయీ....మూర్ఖ మానవా
ఓరీ......దుష్ట మానవా
ఓసీ.....ఎందు బోతివి.....మున్నగునవి
ఔప విభక్తికాలు:- ఇ టి
తి ఔపవిభక్తికంబులు
"విభక్తి నిమిత్తకంబులై యాదేశాగమాత్మకాలైన
"ఇ..,టి...తి" వర్ణంబులు ఔపవిభక్తికంబులనంబడు"
ఊరు+ని....ఊరిని
మ్రాను+ని...,.మ్రానిని
నోరు+ను...నోటిని
కాడు+ను..,కాటిని
ఏటిని....పగటి....మొదటి.....రెంటిని......మూటిని.....
కంటి.,,,ఇంటి...,మింటి...,పంటి
మున్నగు పదాలు
ఓప విభక్తికాలైన ఇ.,టి...ని అనే వర్ణాలు
ఆగమ ఆదేశాలు గా రావటం వలన ఏర్పడిన
పదాలే.
తిరిగి సంధుల పరిఙ్ఞానములోకి వద్దాము. అయితే సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం వాటి వాటి
భాషా మరియాదలను బట్టి నిర్వచనాలు
చెప్పబడ్డాయి. ఇలా చెప్పుకున్న సంధులలో అనేక రకాలున్నప్పటికి ముఖ్యంగా "అచ్
సంధులు" "హల్ సంధులు " అనేవి ముఖ్యమైనవి. వీటిలో తిరిగి అనేకరకాలుగా
వ్యాకరణ కర్తలు శలవిచ్చారు. మనం వాడే తెలుగు భాషలో అనేకమైన సంస్కృత పదాలు ఎంతగానో
కలిసి ఇమిడి ఉన్నాయి కావున ముందుగా సంస్కృత సంధులు గురించి తెలుసుకుందాము.
సంస్కృత సంధులు
వర్ణాలు గాని పదాలు గాని కలియుటయే సంధి ఇలా
కలిసిన సమయంలో అక్షర లోపము ఆగమము
ఆదేశము మొదలగు వాని వలన జరిగే మార్పులు సంధులౌతాయి ఇలా జరిగే సందులు పదాల మద్య సంహిత
ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది . సంహిత అనగా అక్షరాల మద్య అర్ధమాత్రా వ్యవధానం
కంటే ఎక్కువ వ్యవధానం లేకుండా ఉండే స్థితి. .వ్యవధానమనగా రెండు పదాల
మద్య మరొకటేది లేకుండుట,
ఈ సంధులు సంస్కృతం లో స్థూలంగా 3 రకాలు..1)ఆగమ
సంధులు 2)ఆదేశ సంధులు. 3)ఏకాదేశ సంధులు అని మూడు రకాలుగా ఉంటాయి. తెలుగు భాషకు
సంస్కృత సాంగత్యమధికముగా నుండుటవలన సంస్కృతమునందలి సంధులనేకము తెలుగు భాష లోనికొ చ్చినవి,
అవి 1.సవర్ణధీర్ఘ సంధి. 2.గుణ సంధి.3.యణాదేశసంధి.4.వృధ్ధిసంధి.5. అనునాసిక సంధి. 6.విసర్గ సంధి.7.శ్చుత్వ సంధి. 8.జస్త్వ సంధి.
1) సవర్ణధీర్ఘ సంధి:- సవర్ణమనగా సమానమైన అచ్చు అని
అర్ధము సవర్ణమైన అచ్చు ధీర్ఘముగా వచ్చుట
వలన దీనికి ఆ పేరు వచ్చినది
"సూత్రము:- అ ఇ ఉ ఋ లను అక్షరములకు సవర్ణములైన అచ్చులు
పరమైనప్పుడు క్రమముగా ధీర్గము ఏకాదేశమగును."అనగా
అ
ఆ లకు అ
ఆ లు పరమైతే....ఆ కారము,
ఇ.,,ఈ లకు
ఇ ఈ లు
పరమైతే....ఈ కారము,
ఉ,,ఊ
లకు ఉ ఊ
లు పరమైతే..ఊ కారము,
ఋ
ౠ లకు ఋ
ౠ లు పరమైతే.ౠ కారము,
నైన సవర్ణ ధీర్ఘాలు ఆదేశమగునని సూత్రార్ధము.
ఉదా..,శత+ అబ్దము....,.......శతాబ్దము (అ+అ..ఆ)
మహా+ఆనందము......మహానందము(ఆ+ఆ..ఆ)
ముని+ఇంద్రుడు.... ....మునీంద్రుడు (ఇ+ఇ..ఈ)
గౌరీ+ఈషుడు............గౌరీశుడు (ఈ+ఈ.,ఈ)
భాను+ఉదయము... ..భానూదయము(ఉ+ఉ.,ఊ)
పితృ+ఋణము...... ..పితౄణము (ఋ+ఋ..ౠ)
2) గుణసంధి:- ఏ ఓ ఆర్ లకు గుణములను సఙ్ఞ కలదు. ఈ గుణములు ఏకాదేశమగుటవలన దీనికి గుణసంధి అనే
పేరుకలిగినది.
సూత్రము--"అ ఆ అను స్వరంబులకు అసవర్ణములైన ఇ ఉ,,ఋ
లుపరమగు నప్పుడు క్రమముగా ఏ..,ఓ...ఆర్....లు ఏకాదేశంబగు" అనగా
అ
ఆ లకు ఇ
ఈ లు పరమైతే....ఏ కారము,
అ ఆ
లకు ఉ,,ఊ
లు పరమైతే....ఓ కారము,
అ
ఆ లకు ఋ ౠ
లు పరమైతే..ఆర్ అనేవి
ఏకాదేశమగును, అని సూత్రార్ధము.
ఉదా..,
దేవ+ఇంద్రుడు..........దేవేంద్రుడు (అ+ఇ..,ఏ),
మహా+ఈశుడు.........మహేశుడు(ఆ+ఈ....ఏ),
సూర్య+ఉదయము...సూర్యోదయము(అ+ఉ..,ఓ),
గంగా+ఊర్మి.............గంగోర్మి (ఆ+ఊ.....ఓ),
దేవ+ఋషి...............దేవర్షి(అ+ఋ....ఆర్),
3)యణాదేశ సంధి:-య,,,వ.....ర లకు యణ్ణులని పేరు..ఈ యణ్ణులు ఆదేశమగుటవలన
దీనికి యణాదేశ సంధి అని పేరువచ్చినది.
సూత్రము--"ఇ...ఊ..,ఋ లకు అసవర్ణములైన అచ్చులు (అసమాన అచ్చులు) పరమైనప్పుడు క్రమముగా య
వ ర లు
ఏకాదేశమగును."
ఇ.,ఉ
ఋ అనేవి ఇక్కులు.
య,,,వ.....ర
లకు యణ్ణులని పేరు.
అసమాన అచ్చులు పరమైతే
ఇ కారమునకు
య కారము,
ఉ కారమునకు వ కారము,
ఋ
కారమునకు ర (రేఫ) ఆదేశముగా వస్తాయి
అనునది సూత్రార్ధము.
ఉదా...
అతి+అంతము..........అత్యంతము (ఇ+అ...య)
దేవి+ఆలయము......,,,దేవ్యాలయము(ఈ+ఆ.,,య)
మను+అంతరము.......మన్వంతరము(ఉ+అ..,వ)
వధు+ఆనందము.,....,వధ్వానందము(ఊ+ఆ,,,,వ)
ధాతృ+అంశము...........ధాత్రంశము (ఋ+అ...ర)
పితృ+ఆఙ్ఞ...................పిత్రాఙ్ఞ (ఋ+ఆ.,.,,ర)
4)వృద్ధిసంధి:- ఐ ఔ లకు వృధ్ధులని పేరు ఈ
వృధ్ధులు ఆదేశముగా వచ్చుటవలన వృధ్ధి సంధి అని పేరు వచ్చినది.
సూత్రము--"అకారమునకు ఏ ఐ లు
పరమగు నప్పుడు "ఐ" కారమును
ఓ ఔ పరమగునప్పుడు
" ఔ" కారమును
ఏకాదేశములగును."
అకారాంత, ఆ కారాంత శబ్దాలకు(అ ఆ లకు)
ఏ ఐ పరమైనప్పుడు ఐ కారమును, ఒ ఔ లు
పరమైనప్పుడు ఔ కారమును
ఏకాదేశముగా వచ్చుటను వృద్ధి సంధి అందురు అని సూత్రార్ధము.
ఉదా....
భీష్మ+ఏకాదశి.....భీష్మైకాదశి (అ+ఏ...ఐ)
మహా+ఐశ్వర్యము....మహైశ్వర్యము(ఆ+ఐ....ఐ)
వన+ఓషధి..,.,వనౌషధి (అ+ఓ.....ఔ)
మహా+ఔషధము.....మహౌషధము (ఆ+ఔ....ఔ)
5.యన్తాదేశ సంధి
6.వాంతాదేశ సంధి :-ఇవి పూర్తిగా సంస్కృతమునకు
సంబంధించినవి..
పూర్వ పదము చివర ఏ
ఓ ఐ ఔ లు
ఉండి విటికి అచ్చులు పరమగునప్పుడు అయ్.,,ఆయ్..,,అవ్ ఆవ్
అనునవి ఆదేశములుగా వచ్చును
హరే+ ఏ.,,హరయే
విష్ణో+ఏ....,విష్ణవే
7) విసర్గ సంధి:- (ఈ సంధి వలన ఏర్పడిన
పదములనేకము మనము అనునిత్యము వాడుతుంటాము కావున ప్రత్యేకమైన శ్రద్ధ తో గమనించ
వలసినదిగా నా విన్నపము) సంస్కృతమునందు "స"కారాంత పదములు కలవు అవి సంధి
జరుగు సమయమున విసర్గ గానే కాక మరికొన్ని విధములుగా మారును.
a)స
కారాంత పదములకు చ..,.ఛ....శ అను వర్ణములు పరమైనప్పుడు స కారం శ వర్ణముగా మారును
ఉదా..
మనస్+ శాంతి...మనశ్శాంతి
తపస్+చర్య......తపశ్చర్య
దుస్+చరితము..దుశ్చరితము.,,మున్నగునవి.
b)స
కారాంత పదములకు. క ఖ ప
ఫ అను వర్ణములు పరమగు నప్పుడు స కారము విసర్గ ః గామారును.
ఉదా....
ప్రాతస్+కాలము...,ప్రాతఃకాలము
మనస్+ఖేదము....మనఃఖేదము
తేజస్+ పుంజము..తేజఃపుంజము
తపస్+ఫలము.......తపఃఫలము........,మొదలైనవి.
c) ఇస్.,,ఉస్
అంతమందు గల ఉపసర్గలు మరియు శబ్దములయెక్క స కారములకు క ఖ
ప ఫ వర్ణములు పరములగు నప్పుడు,,షకారము వచ్చును.
ఉదా.,,
నిస్+కారణము....నిష్కారణము
దుస్+కార్యము....దుష్కార్యము
ధనుస్+ఖండము..ధనుష్ఖండము
చతుస్+పదము....చతుష్పదము...మొదలైనవి.
d)స
కారమునకు "ట" వర్ణము పరమగునప్పుడు షత్వమును షకారము పరమగునప్పుడు
షత్వ మరియు విసర్గలు వచ్చును.
ఉదా...
ధనుస్+ టంకారము....ధనుష్టంకారము.
చతుస్+షష్టి........,,..,,చతుష్షష్టి.
e)అస్
అంతముగా గల పదములకు క ఖ
చ ఛ ట
ఠ త థ
ప ఫ శ
ష స కాక తక్కిన హల్లులేవేని పరమైనప్పుడు అస్
స్థానమునకు ఓ కారము వచ్చును.
ఉదా...
మనస్+గతి....మనోగతి
తపస్+బలము..,తపోబలము
మనస్+వేదన...,మనోవేదన
మనస్+ రధము..మనోరధము..,,,మున్నగునవి.
f)ఇకారాద్యచ్చులు
పూర్వమందుగల సకారమునకు క ఖ
చ ఛ ట
ఠ త థ
ప ఫ శ
ష స వర్ణములు తప్ప తక్కిన
హల్లులు అచ్చులేవేని పరమైనప్పుడు
రేఫము వచ్చును.
ఉదా..,
బహిస్+అంగము.....బహిరంగము
ఆశీస్+వదము......ఆశీర్వాదము
దుస్+అంతము..,.దురంతము
విస్+ధనులు.......విర్ధనులు
దోస్+బలము......దోర్బలము........మున్నగునవి.
సంస్కృత సంధులలో మరెన్నో సంధులు కలవు కాని నేను
వాటిని ప్రస్తావించటంలేదు.
సామాన్యముగా మనకు కావలసినవనుకున్న అతిముఖ్యమైన వాటినే ముచ్చటించటం జరిగినది కావున మిత్రులు గమనించ
గలరు.
తెలుగు సంధులు
"పూర్వపరస్వరంబులకుపరస్వరంబేకాదేశంబగుట
సంధి యనంబడు”
పూర్వ పదం చివర ఉన్న అచ్చుకు పర పదము మొదటనున్న
అచ్చు పరమైనప్పుడు ఆ రెంటిలోను పరపదము యెక్క అచ్చు ఒక్కటే ఆదేశమగుటను సంధి అని అంటారని అర్థం.
ఉదా..,
రాముడతడు. రాముడు+ అతడు..(విడదీసిన రూపము) ఉ+అ.,,అ
(సంధిలో వచ్చిన మార్పు)
రాముడు
పూర్వపదము అతడు పరపదము
పూర్వపదము చివరి అక్షరం "డు"
డ్+ఉ=డు.,,డులో ఉన్న ఉ అనేదానిని
కార్యోత్తర వర్తి అంటారు. అతడు అనేది పరపదము.
పూర్వపదములోని చివరనున్న "ఉ" అనే అచ్చుకు "అతడు" అనే పరపదములోని
"అ " అనే అచ్చు పరంగానున్నది. రెండుపదములలోని అచ్చులు పోయి రెండవపదములోని మొదటి అచ్చు ఒక్కటే ఆదేశముగా
రావటమే తెలుగు సంధి లక్షణము..కావున
రాముడ్+ఉ+అతడు..రాముడ్+(ఉ)+అ+తడు..రాముడ్+అ+తడు....రాముడతడు అనే రూపము వచ్చినది ఇదియే సంధి కార్యము.
తెలుగులో
అచ్చులకు సంబంధించిన విధానమిలాఉంటూ
ఒక్కో అచ్చుకు సంబంధించి ఒక్కో సంధి ప్రారంభమైనది. తెలుగులో సంధులు అచ్ సంధులు
హల్ సంధులు అని వ్యాకరణ కర్తలు విడదీయలేదు కాని ప్రస్తతం ఆవిధంగానే చెప్పబడుతున్నాయి.
సంధులలో
బాహ్య సంధులు, అంతర సంధులు అని
రెండు రకాలున్నాయి. వాక్యం లోని పదాలకు మద్య జరుగునవి బాహ్య సంధులు. ఏక పదములో ప్రకృతి ప్రత్యయాలకు మద్య సమాసగత పదాలకు మద్య జరిగే
సంధులను అంతర సంధులు అంటారు. ఉకార సంధుల వంటివి బాహ్య సంధులు అయితే
స్వర సంధి టుగాగమసంది అపదాది సంధులు అంతర సంధులు సాదారణముగా పదాల కలయికలో
ఏదేని మార్పును గమనించినయెడల సంధి జరిగినది, సంధి పొసగినది అంటాము. ఎందుచేతననగా "దృత ప్రకృతికాలకు సంధి
లేదు" ఏలననగా దృత ప్రకృతికం తరువాత అచ్చుతో కలసిపోతుంది. మార్పు ఉండదు.
కొనెన్+ఇప్పుడు...కొనెనిప్పుడు. మార్పులేదు, అనగా సంధి పొసగ లేదని
తెలుసుకోవాలి.
తెలుగు సంధులు
1) అకార సంధి. 2) ఇకార సంధి. 3)
ఉకార సంధి. 4) యడాగమ సంధి. 5) టుగాగమ సంధి 6) పుంప్వాదేశ సంధి 7) దృత-సరళా దేశ సంధి, 8) గసడదవా దేశ సంధి. 9) రుగాగమ సంధి. 10) దుగాగమ
సంధి.11) ద్విరుక్త టకార సంధి. 12) పుగాగమ సంధి, 13) త్రికసంధి. 14) ఆంమ్రేడిత సంధి.
15) నుగాగమ సంధి.16) ప్రాతాధిసంధి. 17) పడ్వాదేశ సంధి. 18) డు వర్ణలోప సంధి. 19) పోడ్వాదేశసంధి.
20) లు ల న ల సంధి. 21) అపదాది స్వరసంధి. 22) అల్లోపసంధి. 23) తకారదేశసంధి. 24) తచ్చబ్ద
వకారలోపసంధి. 25) ము వర్ణలోప సంధి.
1.అకార సంధి (అత్త్వసంధి)
సూత్రం...."అత్తునకు సంధి బహుళముగానగు"
"అత్తు" అనగా హ్రస్వ అకారము.,బహుళమనగా
ఒకసారి సంధి జరగటం ఒకసారి సంధి జరగక పోవటం ఒకసారి విభాషగా సంధి జరగటం. ఒకసారి మరోరకముగా
జరగటము.
ఉదా..,,
మేన+అల్లుడు...మేనల్లుడు...సంధి జరిగిన రూపము
మేనయల్లుడు..,యడాగమము వచ్చిన రూపము
పుట్టిన+ఇల్లు .,,పుట్టినిల్లు సంధి జరిగిన రూపము
పుట్టినయిల్లు..యడాగమము వచ్చిన రూపము
చూడక+ఉండెను..చూడకుండెను..సంధి జరిగిన రూపము
చూడకయుండెను...యడాగమము వచ్చిన రూపము
అకారసంధి(అత్వసంధి)లోమరికొన్ని విశేషాలు గమనిద్దాము
A)"బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక తత్సమ సంబోధనాంతంబులకు
సంధి లేదు" బహుళము అనే పదము వాడుట వలన
"స్త్రీలను" అనే బహువచన రూపముతోననియు,తత్సమ శబ్దాలకు సంబోధన చివరగా గల శబ్దాల
యందలి అచ్చులకు అచ్చులు పరమైతే సంధి జరగదు అని అర్ధం సంధి జరుగనిచో
యడాగమం వస్తుంది కదా. (తత్సమ శబ్దమనగా సంస్కృత శబ్దము కాదు కాని సంస్కృత శబ్దము
వంటి శబ్దమని అర్ధము)
ఉదా.,,అమ్మ+ఇచ్చెను.,అమ్మయిచ్చెను (స్త్రీవాచకమగుటవలన
సంధి లేదు. యడాగమమొచ్చినది.)
దూత+ఇతడు,,దూతయితడు (తత్సమ శబ్దమగుటవలన సంధి లేదు. యడాగమమొచ్చినది)
చెలువుడ+ఉందము..చెలువుడయిందము("చెలువుడ"సంబోధన
శబ్దమగుటవలన సంధి లేదు.యడాగమమొచ్చినది) వీటికి సంధి జరిగినచో... మమ్మిచ్చెను... దూతితడు...చెలువుడిందము
అనే దుష్టరూపపదాలొస్తాయి.
B)వెలయాల్వాదుల సంధి లేమి బహుళంబుగానగు
వెల+ఆలు.,...,,అకారసంధి జరగాలి కాని బహుళముగా అకారసంధి
జరుగునని చెప్పినందున బహుళములో సంధి రాకపోవటం కూడా భాగమైనందున సంధిలేక యడాగమమొచ్చి
వెల+య్+ఆలు...వెలయాలు అయినది...
ఓకవేళ సంధి జరిగితే "వెలాలు" అనెడి అనిష్ట
రూపం వస్తుంది
C)శ్రేష్టతా వాచకంబులగు "నార్యాంబాద్యర్ధక"
శబ్దంబుల పరంబులగుచో ఆన్ని యచ్చులకు సంధి నిత్యము
(ఆర్య+అంబ+ఆది+అర్ధక...ఆర్యాంబాద్యర్ధక) ఈ సూత్రము నిత్యవిధిని తెలియజేయుచున్నది. అట్లు తెలియజేయకున్నచో బహుళమో
వికల్పమో వచ్చినచో
రామ+అయ్య.,,రామయ్య....రామయయ్య అనే రెండు రూపాలుగా అవుతుంది
శ్రేష్టతా
వాచకాలు:-గొప్పను సూచించే శబ్దాలు. శ్రేష్టత్వాన్ని సూచించే ఆర్య అంబ
మున్నగు శబ్దాలు అన్ని అచ్చులకు పరమైన
సంధి నిత్యముగా జరుగునని అర్థము .
రామ+అయ్య..,రామయ్య(అ+అ) అకారసంధి నిత్యము
సోమి+అయ్య.,సోమయ్య(ఇ+అ)ఇకారసంధి నిత్యము
సీత+అమ్మ.,,,.,సీతమ్మ (అ+అ)
అకారసంధి నిత్యము
లక్ష్మి+అమ్మ...లక్ష్మమ్మ (ఇ+అ)ఇకారసంధి నిత్యము
ఆది శబ్దములగు అన్న,, అక్క,,,అప్ప..పరమగునప్పుడు
అకార సంధి నిత్యము
రామ+అన్న..,,రామన్న
సీత+అక్క.,,సీతక్క
వెంక+అప్ప,,,వెంకప్ప
2.ఇకార సంధి
A)సూత్రము:-"ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగానగు"
ఏమి..మఱి..కి(.షష్టీ విభక్తి)..అది..అవి.,ఇది,,ఇవి.,ఏది.,ఏవి..అనేవి
ఏమ్యాదులు
"ఇత్తు " అనగా హ్రస్వమైన ఇకారము
"వైకల్పికము" అనగా ఒకసారి
సంధి జరుగుట ఒకసారి సంధి జరుగక పోవుట.
ఏమి మొదలైన పదాల చివర నున్న హ్రస్వ ఇకారమునకు అచ్చులు
పరమైనచో సంధి వికల్పముగా జరుగునని సూత్రార్ధము..సంధి జరుగని యెడల యడాగమము వస్తుంది
కదా.
ఏమి+అంటివి
ఏమంటివి....(ఇ+అ---అ) సంధి జరిగిన రూపము
ఏమియంటివి..(ఇ+అ..య) సంధి లేమి యడాగమ రూపము
మఱి+ఏమి.,,మఱేమి(ఇ+ఏ--ఏ) సంధి జరిగిన రూపము.
మఱి+ఏమి,,మఱియేమి(ఇ+ఎ--యే) సంధి లేమి యడాగమ రూపము
హరికిన్+ఇచ్చె...హరికిచ్చె..(కిన్+ఇ---ఇ)సంధి జరిగిన
రూపము (సంధిలో ద్రతము జారిపోయినది)
హరికినిచ్చె..(న్+ఇ,,,ని) సంధి జరుగక ద్రుతం సంయోగము చెందినది.
సంధి జరుగక
యడాగమము రాదు ఎందువలననగా ద్రుతం పొల్లుహల్లు కావున అచ్చుతో సంయోగము చెంది "హరికినిచ్చె" అయినది.
B)సూత్రము:- "క్రియా పదంబులందిత్తునకు సంధి
వైకల్పికముగానగు" ("క్రియ " అనగా చేసే పనిని గూర్చి తెలియ జేయు పదము
)
క్రియా పదాలు హ్రస్వమైన ఇకారాంతములై వాటికి అచ్చులు
పరం అయితే సంధి వైకల్పికంగా వస్తుంది అని సూత్రార్ధం.
వచ్చిరి+అప్పుడు
వచ్చిరప్పుడు...,,(ఇ+అ..అ)..సంధి జరిగినది
వచ్చిరియప్పుడు.,సంధిలేక యడాగమము వచ్చినది
వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు (ఇ+ఇ.,ఇ)..సంధి
జరిగినది
వచ్చితిమియిప్పుడు (ఇ+ఇ--య) సంధిలేక యడాగమము.
అయితే ఈ ఇకార సంధి ప్రధమ పురుష, ఉత్తమ పురుష క్రియా
పదాలలో మాత్రమే వస్తుంది.
(వాడు,,, అది..వారు ప్రదము పురుష
నేను.,మేము...మనము..,ఉత్తమ పురుష)
వచ్చిరి+అప్పుడ..వచ్చిరప్పుడు "వచ్చిరి" క్రియా పదము
"క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు"
ఈ సూత్రముతో సంధి జరిగినది
వచ్చిర్+అప్పుడు.,వచ్చిరప్పుడు(ర్+అ..ర) సంధి లేదు (పొల్లు హల్లు అయిన ర్ లో అ సంయోగము
చెంది "ర" అయినది)
వచ్చిరి+అప్పుడు.,వచ్చిరి+య్+అప్పుడు=వచ్చిరియప్పుడు యడాగమము వచ్చిన రూపము.
వసరమొచ్చింది కావున "పురుష వాచకాలు”అనగా నేవో చూద్దాము. పురుషలు మూడు రకాలు.
"నామ యుష్మదస్మదర్ధములందుంబ్రదమ మద్యమోత్తమంబులగు"
నామార్ధములో ప్రధమ పురుష క్రియ, ఎక్కడో ఉన్న వారి
గురించి యుష్మదర్ధంలో మద్యమ పురుష క్రియ, ఎదురుగా ఉన్న వారిని గురించి అస్మదర్ధంలోఉత్తమ
పురుష క్రియ. తనను గురించి తెలియచేస్తుంది.
వాడు..,అది...వారు......ప్రధమ పురుష
నీవు..,మీరు..,,,,.మద్యమ పురుష
నేను మేము మనము....ఉత్తమ పురుష
"తానుత్తమ..ఎదుట మద్యమ...ఎక్కడో ప్రధమ"
c)"మద్యమ పురుష క్రియలయం దిత్తునకు సంధి యగు"
నీవు..,మీరు
అనేవి మద్మ పురుష వాచకాలు..కావున ఈ పురుషలలో ఉండే క్రియలు మద్యమ పురుష క్రియలు.
మద్యమ పురుషార్ధములో క్రియాపదమందిలి ఇత్తునకు (హ్రస్వ
ఇకారమునకు అచ్చులు పరమయితే సంధి నిత్యముగా జరుగునని సూత్రార్ధము.
మనమిక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఏమంటే క్రియా పదాల హ్రస్వ ఇకారానికి సంధి
"వైకల్పికం"గా వస్తుంది కాని మద్యమ
పురుష క్రియా పదములందుదిత్తునకు సంధి "నిత్యము" (తేడా గమనించగలరు)
చదివితివి+అప్పుడు(ఇ+అ--అ)...చదివితివప్పుడు
చూచితివి +ఇప్పుడు(ఇ+ఇ--ఇ)...చూచితివిప్పుడు
పోయితిరి+ఎప్పుడు(ఇ+ఎ--ఎ)..,పోయితిరెప్పుడు
"నీవు" చదివితివప్పుడు..."మీరు"
పోయితిరెప్పుడు
ఇవన్నీ మద్యమ పురుష క్రియలు..
d)క్త్వార్ధంబున ఇత్తునకు సంధి లేదు
క్త్వార్ధము..అనగా భూతకాల అసమాపక క్రియ
క్త్వార్ధాన్ని ఇచ్చే క్రియా పదము చివర హ్రస్వమైన
ఇకారము ఉండగా అచ్చు పరమైనచో సంధి జరుగదు అని
సూత్రార్ధము.
సంధి జరుగనిచో
యడాగమము వచ్చును.
వచ్చి+ఇచ్చెను... వచ్చియిచ్చెను., ఇ+ఇ సంధి లేదు
కావున యడాగమము. "వచ్చి"..ఈ పదము
భూతకాల అసమాపక క్రియ కావున సంధిలేదు.
“సంధి లేనిచోట స్వరంబుకంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు”ఈ సూత్రముచే యడాగమము వచ్చి,
వచ్చి+య్+ఇచ్చెను.. వచ్చియిచ్చెను అయినది.
e)" ఇఁకాదులకు దప్ప ద్రుతప్రకృతికములకు సంధి
లేదు" (ద్రుత ప్రకృతికం-నకారము చివరగల పదము)
ఇఁక.,,ఇఁగ...,ఎట్టకేలకు...,ఎట్టకేని,, ఇలాంటి వాటిని ఇకాదులంటారు. వీటికి సంధి వైకల్పికము. మిగిలిన వాటికి సంధిలేదు.
ప్రధమేతర అనే సూత్రములో చెప్పబడిన ద్రుత ప్రకృతికాలకు
ఇకాదులలోని ద్రుతప్రకృతికాలకు తప్పించి మిగిలిన ద్రుతప్రకృతికాలకు సంధి లేదని సూత్రార్ధము.
ఈ క్రింది ఉదాహరణలు ఇఁకాదులు కాదు. కావున వీటిలోని ద్రుతానికి అచ్చు
పరమైతే లోపం రాక సంధిలేక పర అచ్చులో సంయోగమౌతాయి.
వచ్చున్+ఇప్పుడు..వచ్చునిప్పుడు..
చూడన్+అయితి.,చూడనయితి
ఉండెడిన్+అతడు..ఉండెడినతడు.
ఈ మూడు ఉదాహరణలలోకూడా సంధిలేదు ద్రుతం పరచ్చులో కలసిపోయింది.కావున,,ఇఁకాదులలోని
ద్రుతమునకు అచ్చు పరమైనచో సంధి వికల్పము
1.ఇఁకన్+ఏమిటి.,,,ఇఁకేమిటి....(సంధి జరిగిన రూపము)
ఇఁకనేమిటి ... (ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)
2.ఎట్టకేలకున్+అయినది.,ఎట్టకేలకైనది(సంధి జరిగిన
రూపము)
ఎట్టకేలకునయినది(ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)
3.ఎట్టకేనికిన్+ఇది..,ఎట్టకేనికిది(సంధి జరిగిన
రూపము)
ఎట్టకేనికినిది...(ద్రుతం పరఅచ్చులో సంయోగము చెందినది)’
3.ఉకారసంధి(ఉత్వసంధి)
సూత్రము --"ఉత్తునకచ్చు పరమగునప్పుడు సంధి
నిత్యము"
హ్రస్వమగు ఉకారానికి అచ్చు పరమైనప్పుడు అక్కడ తప్పక
సంధి జరుగుతుంది అని సూత్రార్ధము.
"ఉత్తు" అని తపకరణము చేయుటవలన
హ్రస్వ " ఉ" కారము మాత్రమేనని
ధీర్ఘమైన "ఊ"ఉండకూడదని భావింపవలయును. అలాగే పరపదమునందు అచ్చు అన్నప్పుడు హ్రస్వ అచ్చైనా లేదా ధీర్ఘ అచ్చైనా ఉండ వచ్చు.
ఉదా...,
రాజు+అతడు....రాజతడ (ఉ+అ=అ)
సోముడు+ఇతడు,,సోముడితడు (ఉ+ఇ=ఇ)
మనము+ఉంటిమి,,మనముంటిమి (ఉ+ఉ=ఉ)
వాడు+ఎక్కడ ...,వాడెక్కడ..(ఉ+ఎ=ఎ)
ఇతడు+ ఒకడు.,,ఇతడొకడు (ఉ+ఒ=ఒ
మనసు+ఐన..,మనసైన ( ఉ+ఐ=ఐ)
సులభము+ ఔను
.,,సులభమౌను (ఉ+ఔ=ఔ)
ఋ ఌ అనే అక్షరాలు ర...ల అనే
హల్లుల సమములని బాలవ్యాకరణం చెబుతున్నందున ఈ అక్షరాలు పరమగునప్పుడు సంది జరుగదు (ఉన్నవి
ఉన్నటులే ఉండును) అతడు+ఋషి...అతడుఋషి(సంధి జరుగలేదు యధాతధంగా ఉన్నది.)
A).ఉకార వికల్ప సంధి
సూత్రము "ప్రథమేతర విభక్తి శత్రర్ధ చు వర్ణబులందున్న
యు కారమునకు సంధి వైకల్పికముగానగు"
ప్రథమేతర విభక్తులనగా ప్రథమా విభక్తి కాని ద్వితీయ తృతీయా మొదలైన విభక్తులు.
ఇవి చాలా వరకు దృతంతాలు
శత్రర్ధ చువర్ణమనగా సంస్కృతం లో "శతృ"
ప్రత్యయము వచ్చే చోట్ల తెలుగులో చు అనే వర్ణం వస్తుంది. వర్తమాన కాలములోని క్రియా
విశేషణార్ధములో ధాతువుకు చు అనే అక్షరం వస్తుంది.
ఇది దృతాంతము "చూచు" ధాతువు చు వర్ణము చేరినందన "చూచుచు" దృతాంతము
కనుక "చూచుచున్" కావున ప్రథమా విభక్తి
కాక మిగిలిన విభక్తులలో పూర్వపదాంతములోని ఉకారమునకు శత్రర్ధములో వచ్చు "చు" అనే అక్షరానికి పరపదములో అచ్చు పరమైనచో
సంధి వికల్పంగా జరుగుతుంది అని సూత్రార్ధము.
(వికల్పము
లేదా వైకల్పికమనగా ఒకసారి చెప్పిన అంశము జరుగుట లేదా జరుగక పోవుట అని మనము ఇంతకు
పూర్వమే తెలుసుకొనినాము.)
ఉదాహరణలు:- క్రింది ఉదాహరణలలో ఉకారము మీద ఉన్న ద్రుతము అచ్చు పరమైనప్పుడు సంధి
జరిగినచో లోపిస్తుంది అనియు,,సంధి జరుగని యెడల పరపదం అచ్చుతో కలసిపోతున్నదని మనం గ్రహించ
వలెను.
ఉదా//నన్నున్+అడిగె....నన్నడిగె,,(సంధి జరిగిన రూపం)
నన్నునడిగె(ద్వితీయా విభక్తి...ద్రుతం పర అచ్చుతో
కలసిన రూపము)
నాకొరకున్+ఇచ్చె..నాకొరకిచ్చె...(సంధి జరిగింది
)
నాకొరకునిచ్చె..(చదుర్ధీ విభక్తి.,ద్రుతం పరఅచ్చుతో
కలసిన రూపము)
నాకున్+ఆదరువు...నాకాదరువు.......(సంధి)
నాకునాదరువు..(షష్టీ విభక్తి..ద్రుతం పర అచ్చుతో
కలసిన రూపము)
నాయందున్+ఆశ...నాయందాశ...(సంధి)
నాయందునాశ......సప్తమీ....(ద్రుతం పర అచ్చుతో కలసిన
రూపము)
వచ్చుచున్ +ఉండును..వచ్చుచుండెను(సంధి)
వచ్చుచునుండెను.....(శత్రర్ధక చు వర్ణము)
చూచుచున్+ఏగెను...., చూచుచేగెను..(సంధి)
చూచుచునేగెను....(శత్రర్ధక చు వర్ణము)
4.యడాగమ సంధి
సూత్రం--"సంధిలేని చోట స్వరంబుకంటె పరంబైన
స్వరంబునకు యడాగమంబగు"
సంధి రెండు అచ్చుల మద్య జరగని సందర్భములో (ఎలాంటి
అచ్ సంధి అయినా ఆ రెండు పదాలలో ఉండే) అచ్చుల మద్య యట్ అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది "యట్" అనేది టిత్తు కనుక పరపదములోని మొదటి
అచ్చుకు వచ్చి చేరుతుంది "యట్" అనే దానిలో "య్ " అనేది మాత్రమే
మిగులుతుంది .ఆగమము అనగా ఒక అక్షరం అధికంగా
వచ్చి చేరటం.
ఉదాహరణ
మా+అమ్మ...మాయమ్మ...అకారసంధి జరగలేదు
మీ+ ఇల్లు
.,మీయిల్లు...ఇకార సంధి జరగలేదు
మా+ఊరు....మాయూరు అకార సంధి జరగలేదు
వివరణ ...
మూడు ఉదాహరణలలోను పూర్వపదం చివర ఆ..,ఈ...ఆ అనే అచ్చులు
ధీర్ఘములుగానున్నవి. అందువలన సంధి జరగలేదు.హ్రస్వ అకారమునకు మాత్రమే అకారసంధిలో అచ్చు
పరమైతే సంధి జరుగుతుంది. సంధి జరగలేదుకావున
యడాగమము వచ్చినది. యడాగమము రానిచో అర్ధాలు సరిగానుండవు.
మమ్మ..మిల్లు..మూరు అవుతాయి
ఇవి అర్ధరహితము కదా..
అకార, ఇకార, ఉకార సంధులలో పూర్వ పదం చివర ధీర్ఘాచ్చులు
ఉన్నయెడల సాదారణముగా సంధి జరగదు. హ్రస్వాచ్చులు ఉన్నా కొండొకచో సంధి జరగదు. యడాగమం
రావటానికి సంధి జరిగినదా లేదా అనేది గమనించ
వలసిన విషయము.
5)టుగాగమసంధి
A)"కర్మధారాయములందుత్తున కచ్చు పరంబగు నపుడు
టుగాగమంబగు" (విశేషము+విశేష్యము.....కర్మధారాయ సమాసము)
కర్మధారాయ సమాసంలో పూర్వ పదాల చివర ఉన్న హ్రస్వ ఉకారానికి అచ్చు పరమైతే
"టుక్" అనేది వచ్చి చేరుతుంది అని సూత్రార్ధము .
ఉదా...
కఱకుటమ్ము..కఱుకైన అమ్ము(వాడిగల బాణము)
కఱకు అనేది పూర్వపదము అమ్ము అనేది
పరపదము (ఉత్తర పదము) ఇది కర్మధారాయ సమాసము
కఱకు+ అమ్ము...కఱకుటమ్ము.(.ఉ+ట్+అ .,,ట)
నిగ్గు+అద్దము...నిగ్గుటద్దము...(ఉ+ట్+అ,,,ట)
పండు+ఆకు.,,పండుటాకు.....(ఉ+ట్+ఆ..,టా)
ఉప్పు+ఏరు.,.ఉప్పుటేరు...(ఉ+ట్+ఏ...,టే)
కఱకు. నిగ్గు. పండు అనే ఉకారాంత పదాలు కర్మధారాయ సమాసములందలి పూర్వపదములు
B)"కర్మధారాయంబునందు బేర్వాది శబ్దములకచ్చు
పరమగునపుడు టుగాగమంబు విభాషనగు"
పేరు చిగురు పొదరు మున్నగునవి పేర్వాదులు
కర్ధారాయ సమాసములో పేరు మున్నగు శబ్దముల చివర నున్న హ్రస్వ ఉకారమునకు
అచ్చు పరమగునపుడు "టుక్" అనే ఆగమము విభాషగా వస్తుంది అని సూత్రార్ధము.
ఉదా//
పేరు+ఉరము.,పేరుటురము..(.ఉ+ట్+ఉ...టు)
పేరురము----ఉకార సంధి(టుగాగమము వికల్పము కనుక )
చిగురు +ఆకు...చిగురుటాకు ..(.ఉ+ట్+ఆ...టా)
చిగురాకు.......ఉకార సంధి(టుగాగమము వికల్పము కనుక )
పొదరు+ఇల్లు....పొదరిటిల్లు (ఉ+ట్+...టి)
పొదరిల్లు.....ఉకార సంధి(టుగాగమము వికల్పము కనుక )
పేరు, చిగురు, పొదరు అనే ఉకారాంత
పేర్వాదులు కర్మధారాయ సమాసములందలి పూర్వ పదాలు.
C)"కర్మధారాయసమాసములందు ఉద్భిన్నాచ్చులకు అచ్చులు
పరమగునపుడు టుగాగమము నిత్యముగానగు"
కర్మధారాయసమాసములందుగల పూర్వపదాంతమున గల హ్రస్వ
ఉకారమునకేకాక భిన్నమైన అచ్చులకు కూడ అచ్చు
పరమైనచో టుగాగమము నిత్యముగా నగునని సూత్రార్ధము .
ఉదా:-దుక్కి+ఎద్దు...దుక్కిటెద్దు...(ఇ+ట్+ఎ....టె)
పల్లె+ఊరు..,పల్లెటూరు.,.,(ఎ+ట్+ఊ...టూ)
6)పుంప్వాదేశసంధి:
సూత్రము:-"కర్మధారయంబులందు"ము" వర్ణకంబునకుంబుంపులగు"
కర్మధారయమనగా: సమాస పదాలలో ఒక పదం విశేషణం, ఒక పదం
విశేష్యం (నామవాచకం) తో కూడినది కర్మధారయ సమాసమంటారు. దీనినే సమానాధికారణం అంటారు.
ఉదా: నీలము
+ కండ్లు = నీలపు గండ్లు, నీలంపు గండ్లు
ముత్యము
+ సరులు = ముత్తెపు సరులు, ముత్తెంపు సరులు
సరసము
+ మాట = సరసపు మాట, సరసంపు మాట
సింగము
+ కొదమ = సింగపు కొదమ, సింగంపు కొదమ
ముత్యము
+ చిప్ప = ముత్యపు చిప్ప, ముత్యంపు చిప్ప
ము కారాంతముగానున్న ఒక విశేషణ పదము మరొక విశేష్యం
పదముతో కలసి సమాసమేర్పడే సమయములో మువర్ణలోపమేర్పడి పు ంపు లు ఆదేశముగా వచ్చిచేరటమే
పుంప్వాదేషసంధి. పై ఉదాహరణలలో ము కారము లోపించి పు ంపులతో సమాసములేర్పడినాయి గమనించగలరు.
7) ద్రుత సంధి - సరళాదేశ సంధి
సూత్రము:-1) ద్రుత ప్రకృతి కముమీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషలు
విభాషనగు.
ద్రుతం
అనగా నకారము.
ద్రుతప్రకృతికం
అనగా న కారం చివరగల పదము.
పరుషాలు అనగా క చ ట త ప అనే అక్షరాలు.
సరళాలు అనగా గ జ డ ద బ అనే అక్షరాలు.
ఆదేశ సరళాలు
అనగా క చ ట త ప అనే పరుషాక్షరాలు గ జ డ ద
బ అని మారితే అవి ఆదేశ సరళాలు అనబడతాయి.
ఆదేశం అనగా ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం వచ్చుట.
బిందువు అనగా
సున్నా,అరసున్నా.
స్వత్ర్యము అనగా ద్రుతంతో ఎలా ఉంటుందో అలాగే ఉండటము.
వివరణ:-సంధి
కార్యము జరుగునప్పుడు "ద్రుత ప్రకృతికం తరువాత కనుక క చ ట త ప అనే పరుషాక్షరాలు
ఉంటే వాటి స్థానంలో గ - జ - డ -ద - బ అనే అక్షరాలు ఆదేశాలుగా వస్తాయి.
అలా ఆదేశాలుగా వచ్చిన గ జ డ ద బ లు పర పదాలలో ఉంటే
వాటి పూర్వ పదం చివర ఉన్న ద్రుతం (నకారం) బిందువుగాను (అరసున్న, నిండుసున్న) సంశ్లేష
(మీది హల్లుతో కలవటం) గాను మారటం అనేది విభాషగా జరుగుతుంది' - అని సూత్రార్ధం.
అంటే బిందువు వస్తే సంశ్లేషరాదు; సంశ్లేష వస్తే
బిందువు రాదు. ఈ రెండూ రాకపోతే అసలు రూపంతో అంటే సరళాదేశం వచ్చిన రూపంతోనే ఉంటుంది.
అని అర్ధము. అంటే "మొత్తం నాలుగు రూపాలుగా ఉంటుంది. (అరసున్న, నిండుసున్న, సంశ్లేష
సరళాదేశ రూపం, 'అయితే, 'ద్రుతసంధి' అని చెప్పుకున్నప్పుడు రూపాన్ని సాధించుకోవటానికి
ఈ రెండు సూత్రాలు కూడా మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటేనే 'ద్రుతసంధి' అవుతుంది.
ఇందులో ద్రుతం ఆధారం చేసుకొని పరుషాలు సరళాదేశాలను పొందుతున్నాయి. కనుక ఇది 'సరళాదేశసంధి'
అని కూడా పిలువబడుతుంది.
ఉదా:-పూచెను + కలువలు-----పూచెనుగలువలు (సరళాదేశము)
పూచెఁగలువలు (అర్దబిందు రూపము)
పూచెంగలువలు (పూర్ణబిందు రూపము
పూచెన్గలువలు (సంశ్లేషరూపము)
తోచెను + చుక్కలు-------తోచెనుజుక్కలు (సరళాదేశము)
తోచెఁజుక్కలు (అర్దబిందు రూపము)
తోచెంజుక్కలు (పూర్ణబిందు రూపము
తోచెన్జుక్కలు (సంశ్లేషరూపము)
చేసెను + టక్కులు------చేసెను డక్కులు (సరళాదేశము)
చేసెఁడక్కులు (అర్దబిందు రూపము)
చేసెండక్కులు (పూర్ణబిందు రూపము
చేసెన్డక్కులు (సంశ్లేషరూపము)
నెగడెను + తమములు--నెగడె దమములు (సరళాదేశము)
నెగడెఁదమములు (అర్దబిందురూపము)
నెగడెందమములు (పూర్ణబిందు రూపము
నెగడెన్దమములు (సంశ్లేషరూపము)
మొగిడెను + పద్మము---మొగిడెను బద్మము (సరళాదేశము)
మొగిడెఁబద్మము (అర్దబిందురూపము)
మొగిడెంబద్మము (పూర్ణబిందు రూపము)
మొగిడెన్బద్మము (సంశ్లేషరూపము)
పై ఉదాహరణలు గమనించినచో మొదటి సూత్రము "ద్రుత
ప్రకృతికముమీది పరుషములకు సరళములగు."
ఈ సూత్రముననుసరించి క చు ట త ప లకు గ జ డ ద బ లు ఆదేశసరళాలుగా వచ్చాయి. రెండవ సూత్రము
"ఆదేశ సరళములకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు." అనుసూత్రముననుసరించి
అర్దబిందువు, పూర్ణబిందువు, దృతముతో కలసిపోవుట (సంశ్లేష) అనే మూడురూపములొచ్చినాయి గమనించగలరు.
8).గ స డ ద వాదేశ సంధి:-
"ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లుబహుళంబుగానగు"
పరుషములు...క చ ట త ప
ప్రథమా విభక్తితో ఉన్న పదము పూర్వపదముగా ఉండి వాటికి క చ ట త ప అనే పరుషాక్షరాలు
పరమయిన యెడల గ స డ ద వ అనే అక్షరాలు క్రమముగా
బహుళముగా ఆదేశమవుతాయని సూత్రార్ధము
(క కారానికి గకారము, చకారానికి సకారము, టకారానికి
డకారము, తకారానికి దకారము, పకారానికి వకారము ఆదేశముగా వస్తాయి)
ఉదా:- వాడు+కొట్టె...వాడుగొట్టె (.కొ-గొ...క.,గ)..-సంధి రూపము
వాడు కొట్టె,,,..,.,,,,..సంధిలేనందున మామూలు రూపము.
అతడు+చనియె,,అతడు సనియె( చ- స)
అతడు చనియె........సంధిలేనందున మామూలు రూపము.
నీవు+టక్కరివి,.నీవుడక్కరివి...(ట.డ)---సంధి రూపము
నీవు టక్కరివి------సంధిలేనందున మామూలు రూపము
మీరు+తలడు...మీరుదలడు (త...ద)సంధి రూపము
మీరుతలడు----సంధిలేనందున మామూలు రూపము
వారు+ పోరు---వారువోరు(ప..వ)--సంధి రూపము
వారు పోరు..---.సంధిలేనందున మామూలు రూపము
పై ఉదా హరణలలో
గ స డ ద వ ఆదేశం, బహుళము గనుక సంధిలేని
మామూలు రూపము కూడా చూపబడినది .
గ స డ ద వాదేశ సంధిలోని మరికొన్ని రూపాలు
B)"ఈ కార్యము కళలగు క్రియాపదముల మీద సహితము
గానంబడియెడి"
ఈ కార్యము అనగా గ స డ ద వ
లుఆదేశమగుట. కళలు అనగా ద్రుత ప్రకృతికాలు కాని పదాలు(చివర నకారము లేని పదాలు).క్రియ
అనగా పనిని తెలియచేసే పదము.
బహుళముగా "గ స డ ద వ" లుఆదేశమగుట యనేది ప్రథమా విభక్తికి పరంగా ఉన్న పరుషాలకే
కాక కళలయిన క్రియాపదాలకనగా పరంగా ఉన్న పరుషాలు (క చ ట త ప) పరమగునపుడు కూడా కనబడుతుంది
అని సూత్రార్ధము .
చేయరు+కదా..చేయరుగదా "క" అనే పరుషానికి
"గ"కారాదేశం
చేయరుకదా..,గకారాదేశం కాని రూపము
చూసిరి+పోయిరి....చూసిరివోయిరి "ప" అనే
పరుషానికి "వ"కారాదేశం
చూసిరి పోయిరి.....వకారాదేశం కాని రూపము.
C")”తెనుఁగుల మీది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు"
సాంస్కృతికములు...సంస్కృత భాషా సంబంధిత పదములు.
పూర్వపదము తెలుగు పదమై ప్రథమా విభక్తి దైనప్పటికి సంస్కృత శబ్దాలు పరమగునపుడు వాటిలో
ఉండే పరుషాలకు(క చ ట త ప) గ స డ ద వ లు ఆదేశముగారావు
అని సూత్రార్ధము.
వీఁడు+చక్రపాణి....వీఁడుచక్రపాణి చక్రపాణి సంస్కృత పదము సంధిలేదు
ఇది+తధ్యము..,ఇదితధ్యము...తధ్యము సంస్కృత పదము సంధిలేదు
D)"కొన్ని యెడలఁదెనుగుల మీది సాంస్కృతిక క త ప లకు గ ద వ కానంబడియెడు"
కొన్ని కొన్ని చోట్ల తెలుగు శబ్దాల తరువాత పరమవుతున్న
సంస్కృత శబ్దాలలోని పరుషాక్షరాలైన వాటిలోని "క త ప
" అనే వాటికి మాత్రమే " గ ద వ"
లుఆదేశమవటం కనిపిస్తుంది అని సూత్రార్ధము
.(చ ట
అనే పరు షాల మీద స డ అనే
ఆనే ఆదేశాలు లేవు)
వీరల్+కోపించిన.,వీరల్గోపించిన("క" అనే
పరుషానికి "గ"కారాదేశం)
ఇట్లు+తపంబు..ఇట్లుదపంబు("త" అనే పరుషానికి
"ద"కారాదేశం)
వేయి+పణములు..వేవణములు("ప" అనే పరుషానికి
"వ"కారాదేశం)
(కోపించు...తపము....పణములు..అనేవి సంస్కృత సమాలుఅయిన
శబ్దాలు)
,గ స డ ద వాదేశ సంధిలోని మరికొన్ని రూపాలు
E)"ద్వద్వంబునంబదంబుపై పరుషములకు గ స డ ద వ లగు"
ద్వంద్వ సమాసము జరిగే సమయంలో పూర్వపదము పిమ్మట పరపదములో
పరుషాలు(క చ ట త ప)పరమగునపుడు "గ స డ ద వ" లునిత్యముగా ఆదేశమవుతాయని సూత్రార్ధము
.
కూర+కాయ..కూరగాయలు("క" అనే పరుషానికి
"గ"కారాదేశం)
కాలు+చేతులు,,కాలుసేతులు("చ" అనే పరుషానికి
"స"కారాదేశం)
టక్కు+టెక్కు..టక్కుడెక్కులు("ట" అనే
పరుషానికి "డ"కారాదేశం)
తల్లి+తండ్రి..తల్లిదండ్రులు("త" అనే
పరుషానికి "ద"కారాదేశం)
ఊరు+పల్లె..ఊరువల్లెలు("ప" అనే పరుషానికి
"వ"కారాదేశం)
(విగ్రహ వాక్యంలో ఏకవచనముగానున్నప్పటికి సమాసములో
బహువచనమైన" లు" వస్తుంది గమనించ గలరు)
9).రుగాగమసంధి:-
A)"పేదాదిశబ్దంబులకాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు
రుగాగమంబగు"
పేద, బీద, ముద్ద, బాలింత, జవ, అయిదవ, మనుమ, గొడ్డు,
ఇలాంటివి పేదాదులు (జవ్వని అనేదానికి జవ అనేది ఆదేశంగా వచ్చినది).
పేద+ఆలు..పేదరాలు..(పేద+ర్+ఆలు)
బీద+ఆలు..బీదరాలు (బీద+ర్+ఆలు)
B)"కర్మధారయంబు నందత్సమంబుల కాలు శబ్దము పరంబగునపుడత్వంబున
కుత్వంబును రుగాగమంబునగు"
తత్సమమనగా సంస్కృతంతో సమానమైన శబ్దాలు
అత్వమనగా హ్రస్వమయిన అకారము
ఉత్త్వమనగా హ్రస్వమయిన ఉకారం..
కర్మధారాయ సమాసంలో పూర్వపదములోనున్న తత్సమ శబ్దానికి ఆలు అనే శబ్దము పరమగునపుడు ఆ తత్సమశబ్దము చివరనున్న
హ్రస్వ అకారానికి హ్రస్వ ఉకారము మరియు
"రుక్" అనేది కూడా ఆగమంగా వస్తుంది అని సూత్రార్ధము .
(ఆలు శబ్దానికి సమాసం చేసినచో స్త్రీ అని మాత్రమే అర్ధం)
ఉదా:-ధీర+ఆలు.,ధీరురాలు ( ధీర్+అ+ఉ+ర్+ఆలు..ధీరురాలు)
ధీర అనే
తత్సమ శబ్దానికి ఆలు శబ్దము పరమగుట వలన..అకారానికి ఉకారాదేశము రుగాగమము చేరి....ధీర్+అ+ఉ+ర్+ఆలు..ధీరురాలు అయినది.
10 దుగాగమ సంధి.(దుక్+ఆగమము -దుగాగమము)
సూత్రము:-"యుష్మదన్మదాత్మార్థకంబుల కుత్తర
పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు."
ఉత్తరపదము పరమగు టయన, సమాసమగు నని భావము. క్ - కారములోపించును.
“నీ,నా,తన శబ్దములకు, ఉత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబగు.”
ఉదా// నీ + వార్త - నీదు వార్త
నా + పలుకు - నాదు పలుకు
తన + రాక - తనదురాక
11).ద్విరుక్తటకారసంధి.
సూత్రము:- “కుఱు... చిఱు... కడు... నిడు.,. నడు...
శబ్దములందలి ఱ డ లకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు” ఱ..డ లు అనగా
బండిరాకు (శకటరేఫకు) డకారానికని అర్ధము.
ద్విరుక్త టకారమనగా రెండుసార్లు చెప్పబడిన టకారమని
అనగా "ట్ట" అని అర్ధం.
కుఱు..చిఱు
అనే శబ్దాలలోని ఱ (శకటరేఫ)కు కడు, నడు, నిడు, శబ్దాలలోని డకారమునకు గాని అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారం (ట్ట)
ఆదేశంగా వస్తుందని సూత్రార్ధము.
కుఱు+ఉసురు..,కుట్టుసురు (ఱ్+ఉ+ఉ..ట్ట్+ఉ,.ట్టు)
చిఱు+అడవి.....చిట్టడవి..(ఱ్+ఉ+అ...ట్ట్+అ...ట్ట)
కడు+ఎదురు...కట్టెదురు..(డ్+ఉ+ఎ...ట్ట్+ఎ..ట్టె)
నడు+అడవి...నట్టడవి...(డ్+ఉ+అ..,ట్ట్+అ...ట్ట)
నిడు+ఊర్పు...నిట్టూర్పు..(డ్+ఉ+ఊ...ట్ట+ఊ...ట్టూ)
పై ఉదాహరణలు గమనించినచో ద్విరుక్త టకారము ఆదేశమైనపిమ్మట నిత్యసంధి అయిన ఉకార సంధి ప్రతిచోట జరిగినది,,మిత్రులు
గమనించ గలరు
అయితే ఈ సంధిని ఫ్రౌఢ వ్యాకరణం.."చిఱు" అనే పదానికి బదులుగా "చిట్టి " అనే పదాన్ని తీసుకున్నది
చిట్టి+అడవి
చిట్టడవి,,,ఇకార సంధి
చిట్టి+ఆముదము...చిట్టాముదము
చిట్టి+ ఉడుకు..చిట్టుడుకు
కాని సాదారణముగా ద్విరుక్తటకార సంధికి బాలవ్యాకరణాన్నే ప్రామాణికంగా తీసుకుంటారందరు. కుఱు
చిఱు నడు నిడు సూత్రమే మిగిలిపోయింది.
ఏలననగా
చిట్టి+చాప ..చిట్టిచాప...చిటిచాప
చిట్టి+పాప
చిట్టిపాప చిటిపాప
చిట్టి+తాళము..చిట్టితాళము-చిటితాళము అనేరూపాలున్నాయి. హల్లు పరమైనప్పుడు ద్విరుక్త టకారములోని ఒక ట లోపించినది. అదీ బాల వ్యాకరణములోని "అక్కడాదులజడ్డకు లోపంబు
బహుళంబుగానగు" అనే సూత్రము వలననే సిద్దిస్తుంది.
అయితే మనమిక్కడ గమనించ వలసిన ముఖ్యాంశమొకటున్నది.
కుఱు చిరు నడు నిడు అనే పదాలున్నాయా? లేవు కదా? కడు అనే పదమున్నది వాటి పూర్తి రూపాలిలా ఉంటాయి
"కుఱుచ" బుద్ధి ..."చిఱుత"
ప్రాయము...."నడుము"సన్నన
"నిడుద"(పొడవు)మిక్కిలి ...."కడు"సామార్ధ్యము
ఇవి అసలు శబ్దాలు వీటిని సమానం చేసే సమయంలో ఒక్క కడ శబ్దానికి తప్ప
మిగిలిన వాటికి అంత్య వర్ణం లోపిస్తుంది.అలా లోపించిన వాటినే మనం తీసుకుంటాము అవే కఱు చిఱు నడు నిడు శబ్దాలు.
12. పుగాగమ సంధి
సూత్రం: తామరకాకు పరంబగునపుడుపుగాగవంబగు. (ప్రౌఢ
వ్యాకరణం) పుక్ + ఆగమం = పుగాగమం.
"తామర అనే శబ్దానికి ఆకు అనే పదం పరంగా ఉంటే
పుక్' అనే ఆగమం వస్తుంది' అని సూత్రార్ధం.
ఉదాహరణ :తామర + ఆకు--తామరపాకు
వివరణ :తామర + ఆకు తామర కాకుపరంబగునపుడు పుగాగమంబగు
అనే సూత్రం చేత "తామర" శబ్దానికి పుక్" ఆగమం వస్తే తామర + పు + ఆకు
= తామరపాకు" అవుతుంది. పుగాగమంలేని "తామరాకు' అనే రూపం కూడా ఉంది.
13) త్రికసంధి:-
సూత్రములు 1. ఆ - ఈ - ఏ లు త్రికములు అనబడును.
2. "త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు
బహుళంబుగానగు."
3. "ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్చికంబుమీది
దీర్ఘంబునకు హ్రస్వంబగు."
ఉదా : - ఆ + కన్య - అకన్య (ఇచట "ఆ' త్రికము.)
రెండవ సూత్రము వలన ఉత్తర పదాది అక్షరమైన 'క' అసంయుక్తము
కాన దానికి ద్విత్వము వచ్చి, ఆ + క్కన్య - అయినది. మూడవ సూత్రము వలన, ద్విరుక్తమైన
హల్లుకు పూర్వమందున్న ఆచ్చికమగు, ఆకారము హ్రస్వమై - అకారమగును. అప్పుడు అక్కన్య - అను
రూపమేర్పడును. ఆచ్చికములు - తెలుగు పదములు, ద్విరుక్తము. రెండుసార్లు ఉచ్చరించబడునది.
ఉదా : - ఆ + కాన = అక్కాన
ఈ + కాన = ఇక్కాన
ఏ + కాన = ఎక్కాన
14) ఆంమ్రేడిత సంధి:-
ద్విరుక్తము యొక్క పర రూపము ఆమ్రేడితము.
సూత్రము "అచ్చునకు ఆమ్రేడితము, పరంబగునపుడు
సంధి తరుచుగా అగును."
పూర్వ పరఫదములు రెండూ ఓకే పదమున్నప్పుడు పూర్వ పదము
చివరున్నచ్చుకు ఆమ్రేడితములోని అచ్చు పరమైతే సంధి జరుగుతుంది.
ఉదా// ఔర + ఔర = ఔరౌర -
ఆహా + ఆహా = ఆహాహా
ఎట్టు + ఎట్టూ = ఎట్టెట్టూ
ఏమి + ఏమి = ఏమేమి - ఏమియేమి (ఏమ్యాదుల ఇ కారమునకు సంధి వైకల్పికము అగుటవలన
ఏమికి రెండు రూపములు వచ్చినవి.)
2 వ సూత్రము:- "ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదుల
తొలియచ్చుమీది వర్ణంబులలెల్ల, నదంతంబగు, ద్విరుక్తటకారంబగు."
కడాదులు - కడ - ఎదురు - కొన - చివర - తుద - తెన్ను
- తెరవు - నడుమ - పగలు - పిడుగు - బయలు - మొదలు ఇత్యాదులు. ఆమ్రేడితమున మొదటి పదముమీది
వర్ణముల కన్నింటికి, హ్రస్వ అకారము అంతముందు గల ద్విరుక్తటకారము ఆదేశమగునని సూత్రార్థము.
ఉదా//కడ + కడ = క + ట్ట + కడ = కట్టకడ.
ఎదురు + ఎదురు = ఎ + ట్ట్ + ఎదురు = ఎట్టయెదురు
3 వ సూత్రము:- "ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తి
లోపంబు తరుచుగ నగు."
ఆమ్రేడితము పరమగునపుడు పూర్వపదము తుది నున్న విభక్తి
బహుళముగ లోపించునని సూత్రార్థము,
పదాల మధ్యనుండే సంబంధాన్ని తెలియచేసేవే విభక్తులు.
ఇక్కడ పూర్వపదము పరపదము ఒకటే కావున పూర్వపదము
చివరనున్న విభక్తి లోపించి పరపదము విభక్తి తోనే ఉంటుంది.
అప్పటికిన్ + అప్పటికిన్ = అప్పటప్పటికిన్ - అప్పటికప్పటికిన్.
అక్కడన్ + అక్కడన్ = అక్కడక్కడన్ - అక్కడనక్కడన్.
ఇంటన్ + ఇంటన్ = ఇంటింటన్ - ఇంటనింటన్.
బహుళమనుటచే, ఇంచుక - నాడు ఇత్యాదులందును విభక్తి
లోపించును.
ఇంచుక + ఇంచుక = ఇంచించుక - ఇంచుకయించుక
నాడు + నాడు = నానాడు - నాడునాడు.9
4 వ సూత్రము,. "అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ
గ్రాహ్యములు." (ప్రభుతులు-మొదలైనవి)
అందదుకు మొదలగునవి ప్రయోగించినట్లైతే ఈ మార్పులే
వస్తాయని నిర్ధారణ చేసి చెప్పలేము. ఎలా ఉంటే
అలా గ్రహించవలెనని సూత్రార్థము.
ఉదా : అదుకు + అదుకు = అందదుకు
ఇంకులు
+ ఇంకులు = ఇఱ్ఱింకులు
ఇగ్గులు
+ ఇగ్గులు = ఇల్లిగ్గులు
చెదరు
+ చెదరు = చెల్లాచెదరు
తునియలు
+ తునియలు = తుత్తునియలు
మిట్లు
+ మిట్లు = మిరుమిట్లు.
15) నుగాగమ సంధి
సూత్రము:- "సమాసంబున, నుదంత స్త్రీ సమంబులకు,
పుంపులకు అదంత గుణ వాచకంబునకు, తనంబు పరంబగునపుడు నుగాగమంబగు."
సమాసము నందు, హ్రస్వ ఉ కారము చివర గల స్త్రీ సమపదములకు,
- పుంపులకు, హ్రస్వ అకారము, చివరగల గుణవాచకములకు, పరుషాలు సరళాలు పరంబగునపుడు నుగాగమమగును.
ఇది వచ్చినపుడు అర్దబిందు - బిందు - సంశ్లేష రూపములు మూడును జరుగునని సూత్రార్థము.
ఉదా : - సొగసు + తనము = సొగసు + న్ + తనము = సొగసుందనము
సొగసుందనము
సొగసున్దనము
సొగసు - ఉదంత స్త్రీసమము.
ఉదా : రాజు + యొక్క + ఆజ్ఞ
రాజు
+ ఆజ్ఞ
రాజు
+ ను + ఆజ్ఞ - రాజునాజ్ఞ.
పితృ
+ ను + ఆనతి = పితృనానతి అగును.
16) ప్రాతాధిసంధి :
సూత్రము:-సమాసంబున, ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల
లెల్ల, లోపంబు బహుళంబుగానగు
ఉదా//ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు - ప్రాతయిల్లు
లేత + దూడ = లేదూడ - లేతదూడ
పూవు + రెమ్మ = పూరెమ్మ - పూవురెమ్మ.
ప్రాత మొదలగు, శబ్దములచే నేర్పడు సమాసమున మొదటి
అచ్చుమీది, వర్ణంబులకెల్లను లోపము బహుళముగా నగును.
ప్ + ర్ + ఆ - త్ + అ = ప్రాత - ఇందు మొదటి అచ్చు
'అ' మీది అక్షరములన్నియు లోపింపగా ప్ + ర్ + ఆ = మిగిలి (ప్రా) త్ + అ = త లోపించును.
అప్పుడు ప్రా - ఇల్లు - యడాగమమురాగా ప్రా + య్ + ఇల్లు = ప్రాయిల్లు - లోపించనియెడల
ప్రాతయిల్లు అనియే యుండును.
2-- లుప్త శేషమునకు, పరుషములు పరములగునపుడు, నుగాగమంబగు.
ఉదా// ప్రాత + కెంపు = ప్రాగెంపు
పూవు + తోట = పూదోట
కెంపు + తామర = కెందామర
చెన్ను + తోవ = చెందోవ.
లుప్త శేషమున, లోపింపగా మిగిలినది, ప్రాతలో త లోపింప
ప్రా మిగులును. దానికి పరుషము పరముకాగా నుగాగమమగును. ప్రాతలో తలోపింప ప్రా శేషించును.
ప్రా + కెంపు - అనుచో ప్రా మీది 'కె' పరుషము పరముకాగా నుగాగమమై ప్రా + ను + కెంపు
= ప్రాగెంపు. ఇచ్చట సరళాదేశసంధి యు జరిగినది, ఇట్లే పూదోట తెలియునది. . కెంపులో కె
మిగులును - తామర అను దానిలో, తా పరుషము చేరగా, నుగాగమ మగును. కె + ను + తామర = కెందామర.
ఇందు ద్రుత సంధి జరిగి, కెందామర అయింది.
అట్లే చెన్ను + తొవ
చె
+ తొవ
చె
+ ను + తొవ - చెందోవ.
3---- క్రొత్త శబ్దమునకు, అధ్యక్షర శేషమునకు కొన్ని
యెడల, నుగాగమంబును, కొన్ని యెడల మీది హల్లునకు ద్విత్వము నగు.
క్రొత్త
+ చాయ = క్రొంజాయ
క్రొత్త
+ చెమట = క్రొంజెమట
క్రొత్త
+ పసిడి = క్రొంబసిడి
క్రొత్త
+ కారు = క్రొక్కారు
క్రొత్త
+ నన = క్రొన్నన
క్రొత్త
+ తావి = క్రొత్తావి.
క్రొత్త శబ్దము ప్రాతాదుల లోనిది. క్రొత్తలో మొదటి
అక్షరమునకు పరుషము పరముకాగా, నుగాగమ మగును. కొన్ని చోట్ల మీది హల్లున మీ ద్విత్వమగును.
క్రొత్తలో - క్రొ మిగిలును - చాయ - పరము కాగా నుగాగమమువచ్చి క్రొ + ను + చాయ అగును.
తర్వాత సరళాదేశము వచ్చి నిండు సున్న వచ్చి - క్రొంజాయ అయినది.
అటులనే క్రొంజెమట - క్రొంబసిడి
క్రొత్తలో క్రొ మిగిలి కారులో - కా పరుషము - సరళము
కాగా నుగాగమము రాక బహుళ గ్రహణముచే హల్లునకు ద్విత్వము వచ్చును.
క్రొ
+ కారు - క్రొ + క్ + కారు = క్రొక్కారు
క్రొ
+ నన - క్రొ + న్ + నన = క్రొన్నన
క్రొ
+ తావి - క్రొ + త్ + తావి = క్రొత్తావి.
4---అన్వంబులకు సహితమీ, కార్యంబు కొండొకచో కానంబడెయెడి.
పది
+ తొమ్మిది = పందొమ్మిది
నిందు
+ వెర = నివ్వెర
పది
+ తొమ్మిది - ప మిగిలి, తొమ్మిది పరముకాగా, నుగాగమమై - సరళాదేశము వచ్చి - ప + న్ +
తొమ్మిది = పందొమ్మిది అయినది. ఇందు నిండు సున్న చేరినది.
నిండు + వెర = లో - ని మిగిలి - వెరపరము కాగా, మీది
హల్లునకు ద్విత్వము వచ్చి ని + వ్ + వెర = నివ్వెర అయినది.”
17) పడ్వాదేశ సంధి
సూత్రము:-"పడ్వాదులు, పరంబగునపుడు, ము వర్ణమునకు
లోప, పూర్ణబిందువులు, విభాషనగు."
పడు మొదలగు పదములు పరమైనప్పుడు పూర్వపదము చివరగల
'ము' అనే ప్రత్యయానికి లోపము మరియు పూర్నానుస్వారము విభాషగా వస్తాయని సూత్రార్థము.
'విభాషనగు' అనటమువలన ఆరెండూ రానప్పుడు ము అలాగే ఉండిపోతుంది. మూడురూపాలొస్తాయి
ఉదా//
1.భయము + పడె - భయపడె. 2.సూత్రము + పట్టె - సూత్రపట్టె
భయంపడె సూత్రం
పట్టె
భయముపడె సూత్రముపట్టె.
పడ్వాదులు - పడు - పెట్టు - పెట్టు మొ..నవి. ఈ కార్యము
కర్తృవాచి ము వర్ణమునకు కలుగదు. గజముపడియె - అశ్వము పడియె. పడు - మొదలగునవి. పరంబగునపుడు
ప్రథమా విభక్తి ప్రత్యయముగల, ము వర్ణమునకు లోపముగాని, పూర్ణ బిందువుగాని వికల్పముగా
వచ్చును. భయము + పడె = భయపడె. ము వర్ణము లోపించినది. పూర్ణ బిందువు రాగా భయంపడె రూపము
కల్గును. ఈ లోప - పూర్ణ బిందువులు రానిచో భయముపడె అని లోపముకాని రూపమే యుండును. ఈ ము
వర్ణలోపము కర్తను దెల్పు పదమునకు కలుగదు. గజముపడె - ఇది పడియె అను క్రియాపదమునకు గజము
కర్త. దాని ము వర్ణమునకు లోపమురాదు. పూర్ణ బిందువును కలుగదు. గజంపడియె - అశ్వంపడియె
- అనునవి సాధు రూపములుకావు అసాదురూపములవుతాయి.
18) డు వర్ణలోప సంధి
సూత్రము:-"సమానాధికరణంబగు, ఉత్తరపదంబు, పరంబగు
నపుడు, మూడుశబ్దము, డు వర్ణమునకు లోపమును, మీది హల్లునకు, ద్విత్వమును విభాషనగు."
మూడు + జగములు = ముజ్జగములు
మూడు + లోకములు = ముల్లోకములు
విశేషణ విశేష్యముల రెండింటికీ ఒక పదమే ఆశ్రయమగుట
సమానాది కరణము. అట్టి సమాసములో ఉత్తర పదము పరమగునపుడు పూర్వపదముగా మూడు శబ్దమున్న యెడల
దానిలోని డు - లోపించి మీది హల్లునకు ద్విత్వము వచ్చును.
మూ + జ్జగములు.
"ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు, ఆచ్చికంబు
మీది, దీర్ఘంబునకు హ్రస్వంబగు," అను సూత్రము ననుసరించి, 'మూ' లోని దీర్ఘము లోపించి
'ము' అగును - అప్పుడు
ముజ్జగములు - ముల్లోకములు అను రూపములు ఏర్పడును.
19) పోడ్వాదేశసంధి :
సూత్రము:-"బహువ్రీహిని స్త్రీ వాచ్యంబగుచో,
ను సమానంబు మీది, మేనునకు బోడియగు."
పూర్వపద
ముపమావాచకమై, యుత్తర పదముగా మేను శబ్దమున్నచో, ఆ మేను శబ్దమునకు పోడి(బోడి)యను నదాదేశముగ
వచ్చును.
ఉదా// అలరు + మేను = అలరుబోడి
పూ + మేను = పూబోడి
విరి + మేను = విరిబోడి.
20) లు-ల-న ల సంధి :
సూత్రము:- "లు-ల-నలు పరంబగునపుడు డొకానొకచో,
ముగాగమంబునకు లోపంబును తత్పూర్వస్వరంబునకు, దీర్ఘంబును విభాషణగు"
లు-ల-నలు పరమగు నపుడు, ఆగమమైన 'ము' వర్ణమునకు కొన్ని
చోటుల లోపమును దానికి ముందున్న అచ్చునకు దీర్ఘమును వికల్పముగా వచ్చునని సూత్రార్థము.
వజ్రము + లు = వజ్రాలు
వజ్రము + ల = వజ్రాల
వజ్రము + న = వజ్రాన
పగడము + లు = పగడాలు
పగడము + ల = పగడాల
పగడము + న = పగడాన
21) అపదాది స్వరసంధి
అపదాది స్వర సంధి:-
సూత్రము: "అంద్వవగాగమంబులందప్ప నపదాది స్వరంబు
పరమగునప్పుడచ్చునకు సంధి యగు" (అందు+అవక్+ఆగమంబులు .,అంద్వాగమంబులు)
పదము కానిది అపదము.,దానిలో నున్నఅచ్చు ఆదిస్వరము
అది "అపదాదిస్వరము"అందు అవక్ వంటి ఆగమాలు తప్పించి మిగిలిన పదాలుకాని ఆజాది
ఆగమాలు ప్రత్యయాలు గాని పూర్వపదమందలి అచ్చుకు పరమైతే సంధి నిత్యముగా జరుగుతుంది. అందు..,అవక్ వంటి పదాలు పరమైతే యధాసంభవాలుగా అంటే సంధి జరిగితే
సంధి రూపము. సంధి జరగని యెడల యడాగమము వస్తుందని సూత్రార్థము.
అంద్వాగమంబులు తప్పించి మిగిలిన పదాలకుదాహరణ
మూర+ఎడు...మూరెడు(అ+ఎ..)
వీసె+ఎడు....వీసెడు (ఎ+ఎ..,ఎ)
అర్ధ+ఇంచు..,అర్ధించు(అ+ఇ.,ఇ)
నిర్జి+ఇంచు...నిర్జించు(ఇ+ఇ.,,ఇ)
పై ఉదాహరణలయందు..సంధి నిత్యముగా జరిగి పరస్వరం ఆదేశమైనది.
అంద్వాగమంబులు అయితే యథాసంభవాలు. సంధి జరగవచ్చు
లేదా యడాగమము రావచ్చు.
ఉదాహరణలు
1.రాముల+అందు...రాములందు(అ+అ,,అ) అకార సంధి.
రాములయందు....(అ+అ..య్) యడాగమమొచ్చిన రూపము.
2.హరి+అందు.,హరియందు... సంధి లేదు యడాగమమే అవశ్యం.
3.తొమ్మిది+అవది..తొమ్మిదవది..(ఇ+అ,.అ)ఇకార సంధి
తొమ్మిదియవది....యడాగమము వచ్చిన రూపము.
22. అల్లోపసంధి :(అత్+లోపము=అల్లోపము)
సూత్రము:- "అది, యవి శబ్దముల యత్తునకు వృత్తిని
లోపంపు బహుళంబుగానగు"
అది - అవిమొదలైన శబ్దముల అకారమునకు సమాసమున, లోపము బహుళముగ వచ్చునని
సూత్రార్థము.
ఉదా : ఎక్కడ + అది = ఎక్కడది
ఎట్టి
+ అది = ఎట్టిది
నా
+ అది = నాది.
23. తకారదేశసంధి :
చు
వర్ణంబు తోడి, దుగ్దకారంబు తకారంబగు.
ఇచ్చు
+ దును = ఇత్తును
వచ్చు
+ దము = వత్తము
తెచ్చు
+ దును = తెత్తును
చూచు
+ దము = చూతము
నియమించు
+ దురు = నియమింతురు.
24. తచ్చబ్ద వకారలోపసంధి :
సూత్రము :-"ఉన్న - కల - న వర్ణముల మీది తచ్చబ్ద
వ కారమునకు, లోపము విభాషణగు."
ఉదా :
- ఉన్న + వాడు = ఉన్నాడు - ఉన్నవాడు
కల + వాడు = కలాడు - కలవాడు
చేసిన + వాడు = చేసినాడు - చేసినవాడు.
2.ఆచ్చిక సమాసము లందు, తఱచుగ వర్ణలోప - ఆగమ - ఆదేశాది
వికారములు నిత్యవైకల్పికముగా పెక్కులు కానంబడియెడి-
ఉదా : - అంత + దాక = అందాక
కవ + వడి = కవ్వడి
నడుము + రేయి = నడురేయి
నిక్కము + కల = నిక్కల
మూడు + న్నాళ్లు = మూన్నాళ్లు
ఇంత + దనుక = ఇందనుక.
25)మువర్ణ లోప సంధి:-
1.సూత్రము:- "ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ
ముడుజ్ఞులకు లోపంబు విభాషనగు."
మధ్యమ పురుషలో ఉండే “ము" అనేది 'డుజ్"
అనేది మధ్యమ పురుష . ఎదుటి | వ్యక్తిని తెలియ జేసేది మధ్యమ పురుష.
ఉండుము+ఉండుము =ఉండుండుము,.. ఉండుముండుము
'ఉండుము' అనే ఆమ్రేడితం పరం కాగా మధ్యమ పురుష మువర్ణకానికి,
ఆమ్రేడితంబు పరంబగునపుడు లోపం రాగా ఉండు+మూ ఉండుము = ఉండుండుము. లోపం వికల్పంగనుక అదిరాక
పోతే ఉండుము - ఉండుము. ఉకార సంధి 'ఉండుముండుము". అనే రూపమేర్పడుతుంది.
సూత్రం 2 "మధ్యమపురుష ము వర్ణంబునకు హలవసానంబులు
పరంబులగునపుడు లోపము విభాషనగు."
(మధ్యమపురుషు ఎదుటనున్న వ్యక్తులను తెలియచేసే పదాలు.
నీవు, మీరు) చివర, విభాష ఒకసారి సంధికార్యం జరగటం ఒకసారి జరుగకపోవటం. “మధ్యమ పురుషలో
ఉన్న “ము" అనేప్రత్యయానికి హల్లు పరం అయినా, అవసానం అనగా వేదంలేదా వాక్యం చివరలో
ఉన్నప్పటికీ లోపంవిభాషగా వస్తుంది' అని సూత్రార్ధం.
చూడుము+నన్ను=చూడునన్ను.... చూడుమునన్ను
'చూడుము' అనేదానిలోని 'ము' వర్ణ కానికి 'మధ్యమ పురుష
మువర్ణకంనకు హలవసానంబులు వరంబులగు నపుడు లోపము విభాషనగు అనేదాని చేత లోపమురాగా 'చూడు-ము+
నన్ను=చూడునన్ను. లోపము విభాష కనక లోపము లేమి 'చూడుమునన్ను' అనే రూపముకూడా వచ్చును.
వ్యాకరణ కర్తలు ఇంకొన్ని సంధులు సూచించినారు కాని
నేను ముఖ్యమనుకున్న కొన్ని సంధులను మాత్రమే ఇక్కడ
ప్రస్తావించినాను.
No comments:
Post a Comment