సమాసములు
వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా
అగుటను సమాసము అంటారు.సాధారణంగా సమాసమునందు రెండు పదము లుండును. మొదటి పదమును పూర్వపదమని,
రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
ఉదా - కృష్ణుడు ,అర్జునుడు = కృష్ణార్జునులు
సమాసము రెండు పదములతో మొదలగును. కాని ఇన్ని పదాలతో
అంతమగునని చెప్పలేము. సమాసం రెండు పదాలతో ఉంటుందనుకున్నప్పుడు పూర్వ పదం, ఉత్తర పదం
అనేవి రెండూ ఇక్కడ తప్పకుండా ఉంటాయి.
అయితే సమాసంలో పూర్వోత్తర పదాలు రెండూ ఉన్నప్పటికీ
కూడా కొన్ని పూర్వపదార్థము ప్రధానంగా కలిగినవి ఉంటాయి. మరికొన్ని ఉత్తరపదార్థం ప్రధానంగా
కలవి ఉంటాయి. మరికొన్ని రెండూ సమప్రాధాన్యం కలవిగా ఉంటాయి. మరికొన్ని అన్యపదం ప్రధానంగా
కలిగినవి కూడా ఉంటాయి. ఇది తెలుగు వ్యాకరణం కనుక సంస్కృతంలోని ఉదాహరణలను మనం తీసుకోము. తీసుకున్నా విగ్రహవాక్యాన్ని తెలుగులోనే
చెప్పుకుంటాం.
"సమర్థంబులగు పదంబు లేక పదం బగుట సమాసంబు” "పృథక్భుతంబులగు నర్థంబులు కేకార్థీభావంబు
సామర్థ్యంబు" "పృథక్ర సిద్ధార్థంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము"
అని చిన్నయసూరిగారు శెలవిచ్చారు.
"ఒకే అర్ధాన్ని పొందదగిన పదాలు కూడి ఒకే పదం
కావడం సమాసం" . 'సమర్ధంబులగు' - అనే దానికి తాత్పర్యం. చిన్నయసూరి ‘సామర్థ్యం'
అనే పదం ఒకటి నిర్వచనం యొక్క వివరణలో వాడారు.
పృథక్భూతంబులగు నర్ధంబులకేకార్థ భావంబు సామర్థ్యంబు
- 'పృధక్భూతంబులగు అర్ధములు' - అంటే వేరువేరుగా ఉన్న పదాల అర్థాలకు అని అర్థం. ఏకార్ధభావంబు
- అంటే ఒకే అర్ధం ఏర్పడటం అని అర్ధం.
రెండుగాని, అంతకంటే ఎక్కువగాని పదాలు కలిసి ఒకే
పదంగా ఏర్పడితే దాని 'సమాసం' అంటాం. ఒకే పదంగా ఏర్పడటం అంటే అర్థంలోగాని, శబ్దరూపం
ఏర్పడటంలో ఒకటిగా అయిపోవాలన్నమాట. అప్పుడు
వేరు వేరు శబ్దాల అర్థాలు కలిసిపోయి ఒకే అర్థాన్ని చెబుతాయన్నమాట.
'ప్రభుత్వాధికారి' అనేది ఒక సమాసం. ప్రభుత్వానికి
సంబంధించిన అధికారి అని దీనికి అర్థం చూసినచో, ప్రభుత్వ శబ్దం వేరు, దాని అర్థం వేరు. అధికారి శబ్దం వేరు, దాని అర్థం వేరు. ఇలా వేర్వేరు శబ్దాలు
వేరు వేరు అర్థాలు ఉన్న పదాలు ఒకటిగా అయిపోయి వారి వేర్పాటు తనాన్ని పోగొట్టుకొని
'ప్రభుత్వాధికారి' అయి ప్రభుత్వానికి సంబంధించిన 'అధికారి' అనే ఒకే అర్ధాన్ని ఇస్తోంది.
కనుక సమాసం ఇలా ఏర్పడుతుంది.
సమాసములు అందలి రకములు
1.తత్పురుష సమాసము -
ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష
సమాసము.
"తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగా సంస్కృతోక్తంబయగు"
సంస్కృతంలో తత్పురుష లక్షణం - దాని భేదాలు:
"తత్పురుషః
ప్రాయేణ ఉత్తర పదార్ధ ప్రధాన: ఉత్తర పదలింగశ్చ - సద్వివిధ వ్యధికరణస్సమానాధికరణశ్చేతి.”
"తఱచుగా తత్పురుష సమాసం ఉత్తర పదార్థం ప్రధానంగా
గలిగి ఉంటుంది. ఉత్తర పదలింగం కూడా దానికి ఉంటుంది. ఈ తత్పురుష రెండు రకాలు.
1)వ్యధి కరణ తత్పురుష
2) సమానాధి కరణ తత్పురుష”
వ్యధికరణంబు:-“ద్వితీయాదులకు మీదిపదంబుతోడ సమాసంబు
వ్యధికరణంబు.”
సమానాధికరణంబు:- విశేషణంబునకు విశేష్యంబుతోడ
సమాసంబు సమానాధికరణంబు కర్మధారయంబనబడు.
వివరణ: సమాసంలో ఉన్న రెండు పదాల్లోనూ పూర్వపదం ద్వితీయా
మొదలయిన విభక్తుల్లో ఉంటుంది. ఉత్తరపదం సాధారణంగా ప్రథమావిభక్తి చివరగల పదంగా ఉంటుంది.
ఇలా ఉండేటట్లయితే అది "వ్యధికరణ తత్పురుష సమాసం" అవుతుంది. అయితే, ఏ విభక్తి
పూర్వపదంగా ఉంటుందో ఆవిభక్తితోనే ఆ తత్పురుష సమాసం ఉంటుందనేది మనం గమనించాలి. అంటే
ప్రథమావిభక్తి పూర్వపదంతో ఉత్తరపదం ఉంటే అది "ప్రథమా తత్పురుష సమాసం" అని,
ద్వితీయా విభక్తి చివర గల పూర్వపదంతో ఉత్తరపదం
ఉంటే అది "ద్వితీయా తత్పురుష సమాసం' అనీ అవుతుందన్న మాట. ఇలాగే "తృతీయా తత్పురుష
సమాసం, చతుర్థీతత్పురుష సమాసం, పంచమీతత్పురుష సమాసం, షష్టీతత్పురుషసమాసం, సప్తమీ తత్పురుష
సమాసం' అంటూ ఏడు విభక్తులకు ఏడు తత్పురుష భేదాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏడే కాక ఇంకా నఞ
తత్పురుష సమాసంతో కలిపి సంస్కృతంలో ఇంకా మూడు
తత్పురుష సమాసాల భేదాలు కూడా చెప్పబడ్డాయి. అవి మనతెలుగులో వాడబడ్డాయి కాని,
అంతగా వాడకంలోలేవు. పద్యగ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాసిన విమర్శకులు కవులువాడిన అలాటి
క్రొత్తసమాసాలకు ఈ మూడింటిని ఆధారంచేసుకొని వాటికి ప్రాణప్రతిష్ఠ చేశారు.
వ్యధికరణం అనే పదాన్ని 'వి+అధికరణం' అని విడదీస్తారు.
అధికరణం అంటే ఆధారం అని, 'వి' వ్యధికరణ తత్పురుష సమాసం ఇలా ఉంటుందన్న మాట. అయితే 'వ్యధికరణంలోని
సమాసములను చూద్దాము.
a.ప్రధమా తత్పురుష సమాసము: - ప్రథమా విభక్తి చివరకలిగిన
పూర్వపదము, వేరే విభక్తి కలిగి ఉండి ఉత్తర పదార్థ ఉత్తరపదం ప్రాధాన్యం కలిగినది ప్రధమా
తత్పురుష సమాసము.
ఉదా//పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము.
నడిరేయి= రేయి యొక్క నడిమి భాగము.
ద్వితియా తత్పూరుష సమాసము:- నిన్, నున్, లన్, గూర్చి, గురించి...
ద్వితీయా విభక్తి ప్రత్యయాలు. ఇవి విగ్రహ వాక్యములలో వచ్చి సమాసపదాన్ని వేరుచేసి సమాసంలోని
పూర్వ పదంలో చేరతాయి. కావునిది ద్వితియా తత్పూరుష సమాసము:
ఉదా// నెలతాల్పు=నెలను దాల్చినవాడు.
కృష్ణాశ్రితుడు= కృష్ణుని ఆశ్రయించినవాడు
b.తృతియ తత్పురుష సమాసము -చేతన్, చేన్, తోడన్, తోన్
.. తృతీయా విభక్తి ప్రత్యయాలు. ఇవి విగ్రహ
వాక్యములలో వచ్చి సమాసపదాన్ని వేరుచేసి సమాసంలోని పూర్వ పదంలో చేరతాయి. పూర్వపదం ప్రధానార్థముగా
కలది కావునిది తృతీయ తత్పురుష సమాసము.
ఉదా//ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు.
పితృసముడు=పితృనితో సముడు.
c.చతుర్ధీ తత్పురుష సమాసము: - కొఱకున్ (కొరకు), కై ఇవి చతుర్ధీ విభక్తి ప్రత్యయాలు. ఇవి విగ్రహ వాక్యములలో
వచ్చి సమాసంలోని ఉత్తర పదంతో కూడుకొని ఉత్తరపదం ప్రధానార్థముగా కలది కావునిది చతుర్థి
తత్పురుష సమాసము.
ఉదా//భూతబలి = భూతము కొరకు బలి.
సభాభవనము = సభకొరకు భవనము.
d.పంచమీ తత్పురుష సమాసము - (వలనన్, కంటెన్, పట్టి........పంచమీ
విభక్తి ప్రత్యయాలు. ఇవి విగ్రహ వాక్యములలో వచ్చి
సమాసంలోని ఉత్తర పదంతో కూడుకొని ఉత్తరపదం ప్రధానము కలది కావునిది పంచమీ తత్పురుష
సమాసము.
ఉదా//చోరభయము = చోరుని వలన భయము.
కోపావేశము =కోపము వలన ఆవేశము.
e.షష్టీ తత్పురుష సమాసము: -కిన్, కున్, యొక్క, లోన్,
లోపలన్ ఇవి షష్ఠీ విభక్తి ప్రత్యయాలు. ఇవి విగ్రహ వాక్యములలో వచ్చి సమాసంలోని ఉత్తర పదంతో కూడుకొని ఉత్తరపదం ప్రధానము
కలది కావునిది షష్టీ తత్పురుష సమాసము. తెలుగు భాషలో ఎక్కువగా వాడమడే సమాసము ఈ షష్టీ
తత్పురుష సమాసమే.
ఉదా//మహీపతి=మహికి పతి
విజయమూలము.=విజయమునకు మూలము.
రాజభటుడు = రాజు యొక్క భటుడు.
f.సప్తమీ తత్పురుష సమాసము:-అందున్, నన్ ,,సప్తమీ విభక్తి
ప్రత్యయాలు. ఇవి విగ్రహ వాక్యములలో వచ్చి ఇవి విగ్రహ వాక్యములలో వచ్చి సమాసంలోని ఉత్తర పదంతో కూడుకొని ఉత్తరపదం ప్రధానము
కలది కావునిది సప్తమీ తత్పురుష సమాసము.
ఉదా//మాటనేప్పరి = మాట యందు నేర్పరి
శరీరాంగములు= శరీరమునందలి అంగములు
g.నఞ్ తత్పురుష సమాసము - ఇందులో విభక్తి ప్రత్యాయాలుండవు.
వ్యతిరేకార్థం విగ్రహ వాక్యములో ఉంటుంది.
ఉ//అధర్మము - ధర్మము కానిది.
అమానవీయము=మానవీయముకానిది.
2.కర్మధారయ సమాసము - (కర్మధారయ సమాసాలు)విశేషణము,
విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.
"విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబనబడు
ఇదియే కర్మధారయంబనబడు"
సమాసం అయిన పదంలో ఒకపదం విశేషణం, మరొకపదం విశేష్యం
అయితే అది 'సమానాధికరణ' సమాసం అవుతుంది. అదే 'కర్మధారయ సమాసం' అవుతుందనిదాని అర్థం.
a.విశేషణ పూర్వపద కర్మదారాయ సమాసము:-
సాధారణంగా
కర్మధారయ సమాసంలోని విగ్రహవాక్యంలో 'అయిన' అనేది వస్తూఉంటుంది. విశేషణ పూర్వపదంలో మాత్రమే
ఉంటుంది.
ఉదా// - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు
నిండురూపము= నిండుదైన రూపము
b.విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము -
ఇందు విశేషణాలు సమాసములో ఉత్తరపదాలుగా, విశేష్య వాచకపదాలు పూర్వపదాలుగాను
ఉంటాయి. అదువలన దీనికివిశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము,మరియూ విశేష్యపూర్వపద కర్మదారాయ
సమాసమని రెండువిధములుగా పిలవబడుతుంది
ఉదా//కపోతవృద్దము = వృద్దమైన కపోతము
కవిశ్రేష్టుడు=శ్రేష్టుడైన కవి
c.విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము -
ఈ సమాసములో పూర్వోత్తర పదములు రెండూ విశేషణాలుగా
ఉండుటవలన ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము అని పిలవబడుతుంది
ఉ//మృదుమధురము
= మదువును, మధురమును.
ఈడుజోడైన
= ఈడైనది జోడైనది
d.ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము – ఉపమాన (పోలిక) పూర్వపదముగాను,
ఉత్తరపదము విశేష్యముగానుండుటవలన ఇది ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసముగా పిలవబడుతుంది.
ఉదా//తేనెపలుకు = తేనెవంటి పలుకు
రతి సుందరి= రతివలె సుందరమైనది.
e.ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ఉపమానము ఉత్తరపదముగా ఉండుటవలన
దీనిని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు.
ఉదా//ముఖపద్మము = పద్మము వంటి ముఖము
నరకేసరి= కేసరివంటి నరుడు
f.ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము -(రూపక సమాసము) :- అవధారణ అనగా
నిర్ధారణచేయటము. ఇలా నిర్ధారణ చేయబడిన పదము పూర్వపదమునందుండి, తరువాత నామవాచకమున్నచో అదిఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము లేదా రూపక సమాసము అనికూడా అంటారు. రూపకము అనగా ఆరోపించటము.
ఒకదాని ధర్మాన్ని మరొకదానియందారోపించటము. ఒకదానియందులేని మరొకదాని లక్షణాన్ని ఉన్నట్లుగా
ఆరోపించటము.
ఉదా//సంసారసాగరం = సంసారమనెడి సాగరము.
సంగీతఝరులు= సంగీతములనెడి ఝరులు.
g.సంభావనాపూర్వపద కర్మధారయసమాసము:- సంభావించునది పూర్వపదముగా
ఉన్నందున ఇది సంభావనా పూర్వపద
కర్మధారయ సమాసము.
ఉ//పెన్నానది = పెన్నా అను పేరు గల నది.
శింశుపా
వృక్షము = శింశుపా అనుపేరుగల వృక్షము
3.ద్విగు సమాసము - సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక
విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.
ఇందు తప్పక సంఖ్య సూచించబడాలి. కొన్ని , కొంత
మున్నగు వాటితో ఏర్పడితే అవి ద్విగుసమాసములనబడవు. తప్పనిసరిగా ఒక సంఖ్య నిర్దేశించబడాలి.
ఉదా // ముల్లోకములు = మూడగులోకములు.
ముజ్జగములు = మూడగుజగములు.
4.బహువ్రీహి సమాసము -
దీని లక్షణం :- "బహువ్రీహిః ప్రాయేణ అన్యపదార్థ
ప్రధానో విశేష్య నిఘ్నశ్చ". "బహువ్రీహి సమాసం సాధారణంగా అన్యపదార్థము ప్రధానంగా
గల్గినది అవుతుంది."అన్యపదార్థ ప్రాధాన్యం గలది బహువ్రీహి' - అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో
చెప్పటం జరిగింది. విశేష్యమునకు సంబంధించి ఉంటుంది. అంటే విశేష్యం ఏ లింగం ఏ విభక్తిలో
ఉంటుందో అందులోనే ఈ బహువ్రీహి కూడా ఉంటుంది.
'అన్యపదార్థం' అనగా సమాసంలో ఉన్న పదాలు కాక సూచింపబడే వేరొక పదం యొక్క అర్థం కలిగి ఉండటము.
"అన్యపదార్థం”. అది ప్రధానంగా కలది 'అన్య పదార్థ ప్రాధాన్యం. అన్యపదార్థ క్రియతో
అన్వయం ప్రాధాన్యం గల సమాసం' 'బహువ్రీహి సమాసం' అని అర్థం. బహువ్రీహి సమాసంలో విగ్రహ
వాక్యం చెప్పుకునేటప్పుడు 'కలది, కలవాడు' అనే రెండుపదాలు సమాసపదాలకు చివరన తెలుగులో
వచ్చి చేరతాయి. అలా వచ్చి చేరిన పదాలే అన్యపదాల అర్థాన్ని సూచిస్తాయి.
ఉదా//పీతాంబరుడు = పీతమైన అంబరము కలవాడు ('విష్ణువు'
అనే మరొక వ్యక్తిని సూచిస్తోంది. ఇదే అన్యపద ప్రధానం)
ముక్కంటి=మూడు కన్నులుగలవాడు(శివుడు)
5.ద్వంద్వ సమాసము –
"ప్రాయేణ ఉభయ పదార్థ ప్రథానో ద్వంద్వః"
"ఉభయపదార్థ ప్రథానం ద్వంద్వం" అని చిన్నయసూరి
శెలవిచ్చినారు.
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ
సమాసము. ఇది తరచుగా రెండుపదములయొక్క అర్థము ప్రధానముగా కలిగియుండును.
ఉదా - సీతారాములు = సీత, రాముడు,
కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును
బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ
పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: 'ధర్మ భీమార్జున నకుల సహదేవులు'
ధర్మరాజు,భీముడు అర్జునుడు నకులుడు,సహదేవుడు
6.అవ్యయీభావ సమాసము -
సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ
సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును. అలా పూర్వపదము అవ్యయముగానుండి
అదే ప్రధానమైన సమాసముగానున్నచో అది "అవ్యయీభావ సమాసము."
ఉదా:- యధాశక్తి(సమాసము) = శక్తికి తగినట్లు (విగ్రహవాక్యము)
పద్మనేత్రి (సమాసము) పద్మమువంటి నేత్రములు కలది
(విగ్రహవాక్యము).
*****
No comments:
Post a Comment