Saturday, October 24, 2026

సాహిత్యగుమ్మడి 76--100

సాహిత్యగుమ్మడి -76

ఉ//
అత్తను గాంచిరమ్మనగ నౌరసు డేగియు నామెచెంతకున్
అత్త కుమార్తెఁగాంచియట నాతడుదెల్పగ తండ్రికింపుగన్
చిత్తము మర్లగామెయెడ చెంతకు దీసెగ యాలిరూపమున్'
ఉత్తర మియ్యరే బుధులు నోర్పుగ, వ్రాసినదెవ్వరెద్దియో?

సరైన జవాబులు.
కాణాదం పెద్దన సోమయాజి
ముకుందవిలాసము

ముకుందవిలాసము ఒక ప్రసిద్ధిచెందిన తెలుగు ప్రబంధం. దీనిని గద్వాల సంస్థానపు ప్రభువుల ఆస్థాన కవి కాణాదం పెద్దన సోమయాజి రచించారు. ఇది మూడాశ్వాసాల ప్రబంధం. ఇది తొలిసారి సా.శ. 1886లో గద్వాల సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాలలో ముద్రితమైంది.. తరువాత తెలుగు విజ్ఞానపీఠం వారు ఈ ప్రబంధాన్ని 1985లో ముద్రించారు. ముకుందుడు అనగా శ్రీకృష్ణుడు. కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణునికి జరిగిన వివాహం ఇందులోని ప్రధానమైన ఇతివృత్తం. అందువలన దీనికి భద్రాపరిణయం, భద్రాపరిణయోల్లాసం అని దీనికి నామాంతరాలు ఉన్నాయి. ఇది గద్వాల సంస్థాన ప్రభువు చినసోమ భూపాలుని ఆస్థానంలో చేరిన తరువాత అతని ప్రేరణచే పెద్దన రచించిన మొదటి ప్రబంధం. ఈ ప్రబంధం గద్వాల లోని కేశవస్వామికి అంకితం చేయబడింది. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపిస్తాయి.

శ్రీకృష్ణుడు ద్వారకలో వుంటూ ప్రజలను ఈతిబాధలు లేకుండా పాలిస్తున్నాడు. ఒకనాడు పాండవులను చూడాల్ని ఇంద్రప్రస్థానికి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తుంటాడు. ఒకనాడు కృష్ణార్జునులు ముచ్చటలాడుచుండగా వారి వద్దకు అగ్నిదేవుడు వచ్చి ఆకలిగావున్నది కావున ఖాండవవనాన్ని ఆహుతిగా ఇమ్మని వేడుకుంటాడు. కృష్ణార్జునులు అందులకు అంగీకరిస్తారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తుండగా ఆ వనంలోనున్న మయుడు అగ్నిదాహాన్ని భరించలేక అర్జునున్ని శరణు వేడుకుంటాడు. అర్జునుడు మయుణ్ణి రక్షిస్తాడు. మయుడు కృతజ్ఞడై అర్జునునికి మయసభను సమర్పిస్తాడు. శ్రీకృష్ణుదు తిరిగి ద్వారకకు తిరిగివస్తాడు.

అర్జునుడు తనను రక్షించింది శ్రీకృష్ణుని మూలంగానే కదా అని మయుడు ఒక చిత్రసభను నిర్మించి దానిని శ్రీకృష్ణునికి సమర్పించాలని ద్వారకకు వెళ్తాడు. శ్రీకృష్ణుని మాయా ప్రభావం వల్ల ఆ సభాభవనమంతా అతనికి పలువింతలతో కనిపిస్తుంది. తనెంత భ్రమలో వున్నది గ్రహించి రైవతక పర్వత సానుతలం మీద ఒక కేళీవనాన్ని నిర్మించి శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. అదే విధంగా కానుకలను సమర్పించడానికి ఇంద్రుడు కూడా ద్వారకకు వచ్చి పశ్చాత్తాపంతో అక్కడొక లతాసంచయాన్ని నాటి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు ఆ కేళీవనంలో విహరిస్తూ సుఖంగా ఉంటాడు.

ఒకనాడు వసుదేవుని చెల్లెలైన శ్రుతకీర్తి యోగక్షేమాలను తెలుసుకొని రావడానికి తన కుమారుడైన గదుణ్ణి పంపుతాడు. గదుడు కేకయపురానికి వెళ్ళి మేనత్త యోగక్షేమాలను తెలుసుకొని వచ్చి తన తండ్రికి తెలియజేస్తాడు. ఏకాంతంగా శ్రీకృష్ణునితో మేనత్త కూతురైన భద్రాదేవి సౌందర్యాతిశయాన్ని గూర్చి చెబుతాడు. శ్రీకృష్ణునికి భద్రపై ప్రేమ అంకురిస్తుంది. భద్రాదేవిని కృష్ణపరమాత్మ అష్టమసతిగా పరిణయమాడతాడు

------------------------------------------
సాహిత్యగుమ్మడి -77--25/12/22
చం//షట్పది)
ఇరువది రెండుగాథలవి నింపుగ వ్రాసిరి సూక్ష్మబుధ్ధిగన్
విరిసెగ నాదిఁ తీర్పు కడఁ వీడదినొక్కటి, జూడఁ జోక యం
బరముల బుట్టుకే విధిగ ప్రాణము బోసెనొ నాడు, నేడు నే
కరిణిగ సాగుచున్నదది కండ్లకు గట్టియుచూపె నింపుగన్
పరిపరి తావులేగి నొక బాధ్యత రంగమునెంచిశోధనన్
జరిపియు వ్రాసెనెవ్వరవి సంగడి పొత్తములెవ్విదెల్పరే
'
సరైన జవాబులు
శ్రీమతి మంథా భానుమతి
అనంత వాహిని
అగ్గిపెట్టెలో ఆరుగజాలు

డా. మంథా భానుమతి. గారుపుట్టింది అమలాపురం, కోనసీమలో, పెరిగింది గుంటూరులో, నివాసం హైద్రాబాద్ లో.
జీవననేస్తం-- మంథా రామారావు బి.టెక్. విద్యుత్ శాఖలో సూపరెండెంట్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు.
చదువు –ఉస్మానియా యూనివర్సిటీ యమ్. యస్సీ, యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్, యు.యస్. ఏ నుండి రసాయన శాస్త్రంలో యమ్.యస్,  ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి,
  వృత్తి- విశ్రాంత ప్రభుత్వ రసాయన శాస్త్ర అధ్యాపకురాలు.
  ప్రవృత్తి-   సంగీతం (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం నుంచి కర్నాటక సంగీతంలో డిప్లమా)
    సాహిత్యం- పఠనం, రచన, యోగా.
   రచనలు- ఇరవై మూడు నవలలు, ఎనభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురింప బడ్డాయి.  మూడు కథా సంకలనాలు, మూడు నవలలు పబ్లిష్ చేశారు. మూడు శతకాలు, రెండు ప్రబంధాలు, కొన్ని ఖండికలు రచించారు.
పబ్లిష్ అయిన పుస్తకాలు..
1. “అనంత వాహిని”- కథా సంపుటి.
2. “రామాయణం మావయ్య.” నవల
3. “గ్లేషియర్.” -నవల
4. “జీవన వాహిని”- కథా సంపుటి.
5. “అగ్గిపెట్టెలో ఆరుగజాలు” నవల
6. “‘మంథార’ మాల”- కథా సంపుటి.

నవలల పేరులు- ప్రచురణ వివరాలు-

                               నవలల, కథల పట్టిక:

పబ్లిష్ అయిన నవలలు.
1.గ్లేషియర్-రచన (నర్శిపురం ఆదిలక్ష్మి స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల.)
2.అంతా ప్రేమమయం-స్వాతి (పదహారు వారాల సీరియల్ కి ఎన్నికైన నవల)
3రామాయణం మామయ్య-ఆంధ్రభూమి (నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది.)
4.శివానీ-కౌముది
5.అగ్గిపెట్టిలో ఆరుగజాలు-ఆంధ్రభూమి
6.అరుణోదయం-ఆంధ్రభూమి
7.మౌనంగానే ఎదగమని-స్వాతి (అనిల్ అవార్డ్ పొందిన నవల.)
8.మారని భారతంలో మరో శకుంతల-స్వాతి
9.మాయ పండు-చతుర
10.సిస్టర్ కరుణ-ఆంధ్రభూమి మాస పత్రిక
11.అనుబంధాలు-నవ్య. (ఎనిమిది వారాల నవలల పోటీలో ఎన్నికైన నవల)
12.జీవన పోరాటం--- కౌముది అంతర్జాల పత్రిక.
13.సగం ఇక్కడా సగం అక్కడా!—స్వాతి మాస పత్రిక
14. జనని- ఆంధ్రభూమి వార పత్రిక.
15. నిన్నటినాతో రేపటి నేను- (స్వాతి మాస పత్రిక))
16. మేఘం లేని మెరుపు.- కౌముది అంతర్జాల పత్రిక
17. చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు. -తెలుగు వన్ . కామ్.
18. మొదటి అడుగు- ఆంధ్రభూమి వారపత్రిక
19. అజ్ఞాత కులశీలస్య- తెలుగువన్.కామ్
20. ప్రేముడి-- కౌముది- అంతర్జాల మాస పత్రిక.
21. కలియుగ వామనుడు- ‘మాలిక’ అంతర్జాల పత్రిక.
22. అద్వితీయుడు -ఆధునిక ప్రబంధ కావ్యం.
23. పద్మప్ప.

పద్యాలు-
అర్క శతకం- కందాల మాల.
అంశు శతకం- కందాల మాల
సిరి శతకం- కందాల మాల
కృష్ణా పుష్కరాలు- దశ కందాల మాల.. అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక.
మైండ్ ఇండియా భారతమాత పద్యాల పోటీలో ప్రోత్సాహక బహుమతి. అక్కిరాజు ప్రసాద్ ఏరువాక పద్యాల పోటీలో ప్రధమ బహుమతి. వీర నరసింహరాజుగారి శివరాత్రి పద్యాల పోటీలో తృతీయ బహుమతి. ‘ధనుర్మాస వైభవం’- అచ్చంగా తెలుగు బృందం వారి పద్యాల పోటీలో ప్రధమ బహుమతి.. స్వాతంత్ర్య సమరయోధులు, అచ్చంగా తెలుగు పద్యాల పోటీలో విశేష పురస్కార భహుమతి. కార్తీక మాస వైశిష్ట్యము, అచ్చంగా తెలుగు, జంధ్యాల పికల్స్, వీరనరసింహరాజు పద్యాల పోటీలో ద్వితీయ బహుమతి.

పురస్కారాలు..
లేఖిని సంస్థ వారి మాతృదేవ పురస్కారం,
కళాసాగరం వారి జీవితకాల సాఫల్య పురస్కారం,
బోయి హైమవతిగారిచే కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు దంపతుల జీవిత పురస్కారం.
గుంటూరు సాహిత్య బృదం వారిచే ఉగాది పురస్కారం.
లయన్స్ క్లబ్, యల్.బి నగర్ వారిచే జీవితకాల సాఫల్య పురస్కారం.
వంశీ సంస్థ వారి వాసిరెడ్డి సీతాదేవి స్మారక పురస్కారం.
శ్రీ సత్యనారాయణ శ్రీమతి శారద మెమోరియల్ ట్రస్ట్ వారి సాహితీ శిరోమణి పురస్కారం.
పెద్దక్క శ్రీమతి భానుమతి మంథాగారి సాహితీ సేవకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి సమకాలికునిగా నేనిప్పుడు ఈ ధరణిపైనడయాడటం నా భాగ్యముగా భావిస్తున్నాను.
                        *--------*
------------------------------------------
సాహిత్యగుమ్మడి -78--26/12/22
మ.కో
యోగ శాస్త్రముసార మిచ్చిరి యోగి తీరుగ నొక్కరున్
శ్రీ గణేశునిఁ గొల్చి గొప్పగ, చింతఁ దల్చియు శారదన్
యాగమట్టుల వ్రాసె వారలె యమ్మనూ మకుటమ్ముగా
కాగడా కిరణాలలా శతకంబులల్లిరి యెవ్వరో

సరైన జవాబు
పిన్నలి వేంకట రామ గోపీనాథ్.(Pvr gopinath)

వారి గురించి వారిమాటలలోనే........
పేరు: పిన్నలి వేంకట రామ గోపీనాథ్.
వయసు: 70 సంవత్సరాలు. భార్య శ్రీనివాస లక్ష్మీ పద్మావతి, ఇద్దరు కుమారులు ఆదిత్య(కోడలు సిరి), చైతన్య(దీప్తి). ముగ్గురు మనుమలు, ఒక మనుమరాలు.
ఏ ఊరు నీదంటే . . .
చెన్నైలో(1953) పుట్టి, విజయవాడలో ఎదిగి, గుంటూరులో ఒదిగి హైదరాబాద్, పుణె నగరాలు చూసి ప్రస్తుతం బెంగళూరులో పిల్లల నీడలో విశ్రాంతిగా . . .
సనక సనందానాదులు నలుగురూ భక్తిదేవి కోసం జ్ఞాన వైరాగ్యాలు రెంటినీ తిరిగి మేల్కొల్పే ప్రయత్నంలో శ్రీ మహభాగవత పురాణం ఆలాపించడం ప్రారంభించిన కార్తిక శుద్ధ నవమినాడే జన్మించినందున కాబోలు నాలోనూ భక్తి తత్వం కాస్త ఎక్కువే అనాలి. అన్నట్లూ . . .
శివకేశవుల అభేదానికి తార్కాణమా అన్నట్లు అమ్మ కనక దుర్గాంబ కాగా, నాన్నగారు నరసింహారావుగారు. ఇద్దరూ కీర్తి శేషులే. ఇద్దరన్నల తర్వాత మూడోవాడిని. నా తర్వాత ఓ చెల్లాయి.
చిన్నన్న పివిఆర్ శివకుమార్ చిన్ననాటి నుండే కథా రచయిత కావడంతో నేను కనీసం పత్రికా రచయితను కావాలనుకుని . . .
ఈనాడు, ఆంధ్రప్రభలలో సబెడిటరుగా చేసి ఆ రంగం అచ్చిరాదనుకుని, బయటకు వచ్చాక ఏమీ తోచక కలం పట్టి యఫ్బీ మిత్రుల ప్రేరణతో 2015లో షిరిడీ సాయి శతకము (ఆటవెలదులలో) . . . అముద్రితమే. అల్లుకోగా అది చూసి శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారు పసిగట్టి పట్టుబట్టి చేయిపట్టి నడిపించసాగారు.
ఫలితంగా . . . అచ్చంగా తెలుగు కూటమిలో వచ్చిన ఒక వ్యాసానికి బహుమతిగా 'గీతా దైనందిని' లభించడంతో అందులోని గీతను చదివి ఆ ప్రేరణతో శ్రీమద్భగవద్గీతా సారము.
609 ఆట వెలదులలో అల్లుకున్నాను.
ఇక మనసు ఆగక, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్ ఆధారముగా ఆటవెలదులలో ద్విశతకము(వందనాలు హరికి వంద వేలు), కనకధారా స్తవము(ఆటవెలదులలో), భజగోవిన్దమ్ (ఆటవెలదులలో) అలాగే ఈశ (కందాలు), శ్రీ దేవి (అమ్మవారు .  ఆటవెలదులు),  శ్రీ గణపతి(ఆటవెలదులు), శ్రీ స్కంద(కందం), శ్రీ శాస్త (అయ్యప్ప.. కందం),శ్రీ రామ(ఆటవెలదులు), శ్రీ హనుమ (కందం), శ్రీ వంశీ(కందం), శ్రీ శారదాంబ(ఆటవెలదులు), శ్రీ నరసింహ, శివా (నీతి కందాలు) శతకాలు .

అచ్చులో లభించు పొత్తములు
1)గీతాసారము,  2)రహి చూపుశివా (నీతి కందాలు) 3)శ్రీ దేవీ శతకము (మకుటము- 'అమ్మ మమ్ము నీవె యాదరించు') 4)శ్రీ గణపతి శతకము (మకుటము 'గణపతయ్య మమ్ము గావుమయ్య') 5)శ్రీ శారదాంబ శతకము (మకుటము- 'సాకుమమ్మ మమ్ము శారదాంబ') 6)రహి చూపు శివా పేరిట శివా అనే మకుటము గల నీతికందాలు.
ఇవిగాక ఆశ్రయం పేరిట 255 పద్యాలతో సామాజిక పద్య ప్రబంధం, ఆలోచనే మార్గము పేరిట పది పద్యాలతో కథ.. ద్వితీయ బహుమతి పొందినది. మధ్య మధ్య ఏమీ తోచక ఓ పాతిక కథలు కూడా (యఫ్బీలోనే అ.తె., పున్నాగవనం కూటములలో) అచ్చేయించుకున్నాలెండి. నన్ను పద్యరచయితగా గుర్తించి తీర్చిదిద్దిన గురువన్న శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారికి వందన శతాలు మినహా మరేమీ ఇచ్చుకోలేకపోతున్నవాడిని.
అలాగే పద్యం చూడగానే నన్ను పట్టేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాద పూర్వక వందనాలు.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -79--27/12/22
ఉ//
సవ్వడిజేయుజక్కగను సాహితి యన్నను బ్రీతిమిన్నయున్
దివ్వెయె జూడపల్కులును దిక్కును జూపెగ వ్రాతలందునన్
బువ్వను, నిప్పురవ్వలిడు భూమిని, నీటిని, వృక్షసంపదల్
కవ్వముతీరుగా చిలికి కైతలనల్లిరి యెవ్వరందురో?

సరైన జవాబు
శ్రీ కలిదిండి రామచంద్ర రాజు

(పద్యవివరణ..మొదటిపాదము హాస్యపూరితమైన వీరి సంభాషణలు వీరికి తెలుగు సాహిత్యమనిన మక్కువ ఎక్కువ అని మనకు చెప్పకనే చెబుతాయి.
రెండవ పాదము దివ్వె  దీపము..,పల్కులు  మాటలు (అక్షరాలు) అక్షరదీపాలు, దిక్కు అనగా పథము,
మూడవపాదము,,వారి రచనలలో ఆహారవినియోగము,భూమి తాపము, నీటివాడకము, పచ్చదనము పరిశుబ్రతలకు అధికప్రాధాన్యమివ్వబడినది.
నాలుగవ పాదము వీరిరచనలు పైకి సాధారణముగా కనిపించినప్పటికీ సమాజపోకడలను లోతుగా పరిశీలించి రుగ్మతలను గుర్తెరిగి వ్రాయబడినాయి.

శ్రీ కలిదిండి రామచంద్రరాజు గారు 24/11/1960 రోజున జన్మించారు.
తల్లిదండ్రులు కీ.శే శ్రీమతి సీతమ్మ, రామచంద్ర రాజు గార్లు
అర్థాంగి  కీ.శే శ్రీమతి సత్య స్వర్ణలత.
సంతానం కుమార్తెలు శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీమతి శ్రీ విద్య
వీరు యోగా గురువుగా ప్రసిద్ధి నొందినారు. వీరికి కందము ఛందస్సు లో పద్యములు వ్రాయుట బహుప్రీతి. "కందము వ్రాసినవాడే కవీ పందిని పొడిచినవాడే బంటు"  అన్న నానుడి వీరికి అక్షరాలా సరిపోతుంది. వీరు కందపద్యములలో ప్రచురించిన "నాపథం నాపయనం" "అక్షర దీపాలు" ఈ రెండు పద్యకావ్యములు సామాజిక స్పృహతో వ్రాయబడినాయి. ముళ్ళపూడి వారి "బుడుగు" ప్రశ్నల వర్షం గా పద్యాలు కధపడతాయి. వాటికి పరిష్కారం కూడా చూపెట్టబడుతుంది. సరళమైన భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పద్యరచన చేయటం వీరిప్రత్యేకత. వీరి పద్యరచన చదవడం ప్రారంభిస్తే మనకు లీలగా వేమన శతకము, "సుమతీ శతకము" కూడా మనసులో మెదులాడుతుంది. ప్రస్తుతం సమాజములోని చెడును దునుమాడుటలో వీరికలము కరవాలముకన్నను పదునైనదిగా పాఠకునకు కనపడుతుంది అనుటలో ఎట్టి సందియములేదు.
పైనుదహరించిన రెండు పొత్తములే కాక "నవకవితాఝరి"  (పద్యసంకలనము) మేమిరువురము ప్రచురించనైనది. ఇందులో
సర్వ శ్రీ /శ్రీమతి
bhanumathi
gopinath
హంసగీతి
jhansi
mvvs sasthry
mallisiripu
mallikarjuna rao
nandoori sundari
sasikala
sandhya goollamudi
sree swami
sarada polamraju
ramalakshmi avasarala  గార్లు వివిధ అంశములమీద అద్భుతంగా వ్రాసిన పద్యములు పాఠకులను ఔరా! అనిపిస్తాయి.
అందరికీ అభినందనలు తెలియచేద్దాము.
----------------------------------------
సాహిత్యగుమ్మడి -80--28/12/22
ఉ//
పిల్లనగ్రోలు చిత్తరువు భేరము భేదము పార్థసారధిన్!
వల్లభమున్ప్రబంధమును పాణిజ శబ్దము లెంచియంతటన్
చెల్లగ నాదియంతములు చేర్చగ వైనముఁ దక్కినక్కరల్
వెల్లివిరియ్గు వాణొకటి వేడితి నెద్దది? వ్రాసెనెవ్వరో?

సరైనజవాబులు
రాజశేఖరచరిత్ర
కందుకూరి వీరేశలింగం పంతులు

నా పద్యవివరణ
మొదటి పాదము:- పిల్లనగ్రోలు = మురళి, చిత్తరువు = చిత్రము, భేరము =  గజము, భేదము =  విశేష, పార్థసారధి = మురారి,
రెండవపాదము:- వల్లభము = కూరిమి, ప్రబంధము = రచన, పాణిజ = నఖము, శబ్దములు=పదములు, ఎంచి = తీసికొని, అంతటన్=అటుపిమ్మట
మూడవ పాదము:- చెల్లగ = సమసిపోగా.(తొలగించగ) ఆది అంతములు= మొదటి చివరలు,  తక్కినక్కరలు = మిగిలిన అక్షరములు. వైనముఁ = ఒక క్రమపద్దతిలో, పేర్చిన = పేర్చినచో,
నాలుగవపాదము:- వెల్లివిరుయు= ప్రకటితమగు, వాణొకటి = ఒకపుస్తకము, వేడితిన్ = మిమ్ముకోరితిని. ఎద్దది = అదియేది వ్రాసెనెవ్వరో=ఎవరు వ్రాసినారో?
కావున మనమా మూడక్షరముల పదములను తీసుకొని మొదటి చివరక్షరములు తొలగించి నడుమమిగిన అక్షరములను క్రమపద్దతిలో వ్రాసుకున్నచో క్రింది విధముగా ఒకపుస్తకము మనకు లభించును.
పిల్లనగ్రోలు = మురళి------ర
చిత్తరువు = చిత్రము.....,త్ర
భేరము =  గజము.........,,జ
భేదము =  విశేష............,.శే
పార్థసారధి = మురారి.......రా
వల్లభము = కూరిమి.........రి
ప్రబంధము = రచన ,......,.చ
పాణిజ = నఖము.............ఖ
ర త్ర జ శే రా రి చ ఖ-- ఈ అక్షరములు క్రమపద్దతిలో పేర్చినచో  'రాజశేఖర చరిత్ర',  వ్రాసినవారు కందుకూరి వీరేశలింగం
పంతులు గారు.
-----------------------------------------
సాహిత్య గుమ్మడి..81--29/12/22
ఉ//
వ్రాసిరి బూర్వమందునిది వ్యాసులు గొప్పగ సంస్కృతంబునన్!
వాసిగ యుద్దరంగమున వాక్కొన గృష్ణుడు జ్ఞానబోధ, వి
శ్వాసము హిందు ధర్మమున పావనమియ్యది సారమంచదే
ఆ సిరినాంధ్రమందు ఘనులల్లిరి బూర్వము, నేటికాలమున్
కూసిని పల్కులందుననె గూర్చె కకుప్పని యంచునెవ్వరో?

(కకుప్పు = శాస్త్రము)

సరైన జవాబు:-శ్రీ మన్నేరి రమేష్ ప్రసాద్.

శ్రీ మన్నేరి రమేష్ ప్రసాద్
పుట్టినదినము: 23-02-1953, నివాసము: హైదరాబాద్
విద్య :బి.ఎ (గణితము, ఆర్ధిక రాజకీయశాస్త్రములు) ఎమ్.ఏ (ఆర్ధికశాస్త్రం) జ్యోతిషం (సర్టిఫికేట్ కోర్సు) సంస్కృతము (సర్టిఫికేట్ కోర్సు)
తల్లిదండ్రులుకీ॥శే॥ శ్రీమతి సరోజమ్మ గారు. కీ॥ శే॥ శ్రీ మన్నెరి చిన్న సుబ్బరాయుడు గారు
కళత్రం: శ్రీమతి పద్మావతి :
పుత్రుడు :శ్రీ మన్నేరి సుందరరామ రాయుడు
Director, software Development Fidelity Investments, USA
పుత్రిక: శ్రీమతి డా|| గంగాళం హిమబిందు MBBS, MD
Hospitalist, Providence Hospital Washington DC, USA :
ఉద్యోగం :ఆంధ్రాబ్యాంక్, ప్రొబేషనరీ ఆఫీసర్గా 1976 లో ఆరంభం, ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ గా 2013లో పదవీ విరమణ.
'శ్రీమద్భగవద్గీతా శాస్త్రము,'
మనలో ఒకరైన విద్యాధికులు, సౌమ్యులు, సహనశీలి, ఉత్తమగుణసంపన్నులైన శ్రీ మన్నేరి రమేష్ ప్రసాద్ గారు ఆంధ్రా బాంక్ యెల్లందు బ్రాంచ్ మేనేజరుగా, నేనదే బ్రాంచిలో వారిక్రింది అధికారిగా 1998--99 ప్రాంతములో కొంతకాలము కలసి పనిచేయటంజరిగినది. అనంతర కాలములో మరలా ఈ fb వేదిక మాయిరువురను కలిపినది. నాకు తెలిసినంతవరకు వారికి ఆంగ్లభాషమీద మంచి గట్టిపట్టున్నది. కాని సంస్కృత తెలుగు భాషలలో కూడా అనే విషయము ఈ మధ్యనే ఈ పొత్తము ద్వారా తెలిసినది. వారు 10/12/22 న అమెరికా పయనమై వెళ్ళేముందు. 1000 కాపీలలో మిగిలి ఉన్న 35-40 పుస్తకాలు మన 'సాహిత్యగుమ్మడి, వేడుకలో ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులైన వారికందించమని నా యింటికి వచ్చియిచ్చి, నా 'సరళంగా తెలుగు వ్యాకరణం' అందుకొని వెళ్ళారు. పద్యరచనపై మక్కువ గల వీరు త్వరలోనే ఉత్తమ పద్యకవిగా మనకు దర్శనమిస్తారనాశిద్దాము. వారికి ధన్యవాదములు.
ఈ గ్రంథమునకు శ్రీ రామకృష్ణా మఠం ప్రచురణ విభాగమువారైన  శ్రీ స్వామి రఘునాయకానంద మహరాజ్ వారలు ముందుమాట వ్రాసినారు. తిరుమల తిరుపతి దేవస్థానమువారు 1000 కాపీలకవసరమైన ఆర్ధిక సహాయమందచేయుటం జరిగినది. తిరిగి రామకృష్ణా మఠంవారు అశేష భక్తసముదాయము సమక్షములో ఈ పుస్తకావిష్కరణ జరపటమును బట్టి ఈ పుస్తకమెంత విలువైనదో మనము గ్రహింవచ్చు.

ఈ గ్రంధము గురించి వారిమాటలలోనే.......
శ్రీమద్భగవద్గీతా శాస్త్రము, ఓం నమోవేంకటేశాయ
ఆధ్యాత్మికము : జీవనము, భగవంతుడు, ఆధ్యాత్మికత అన్నియును మనిషి శాంతముగా సుఖముగా జీవించుటకు ముడిబడిన భావాలు, రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత మొ|| అన్నియును జీవన అభ్యుదయమునకు, శాంతి, సుఖజీవనానికి తోడ్పడే ఋషుల శాశ్వత భావతరంగాలు. ఆ అమృత తరంగాలలో ఓలలాడి తరిద్దాం....
1. ప్రతి మనుజుడు తన జీవనగమనంలో ఎదుర్కొనే క్లిష్టమైన -సమస్యలు, బాధలు దుఃఖము అసంతృప్తి మొ॥ అధిగమించి తమస్వస్వరూపమైన శాంత సచ్చిదానందమును అనుభవించే జ్ఞానమును, కార్యకుశలతను శ్రీకృష్ణభగవానుడు, అర్జునుని ద్వారా మనకు ఉపదేశించిన గ్రంధమే శ్రీభగవద్గీత. 2.శ్రీభగవద్గీతనే "శ్రీమద్భగవద్గీతా శాస్త్ర"మని తెలుగులో వ్రాయబడినది.
3. శ్రీమద్భగవద్గీతాశాస్త్రము నందు పీఠికలో నేటి మానవునకు శాస్త్రరూపమైన భగవద్గీత తెలుసుకొని ఆచరించవలసిన ఆవశ్యకత తెలుపబడినది. ఇందు సత్వరజస్తమో గుణవివరణ స్థూలముగా తెలుపబడినది.
4. శ్రీమద్భగవద్గీతాశాస్త్ర సంగ్రహ విశ్లేషణము అనుభాగమునందు 18 అధ్యాయములలో చెప్పబడిన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, అలౌకిక, సాంఘిక, శాస్త్రవిషయములను భగవంతుడైన శ్రీకృష్ణుడు ఒక క్రమబద్ధమైన తర్కశాస్త్రముతో అర్జునునకు బోధించిన క్రమము తెలుపబడినది. ప్రతి అధ్యాయములో గల విషయ పరిచయము ఇవ్వబడినది.
5. అర్జునుని ప్రశ్నలు అని ఒక చిన్న భాగము, అతని సందేహములను క్రోడీకరించి ఇవ్వబడినది.
6. ఈ గ్రంథము కేవలము బోధనా గ్రంధమేకాదు, అనుష్టాన గ్రంధము కూడా. 'స్వభావ విశ్లేషణ' అనే భాగమునందు ఆచరణ సూత్రములు మరియు 4 అనుబంధ పట్టికలు కలవు. ఎవరికి వారే తమను విశ్లేషించుకొని. గుణపరిశీలనతో, ఆచరణ యోగ్య సాధనాక్రమముతో పరమాత్మ సన్నిధి చేరు ప్రయత్నముచేయవచ్చును.
7. ఈ గ్రంధములో శ్రీభగవద్గీత యందుగల 18 అధ్యాయములు సరళమైన తెలుగులో అనువదించబడి ఒక వైపు సంస్కృతశ్లోకములు, రెండవవైపు ఎదురుగా తెలుగు తాత్పర్యము ఉంచబడినది. సంస్కృతమునగాని, తెలుగునగాని నిరంతర భావార్థ రసహితముగా చదువుకొని ఆనందించ వలయును. భగవంతునికృప అందరకు కలుగవలేననే సదుద్దేశముతో ఈ రచన చేయబడినది.

అందరి అశీస్సులు కోరుతూ
భవదీయుడు
మన్నేరి రమేష్ ప్రసాద్
రచయిత

కొసమెరుపు:- నన్ను గెలిపించటానికో లేక వారుకూడా తడబడ్డారో తెలియదుకాని  ఈ గ్రంథరచయితైన శ్రీ M-10 Manneri Ramesh Prasad గారు కూడా మొదటిజవాబుగా ఒక నమస్కార బాణము వదలి  మూడు గంటల పిమ్మట వారిపేరు వ్రాసినారు. కావుననే నాకు ఈ రోజు 0 Pass లభించినది.
------------------------------------------
సాహిత్యగుమ్మడి - 82--30/12/22
మ.వి
బయకారంబున మూర్తులున్మువురు సద్భక్తాగ్రగణ్యుండులే
దయయున్దాన గుణంబులందున దయార్ద్రాగ్రేశ్వలందొక్కరున్
రయమున్గీతము లాలపించగల గీర్వాణంపు దౌరేయు, స్వా
మి యనుజ్ఞానముఁ వ్రాసె లేఖనలఁ సంసేవంబకూతర్దముల్
నయమున్దెల్గునఁ దర్జుమాగ యనుసంధానంబిడెద్దెవ్వరో?

బయకారము = సంగీతము, గీర్వాణము = సంస్కృత భాష, దౌరేయు = శ్రేష్టుడు,  స్వామి= కుమారస్వామి, లేఖనలు= వ్రాతలు. సంసేవ = గౌరవము, అకూతి = తాత్పర్యము (భావము)  అర్థము = అర్థము, అనుసంధానము = సంకలనము
సంగీత మూర్తిత్రయము- శ్రీ త్యాగరాజు , శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామ శాస్త్రుల వారు.

సరైన జవాబు
శ్రీ ముత్తుస్వామి దీక్షిత కృతిసర్వస్వము
శ్రీ డా.తాడేపల్లి పతంజలి.

డా. తాడేపల్లి పతంజలి గారి పుట్టిన తేదీ  15-07-1963 తల్లిదండ్రులు తాడేపల్లి సుశీల, పార్వతీశ శాస్త్రి గార్లు,
తాడేపల్లి మీనాక్షి సతీమణి, దీప్తి, కావ్య సంతానం. ప్రస్తుత ఉద్యోగం ప్రిన్సిపాల్, ప్రభుత్వడిగ్రీ కళాశాల, సదాశివపేట,  సంగారెడ్డి జిల్లా

ముద్రిత మరియు ఇకాపీ రచనలు  
1.నాటి భారతంలో నేటి సమాజం,(1996)
2. మామాకలాపం,(1997)
3. భావనలు,(2004)
4. శ్రీమన్నారాయణీయము( కేవలం తాత్పర్యముతో   2006),
5. భవిష్యపురాణము,(2010)
6. అన్నమయ్యగీతోపదేశాలు,(2011)
7. అన్నమయ్యఅన్నమాట,(2012)
8. ప్రాచీనప్రబంధం, ఆధునిక సంతకం(2014),
9. అన్నమయ్య కౌముది (2015)
10. శ్రీశివ మంగళాచరణ సురభి(2016)
11.  అన్నమయ్య పదం పరమార్థం(2016)
12. నమకచమకాలు (Ist print 2016, IInd print 2019)
13. చెరువు సత్యనారాయణ శాస్త్రి లింగోద్భవ స్తుతి(2017)
14. శ్రీ విష్ణుదేవ కర్ణామృతం(2018)
15. శ్రీ అరుణాచల మణమాల (2018)
16. శ్రీ రాజోపచార పూజా కల్పం(2019),
17.  అప్పయ్య దీక్షితుల ఆత్మార్పణాస్తుతి- తాత్పర్యవిశేషాలు(ఇ కాపీ2019)
18. మారిషస్ అన్నమయ్య గీతాలు(2019)
20. శ్రీమన్నారాయణీయము( తెలుగులో మొదటిసారిగా ప్రతిపదార్థంతో ఇ కాపీగా 2021, పుస్తకరూపంలో 2022)
పవిత్రమైన ప్లవ ఉగాది రోజునుండి (13-04-21)   ఇ కాపీగా  కినిగెలోలభిస్తున్నది.
21. ధన్వంతరి శతకం(ఇ కాపీ 2021)
22. శ్రీ ముత్తుస్వామి దీక్షిత కృతిసర్వస్వము -01 (2021 విజయదశమి)
23.  తెనాలి రామకృష్ణుడు( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ  2021)
24. అమృతం ( గురూజీ నౌషీర్ ఆంగ్ల గ్రంథానికి తెలుగు సేత ఇ కాపీ) 2017
ప్రభుత్వ అవార్డులు జాతీయ స్థాయిలో ఆకాశవాణి ఉత్తమ హాస్య రచయిత అవార్డు(1996)
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపక అవార్డు(2010)
బిరుదులు అన్నమయ్య పదసేవక , ప్రవచన ప్రవీణ
అభిరుచి యస్ వి బి సి ఛానల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రసంగాలు, బ్రహ్మోత్సవ వ్యాఖ్యానాలు, ఈటీవీ లోసాహితీ , సాంస్కృతిక చర్చలు, శివశక్తి సాయి టీవీ చానల్లో శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ,హరవిలాస శ్రీశివ మంగళాచరణ సురభి ప్రవచనాలు, జయజయ శంకర టీవీ చానల్లోఅప్పయ్య
దీక్షితుల ఆత్మార్పణ స్తుతి, యాదగిరి టివీ ఛానల్లో వివిధ ప్రసంగాలు, రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ సాహిత్య వేదికలపై కావ్యాలు, భగవద్గీత ,ఉపనిషత్తులుమొదలైన వాటిపై ప్రసంగాలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వివిధ సందర్భాల్లో అనేక ప్రసంగాలు, జాతీయ కవిత్వానువాదాలు
అభిలాష:- అడ్డుగోడలు లేకుండా ఆకాశంలా కనిపించే విశ్వ సాహిత్యాన్ని చేతనయినంతగా ఆస్వాదించటం, వీలయినంతగా అర్హులకు ఆ పరిమళాలని పంచిపెట్టడం.

శ్రీ Tadepalli Patanjali గారిచే వ్రాయబడిన షుమారు 600 పేజీల  "శ్రీ ముత్తుస్వామి దీక్షిత కృతిసర్వస్వము" పుస్తకమునకు అవధూత దత్తపీఠాదిపతి జగద్గురు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ సచిదానంద స్వామీజీ వారు,
అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి కరకమల సంజాతు దత్తపీఠ ఉత్తరాధిపతి పరమపూజ్య పరివ్రాజకాచార్యవర్య
శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామీజీవారు
శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి వారు,
వాగ్దేవీ వరపుత్ర సమన్వయ సరస్వతి శ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ వారు, శ్రీ మల్లాది సూరిబాబు గారు, ఆశీస్సందేశములందించినారు. ఇందు  శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి 100 కృతులకు ప్రతిపదార్థసహిత తాత్పర్యములతోపాటు  విశేషాలను కూడా పొందిపరచి రచయిత అందించినారు. నాకత్యంత ఆప్తులు, బహుభాషా కోవిదులు  'అన్నమయ్య పదసేవక', "ప్రవచన ప్రవీణ' శ్రీ Tadepalli Patanjali గారికి  అభినందనలు తెలియచేద్దాము.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -83--31/12/22
ఉ//
రాజ కుమారుడున్గనెను రాతిరి నిద్దురఁ నొక్కజవ్వనిన్
ఆ జవరాలునున్గనగ నాతని రూపము స్వప్నమందునన్
రాజుకొనింపుగా వలపుఁ రంజిలనించును దోయిపాతిలున్
రాజిలె నిర్వురీబెడగుఁ వ్రాసినదెవ్వరు? పొత్తమెద్దియో?

(నించు=కలుపు, పాతి=పక్షి, బెడగు= విలాసము, విధము)

సరైనజవాబులు
1) తెనాలి రామకృష్ణుడు  1)వక్కలంక వీరభద్రకవి
2) కందర్పకేతు విలాసము 2)వాసవదత్తా పరిణయము

కందర్పకేతు విలాసము
కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణుడు రాసిన రచన. తెనాలి రామకృష్ణుడు కందర్ప కేతు విలాసము, హరిలీల విలాసము వంటి రెండు రచనలు చేసినట్లు పెదపాటి జగ్గన్న కవి తాను రాసిన "ప్రబంధ రత్నకరము"లో, ఉటంకించాడు.[1] ఈ గ్రంథం కథాకావ్యం.
ప్రథమాంధ్ర కవిజీవిత చరిత్రనిర్మాత గురజాడ శ్రీరామమూర్తి 1893లో ప్రకటించిన తమ కవిజీవితములు సంపుటంలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతుల ఆధారంగా, రామకృష్ణుని చాటుధారాపద్యములు అని ఉదాహరించినారు.

ఇదే కథాంశముగా మరొకపొత్తము వక్కలంక వీరభద్రకవి
గారు "వాసవదత్తా పరిణయము" అనే పేరుతో వ్రాసినారు.
వాసవదత్తా పరిణయము
వాసవదత్తా పరిణయము అనే ఈ కావ్యాన్ని వక్కలంక వీరభద్రకవి సుమారు సా.శ. 1704 ప్రాంతంలో వ్రాశాడు. ఐదు ఆశ్వాసాలున్న ఈ ప్రౌఢకావ్యానికి సంస్కృత మూలము భాషలోని వాసవదత్తా అనే గద్యకావ్యము. దానిని సుబంధుడు అనే కవి వ్రాశాడు. సంస్కృతకావ్యానికి ఇది స్వేచ్ఛానువాదము. వీరభద్రకవి మూలకథను కొంత అనుసరించి, కొంత అతిక్రమించి, కొంత కుంచించి, కొంత సృష్టించి వాసవదత్తా పరిణయమును రసవంతమైన కావ్యముగా తీర్చిదిద్దాడు. వైదర్భీరీతిలో రచింపబడిన ఈ కావ్యాన్ని కవి తన సంస్థానాధీశుడైన రావు పెదమాధవరావుకు అంకితమిచ్చాడు. ఈ కావ్యం 1897లో వీరభద్రకవి వంశీకుడైన వక్కలంక భీమశంకరం రాజమండ్రిలోని వివేకవర్ధినీ ముద్రణాలయములో ముద్రించి ప్రకటించాడు.

ఇతివృత్తము
చింతామణి అనే రాజు యొక్క కుమారుడు కందర్పకేతుడు పాటలీపుత్రానికి అధిపతి. అతడు కలలో సాక్షాత్కరించిన ఒక సుందరిని వలచి, విరహతప్తుడై రాచకార్యాలను విడిచి, సఖుడైన మకరందునితో కలసి వింధ్యాటవికి వెళతాడు. అక్కడ రేవానది దగ్గర ఒక శమీవృక్షము వద్ద విశ్రమించి ఉండగా వారికి శుకశారికల సంభాషణ వినిపిస్తుంది. అక్కడ ఒక చిలుక రెండు గోరింకలు ఉన్నాయి. చిలుక తాను చూచివచ్చిన వింతలను ఒక గోరింకకు తెలుపుతూ, కుసుమపురగాధను ఈ క్రింది విధంగా వివరిస్తుంది.

కుసుమపురానికి శృంగార శేఖరుడు అనేవాడు రాజు. అతని భార్య రాజ్యలక్ష్మి. ఇంద్రుని వరప్రసాదముతో వారికి ఒక కుమార్తె కలుగగా శృంగార శేఖరుడు ఆమెకు వాసవదత్త అని నామకరణం చేస్తాడు. యౌవనవతి అయిన వాసవదత్తకు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ ఆమె ఎవ్వరినీ వరించలేదు. వాసవదత్తకు కలలో పాటలీపుత్రాధిపతి అయిన కందర్పకేతుడు కనిపించగా, ఆమె అతనియందే వలపు నిలిపి విరహ తాపాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ సమయంలో 'తమాలిక' అనే శారిక వాసవదత్తను ఊరడించి, తాను కందర్పకేతుని దగ్గరకు వెడతానని పలుకుతుంది. వాసవదత్త మహదానందంతో ఒక ప్రేమలేఖ వ్రాసి 'తమాలిక'కు ఇస్తుంది. ఆ తమాలికయే తనతో వచ్చిన గోరింక అని చిలుక మొదటి గోరింకకు తెలుపుతుంది.

తమాలిక అనే పేరుకల రెండవ శారిక కందర్పకేతుని గుర్తించి అతని వద్దకు వచ్చి వాసవదత్త ఇచ్చిన ప్రేమలేఖను అందిస్తుంది. తరువాత ఆ గోరింక వాసవదత్త విరహాన్ని అభివర్ణిస్తుంది. కందర్పకేతుడు సంతోషించి మకరంద, శారికా సమేతుడై వాసవదత్త అంతఃపురానికి వెళ్లి వాసవదత్తను చూచి తన స్వప్నసుందరిగా గుర్తిస్తాడు. పరస్పరం అనురాగ వీక్షణాలను కురిపించుకుంటూ వాసవదత్తా కందర్పకేతులు ఇద్దరూ మైమరచి పోతారు. వాసవదత్తను పుష్పకేతుడనే రాజుకు ఇచ్చి వివాహము చేయబోతున్నారన్న వార్త విని కందర్పకేతుడు వాసవదత్తను తీసుకుని పాటలీపుత్రానికి వెళ్తూ రాత్రి వింధ్యాటవిలో విశ్రమిస్తాడు. మరుసటి రోజు ఉదయం కందర్పకేతుడు మేల్కొనే సరికి వాసవదత్త కనిపించదు. అతడెంతగానో దుఃఖిస్తూ, వెదకి వెదకి సముద్రములో ప్రాణత్యాగం చేసుకోబోగా "త్వరలోనే వాసవదత్తను కలుసుకొందువ"ని అశరీరవాణి పలుకుతుంది. కందర్పకేతుడు తీర్థాటనం చేసి చివరకు వింధ్యాటవిలో శిలావిగ్రహంగా మారిన వాసవదత్తను చూచి నివ్వెరపోయి చేతితో తాకగా విగ్రహం సజీవ వాసవదత్తగా మారుతుంది. కందర్పకేతునకు వాసవదత్త క్రింది విధంగా తన కథ తెలుపుతుంది.

వింధ్యాటవిలో కందర్పకేతుడు నిద్రపోతుండగా మేల్కొనిన వాసవదత్త పతికి ఫలాలు సమకూర్చే ఉద్దేశముతో అడవిలోనికి వెళ్ళి రెండు కిరాతసేనల మధ్య చిక్కుకుంటుంది. అది ఒక ముని ఆశ్రమం. వాసవదత్తను స్వాధీనం చేసుకోవడానికి రెండు సేనలు అక్కడ యుద్ధంచేసి ఆశ్రమ ప్రాంతాన్ని బీభత్సం చేస్తాయి. ముని వచ్చి చూచి ఆ మారణహోమానికి కారణమైన వాసవదత్తను శిలగా మారిపొమ్మని శాపమిస్తాడు. తరువాత జాలిపడి భర్త హస్తస్పర్శతో శాపవిమోచనమవుతుందని చెప్తాడు. కాబట్టి కందర్పకేతుని వల్ల వాసవదత్త యథారూపం పొందింది.

ఇది ఇట్లుండగా కుసుమపురంలో శృంగార శేఖరుడు వాసవదత్తను వెదకడానికి చారులను పంపి విషయము తెలుసుకొని, వారిరువురిని పిలిపించి కందర్పకేతునకు, వాసవదత్తకు వివాహం జరిపిస్తాడు..
------------------------------------------
సాహిత్యగుమ్మడి - 84--1/1/23
ఉ//
మూడు యుగంబులందుగల పోడిమి నామములెంచి జూపుచున్!
వాటము నైనవే  త్రికము వాలుగ దెల్పును గొప్పసంగతుల్
చూడగ వీటిలో దొరకు సూక్ష్మము లెన్నియొ నిక్కవంబుగన్
వేడితినార్యులార మిము వేగముఁ దెల్పరె మూడు పొత్తముల్?

సరైన జవాబు
"పూర్వ గాథాలహరి"
"పురాణనామ చంద్రిక"
"పురాణనామ సంగ్రహము"

భారతీయ సాహిత్య సంపద అపారం. చతుర్వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, భారత రామాయణ ఇతిహాసాలు, కాళిదాసాది మహాకవుల కావ్యాలూ భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. మన పురాణేతిహాసాలలో వందలాది కథలున్నాయి. ఆఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ ఉన్నాయి. వేలాది పాత్రలున్నాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే వచ్చే పాత్రతో మొదలుకొని బహు రచనల్లో, అనేక కథల్లో మళ్లీ మళ్లీ వచ్చే పాత్రల వరకు మన ప్రాచీన సాహిత్యంలో వైవిధ్యభరితమైన పాత్రలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అట్లాగే పర్వతాలూ, నదులూ, పల్లెలూ, పట్టణాలూ, నగరాలూ, భూలోకానికే పరిమితం కాలేదు మనం. స్వర్గ నరకాలూ ఉన్నాయి. ఏడేడు పధ్నాలుగు లోకాలున్నాయి. దేవతలు, రాక్షసులు, కిన్నర, కింపురుష, గంధర్వాదులున్నారు. మానవపాత్రలతో పాటు వానరులూ, భల్లూకాలూ, పక్షులూ ఉన్నాయి. అసంఖ్యాకమైన ఈ వివరాలూ, వాటి గాథలూ మన సాహిత్యంలో ఎక్కడెక్కడో ఉన్నవాటిని సంగ్రహంగా ఒక్కచోట కూర్చిన గ్రంథం 'పూర్వగాథాలహరి' మన పురాణేతిహాస సర్వ విషయ సంగ్రహం ఇది. విజ్ఞాన సర్వస్వం వంటి నామ నిఘంటువిది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సాహిత్యాభిలాష  ఉన్న అందరికీ ఎంతో ఉపయోగపడే గ్రంథం. ఈ కృతికర్త శ్రీ వేమూరి శ్రీనివాస రావు. వేంకటరామ & కో వారి ప్రచురణ.
పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము.
"పురాణనామ చంద్రిక" శ్రీ యెనమండ్రం వెంకట్రామయ్య గారిచే,
"పురాణనామ సంగ్రహము"     శ్రీ సాదు లక్ష్మి నరసింహ శర్మ గారిచే వ్రాయబడినాయి.

-----------------------------------------
సాహిత్యగుమ్మడి- 85--2/1/23
చం//
చరితయె రాచవంశజుల సంచరితంబది జూడ గొప్పగా
నిరువురు సౌరు గన్నియల నెక్కిడె గెల్వగ తాత, తాత లి
ద్దరు, రుసొకండు, భాండపతి, దాయ రుసిన్సచి శెట్టి రేడుకున్!
పరిచెను రాచపోకడలు, పాలనతీరు నదెద్ది యెవ్వరో?

పద్యప్రతిపదార్థము
చరితయె =చరిత్రము, రాచవంశజుల =రాజవంశీయులది, సంచరితబు+అది =మంచిచరిత్ర. జూడ =చూసినయెడల , గొప్పగా= గొప్పనైనది,
యిరువురు =ఇద్దరు, సౌరు =అందమైన. కన్నియల= కన్యలను గెల్వగ= గెలుపుకోసం, ఎక్కిడె =ఎక్కుపెట్టిరి. తాత= తండ్రి. తాత =తాత (తండ్రితండ్రి,తల్లితండ్రి)

ఇద్దరు =ఇరువురు, రుసి+ఒకండు రుసొకండు =ఒకడుఋషి, భాండపతి =ఒకడువర్తకుడు, రేడుకున్= రాజుకు రుసి= ఋషి, దాయ =శత్రువు.   శెట్టి= వర్తకుడు, సచి =మిత్రుడు 

పరిచెను =వివరించెను. రాచపోకడలు =రాజుల పోకడలు. పాలన తీరు =పరిపాలనా విధానము, అదియెద్ది =ఆపుస్తకము యేది, యెవ్వరో =వ్రాసిరెవ్వరో

తాత్పర్యము;- చూడగా గొప్పనైన రాజవంశీయుమంచిచరిత్ర ఇందు ఇద్దరు అందమైన కన్యలు తండ్రి తాతలచే గెలుపుకోసం ఎక్కుపెట్టబడినారు వినియోగించబడినారు అందు ఒకరు ఋషి రాజునకు శుత్రువు ఒకరు వర్తకుడు రాజునకు మిత్రుడు. ఇందు రాజవంశీయుల పోకడలు, పరిపాలనా విధానము చూపబడినది అదియేది వ్రాసినవారెవరు?

సరైన జవాబులు
1) హిమబిందు (చారిత్రక నవల)
2) శ్రీ అడివి బాపిరాజు

అడివి బాపిరాజు:-
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.

బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్ర గుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' అనే నవలలో పొందుపరచాడు.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.

హిమబిందు
చారుగుప్తుడు ఒక వ్యాపారవేత్త. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి మూలస్థంభం వంటి వాడు. చక్రవర్తి శ్రీముఖుడికి కుడిభుజం లాంటివాడు. స్థౌలతిష్యుడు ఒక హిందూ మహర్షి. బౌద్ధమతం ప్రధానంగా గల శాతవాహన సామ్రాజ్యాన్ని రూపుమాపి ఆ పునాదుల మీద హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని స్థౌలతిష్యుని ఆకాంక్ష. అందుకోసం ఆయన ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. చారుగుప్తునిది మరో కల. పాటలీపుత్రాన్ని జయించి తన చక్రవర్తి సకల జంబూద్వీపానికి చక్రవర్తి కావాలనీ, కూతురు హిమబిందును ఆయన కొడుకు శ్రీకృష్ణ శాతవాహనుడికిచ్చి పెళ్ళి చేసి, ఆమెను భావి సామ్రాజ్ఞిని చేయాలని కోరిక. తన మనమరాలైన చంద్రబాలను విషకన్యగా మార్చి ఆమెను ఎరవేసి శ్రీకృష్ణమహారాజును హతమార్చాలనేది స్థౌలతిష్యుని కోరిక. అందాల రాశులైన చంద్రబాల, హిమబిందు తమకు తెలియకుండానే తమ పెద్దల ఆటలో పావులైపోతారు.
స్థౌలతిష్యుడు శ్రీముఖుడి చిన్న కుమారుడైన మంజుశ్రీ అపహరణకు పథకం వేసి తాను నిర్మించబోయే హిందూ సామ్రాజ్యానికి అతన్ని చక్రవర్తిని చేయాలని చూస్తాడు. చారుగుప్తుడు, చక్రవర్తి శ్రీముఖుడు పాటలీపుత్రం మీదకు దాడి వెడలడానికి కావలసిన సొమ్మంతా సమకూరుస్తాడు. స్థౌలతిష్య మహర్షి తనకున్న ప్రజ్ఞాపాటవాలన్నీ ఉపయోగించి శాతవాహన సామ్రాజ్యాన్ని కూలదోయాలని చూస్తుంటాడు. విధి వశాత్తూ వీరివురి ఆశలు అడియాసలవుతాయి. హిమబిందు శిల్పి ధర్మనంది కుమారుడైన సువర్ణశ్రీ ప్రేమలో పడుతుంది. అతన్ని పొందడానికి తన సమస్త సంపదలూ పోగొట్టుకోవడానికి కూడా వెనుకాడదు ఆమె.
***********************************************
సాహిత్యగుమ్మడి- 86--3/1/23
ఉ// (పంచపాది)
రాయల సీమనెంచి కడు రమ్యత జూపు ప్రలంభమిద్దియున్
చేయగ నెంచచేటు ఋతి చెర్వును గాయును గొల్లకాపరిన్
ఈయక లేకధీశ్వరుడునిల్లరి కూలును కోటవాకిళిల్
కోయగ బూనునంగముల కుర్వగ వానలు నంతమందునన్
నాయక, యిట్టిపోకడల నల్లిరి పొత్తము నెద్దియెవ్వరో?

సరైన జవాబులు
శప్తభూమి
బండి నారాయణస్వామి

శప్తభూమి 2017 లో ప్రచురితమైన తెలుగు చారిత్రిక నవల. 18 వ శతాబ్దపు రాయలసీమ చరిత్ర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ ఈ నవలను బండి నారాయణస్వామి రచించాడు. 2017 మే లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించిన తెలుగు నవలల పోటీలో ఇది, మరో రెండు నవలలతో సంయుక్తంగా మొదటి బహుమతిని పంచుకుంది. 2019 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

సంక్షిప్త కథ
1775 ప్రాంతాలలో అనంతపురం సంస్థానాన్ని హండేరాజు సిద్ధరామప్పనాయుడు పరిపాలిస్తుంటాడు. తన శత్రువులైన తాడిమర్రి సంస్థానం వారు బుక్కరాయసముద్రం చెరువుకు గండి పడేటట్లు చేసి అనంతపురాన్ని ముంచివేయాలనే కుట్ర పన్నుతారు. కానీ బిల్లే ఎల్లప్ప అనే గొర్రెల కాపరి సాహసంతో వారి కుట్రను భగ్నం చేస్తాడు. రాజు మెచ్చి అతడిని అమరనాయకుడిగా నియమిస్తాడు. అతడు ఎల్లప్పజెట్టీగా పిలువబడుతుంటాడు. తన రాజు బొక్కసం నింపడం కోసం తాడిమర్రి సంస్థానానికి చెందిన యెల్లుట్లను దోచుకుంటాడు.
సిద్ధరామప్పనాయుడు మైసూరు నవాబు టిప్పుసుల్తానుకు రెండు సంవత్సరాలు ఖండినీరూకలు బాకీ పడినాడు. దానిని వసూలు చేసుకోవడానికి మైసూరు నవాబు తరఫున గుత్తి సుబేదార్ అనంతపురం సంస్థానంపై దాడికి దిగుతాడు. అతడితో చెరువులోపల్లె పరగణా కుదువ పెట్టడానికి, ఇరవై ఐదు వేల రూకలు చెల్లించడానికి ఒప్పందం కుదురుతుంది. ఐతే పద్నాలుగు వేల రూకలు మాత్రమే సర్దుబాటు కావడంతో గుత్తి సుబేదార్ కోపంతో కోటవాకిళ్లు, దివాణం వాకిళ్లు పడగొట్టి పోతాడు. తమ దొరకు జరిగిన అవమానానికి ఎల్లప్పజెట్టీ కృంగిపోతాడు. వానల కోసం వీరమంటపం ఎక్కడానికి శ్రీశైలం మల్లికార్జునస్వామికి మొక్కుకుంటాడు ఎల్లప్పజెట్టీ. గండకత్తెరతో తన శరీరంలోని అంగాలను ఆన్నింటిని కత్తిరించి మల్లికార్జునికి అర్పించి దేహ త్యాగం చేయడంతో నవల సమాప్తమౌతుంది.
ఈ కథతో పాటు ఎల్లప్పజెట్టీని తిరస్కరించి వివాహ బంధం నుండి బయటపడిన ఇమ్మడమ్మ, నాయకరాజుల సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న రాచవేశ్య పద్మసాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆమె కుమారుడు మన్నారుదాసు, కండబలం వున్నా కులం బలం లేక అన్యాయాన్ని ఎదురించలేని కంబళి శరభుడు, తండ్రి మరణానికి కారకుడైన వాడిపై ప్రతీకారం తీర్చుకునే హరియక్క, మతం ముసుగుతో లైంగిక దోపిడీకి పాల్పడే నాగప్ప ప్రగడ, ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించే గురవడు, తన కూతురి దుర్గతికి కారణమైన స్త్రీలోలుడు సిద్ధప్పనాయుడి పతనానికి ఎత్తులు వేసిన బయ్యన్నగారి అనంతయ్య శ్రేష్టి మొదలైనవారి కథలు ఉన్నాయి.

----------------------------------------
సాహిత్యగుమ్మడి- 87--4/1/23
ఉ//(పంచపాది)
జాలరి యింటజేరి సుధ జన్నపు గొంగకు నాలినయ్యినన్
ఆలముఁ బల్కెనుత్తరుడు నాలికి తేకువఁ, బ్రాహ్మడన్ననున్!
గేలికొనంగ కూర్దనముఁ క్షేమటనయ్యెను తేటతెల్లమున్!
జ్వాలియుఁ నచ్చజెప్పునిరు జాయల నాపగ వాదులాటలన్
మేలిమినిట్టి పొత్తమును మేటిగ వ్రాసిరి యెవ్వరెద్దియో?

(సుధ=గంగ, జన్నపుగొంగ=శివుడు, ఆలము=అబద్దము, ఉత్తరుడు=శివుడు, తేకువ=భయము, బ్రాహ్మడు=నారదుడు, గేలికొను=పరిహసించు, కూర్దనము=ఆట, క్షేమ=పార్వతి, జ్వాలి=శివుడు, జాయ=భార్య, వాదులాట=కలహము,)

సరైన జవాబులు
కూచిమంచి తిమ్మకవి
శివలీలా విలాసము

శివలీలా విలాసము
మూడువందల యేబది ఎనిమిది పద్యములు రెండు ఆశ్వాసములలో కలిగిన శివలీలావిలాసము అనే పేరుగల ఈ కావ్యాన్ని కూచిమంచి తిమ్మకవి 31 రోజులలో రచించాడు. సుమారు సా.శ.1756 ప్రాంతాలలో రచింపబడ్డ ఈ చిన్నప్రబంధం 1921లో వావిళ్ల రామస్వామి శాస్త్రులు & సన్స్, మద్రాసు వారిచే ప్రచురింపబడింది. ఈ కావ్యంలో కూచిమంచి తిమ్మన శివుని లీలలను వర్ణింపక గంగాశివుల పరిణయగాథను మాత్రం తెలిపాడు.

కథాసంగ్రహము
సృష్ట్యాదిలో బ్రహ్మ మొదట ఉదకము సృజించి, అందు తన వీర్యమును విడువగా అది అండమై అందు సకల చరాచర జగత్తు ఉద్భవించెను. మూషికాసురుడనే సురద్వేషి ఆ అండమునకు రంధ్రము చేయగా దానినుండి జలము లోపలికి ప్రవేశించి జగములను ముంచివేయ నారంభించెను. దానితో శంకరుడు జగశ్శాంతికై గంగను జటాజూటమున ధరించెను. గంగ అక్కడ నిలువలేక ఉప్పొంగెను. శ్రీమహావిష్ణువు మూషికాసురుని వధించి, అండబిలమును తన పదాంగుష్ఠమున కప్పివేసెను. ఆ సందునుండి కొంచెము జలము ప్రవహించుచుండెను. అట్లు ప్రవహిస్తున్న గంగ తనను మించిన వారు లేరని గర్వించగా శివుడు కోపముతో భూలోకమున మత్స్యకన్యవై జన్మించమని గంగను శపించెను. హరుని వీడి జీవించలేనని, కరుణించమని గంగ ప్రార్థించగా ఆ శివుడు భూలోకమున జన్మించిన గంగను తాను పరిణయమాడుదునని చెప్పెను. గంగ దాసకన్యా రూపముతో భూలోకమునకు వచ్చి సాగరతీరమున తాపసవృత్తి నవలంబించెను. ఒకరోజు శంఖదేవుడు అనే జాలరి ఆమెను చూచి తపస్సుకు కారణము తెలుసుకోగోరెను. గంగ తన శాపవృత్తాంతమును తెలిపి, తనను కూతురిగా స్వీకరించమని శంఖదేవుని కోరెను. సంతానరహితుడైన ఆ జాలరి ఆనందముతో అంగీకరించి, గంగను వెంటతీసుకొనిపోయి, తన భార్య చక్రమదేవికి అప్పజెప్పెను. నారదునివలన గంగాదేవి వృత్తాంతము తెలుసుకున్న శివుడు జంగమవేషధారియై భూలోకములోని శంఖదేవుని నివాసమైన ఏలూరు పట్టణములోని ఉద్యానవనమున ప్రవేశించెను. అదే సమయములో గంగాదేవి చెలికత్తెలతో అక్కడికి వచ్చెను. జంగమవేషధారి తనను వివాహమాడవలసినదిగా ఆమెను కోరెను. శివుని గుర్తించలేని గంగాదేవి అతడిని పరసతీలోలుడని నిందించి ఉద్యానవనము నుండి నిష్క్రమించెను. కాని గంగయు ఆ జంగమయ్యను వలసి విరహార్తితో ఉండెను. చెలులు నిదురపోతున్న సమయంలో ఆమె జంగమదేవర కొరకు ఏకాంతముగా ఉద్యానవనమునకు వెడలెను. ఆమెకు అక్కడ జంగమదేవర కనిపించలేదు. అందుచేత ఆమె విరహవేదన పడుచుండగా మేలుకొన్న చెలులు గంగను వెదకుతూ ఆమెను ఇంటికి తీసుకుని పోయి శంఖదేవునికి గంగా జంగమయ్యల ఉదంతము వినిపించిరి. జంగమదేవరను వలచుట తగదని శంఖదేవుడు తనయకు నచ్చజెప్ప జూచెను. ఆమె తాను జాహ్నవీగంగనని, జంగమదేవుడు ఆదిదేవుడైన శివుడని జనకునికి తెలిపి తాను అతడినే పరిణయమాడుదునని పలికెను. శంఖదేవుడు మిక్కిలి ఆనందము కలవాడై, జంగమయ్య నిజరూపములో దేవతా సమేతుడై వచ్చినచో గంగనొసగి వివాహము చేయుదునని పలికెను. గంగ నిర్మలాంతఃకరణమున శివుని ప్రార్థింపగా, ఆ దేవదేవుడు బ్రహ్మ విష్ణు మహేంద్రులతో, సమస్త దేవతలతో శంఖదేవునికి సాక్షాత్కరించెను. అంతట శంఖదేవుడు పరవశమున మహేశుని స్తోత్రము చేసి, యథావిథిగా గంగాపరమేశులకు పెళ్ళి చేసెను. కొన్ని దినముల తరువాత హరుడు గంగాసమేతుడై కైలాసముకు వచ్చెను. ఆ సమయమున నారదుడు పార్వతికి ఈ పరిణయగాథను వివరించి ఉండెను. పార్వతికి ఈ వృత్తాంతము తెలిసెనని శివుడు భయపడుతూ గంగను జడలలో దాచి ఏమి ఎరుగని వానివలె అంతఃపురమును వెడలెను. గంగాపరిణయము గురించి శైలసుత శివుడిని ప్రశ్నించగా తనకు తెలియదని అతడు సమాధానము చెప్పెను. పార్వతి సమాధానపడి పూర్వము వలె పతిపట్ల అనురాగము చూపుచుండెను. శివుడు కూడా అట్లె మెసల సాగెను. ఒకరోజు శివపార్వతులు పాచికలాడుచుండగా శివునకు ఓటమి సంభవించెను. పతి ఓటమికి పార్వతి కిలకిల నవ్వగా సహింపలేని గంగ శివుని జటాజూటము నుండి తొంగి చూచెను. గంగను గాంచిన పార్వతి శివుని నిందించెను. గంగ శివుని శిరమునుండి క్రిందకు దూకెను. సపత్నులిరువురు కొంతసేపు కలహించుకున్న తరువాత శివుడు తనను క్షమింపుమని శైలసుతను వేడుకుని, గంగాపార్వతులను సఖ్యముగా ఉండమని కోరి గంగాదేవికి ఉత్తమాంగమునను, పార్వతీదేవికి అర్ధాంగమునను స్థానమిచ్చెను.
-----------------------------------------

సాహిత్యగుమ్మడి- 88--5/1/23
ఉ//(పంచపాది)
రోగము నంటుకొన్ననది రోగులపాలిటఁ గాదనర్ధమున్
సాగును గ్రామదేవతకు సామికి మధ్యన వ్యాధి గాథగన్
రోగము కన్నమిన్న గిలి రోతది వీడుటె యుక్తమంచు నా
రోగుల క్షేమమెంచియొక త్రోవను చూపుచుమానవాళికిన్
బాగుగ నొక్కపొత్తమది వ్రాసిరి గొప్పగ నెవ్వరెద్దియో
 
సరైన జవాబులు
సయ్యద్ సలీం
కాలుతున్న పూలతోట

కాలుతున్న పూలతోట 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. దీనిని సయ్యద్ సలీం రచించారు. "ఎయిడ్స్" ఇతివృత్తంతో తెలుగులోకి వచ్చిన తొలి నవల ఇది.
ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఈ వ్యాధి గురించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల జరిగిన, జరుగుతున్న అనర్ధాలెన్నో. హెచ్ ఐ వి ఉందని తెలీగానే అది మరణ కారణమనుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళూ, ఏ తప్పూ చేయకుండానే రక్త మార్పిడి సమయంలో హెచ్.ఐ.వి బారిన పడి నమాజ బహిష్కరణకు గురౌతున్న అభాగ్యులు, కూతురికి ఆ రాగం సోకిందని తెలికాక గర్భిణీ అన్న కనికరం కూడా లేకుండా వూరి బయట స్మకానంలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రులు, ఓ విద్యార్థికి హెచ్.ఐ.వి ఉందన్న కారణంతో అతన్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టేదాకా ఉద్యమించిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు వంటి అంశాలు ఆయనను ఈ కథాంశంతో నవల రాయడానికి ప్రేరేపించిన అంకాలు.

కథాంశం
ఒక ఊరిలో ఒక స్వామీజీ ఊరి పొలిమేరలో మసూచి అమ్మవారిని కలవడం, ఆమెను ఈ ఊరివారికి ఏమీ చేయవద్దని హెచ్చరించడం, ఆమె నలుగురిని మాత్రమే తీసుకొని పోతానని మాట యివ్వడం, స్వామీజీ దేశాటనకు పోయి తిరిగి వచ్చిన తరువాత ఆ ఊరిలో తొమ్మిది మంది మరణించడం, అమ్మవారిని కలసి ఎందుకిలా జరిగింది అని నిలదీయడం, ఆమె వ్యాధి కంటే భయం వల్ల మిగిలినవారు చనిపోయారని చెప్పడాన్ని ఒక కథలో తెలియజేసారు. ఈ నవలలో వ్యాధి సోకి మరణించేవారి కన్నా భయం వల్ల మరణించేవారే హెచ్చు అని తెలియజేసారు. భయం అనేది ఎన్ని రకాలుగా మనిషిని పీడిస్తుందో ఈ నవలలో చెప్పడానికి ప్రయత్నించారు.

ఈ నవల మొదట "నవ్య" వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి 2006లో పుస్తక రూపంలో వెలువడింది. శ్రీమతి శాంతకుమారి గారు ఈ నవలను "నయీ ఇమారత్ కె ఖండహర్"గా హిందీలో అనువదించారు. ఈ నవలో హెచ్. ఐ. వి/ఎయిడ్స్ రోగుల గౌరవప్రదంగా జీవించే హక్కు గురించి, వాళ్ళ విషయంలో సమాజం యొక్క నైతిక బాధ్యత గురించి, హెచ్ ఐ వి సోకిన పిల్ల ల చదువుకునే హక్కు గురించి చర్చించటం వల్ల ఈ అనువాదానికి 2009 వ సంవత్సరానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, న్యూఢిల్లీ వారి అవార్డు దక్కింది.ఈ నవలకు 2010 నంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
దీన్ని కన్నడ భాషలోకి జి. వీరభద్ర గౌడ గారు, మలయాళంలోకి శ్రీ ఎల్ ఆర్. స్వామి గారు, ఇంగ్లీష్ లోకి డా. జయలక్ష్మి గారు అనువదించారు.

----------------------------------------
సాహిత్యగుమ్మడి- 89--6/1/23.
మ.వి
కవులే లేరుగ నొక్కరన్నను తెలంగాణంబునందేయనన్
అవునా జూడని జూపెగా త్రిశతపంక్తైదుల్గవీశ్వర్లనున్
కవిగా హైందవ ధర్మ పర్వణిల నుక్కండుల్గొనత్యద్భుతన్
కవియై సాహితి లోకమందొక మయూఖంబే కనంగెవ్వరో?

సరైన జవాబు
1) సురవరం ప్రతాపరెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. చదివాడు. 1916లో మరదలు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం పదిమందికాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్‌ కొత్వాల్‌గా వున్న రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు అతను కోరికపై వచ్చాడు. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 350 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 కవుల వివరాలున్నాయి. ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. అతను రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు. ఇతను రాసిన కథలు మొగలాయీ కథలు పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. వీటిని అణా గ్రంథమాల 1940లో అచ్చువేసింది. రాజకీయ సాంఘిక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.

1926లో అతను నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అతనే అధ్యక్షుడు.

1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా అతను జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 1953 ఆగష్టు 25న అతను దివంగతుడైనాడు.
----------------------------------------
సాహిత్యగుమ్మడి- 90--7/1/23.
ఉ//-
మ్రొక్కిన గాననొల్లనొక ముంజికుఁ గాంచియు మార్గమధ్యమున్
అక్కయు చెల్లి మధ్యనొక యాడిక నేర్పడ వింతగొల్పుచున్
అక్కను గెల్చనంతరజ యాతని చేగొని యంపచూడగన్
చిక్కులు నేర్పడాతనికి శ్రీపతి గాయును కష్టకాలమున్
మక్కువ నిట్టిపొత్తమును మంచిగ వ్రాసిరి యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
వైజయంతీ విలాసము
సారంగు తమయ్య

భూమిక
ఈవై జయంతీవిలాసమునకు విప్రనారాయణ చరిత్ర మనియుఁ బేరుగలేదు. ఇందలి కథానాయకుఁడు వైష్ణవబ్రహ్మ చారి. ఈతఁడు కావేరియొడ్డున నుండెడి శ్రీ రంగములో నుండువాఁడు, తనతోటలోని తులసిని పూలను మాలలుగా ఁ గూర్చి స్వామికి సమర్పించుచుండుటయు నందు మాధుకరము చేసి జీవించుచుండుటయు నీతనివృత్తి. మధురవాణి, దేవీ దేవి యను నిద్దఱు వేళ్య లోకనాఁ డాతోట దరినుండిపోవుచు నిష్టాగరిష్టుండైన మనకథానాయకునింజూచి భ క్తితో మ్రొక్కుటయు నాతఁడేమియు ననక యూరకుం డుటయు నందుకై దేవదేవి “మన మ్రొక్కు నందుకొని దీవింపక మోము పంచుకొనిపోవుచున్నాఁడే వీని కేల మ్రొక్కితిమి" అని విసువుటయు అక్కయగు మధురవాణి యాతని వైరాగ్యము స్వామిభక్తి మొదలగువానిని గొంత కొనియాడుటయు దేవదేవి వీనిని విటశిఖామణినిఁ గాఁ జేయవచ్చుననియు మధుర వాణి చేయుటకు సాధ్యపడఁడనియు నట్లు చేయ లేనిచో 'నేను ”వేశ్యావృత్తి వదలుకొని నీకు దాసినగుదునని దేవదేవియు, నట్లు చేయఁ గలిగితివేని నీకు శిష్యురాలు నగుదు నని మధురవాణియుఁ బ్రతిజ్ఞులు పట్టుటయు దేవదేవి వేశ్యా వేషము వదలి భక్తురాలివేషము ధరించి యాతనియొద్దకుఁ బోయివిర క్తినొందినదానివలె నటించి తనవృత్తిని నిందించుచు నావటుని సేవించి సేవించి తుదకాతనిచిత్తమును స్వాయత్తము చేసికొని మెల్లమెల్లఁగాఁ దనయింటికిఁ దెచ్చి విటులకు జరుగు మర్యాద లన్నియుఁ జేయించి తనప్రతినను నెరవేర్చుకొని చల్లచల్లఁగాఁ తన తల్లిచే నిల్లు వెళ్ళఁ గొట్టించుటయు నాతఁడు ధీనమానసుఁ డై దుఃఖించుచుండ, స్వామి శిష్య వేషమున బంగరు గిన్నె దెచ్చి యిచ్చిన మరల నాతని రప్పించుటయు నింతట రాజభటులు పట్టుకొనుటయు పట్టిన విటుని శిక్షింపఁ బోఁగా భగవంతుఁడు ప్రత్యక్షమై తప్పించి యచ్చట వైష్ణవులచే బ్రహ్మరథంబు పట్టించుటయు మొదలు గాఁగలకథ మనోహరముగా నాలు గాశ్వాసములలో వర్ణింపఁ బడినది.

ఇట్టి మృదుమధుర ప్రబంధమును వ్రాసినకవి సారంగు తమయ్య.ఈతఁడు భారద్వాజసగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు, నియోగి బ్రాహ్మణుఁడు. ఇంటిపేరు సారంగు వారు. ఈతనితాత తాత నారంగధరుఁడు. వాని భార్య గంగమ్మ. తాతతండ్రి గిరి మంత్రి. వాని భార్య చంద్రమ్మ. తాత తమ్మన్న వాని భార్య తిమ్మాయమ్మ. తండ్రి నరసయ్య. పెదతండ్రి గిరిమంత్రి. తల్లి అక్కమ. అనంతన్న, వెంకటాద్రి సహోదరులు. ఈతని గురువు కందాళ అప్పలాచార్యులు. ఇక్కవి మహమ్మదుశాహి గోలకొండ నేలు కాలములో గొప్ప నైశ్వర్యము ననుభవించుచు గోలకొండలోనే కరణీకము చేయుచున్నట్లు పీఠికవలనఁ దెలి యుచున్నది. ఈ గ్రంథమును శ్రీ రామున కంకితము చేసెను. ఈగ్రంథము చదువు వారి కేమి వినువారి కేమి యింకను జదువ వలయుననియు విన వలయుననియు నుండక మానదు.
--------------------------------------

వేడుక గొప్పగా జరుపు విధ్వును జిమ్ముచు  కాలకమ్మునన్!

సాహిత్యగుమ్మడి- 91--8/1/23.
ఉ//
వీడియు రాణిఁ రాజ్యమును విట్పతి రంజిలి బ్రేయసింటనే
పోడిమిఁ వ్రాసెనాతడొక పొత్తముఁ నచ్చట నింపుగూర్చుచున్!
కూలగ రాజ్యపాలనముఁ గోరగ రాణియు సాయమించుకన్
కూలును వాణినంతమున కూర్పరులెవ్వరు? పుస్తిలెవ్వియో?

వాణిని=ఆటగత్తె (నర్తకి)
సరైన జవాబు
1)  Dr. నటరాజ రామకృష్ణ,1) డా; సి నారాయణ రెడ్డి
2) రుద్ర గణిక 2) కర్పూర వసంతరాయలు,

సా.శ 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ప్రభువు కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతమే ఈ కావ్యం.

కుమారగిరి రెడ్డి ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. అందుకే అతనిని కర్పూర వసంతరాయలుగా పిలిచేవారు. కుమారగిరి రెడ్డి స్వయంగా పండితుడు, కవి. ఇతడు 'వసంతరాజీయ్యము' అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని వ్రాశాడు.

రాజ్య భారాన్ని తన మంత్రి, బావ అయిన కాటయ వేమారెడ్డి పై మోపి, సంగీత, నాట్య, వినోదాలతో కాలాన్ని కర్పూరం వలె వెలిగించాడు. కుమారగిరి, లకుమ నాట్యానికి, ఆమె లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. సినారె గారు అద్భుతమైన పదజాలముతో శృంగార వీర రసమాధుర్యముతో  ప్రేయసీ ప్రేమికుల హృదయాంతరంగములను, ప్రభువుకు ప్రజలకు నడుమ ఉండే సంబంధములు, మున్నగు అనేక అంశములను స్పృజిస్తూ మాత్రాగణ ఛందస్సు లో వ్రాసిన గేయకావ్యమిది. రెడ్డి రాజుల చరిత్రకు ప్రాణం పోసిన మల్లంపల్లి సోమశేఖరశర్మకు అంకితమిచ్చాడు నారాయణ రెడ్డి. ఈ కావ్యాన్ని నారాయణరెడ్డి స్వయంగా ఆలపించారు కూడా.

----------------------------------------------------------
సాహిత్యగుమ్మడి- 92--9/1/23.
ఉ//(షట్పది)
చక్కగ జాలకైతలది సంచయనంబిది జిన్నికైతలే
బెక్కుగ మానవున్సహజ వేదనఁ నంతముఁ జావులేదనిన్
అక్కర కొచ్చుపాటయట యాదినపూర్ణ  పిపాస బువ్వులున్
జక్కిలిగింతలేనడుమ శ్రావణ లక్ష్మియు సోదిసానియున్
మక్కువఁ బ్రేమ మృత్యువును మల్లెల నూక్తము నంతమందునన్
ఉక్కిరి బిక్కిరేచదువ నుత్తమమియ్యది నెవ్వరెద్దియో

సరైన జవాబులు
ఆలూరు బైరాగి
ఆగమ గీతి

బైరాగి వ్రాసిన "ఆగమ గీతి" కి కేంద్రసాహిత్య అకాడమి పురస్కారము లభించినది. ఇది 99 వారి సొంత కవితలు మరియు, 32 వివిద భారతీయ భాషలనుండి ఇతరదేశ భాషలనుండి అనువదించబడిన కవితలతో కూర్పు చేయబడినది, వారి 99 సొంత కవితలలో చివరికవిత 'నాకు చావులేదు.' (2పా జావు లేదనిన్) మొదటి కవిత 'ఆగమ గీతి' (మూడవపాదములో 'ఒచ్చుపాట')అపూర్ణ, , పువ్వులు, శ్రావణ లక్ష్మి, ప్రేమ మృత్యువు, మల్లెపూలు, వారికవితలలోవి. పిపాస, సోదిసాని అనువాద కవితలలోవి.

బైరాగి చౌదరి , తెనాలి తాలూకాలోని ఐతానగరంలో 1925, నవంబర్ 5వ తేదీన ఆలూరి వెంకట్రాయుడు,సరస్వతి దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి వరకే తెలుగులో చదువుకున్నాడు. ఆయన తండ్రి దేశ భక్తుడు. తండ్రి హిందీ చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో యలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనో ఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే పలాయన్ అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు.

బైరాగి తండ్రి అడుగు జాడలలో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోన్నారు. ఆ తరువాత ఎం.ఎన్.రాయ్ నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. స్వతహాగా ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు.

బైరాగి బహుభాషా కోవిదుడు. వీరికి తెలుగు,హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు బెంగాలి, ఉర్డు భాషలలో కూడా ప్రవేశం ఉంది. బైరాగి పినతండ్రి, చందమామ వ్యవస్థాపకులలో ఒకరైన చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు) హిందీ చందమామకు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. హిందీ చందమామ లో పిల్లల కొరకు చిట్టి పొట్టి కవితలు, కధలు రాసారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి చందమామలో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు.

తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం చీకటి నీడలు ప్రచురించారు. నూతిలో గొంతుకలు, దివ్యభవనం కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలో కెల్లా నూతిలో గొంతుకలు ఆయన ఉత్కృష్ట రచన.

బైరాగి స్వతంత్ర భావాలుగల వ్యక్తి. ఆయన తన పంథా మార్చుకోవాలని ఎవరైనా సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకొనేవారే తప్ప తన భావాలను మార్చుకునేవారు కాదు. చాలా నిరాడంబరంగా జీవించారు.
---------------------------------------------------------
సాహిత్య గుమ్మడి..93--10/1/23.
ఉ//
ఆద్యముఁ విశ్వమేర్పడుట నందున మేలగు దేశదేశముల్
సద్యముఁ నెప్పుడైననట సాగెడి యాంత్రిక జీవనంబులన్
తధ్యము హీనకార్యములు, దాగిన మానవ దాష్టికంబులన్
బాధ్యత నెంచుమంచికని వ్రాసిరి గొప్పగ నెవ్వరెద్దియో?

సరైన జవాలు
1) శ్రీ గరికపాటి నరసింహా రావు
2) సాగర ఘోష

(మొదటిపాదము వివరణ:-సూర్య చంద్రులతోపాటుగా సాగరము, భూమిని చూపుచూ భూమిపైన మానవ వికాసము భారతీయ నాగరికత, ఐరోపాలో మార్పులు,(పేజి-170)వలసదేశాల వేట,,(పేజి-164)అమెరికా స్వాతంత్ర్య సమరం,,(పేజి-207) ఫ్రెంచ్ విప్లవం,,(పేజి-180)రష్యా విప్లవం,,(పేజి-214)చైనా విప్లవం,,(పేజి-216) నెల్సన్ మండేలా,,(పేజి-261) గల్ఫ్ యుద్ధం , ,(పేజి-248) కమ్యునిజం పతనము,,(పేజి-252)మొదలైనవి స్పృజించి వివిధ దేశములను కూడా చూపారు కవి.

రెండవ పాదము వివరణ:- వ్యవసాయము-పరిశ్రమలు,,(పేజి-268), చిన్నదేశాలు-పెద్ద అభివృద్ధి,,(పేజి-287) శాస్త్రీయ విజ్ఞానము,(పేజి-289)వైజ్ఞానికావిష్కరణలు,,(పేజి-292) మున్నగు వాటిద్వారా మనిషి యంత్రములతో మమేకమైన విధము చూపారు.

మూడవ పాదము వివరణ:- సముద్ర కాలుష్యము,,(పేజి-350) మంటలలో మహీతలము,(పేజి-358) మందుపాతరలు,,(పేజి-362) నదులు కాలుష్యము,,(పేజి-378) వ్యవసాయం కాలుష్యము,,(పేజి-390) పరిశ్రమలు కాలుష్యము,,(పేజి-395)పట్టణాలు కాలుష్యము, (పేజి-405) మున్నగు వాటిద్వారా మానవుని దుష్టతను, స్వార్దపూరిత జీవనాన్ని ఎత్తిచూపారు కవి

నాలుగవ పాదము వివరణ:- పరిష్కారము,,(పేజి-413) పరోపకారము,,(పేజి-422) ఫ్లోరెన్స్ నైటింగేల్,,(పేజి-424) మదర్ థెరిస్సా,,(పేజి-425) బాబా ఆమ్టే,(పేజి-428) వసుదైక కుటుంబం,(పేజి-440) మొదలైన వాటిద్వారా మంచిని యెంచవలసిన ఆవశ్యకతను చూపారు కవి.  వారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహా రావు గారు. పొత్తము 'సాగర ఘోష'

"సాగర ఘోష"
ఈ గ్రంథాన్ని కవి, పది ప్రధానమైన అధ్యాయాలుగా విభజించాడు. అధ్యాయానికి "అంతరంగం" అని పేరు పెట్టాడు. తరంగం అంతరంగమే ఈ కావ్యం అని భావస్ఫోరకంగా ఉంది. ఆ అధ్యాయాల పేర్లు ప్రథమాంతరంగం, ద్వితీయాంతరంగం, తృతీయాంతరంగం,.. ఇలా నవమాంతరంగం వరకు ఉంటాయి. పదో అంతరంగాన్ని చివరి అంతరంగంగా సూచిస్తూ పరమాంతరంగం అని పేరు పెట్టాడు. ఒక్కో అంతరంగం లోనూ 108 పద్యాలుంటాయి. మొత్తం 1080 పద్యాలు. వీటన్నిటికీ ముందు కవి స్వీయాంతరంగం వస్తుంది. ఈ కావ్యాన్ని ఎలా రాసాడు, తన అనుభవాలేంటి అనేది వివరిస్తుంది అది. దానికి "ఆవిష్కరణ" అనే పేరు పెట్టాడు. ఈ ఆవిష్కరణలో ఉన్న 36 పద్యాలను కలిపితే కావ్యం లోని మొత్తం పద్యాలు వెయ్యి నూటపదహారు (1116). ఈ కావ్యాన్ని రాసిన అనుభవాన్ని వివరిస్తూ ఒక పద్యంలో కవి, "వేయి పద్యములల్లిన విసుగు రాదు" అంటాడు.

"ప్రధానంగా ఇది పర్యావరణ పద్యకావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందదాయకంగానూ తీర్చిదిద్దుకోవాలని, మనసులో స్వార్థాన్ని తగ్గించుకొని, పరమార్థం గురించి ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రను పరిశీలించి, విశ్లేషించిన కావ్యం." హైదరాబాదు లోని త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో గరికిపాటి నరసింహారావు ఈ పద్యగానం చేసాడు. దీన్ని ప్రవచనం.కామ్‌లో వినవచ్చు.

ప్రపంచ చరిత్రలోని పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలను భారతీయ తాత్విక చింతనా నేపథ్యంలో వర్ణించే పుస్తకం ‘సాగరఘోష’. ‘సాగరఘోష’ గురించి కవి - అంతరంగం సంక్షిప్తంగా ఇది. ‘ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీనిలో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్ల నాటి భూమి పుట్టుక నుంచి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి.  వృత్తాలు పాతవే అయినా, ఇతివృత్తాలు కొత్తవి. ఒకానొక ఫ్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ తన్మయస్థితిలో ఉంటాడు. కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష. ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రను భారతీయ తాత్తివ్వక చింతనా నేపథ్యంలో వర్ణించే ఈ కావ్యరచన మంచి కోసం, మార్పుకోసం...మనిషికోసం..’ అంటారు కవివర్యులు
-----------------------------------------------------------
ఆడది కాపుగాయుతన యాత్మను వీడియు నర్ధరాత్రమున్

సాహిత్యగుమ్మడి- 94--11/1/23.
ఉ//
వీడక నీమమెప్పుడును పేరుకు జూచును నాయకుండునున్
వాడిరి బెక్కుగా గొనియు వర్ణన లిందున పైనమందునన్
వీడగ ప్రాణమొక్కరట పీధము నిచ్చియు నర్ధరాత్రమున్
ఆడగ నొక్కరేబ్రకృతి యాటకు వేదన చెందునాతడున్
పోడిమిఁ దెల్పరే బుధులు పొత్తముఁ, ముఖ్యునిఁ, వ్రాసినాతనిన్

సరైన జవాబులు
1) గాలివాన
2) రావుగారు
3) పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన 'గాలివాన' కథా రచయిత. హేతువాది.
పాలగుమ్మి పద్మరాజు జూన్ 24, 1915 న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడ లోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశాడు. ఫిబ్రవరి 17, 1983 తేదీన స్వర్గస్తులైనారు. తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు, నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.  ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది. గాలివాన కథ  న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పురస్కారం పొందినాక ప్రపంచంలోని పలు భాషల్లోకి కథ అనువాదమైంది.
1949లో పద్మరాజు భీమవరంలో ఉండగా విపరీతమైన గాలివాన వచ్చి ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉందామా, బయటకు పారిపోదామా అని ఊగిసలాడుతూన్న సమయంలో పద్మరాజు బయటకి రావడం, భార్య ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు ఆమెపై కూలిపోయింది. కాపాడేందుకు వచ్చిన ఆయన విద్యార్థుల సహాయంతో ఆమెను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఆమె బతికిందో లేదో, బ్రతికేవుంటే బతుకుతుందో బతకదో కూడా తెల్లారేవరకూ తెలియని దుస్థితిలో ఆ రాత్రి గడపాల్సివచ్చింది. ఆమె శరీరమంతా గాయాలతో చాన్నాళ్ళు కోలుకోలేని స్థితిలోకి వెళ్లారు. ఈ దుర్భరమైన అనుభవం నుంచే కథలోని గాలివాన చిత్రణ, గాలివాన రాత్రి ప్రధాన పాత్ర పొందిన వేదన, భయం వంటివాటి చిత్రణను స్వయంగా తన జీవితం నుంచే స్వీకరించివుండొచ్చని సాహిత్యకారుడు, పాత్రికేయుడు నరిశెట్టి ఇన్నయ్య పేర్కొన్నారు.
ఇతివృత్తం
కథలోని ప్రధాన పాత్రల్లో ఒకటి రావుగారి పాత్ర. ఆయన సంఘంలో గౌరవమర్యాదలు, పేరుప్రతిష్టలు కలిగినవారు. వకీలుగా పనిచేసి కొడుకు వకీలు పరీక్షలు నెగ్గాకా తన ప్రాక్టీసును అతనికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నవారు ఆయన. ఆయన జీవితంలో ప్రతీ విషయంపైనా ఒక నియమాన్ని ఏర్పరుచుకుని అందుకు అనుగుణంగా జీవిస్తూంటారు. కుటుంబంలోని ప్రతివారినీ తన క్రమశిక్షణకు అనుగుణంగా నడుపుతూంటారు, చివరకు కూతుళ్ళ తలకట్టు ఎలావుండాలో కూడా రావుగారే నిర్ణయించేది. తత్త్వవేత్తగా తనను తాను భావించుకునే రావుగారికి ఉపన్యాసాలపై ఆసక్తి ఎక్కువ. దానితో వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు "సత్వము-తత్త్వము", "ప్రకృతి-పరిష్కృతి" లాంటి పేర్లతో ఉపన్యాసాలు ఇస్తూంటారు.(అయితే శీర్షికలను విషయాన్ని బట్టి కాకుండా శబ్దాలంకారాలపై మోజుతో నిర్ణయించుకుంటూంటారని వారి స్నేహితుల వేళాకోళం) కథ ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఆస్తిక సమాజం వారి ఆహ్వానం మేరకు "సామ్యవాదము-రమ్య రసామోదము" అన్న అంశంపై ప్రసంగించేందుకు రైలు ప్రయాణంలో ఉంటారు. వారున్న బెర్తుల వద్దకు అడుక్కునేందుకు వచ్చిన బిచ్చగత్తెను అసహ్యించుంటారు. అయితే ఆ రాత్రి మెల్లగా ప్రారంభమైన వాన అత్యంత తీవ్రమైపోతుంది. తాను దిగాల్సిన స్టేషన్లో బెడ్డింగు, సామాన్లతో సహా రావుగారు దిగుతారు. అయితే ఆ తీవ్రమైన గాలివానలో, రైల్వేస్టేషన్లో తాను అసహ్యించుకున్న బిచ్చగత్తెతో పాటుగా చిక్కుకుంటారు. అంతటి వేదాంతి అయిన రావుగారు ఆ స్టేషన్లో గాలివాన బీభత్సానికి భయపడిపోతారు. అయితే జరుగుతున్న క్షణంతోనే తప్ప గడిచిన గతంతోగాని రానున్న భవిష్యత్తులతోగాని ఏ సంబంధం పెట్టుకోని 30ఏళ్ళ బిచ్చగత్తె మాత్రం ధైర్యంగా ఉంటుంది. అతనికి చలివేస్తుంటే తన చుట్టూ చేతులు వేసుకొమ్మంటుంది, ధైర్యం చెప్తుంది. ఆ రాత్రి ప్రాణాలు కాపాడుతుంది. అయితే తెల్లవారేసరికి ఆమెకి ఏమైంది, తద్వారా తన జీవితంలో ఇన్నాళ్ళూ కాపాడుకుంటూ వచ్చిన విలువలు, నమ్మకాలు, తాత్త్వికత, ధర్మం వంటివన్నిటినీ రావుగారు ఎలా పునర్నిర్వచించుకున్నారు అన్నది కథాంతాన్ని బట్టి తెలుస్తుంది.
వర్ణనలు విస్తారంగా ఉండే ఈ కథలో అవన్నిటినీ కథాగమనానికి, పాత్రచిత్రణకు వినియోగించుకున్నారు. రైల్లో ప్రయాణికుల వివరాలు, వర్ణనలను ప్రధానపాత్ర అయిన రావుగారి మనస్తత్వ చిత్రీకరణ కోసం వినియోగించుకున్నారు. ఆయన దృక్పథాన్ని, దృక్కోణాన్ని వివరించేందుకు ఆ వర్ణనలన్నీ పనికివచ్చాయి. బిచ్చగత్తె మరణించినప్పుడు 'తుఫానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది.' వంటి వాక్యాలతో వర్ణించారు. ఇక గాలివాన బీభత్సాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
---------------------------------------------------------

మేతకు బోవుదారులకు మేలగు నామముఁ బెట్టిగొప్పగా
సాహిత్యగుమ్మడి -95--12/1/23.
ఉ//
రైతుసమాంతరంబుగ విరాజిలు వారల నెంచిజూపుచున్
రాతిరి భానువంతటయు రట్టడి నెంచియు నేకచిత్తమున్
కూతలు, కుంటలెక్కడనిఁ, గూటికి తిప్పలు కూడియుండుటన్
పోతను బోసినట్టులుగ ముద్దుగ వ్రాసిరి యెద్దియెవ్వరో?

సరైన జవాబులు
కొండపొలం
సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి

సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి 1963, ఫిబ్రవరి 16వ తేదీన సన్నపురెడ్డి చెన్నమ్మ, లక్ష్మిరెడ్డి దంపతులకు కడప జిల్లా, కాశినాయన మండలం బాలరాజుపల్లె గ్రామములో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతడు బి.ఎస్సీ, బి.ఈడీ. చదివాడు. 1989నుండి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 1987 నుండి కథలు, నవలలు, కవితలు వ్రాస్తున్నాడు. ఇతడి నవల "చినుకుల సవ్వడి" ఇంగ్లీషు భాషలోనికి అనువదించబడింది. కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతని రచనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి.స్థాయిలో మూడు పరిశోధనలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్. స్థాయిలో రెండు పరిశోధనలు జరిగాయి.

పల్లె పరిసరాలలో బతుకు వనరులు లభ్యం కానప్పుడు దగ్గరలోని కొండల మీద ఆధారపడటం సహజం. ఉదయం వెళ్లి సాయంత్రం లోపల అటవీ ఉత్పత్తులను సేకరించుకొని వచ్చేవాళ్ళు కొందరైతే, వారం పది రోజుల పాటు అక్కడే కొండపొలం చేసి బతుకు తెరువు సాధించుకునేవాళ్ళు మరి కొందరు. కరువు తాండవిస్తున్నప్పుడు గొర్రెలకు నీళ్ళు మేపు వెతుక్కొంటూ ఎక్కడో కొండల్లో నాలుగు చినులుకు రాలి గడ్డి పచ్చబడిన తావులు చేరుకొని కౄర మృగాల దాడులు తప్పించుకుంటూ ఏడెనిమిది బత్తేల  కాలం జీవించిన దుర్భరమైన జీవితం ఈ కొండపొలం నవల.

పాలము దున్ని, విత్తనాలు విత్తి కరువు కాలానికి చింతపడుతూ, మంచి కాలానికి వంత పాడుతూ పంటను ఇంటికి చేర్చుకొనే వ్యవసాయం వేరు. తానే విత్తనమయి మట్టి పాత్తిళ్ల లోంచి మొలకెత్తి, ఆశగా ఆకసానికి చూసే రైతుదనం వేరు. పెద్దంబలి పొద్దున దొడ్ల తడికలు తీసి గొర్లను బైటకు తోలి ఎండల్లో వానల్లో వాటి వెనక కాపలాకర్రలా తిరుగుతూ పాద్దుగుంకే సమయాన తిరిగి గొర్లను దొడ్లల్లోకి చేర్చే గొర్ల కాపరితనం వేరు. తానే ఆకలికి మరో రూపమైన గొర్రెగా మారి బతుకంతా మేతకోసం వెంపర్లాడే గొల్లదనం వేరు. రైతుదనం, గొల్లదనం రెండూ కలగలిసిన జీవితం
సగం శరీరం కంకులుగా పండి గింజలు రాలిస్తే, మరో సగం శరీరం పాదుగుగా మారి పాలిచ్చే పల్లెజీవితం.

కొన్ని మొక్కల్ని భూమిలో నాటి వాటిని కాపాడుకొనే స్థిరమైన జీవితం రైతుది. కొన్ని ప్రాణాల్నివెంటేసుకొని వాటిని బతికించుకొనేందుకు బీడునేలలూ కొండకోనలూ తిరిగే సంచార జీవనం గొల్లలది. కరువులొస్తే పైరు ఎండిపోయి రైతు దుఃఖం కనిపిస్తుంది. మేతను వెతుక్కొంటూ కానని నేలలకు వెళ్లిపోయే గొర్లకాపర్ల దుఃఖం లోకానికి కనిపించదు. గొల్ల మందతో అడవికిపోయినవారి కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపారీ పొత్తములో రచయిత.

-----------------------------------------------------------
సాహిత్యగుమ్మడి -96--15/1/23.
ఉ//
మువ్వను సాహితందునిడి భూరిగ జెప్పిరి జిన్నిసంగతుల్
సవ్వడి జేసెనిర్భయముఁ జక్కని ప్రాసల శోభగూర్చున్
రివ్వున నెక్కుబెట్టెదగు రీతిగ చెండుచుఁ గ్రొత్త వొయ్యిలన్!
పువ్వుల తీరుగానవియె పొత్తముఁ వ్రాసిరి యెవ్వరెద్దియో?

సాహిత్యగుమ్మడి -96--16/1/23.
ఉ//
చంగుడు నాతనెంచియును సవ్వడి జూపెను జిన్నిసంగతుల్
పొంగుల తీరునిర్భయముఁ భూరిగ ఛందము శోభగూర్చుచున్
సంగతిఁ జెప్పెనొక్కవిధిఁ సాహసి దుష్టుల గ్రొత్త రూపుఁ, పా
రంగతులెంచిచూడగను, వ్రాసిరి పొత్తము నెవ్వరెద్దియో?

సరైన జవాబులు
శ్రీ శ్రీ
సి ప్రా లి

(నా పద్యం మొదటి పాదములోని 'చంగుడు నాతనెంచి' (చంగుడు- నేర్పరి)(ఆతనెంచి- అతనినిఅతనేనెంచుకొని, శ్రీ శ్రీ-సిరి సిరి)సిరిసిరిమువ్వకు, రెండవపాదములోని 'ఛందము శోభ' ప్రాస అందము(ప్రాస లలోని అనుప్రాస,అంత్య ప్రాసలు పద్యానికైనా, వచనమునకైన శోభకూర్చుతాయి) మూడవపాదము 'క్రొత్తరూపు'(లిమబుక్కులు అనేది శ్రీ శ్రీ గారు వాడిన క్రొత్తపదము) లిమబుక్కులకు ప్రతిగా చూపనైనది గమనించగలరు.)

సి ప్రా లి ఒక వ్యంగ్య రచనా సంపుటి మూల రచన శ్రీశ్రీ.
శ్రీ శ్రీ అంటే ఎవరు అని ఎవ్వరూ అడగరు. కాని సిప్రాలి అంటే ఏమిటని అందరూ అడుగుతారు. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ అయినట్టే సిరిసిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమబుక్కులు కలిపి 'సి ప్రా లి' అయింది.

తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ వ్రాయని సాహితీ ప్రక్రియ లేదు. ఐతే చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏమిటంటే, శ్రీశ్రీ వ్యంగ్య సాహిత్యంతో అంటే పేరడీ సాహిత్యంతో కూడా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహితీ ప్రియులను ఆనందింప చేశాడు. శ్రీశ్రీ పేరడీ రచనలలో భాగంగానే ‘సిప్రాలి’ అనే శీర్షిక క్రింద ఒక గ్రంధం ప్రచురణ జరిగింది. అది బహుళ ప్రాచుర్యం కూడా పొందింది. ‘సిప్రాలి’లో రమారమి కొన్ని పద్యాలకు “సిరిసిరి” అనే మకుటం వొచ్చేటట్టు రచన చేసాడు. శ్రీ అనే పదం తెలుగులో ప్రకృతి ఐతే సిరి అనే పదం వికృతి కాబట్టి దీనికి మకుటం శ్రీశ్రీకి బదులు సిరిసిరి అని పెట్టి ఉంటాడు. అంటే తన గ్రంధం యొక్క పేరు పెట్టటంలో కూడా కవి పేరడీ చేశాడు అన్నమాట.

సిరిసిరిమువ్వ,  నిజమైన హాస్యం నుంచి జాలి, కరుణ పుట్టాలంటారు కొందరు. కాని వేరే రకం హాస్యం ఉంది. ఇందులో వ్యంగ్యం, నీతి, ఉపదేశం ఉంటాయి. మొదటి తరహా హాస్యం లక్ష్యాలు ఆనందం, ఆమోదం అయితే, రెండో తరహా హాస్యం లక్ష్యాలు చైతన్యం, విమర్శ. మొదటి దాని పరమావధి కేవలం నవ్వు పుట్టించడం, రెండోదాని పరమావధి ప్రయోజనం సాధించడం. ఈ రెండో తరహా హాస్యమే శ్రీశ్రీ ప్రాసక్రీడల్లోనూ, లిమబుక్కుల్లోనూ తొణికిసలాడుతుంది. ప్రాసక్రీడలు కవితా బాణాలయితే లిమబుక్కులు కవితా బాంబులు అంటున్నారు 'సిప్రాలి'ని కూర్చిన శ్రీ చలసాని ప్రసాద్‌గారు.

“ఒక మూల రచనకు అధిక్షేపాణాత్మకమైన, హేళనాత్మకమైన, హాస్యాత్మకమైన రచనతో కూడిన అనుకరణను మాత్రమే పేరడీ అని అంటారు”. పూర్వము వికటకవిగా పేరు పొందిన తెనాలి రామకృష్ణ కవి పేరడీకి ఆద్యుడని భావన చేయవచ్చు. ఆధునిక యగంలో అనేకమంది కవులు పేరడీకి వన్నె తెచ్చారు. ప్రాచీన కవుల నుంచి ఆధునిక కవుల వరకు అన్ని రచనలకు పేరడీలు కట్టారు. ఆధునిక కవులలో జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి (జరుక్ శాస్త్రి) గారు పేరడీకి కొత్త ఒరవడిని, పోకడలను, ప్రజాదరణ తీసుకొచ్చాడు. బమ్మెర పోతన, తిక్కన, ఎర్రన్న, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఇలా ఒకరేంటి దాదాపు ప్రాచీన, ఆధునిక కవులందరి రచనలకు పేరడీకి రచనలకు గురి అయ్యాయి అవి విరివిగా లభ్యమౌతున్నాయి.

మూల రచన
సుమతీ శతకము లోని పద్యము
కం//
ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ

శ్రీశ్రీ పేరడీ రచన
కం//
కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవఫిలిం
చేయకుమీ చేబదుళ్లు సిరిసిరి మువ్వా
-------------------------------------------------------
సాహిత్యగుమ్మడి -97--17/1/23.
ఉ//
పెక్కుగ చేగొనంశములు బేర్చిరి యిందున నింపుగూర్చుచున్
ఒక్కటి నొచ్చునాక్షణము నూరు విమానము పాలతల్లియున్
చక్కగ మేలుకొల్పులని చంద్రుడు భార్యలు రాగమాలికల్
సిక్కులఁ మాటమూటలను జెప్పిరి యెందున యెవ్వరందురో

సరైన జవాబులు
ఇల్లాలి ముచ్చట్లు
పురాణం సీత

పద్యవివరణ:- మొదటిపాదము చాలా అంశములతో కూడుకొనున్న ఈ వ్యాససంపుటి చాలాకాలము ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడినది.
రెండవ పాదము మొదటివ్యాసము 'ఆ ఉగాది మళ్ళీ వస్తుందా'(పేజి నం 1) )'మా ఊరు బెజవాడ' (పేజి నం 375) 'వీపుమీద విమానం',(పేజి నం 251) 'పాలిచ్చే తల్లి',(పేజి నం 296)
మూడవ పాదము:-'మేలుకొలుపులు'(పేజి నం.185) 'వెన్నెల దండ'(పేజి నం 97) "పెళ్ళాన్ని విమర్శించకు'(పేజి నం. 142) 'ఎగిరే పెళ్ళాలు'(పేజి నం 178) 'రాగమాలిక' (పేజి నం 132)
నాలుగవపాదము:-"సంత్ శ్రీ అకాల్' (పేజి నం,400) 'సరిసరి మాటల మూటా'(పేజి నం 226) మున్నగునవన్నీ నా పద్యములో సూచనలగా ఇవ్వబడినాయి.

ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమైనది, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, ఈ శీర్షికను కూడా విజయవంతంగా కొనసాగించారు.

ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైనంతవరకు సునిసితమైన విమర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో, ఎక్కడా కూడా తూకం చెడకుండా, ఈ శీర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు. వ్యాసరచన ఎక్కువ భాగం స్వగతంలోనే జరిగింది. కొన్ని కొన్ని వ్యాసాలలో "పురాణం సీత" తన భర్తతో మా(పో)ట్లాడుతున్నట్టు వ్రాయటం జరిగింది. వార పత్రికలలో, వ్యాసాలను స్వగతంగాను లేదా ఏక వ్యక్తి సంభాషణ రూపంలో, కథలాగ చెప్పే పద్ధతి, ఈ వ్యాస శీర్షికతోనే మొదలు. వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికి భాషలో అవసరమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ, సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపని వేగం ఉంది. పాఠకుడు వ్యాసం చదవటం మొదలుపెడితే ముగింపుగు వచ్చినాక మాత్రమే తెలుస్తుంది, చివరవరకూ చదివినట్టు. పాఠకుల ఆసక్తికి కారణం, కొంతవరకు వ్యాసంలో చర్చించబడ్డ ఆ కాలపు సామాజిక సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి అయినప్పటికి, వ్యాస శైలి అటువంటి ఆసక్తిని ఎక్కువగా నిలపగలిగిందని చెప్పక తప్పదు. వ్యాసాలన్నీ కూడా హాస్యభరితంగా ఉంటాయి. ఒక పక్క కన్నీళ్ళు పెట్టిస్తూ కూడా హాస్యం అంతర్లీనంగా వ్రాయగలగడం (నుదుటన్ వ్రాసిన వ్రాలు...దడిగాడువానసిరా ఒక ఉదాహరణ) పురాణం సీతకే చెల్లింది. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఈ విధంగా వ్రాయటమేమీ తేలిక కాదని, తేలికని ఊహిస్తున్నవారు ప్రయత్నించి చూడవచ్చని సవాలు చేసి, ఈ శీర్షిక శైలిని కొనియాడారు.

********************************************
కానక మారుసంతు, తనుగన్న కుమారుని చెంతనొల్లకన్

సాహిత్యగుమ్మడి -98--18/1/23.
ఉ//
గానము నృత్యమింపుగను గాథనబేర్కొని మేళవింపుగా
యానముసేయగా నొకరు యద్భుతరీతిగ పేరుగాంచినన్
లోనవనొత్తిడెచ్చుగను లుప్తము నయ్యెను శాంతిసౌఖ్యముల్
కానక నైనవారు, తనుగన్నను వారల చెంతనొల్లకన్
పానము సొమ్మసిల్లినటు పంకెనఁ వ్రాసిరి యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
యద్దనపూడి సులోచనారాణి
కీర్తికిరీటాలు

రాజ్యలక్ష్మి అనే ఓ శాస్త్రీయ సంగీత గాయని, స్వర్ణలత అనే శాస్త్రీయ నృత్య కళాకారిణిల కథ 'కీర్తికిరీటాలు.' సులోచనారాణి చాలా నవలల్లో లాగానే సగం కథ హైదరాబాదులోనూ మరో సగం విజయవాడ పక్కనున్న ఓ పల్లెటూళ్ళోనూ జరుగుతుంది. స్వర్ణలత కథని చెబుతూ చెబుతూ ఇంటర్ కట్స్ గా ఫ్లాష్ బ్యాక్ లో రాజ్యలక్ష్మి కథని చెబుతారు రచయిత్రి. దవడ కండరం బిగుసుకునే స్పురద్రూపి తేజా కథానాయకుడు. వంకరగా నవ్వే కిషోర్ కథలో ఒకానొక విలన్. అయితే, 'విధి' ని మాత్రమే బలమైన శత్రువుగా చిత్రించారు సులోచనారాణి. అడుగడుగునా ఎదురయ్యే ఊహించని మలుపులు 364 పేజీల నవలనీ ఏకబిగిన చదివించేస్తాయి.
ఇది అత్యద్భుత నవలగా పాఠకుల ప్రశంసలతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల.
కళలైన సంగీతం, నాట్యాలను నేపథ్యంగా వాడుతూ, వాటికి కుటుంబ కథను జోడించి రచించిన అందమైన నవల. కొటిమందిలో - ఏ ఒక్కరికో, ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం రాజ్యలక్ష్మికి లభిస్తుంది. ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కీరీటాలు పెట్టింది. అయితే ఆమె అదృష్టం అలా మెరిసి ఇలా మాయమయింది . ఆమె వైవాహిక జీవితమంతా అస్తవ్యస్తంగా జరిగింది. రెండు పెళ్ళిళ్ళు ఆమెను చెప్పలేని ఒత్తిడిని లోను చేశాయి. మొదటి భర్తతో కాపురం వల్ల తేజ పుట్టాడు. అయితే పొరపొచ్చాలు మూలంగా విడాకులు తీసుకోవలసి వచ్చింది. కొడుకును కోర్టు భర్తకే అప్పగించింది. తండ్రి పోయాడు. విడాకులు పొందిన భర్త పోయాడు. తోడు కోసం మరో పెళ్ళి చేసుకుంది. విదేశీ ప్రయాణం చేసి ప్రవాసంలో గడిపింది. రెండో భర్తకి అదివరకే వున్న కొడుకు కిషోర్ ను పెంచి పెద్ద చేసింది. కిషోర్ రాజ్యలక్ష్మిని ద్వేషించాడు. కన్నకొడుకు కాకుండా పోయాడు. ఉన్న కొడుకు శత్రువులా చూస్తాడు. ఒక సంగీత కళాకారిణి జీవితంలోని అపస్వరాలని ఆర్ద్రంగా చిత్రించే నవల 'కీర్తి కీరీటాలు'.
----------------------------------------
సాహిత్యగుమ్మడి -99--19/1/23.
ఉ//(పంచపాది)
దిద్దిరి తల్లినెంచికడు తీక్షణఁ జూపుచు కానరాకయున్
పెద్దల తప్పిదంబులకు పిన్నలు నేవిధి బాధ్యులంచు, తా
వద్దనె వ్యక్తి ద్వేషమును పంచమనెంచె దయారసంబునున్
ఎద్దని యంతమందు కడుయింపుగ వ్రాసిరి యెవ్వరెద్దియో

సరైన జవాబులు
1) బుచ్చిబాబు
2) చివరకు మిగిలేది.

ధయానిధి పట్టణంలో డాక్టరు చదువుతూ పల్లెకు వచ్చినపుడు కోమలి అనే ఒక వేరే కులపు అమ్మయిని ప్రేమిస్తాడు, కాని ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలానో, అసలు తనది ప్రేమో లేక ఆకర్షణో తెలియని సంగ్దిగ్దంలో ఉండి చదువు సంద్యలు లేని ఆమెకు ఆ అభిప్రాయాలను వ్యక్తం చేయలేక పోతాడు.

దయానిధి వృత్తి రీత్యా డాక్టరు. జీవిత యాత్రలో తారసిల్లిన అనేక సంఘటనలు, పరిసరాల ప్రభావంతో ఆయన తాత్వికుడుగా, భావకుడుగా మారతాడు. తల్లి మీద ఆయనకి అపారమైన గౌరవం ఉంటుంది. అయితే, ఆమె శీలం గురించి మాత్రం సంఘంలో సరైన అభిప్రాయం ఉండదు. సుశీల, ఇందిర అనే ఇద్దరు దయానిధి తల్లిని అవహేళన చేస్తారు. నిజానికి వారిద్దరు దయానిధికి భార్యలు కావాల్సినవారు. వారికి దయానిధి తల్లి మీద ఉన్న ఏహ్యభావం కారణంగా దయానిధికి దూరమవుతారు. అమృతం అనే యువతి మాత్రం దయానిధి తల్లి పట్ల గౌరవంతో మాట్లాడుతుంది. అందువల్లే ఆమె దయానిధికి సన్నిహితురాలవుతుంది. దయానిధి తల్లి పాత్ర ఎంతో కీలకమైనా ఆ పాత్ర మాత్రం నవలలో ఎక్కడా కనిపించదు. ఆమె చేసిన తప్పిదం మాత్రం కొడుకు దయానిధిని నీడలా వెన్నాడుతుంటుంది. తల్లి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం విని సహించలేక దయానిధి సంఘానికి దూరంగా ఏకాంత జీవితం గడుపుతుంటాడు. అప్పుడే ఆయనకి జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నకలుగుతుంది. సత్యాన్వేషణకు, ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు దారితీస్తుంది. పెద్దలు చేసిన తప్పిదాలకు పిల్లలు బాధ్యులై వారి జీవితాలు సాగాల్సిన తీరున సాగలేకపోవడం- ఈ నవలలో చిత్రితమైంది. దయానిధి సర్కారు వదిలి రాయలసీమకు వెళతాడు. అక్కడ సర్కారు రాయలసీమ ప్రాంతాల మధ్య గల వైషమ్యాలు భగ్గుమంటాయి. దయానిధి స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొంటాడు. పెళ్లయి పునస్సంధానం జరిగే తొలిరాత్రి దేశమాత పిలుపునందుకొని అరెస్టవుతాడు. కోమలి, అమృతం, సుశీల, ఇందిర- ఈ నలుగురు స్త్రీల మధ్య అతను నాలుగు స్తంభాల ఆట ఆడినా అమృతం ఆయన హృదయాన్ని చూరగొంటుంది. అయితే అన్నివిధాలా ఆయనకు కోమలి సన్నిహితురాలైంది. ఇంకా కాత్యాయని, నాగమణి, శ్యామల... వీరు కూడా దయానిధి జీవితంలో సంచలనం కలిగిస్తారు. ఇతర పాత్రలైన కృష్ణమూర్తి, జగన్నాధం, సోమయ్య, రెడ్డి, నారయ్య మొదలైన వ్యక్తులందరూ ప్రతి వ్యక్తికీ సన్నిహితంగా ఉండి అందరితో కలసి మెలసి జీవించే పాత్రలు. ఈ నవల ద్వారా పాఠకులు గ్రహించే సత్యం ఏమిటంటే- 'మానవునికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు... కావాల్సింది దయ. అది కొంచెం ఉన్నా చాలు'. ఇక దయానిధి జీవితం అంతా- 'వ్యక్తిని కాదు ద్వేషించాల్సింది, వ్యక్తిలోని దౌర్భల్యాలను, బలహీనతలను ద్వేషించాలి' అన్న మానవతా వాద సిద్ధాంతం పైనే నడుస్తుంది.

ఇందులో పదకొండు అధ్యాయాలున్నాయి. గడ్డిపోచ విలువెంత, అనుభవానికి హద్దులు లేవు, మూణ్ణాళ్ళ ముచ్చట, చప్పుడు చెయ్యని సంకెళ్లు, సౌందర్యరాహిత్యం, స్వయం సంస్కారం, చీకటి సమస్య, రాళ్లసీమ, కాత్యాయని సంతతి, ఆకులు రాలడం, చివరకు మిగిలేది. బుచ్చిబాబు స్వయంగా 'సమర్పణ' పేరుతో ఉపోద్ఘాతం రాశారు. అందులో తనని బాధించినదే రాస్తూ- 'గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది' అంటూ బుచ్చిబాబు సుదీర్ఘమైన ముందు మాట రాశారు.

----------------------------------------

పువ్వుల నెంచిజూపుజును పూర్వము వ్రాసిన యంశమట్టులా
పువ్వులు చింతనొందవని, పోడిమిఁ గొండలు, భ్రూణహత్యలన్
అవ్వల, గౌరు, భాస్కరుల నబ్ధ కవీశ్వర బాధ్యతెంచియున్
రవ్వగు పొత్తమొక్కటది వ్రాసిరి జక్కగ నెవ్వరెద్దియో?

సాహిత్యగుమ్మడి -100--20/1/23.
ఉ//
కమ్మగ నెంచియున్విరుల గష్టములొక్కరు వ్రాయనొల్లకన్
నెమ్మిని జూపునవ్వియని, నీచము కిట్టుట నాడశిశ్వులన్
ఇమ్ముగ శృంగి, ధేన, గురు, నెంచియు కావ్యుల గొప్పజూపుచున్
తెమ్మెర వీచినట్లుగను తీరిచి  వ్రాసిరి యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
1) ప్రసాద్ కట్టుపల్లి
2) పుష్పదరహాసం

శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు "పుష్పవిలాపం". ఈ పుష్పవిలాపము కీ.శే ఘంటసాల మాష్టారి గళములో మనందరము విన్నాము. నేను బహుపర్యాయములు విన్నాను. అసలు పువ్వులు వారు వ్రాసిన విధంగానే ఎందుకనుకుంటాయి. అనే నా అంతర్మథనములోనుండి పుట్టినదే. నా 'పుష్పదరహాసము' అలాగే  ఒకరోజు వార్తా పత్రికలో ఒక ఫోటోచూసాను. అప్పుడే పుట్టిన ఆడశిశువు మృతకళేబరము తుప్పలలో పడవైచి దానిచుట్టూ పందులు తిరుగాడుతున్నట్లున్నదా ఫోటో. హృదయవిదారకమైన ఆ చిత్రం చూసిన పిమ్మట వ్రాసినది మరొకటి అమ్మఆత్మనివేదన..ఇంకా  ప్రకృతి, నదులు, గిరులు సూర్యుడు చంద్రుడు కవులు బాధ్యతలు మున్నగు అంశములమీద నేను వ్రాసిన పద్యసంకలనమే "పుష్పదరహాసము".

ఇంతటితో 'సాహిత్యగుమ్మడి' శీర్షిక ముగించబడినది. పాల్గొన్న వారలందరకూ పేరుపేరునా వినమ్రముగా ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.

'లోకస్సమస్తా సుఖినోభవంతు'


సాహిత్యగుమ్మడి 51--75


సాహిత్యగుమ్మడి -51--26/11/22
ఉ//షట్పది)
ఏలిక చేయనెంచె వ్రత మిట్టల భక్తిగఁ శూలపాణికిన్!
చూడగ భక్తిఁ శంభు రమ క్షోభను బెట్టుచు రూపుమార్చియున్
శూలను కామితమ్మడిగి శూన్యము జేయగ పట్నమంతటన్
ఆలిని వేశ్యగంపె కడకాతడె యామెయుఁ గౌగలించగన్
బాలుని రూపమయ్యె తన బాహువు లందున పింగళాక్షుడున్
వేడితి దెల్పరే బుధులు వేగమె వ్రాసినదెవ్వరెద్దియో?

సరైన జవాబులు
1) కూచిమంచి తిమ్మకవి  .
2) రాజశేఖర విలాసము        

కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు. ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.

రాజశేఖర విలాసము' అనే ఈ కావ్యమును కూచిమంచి తిమ్మకవి సా.శ.1705లో వ్రాశాడు. ఇది ఇతని తొలి కావ్యమని పరిగణింపబడుచున్నది. మూడు ఆశ్వాసాల ఈ చిన్ని కావ్యము పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి చేత పరిష్కరించబడి వావిళ్ల రామస్వామి&సన్స్ చే వావిళ్ల ప్రెస్, మద్రాసులో 1924లో ప్రచురింపబడింది. దీనిలో మొత్తము 541 పద్యాలున్నాయి.

కూచిమంచి తిమ్మకవి పిఠాపురం సంస్థానములో జమీందారుల ఆశ్రయంలో ఉన్ననూ తాను వ్రాసిన అన్ని కావ్యాలను నరాంకితము చేయక పిఠాపురంలో వెలసిన కుక్కుటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యములో అంకిత పద్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కం||పనిబూని తుచ్చభోగంబునకై కొఱ
   గాని జనులఁ బొగడుట యెల్లన్
   గనుఁగొన నిహపరదూరం, బని తలఁచి
   వినిర్మలాంతాంగుండగుచున్.

చం||విను మఖిలేశ మర్త్యులకు వేడుకఁ గావ్య మొసంగి ధాత్రిపై
   నొనరగ సౌఖ్యసంపదల నుద్దతులై సుకవీంద్రులుందు రా
   ర్యనికరవంద్య నీ విహపరంబుల సౌఖ్యం మొసంగుసామి వం
   చును మది నెంచి నీకు సరసుల్ విని మెచ్చఁ బ్రబంధ మిచ్చెదన్.

  సింధుకటక పురాన్ని ఏలుతున్న భల్లాణుడు అనే ప్రభువు శివపూజా తత్పరునిగను, శరణాగత వత్సలునిగను, సత్యవాక్ప్రియుడిగను పేరుగాంచాడు. అతని భార్యలు చల్లాంబిక, మల్లాంబికలు మహా పతివ్రతలు. తన ఐశ్వర్యానికి కారకుడైన శివుని ఒక వ్రతముచేత మెప్పెంచాలని సంకల్పించి భల్లాణుడు ఒకరోజు గురుదర్శనము చేసి వ్రతదీక్షనిమ్మని కోరాడు. శివభక్తులైన జంగమస్వాములకు కామితార్థములిచ్చి, పరమేశ్వరుని అనుగ్రహము పొందడం ఆ వ్రతముయొక్క ఉద్దేశము. ఆ వ్రతము మిక్కిలి కష్టమైనదని, జంగమస్వాములడిగినచో సతీసుతులనైన, కాయము కోసియైన ఇవ్వవలసి వుంటుందని గురువు భల్లాణుడికి తెలుపుతాడు. ఆ వ్రతమెంత కఠినమైనదైనా చేస్తానని చెప్పి ఆశీర్వదించమని భల్లాణుడు గురువును వేడుకొంటాడు. ఆ గురువు రాజును ఆశీర్వదించి విభూతిని ఇచ్చి పంపుతాడు.

భల్లాణుడు రాజధాని చేరి శివపూజ చేసి శంకరునికి ప్రీతి కలిగేటట్లు జంగమస్వాములు ఏఏ పదార్థములడిగినా లేదనక ఇస్తానని శపథము చేసి దేశదేశలలో చాటింపు వేయిస్తాడు. భల్లాణుని ప్రకటన విని జంగమస్వాములు వచ్చి తమ కామితార్ధములను తీర్చుకొన్నారు. రాజు ధర్మమార్గములో, సత్యవర్తనముతో జంగమారాధన చేస్తుంటాడు. భల్లాణుని వ్రతదీక్షను నారదుని ద్వారా విన్న పార్వతీ పరమేశ్వరులు భల్లాణుని పరీక్షించాలని నిర్ణయించుకుని శివుడు సింధు కటకములోని వేశ్యావాటికకు చేరి అక్కడ ఉన్న వేశ్యలందరికీ కోరిన ధనమిచ్చి విటులను ఏర్పాటు చేస్తాడు. తర్వాత జంగమవేషధారియై శివుడు భల్లాణుని చెంతకు వెళ్లి యథావిధి పూజింపబడి, వేశ్యలేనిదే భుజింపలేనని పట్టుపడతాడు. భల్లాణుడు చేయునది లేక వెలయాలును తెప్పించుటకై ప్రయత్నించగా ఆ రోజు మహేశుని మాయచేత ఒక్క వేశ్యకూడా లభించలేదు. వ్రతభంగమౌతుందనే భయముతో భల్లాణుడు భార్య చల్లాంబికను తరుణోపాయం అడుగుతాడు. ఆమె చిరుతొండనంబి మొదలైన భక్తులను శివుడు పరీక్షించిన విధము జ్ఞప్తికి తెచ్చి పతి ఆనతి శిరోధార్యమని పలుకుతుంది. భల్లాణుడు ఆవేదన పడి చివరకు చల్లాంబికను వెలయాలిగా జంగమవిటుని వద్దకు పొమ్మని కోరుతాడు. చల్లాంబిక పతి ఆజ్ఞను శిరసావహించి జంగమవిటుని సమీపిస్తుంది. చల్లాంబిక అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అతడు స్థాణువులా ఉంటాడు. చల్లాంబ ఆశ్చర్యపడి జంగమ విటుని ఆలింగనం చేసుకోబోగా విటుడు ఆమె చేతులలో నెలరోజుల బాలుడిగా మారిపోతాడు. ఆ బాలుని పరమేశ్వరుడిగా భల్లాణుడు గ్రహిస్తాడు. అంతట శివుడు భల్లాణునకు సాక్షాత్కరించి పార్వతీదేవి అంగీకారముతో చల్లాంబికా, మల్లాంబికా సమేతముగా భల్లాణుని కైలాసానికి తీసుకొని పోయి ప్రమథగణములలో ప్రథమునిగా నిలుపుతాడు.
------------------------------------------
సాహిత్య గుమ్మడి..52
ఉ//
పొత్తము పేరనొక్కటది పొత్తము ముందురనూరునామమున్
మొత్తము నొక్కతీరుగను, భూమము, సేద్యము, వేషభాషలున్
సత్తెము నెంచిజూపునది జక్కగ సాంఘిక భావజాలమున్
గుత్తము వ్రాసెనెవ్వరన గొప్పగ వ్రాసిరి యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
1) శ్రీ నామిని సుబ్రమణ్యం నాయుడు
2) మిట్టూరోడి పుస్తకం

ఈ మిట్టూరోడి పుస్తకం అనే తెలుగు కథాసంకలనం ప్రసిద్ధ తెలుగు కథారచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు చే వ్రాయబడింది. ఈపుస్తకము అంతకు ముందు ప్రచురణ పొందిన కథాసంకలనాలను కలిపి ఒకే పుస్తకంగా అచ్చొత్తిన పుస్తకము. అంతకుముందే అచ్చయి అశేష తెలుగు పాఠకలోక ఆదరణపొందిన పచ్చనాకు సాక్షిగా',.మునికన్నడి సేద్యము, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలుతో కలుపుకొని ఆరు పుస్తకాలను కలిపి మిట్టూరోడి పుస్తకం పేరుతో ఈపుస్తకం ప్రచురించారు. ఈపుస్తకం మొదటి ముద్రణ డిసెంబరు 2009న జరిగింది. ఈపుస్తక ప్రచురణను రచయిత తానే స్వంతంగా టామ్ సాయర్ బుక్స్, తిరుపతి పేరుతో విడుదల చేసాడు. పుస్తకం లోపలి బొమ్మలను బాపు గారందించారు. ఏ పుస్తకముకైన ముఖచిత్ర పేజిపై రచయిత పేరుంటుంది. ఈపుస్తకం కవరుపైనకాని లోపల పేజీలలోకాని రచయిత పేరుకనపడదు. నామిని సుబ్రహ్మణం అని కాకుండా మిట్టూరోడి పుస్తకం అని వేసుకోవటంలోనే తన కథల మీద, తెలుగు పాఠలకుల మీద రచయితకున్న నమ్మకాన్ని తెలుపుతున్నది. ఒకరకంగా వినూత్నమైన ప్రయోగంగా చెప్పవచ్చును.

నామిని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, మిట్టూరులో జన్మించాడు. వాళ్ళది వ్యవసాయప్రధానమైన కుటుంబం. ఆయన ఎనిమిదేళ్ళ వయసునుంచే వ్యవసాయపనుల్లో పాల్గొనేవాడు. ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ చేసే దాకా సెలవుల్లో పశువులు మేపడానికి వెళ్ళేవాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశాడు.
చదువైపోగానే ఈనాడు తిరుపతి ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా చేరాడు. అక్కడే ఒకటిన్నర సంవత్సరం పనిచేశాడు. తరువాత దాసరి నారాయణరావు ఉదయం లో చేరి హైదరాబాద్ కు వచ్చేశాడు. అలా ఉదయంలో ఉండగా పచ్చనాకు సాక్షిగా అనే వ్యాసాల సంకలనం ప్రారంభించాడు. 1985 లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సంచిక ప్రారంభించినపుడు ఏబీకే ప్రసాద్ ఆయన్ను అందులోకి రమ్మని ఆహ్వానించాడు. త్వరలోనే తిరుపతి సంచిక ప్రారంభిస్తాననీ మళ్ళీ అక్కడికి పంపిస్తాననీ మాట ఇచ్చారు. అట్లయితే రేణిగుంటలోనే ఉండి ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకోవచ్చు కదా అని అక్కడ చేరాడు. ఎనిమిది నెలల తరువాత తిరుపతి జ్యోతి సంచిక ప్రారంభమైంది. హైదరాబాదు నుంచి తిరిగి వచ్చి మిట్టూరులో కాపురం పెట్టాడు. సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం రాశాడు. వీటన్నింటిలోనూ పల్లె బతుకుల్ని ఉన్నదున్నట్టుగా చిత్రీకరించాడు.
ఆయన ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో ఉండగా మొదటి కథ రాశాడు. ఆయన ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుండగా జరిగిన ఒక సంఘటన. ఒక ముసలాయన పశుమాంసం తీసుకుని బస్సులో ప్రయాణిస్తుండగా, అందుకు కోపించిన మరో ప్రయాణికుడు ఆ ముసలాయన్ను కొడతాడు. మిగతా ప్రయాణికులు అతన్ని వారించి ఆ ముసలాయన్ను విషయమేంటని అడుగుతారు. తన కూతురు గర్భవతియని, ఆమెకు పాలు బాగా పడుతాయని తీసుకెళుతున్నానని చెబుతాడు. ఆ సంఘటనే ప్రేరణగా ఆయనకు కథ రాయాలనిపించింది. దాన్ని ఆంధ్రప్రభకు పంపిస్తే వెనక్కి తిరిగొచ్చింది. ఆయన మీద ఏ రచయిత ప్రభావం లేదని చెప్పుకొస్తాడు. ఆయన పొలంలో పనిచేసేటపుడు, పశువుల్ని మేతకు తోళుకెళుతున్నపుడు, చుట్టూరా ఉన్న రైతులు, వారి భార్యలు మాట్లాడుకునే మాటల ప్రభావమే ఎక్కువ. పల్లెతోనూ, పైరుతోనూ, మట్టి తోనూ, రైతులతోనూ, ఆయనకున్న అనుబంధమే ఆయన చేత అలా రాయించిందని చెప్పుకొస్తాడు.
------------------------------------------
సాహిత్య గుమ్మడి..53
ఉ//
అప్పయు నొప్పగాయజము నప్పుడు కావర ముప్పతిల్లగా
గప్పము నుప్పురూపమున కట్టను జెప్పగ నన్నదమ్ములున్
చెప్పగ జేరి యప్పకడ చెప్ప జనార్దనుఁ తిప్పలొప్పగన్
'చెప్పు జనార్దనుండనది జెప్పుటె యొప్పు" జనార్దునుండనన్
జెప్పెగ యప్పకప్పుడది, చెప్పరె యెందున? వ్రాసినప్పనున్!

సరైన జవాబులు
1) ఉత్తర హరివంశము
2) నాచన సోమన

నాచన సోమన 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. ఆయన ఉత్తర హరివంశం కావ్యాన్ని రచన చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు. నాచన సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకుల్లో వాదోపవాదాలు జరిగాయి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం సా.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనావేస్తున్నారు. నాచన సోమన రచించినవాటిలో ప్రఖ్యాతిపొందినది, ప్రస్తుతం లభిస్తున్నది ఉత్తర హరివంశం గ్రంథమే.

బ్రహ్మదత్తుడనే రాజు కుమారులైన హంస డిభుకులు తమ తండ్రిని రాజసూయం చేయమని ప్రోత్సహిత్సహించి చివరకు అంగీకరింపచేస్తారు. అప్పుడు వారి మంత్రియైన జనార్దనుడు వారితో, రాజసూయం చేయాలంటే దిగ్విజయం చేసి రాజుల్ని గెలవాలి. కృష్ణుని వోడించడం మీచేతనవుతుందా. నరకునీ, కంసునీ, మురాసురునీ, చాణూరాదులనూ చంపిన కృష్ణునికి మీరొక లెక్కా, అంటూ “మద్దులు మునింగి పార, వెంపళ్ళు తన కెంత బంటీ' అంటాడు. మద్ది చెట్ల లాంటి మహా వృక్షాలే మునిగి పోతే, రెండడుగుల ఎత్తు కూడా లేని వెంపలి చెట్లు మునగడానికి ఎంత లోతు కావాలె. అని అర్థము. కాని పరమశివుడినుండి పొందిన వరగర్వము వలన వారు జనార్దనునిని కృష్ణుడు వద్దకు రాయబారిగా పంపుతూ. ఓటమినంగీకరించి వారితండ్రి నిర్వహించే రాజసూయయాగమునకు కావలసిన ఉప్పు తీసుకురమ్మని కబురుపంపుతారు. ఈ జనార్దనుడు కృష్ణ భక్తుడు. హంస డిభకులు పంపగా కృష్ణుని వద్దకు దూతగా పోతాడు. వారి ప్రల్లదాలను కృష్ణునికి వివరించలేక మొహమాట పడుతుంటే, కృష్ణుడు భయం లేకుండా చెప్పడం దూత ధర్మం అని ప్రోత్సహిస్తూ, “పాముకాటు చీర దుడిచినంబోవునే” అంటాడు. వారి ఆటోపం “దువ్వు జూచి నక్క యొడలు గాల్చుకున్న వడవు” లా ఉన్నదంటూ “పిడుగు వ్రేసిన తల టొప్పి యాగునే” అని ప్రశ్నిస్తాడు కృష్ణుడు. దూతకృత్యం నిర్వర్తించ వచ్చిన జనార్దనుడు, హంస డిభకుల సందేశమును జనార్థనునికి   (శ్రీ కృష్ణునకు) చెబుతాడు. ..తదుపరి కథ పాఠ్యాంతరము.
-----------------------------------------
సాహిత్య గుమ్మడి..54--29/11/22
ఉ//
వీడక భాషనందుపస బేర్చి సమాసము లర్థభావముల్
చూడక గోపనార్థములఁ జూపియు నింపుగ తేటగార్థముల్
బూడిద పూతబొట్టులను పొల్తుక బుర్షుల వస్త్రధారణల్
వేడుకఁ మాట, నడ్వడులు, పిల్పులు, సేవలు సంప్రదాయముల్
వాడిమిఁ నొక్కపొత్తమును వ్రాసిరి యెవ్వరదెద్ది? యందురో!

సరైన జవాబులు
శ్రీ దాసు శ్రీరాములు
తెలుగునాడు

దాసు శ్రీరాములు ప్రసిద్ధ కవి, పండితులు. వీరు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కన్నయ్య, కామమ్మ. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకొని తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి ప్రభువు మన్ననలనందుకున్నాడు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు. తరువాతి కాలంలో ఆంగ్లం చదివి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరై ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు.తరువాతి కాలంలో వృత్తిని వదిలి జీవిత శేషం సాహిత్య సేవకు వినియోగించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు. వీరు మే 16, 1908 సంవత్సరంలో పరమపదించారు. వీరి సతీమణి జానకమ్మ. వీరికి ఆరుగురు కుమారులు కేశవరావు, నారాయణరావు, గోవిందరావు,మాధవరావు, విష్ణురావు, మధుసూధనరావు లలో ఐదవ కుమారుడైన దాసు విష్ణు రావు స్వీయచరిత్ర లో 20 శతాబ్దమునాటి సాంఘిక రాజకీయములు వివరించిరి. వీరి ఏకైక కుమార్తె శారదాంబ పిన్నవయస్సులోనే సంగీతం తో పాటు సంస్కృతాంధ్ర విద్యాభ్యాసములు  కావ్యరచనలుచేసిన 19వ శతాబ్దపు మహిళారత్నము.
తెలుగునాడు నందు క్రింది అంషములు కలవు.
స్తుత్యాదికముబ్రాహ్మణ ప్రశంస, వైదికులు,  నియోగులు, స్మార్త సాధారణ విషయములు, మాధ్వులు, వైష్ణవులు, శైవులు, కరణ కమ్మలు  యాజ్ఞవల్క్యులు, గోలకొండ వ్యాపారులు, ద్రావిడులు, వివాహములు, అత్తకోడండ్రు, పండుగలు, సంక్రాంతి, అట్లతద్దె, దీపావళి, వినాయకచవితి, సంవత్సరాది, నానావిధేతర విషయములు, పొడుము, ఇతర విషయములు.

మచ్చుకు కొన్ని పద్యములు.

సీ.
భాషీయపద్ధతి పట్టుదప్పఁగనీక
     దీర్ఘ సమాసంబు తెరువుపోక
గూఢార్థసమితి దిక్కున దేఱిచూడక
     స్పష్టార్థములజాడ జాఱనీక
మఱుఁగు పదంబుల మార్గంబు ద్రొక్కక
     తేటమాటల రాచబాట విడక
దూరాన్వయంబుల దారి మూచూడక
    సంకరాలంకార సరణి గనక
గీ.
ఉన్నయది యున్నయట్టులు గన్నయదియుఁ
గన్నయట్టులు విన్నది విన్నయటులు
నన్నయది యన్నయట్టులు వన్నె వెట్టి
కవితఁ జెప్పిన సంతోష మవు జగాన.

సీ.మోకాళ్ళు దాఁటని మొరటు గావంచాల
     నందియందనిగోఁచి యంటదోపి
పిల్లగాలికిఁ దూఁగి యల్లాడు చిన్న నే
      రెడుగాయవలె జుట్టు ముడియవైచి
నడునెత్తి పెడచెంప లెడనెడఁ గాన్పింపఁ
    దల నొక్కయంగవస్త్రంబుఁ జుట్టి
గీరు గంధపు రేఖ దీరైన నొసటిపై
     పసపక్షతల చుక్క యెసఁగ నునిచి.
గీ.
బెదరి చూచుచుఁ బెఱవారి కొదిగికొనుచు
జందెపోగులు చిక్కువోఁ జమిరికొనుచు
నోట నొకఋక్కు ముమ్మాఱు నొక్కి యనుచు
శ్రోత్రియ క్షితిదేవతాసుతుడు వెడలు.

సీ.
ఉదయించుచున్న సూర్యునివంటి గుండ్రని
      ముతకకుంకుమబొట్టు మొగమునిండ
కొయ్యకరాటానఁ గొని వ్రేల మెదిపి రా
      చిన నూనెకాటుక కనులనిండ
అట్టిట్టు గదులాడునట్టి మేల్ముత్యాల
      ముక్కుపో గొకప్రక్క మూతినిండ
గోటంచుతో బొద్దుకుట్టు గుట్టిన గట్టి
      పైఠిణీ మోచేతిపట్ల నిండ
గీ.
మాలనూలును చీరెల సాలినేఁత
మూరగలిగిన దళముగాఁ బుంజ మిడిన
మేలికమ్మె సొగసుచీరె మేనునిండ
బ్రియుఁ గదియుఁ దెల్గునాఁటి శ్రోత్రియవధూటి

శా
ఆస్సే; చూస్సివషే; వొషే; చెవుడషే; అష్లాగషే; యేమిషే;
విస్సావఝ్ఝలవారిబుఱ్ఱినష యా విస్సాయ కిస్సారుషే
విస్సం డెంతటివాఁడె యేళ్ళు పదిషే; వెయ్యేళ్ళ కీడేషుమా;
ఓస్సే బుఱ్ఱికి యీడషే; వొయిషు కే ముంచుందిలే మంచివొ
ర్చెస్సే; యందురు శ్రోత్రియోత్తమపదస్త్రీ లాంధ్రదేశంబునన్‌.

సీ.
కోడికూయఁగ మేలుకొని తలవాకిలి
         పై పాచిజిమ్మి కలాపిఁ జల్లి
దడదడగా దంతధావనం బొనరించి
         యిల్లల్కి మ్రుగ్గిడి యెనుముఁ బిదికి
పొరుగింటి కేగి నిప్పును దెచ్చి రాజేసి
        మడివలువల నుత్కి పిడిచి మడఁచి
బుజముపై నిడి దండెముల నాఱవైచి కూ
           రలు దర్గికొనియు దండులము లోడ్చి.
పసుపు రాచుక నీళ్ళు పైఁబోసికొని బట్ట
         తడిది గట్టుకొని తీర్థంబు దెచ్చి
నాలుగుసేర్ల తప్పేల దబ్రాగిన్నె
         రాచిప్పయొకటి పొయ్‌రాళ్ళఁ బెట్టి

గీ.కళపిళ నెసళ్ళు గ్రాఁగించి కమ్మనైన
వంటకా ల్చేసి విస్తళ్ళ వడ్డనములు
పొసఁగఁ గావించి భయభక్తి పూర్వకముగ
నుపచరించును వైదికయువతి పతిని.

ఉ.
స్నానముఁజేసి సంధ్య నిముసాననె దీరిచి బొట్టుఁబెట్టి పీ
ఠానను గూరుచుండి యెఱడా లరివాణము జోడు చెంబులుం
దా నమరించి మంచియరఁటాకున నన్నము గూరగాయలున్‌
దాను భుజించు సైసినపదార్థము గొంచు నియోగి నిచ్చలున్‌.
--------------------------------------
సాహిత్య గుమ్మడి..55--30/11/22
ఉ//
విందుగఁ ద్రొక్కిపట్టువిద వేదన బాపిన వేల్పునెంచి యున్
కందము గర్భమందునిడి ఖ్యాతి పురాణపు గాథజూపుచున్
బంధ కవిత్వమింపుగిడి పండితులొక్కరు వ్రాసియాంధ్రమున్
పొందిన పట్టమేమి ఘనపొత్తము నేమది? యెవ్వరందురో?

సరైనజవాబులు
1) ఠంయాల
2) కుబ్జా కృష్ణ విలాసము
3) శ్రీ నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు

నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు (నల్లంతిఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీ నృసింహాచార్యులు) ప్రాధాన్యత కలిగిన కవి. ఈయన అచ్చ తెలుగులో కుబ్జాకృష్ణ విలాసము అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో కుబ్జ(పొట్టి, అందవికారమైన అమ్మాయి)ని మధురలో కృష్ణుడు సుందరిగా మలిచిన గాథను ఇతివృత్తంగా స్వీకరించాడు. ఇటువంటి కావ్యం కవి భాషా సృజనశక్తికి అద్దంగా పాఠకుని భాషాసంపదకు ఆలంబనగా నిలుస్తుందని విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం పేర్కొన్నారు.

అతనికి "ఠంయాల" అనే బిరుదు నామము కలదు. అతను వరంగల్లుకు చెందినవాడు. అతని గోత్రము హతసగోత్రము. అతని తండ్రి రంగాచార్యులు. అతను ఆంధ్రభాషా ప్రవీణులు, చతుర్విధ కవితా ప్రబంధరచనా నిర్మాణధురీణుడు. ఈ విషయం నాశ్వాసాంత గద్యవలన స్పష్టమగుచున్నది. అతను అచ్చమైన తెలుగు ప్రబంధమునే కాక నిరోష్ట్యాద్యేతర గ్రంథములను కూడా కొన్ని రచిందాడు. అతని రచనా శైలి సులభ శైలి. ఇది పండిత పామరులకు ఆనందం కలిగిస్తుంది. అతని గ్రంథములలో పురాతన కవుల పోకడలు కనబడుతున్నవి.

కుబ్జా కృష్ణ విలాసమునందలి ద్వితీయాశ్వాసం నందలి వర్ణనాంశములు, తృతీయాశ్వాసము నందలి కూర్మబంధము, మర్దళబంధము, ఖడ్గ బంధము, మొదలగు బంధ విశేషములును, కల్పితమైన చతుర్విధ కందౌలను, కందగర్భ చంపకమాల వృత్తము మున్నగు వృత్త విశేషములు అతని పాండితీ వైభవమును చాటుచున్నవి.

-------------------------------------
సాహిత్య గుమ్మడి..56--1/12/22
ఉ//
ఇష్టత హెచ్చుమీరగ తనేలిక చెంతకు జేరనెంచి నా
దుష్టుని నెంచిజూపుచును దుష్టత మాటుతనాత్మఘోషనున్!
కష్టము దీరనెంచి తన కార్యములన్నియు శంఖిముందరన్
క్లిష్టిని నోర్వలేక తన డెందము విప్పిన క్రొత్తరూపునున్
పుష్టిగ చిన్నదొక్కటది పొత్తము వ్రాసెనదెవ్వరెద్దియో?

సరైన జవాబులు
1) శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు
2) "పౌలస్త్య హృదయము"

కాటూరి వెంకటేశ్వరరావు ఒక తెలుగు కవి, రచయిత, నాటకకర్త, అనువాదకుడు. జన్మస్థలం కాటూరు (వుయ్యూరు) . ఇతను బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతను,, పింగళి లక్ష్మీకాంతం కలిసి పింగళి కాటూరి కవులు అనే జంటకవులుగా ప్రసిద్దులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు.

జీవిత విశేషాలు
ఇతడు 1895, అక్టోబరు 15వ తేదీన కృష్ణాజిల్లా, వుయ్యూరు మండలం, కాటూరు గ్రామంలో జన్మించాడు[1]. ఇతని తల్లిదండ్రుల పేర్లు రామమ్మ, వెంకటకృష్ణయ్య. ఇతడు కాటూరు, గుడివాడలలో ప్రాథమిక విద్యను ముగించుకుని, బందరు హిందూ హైస్కూలులో స్కూలు ఫైనలు పూర్తిచేసుకుని ఇంటర్మీడియట్, బి.ఎ. బందరులోనే చదివాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో సహాయనిరాకరణ ఉద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహంలోను చురుకుగా పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించాడు.

ఇతడు 1933-39 సంవత్సరాల మధ్య ఆంధ్రోపన్యాసకుడిగా, 1939-43ల మధ్య వైస్ ప్రిన్సిపాల్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1945-53ల మధ్య కృష్ణా పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. చాలా రచనలు చేసారు. ఇతడు 1962, డిసెంబరు 25న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు

మన పురాణాల్లోని కొన్నికొన్ని పాత్రలు అన్యాయానికి గురైనాయని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కవి హృదయం సాధారణంగా ఆర్ద్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రల యెడ సహానుభూతి కలిగి ఉంటుంది. ఒక ఏకలవ్యుడు, ఒక ఊర్మిళ, ఒక అహల్య, ఒక కర్ణుడు లాంటి వారి యెడ ఏంతో అనుకంపనని చూపిస్తుంటారు చాలామంది. వాల్మీకి ఊర్మిళకు అన్యాయం చేశాడని వాల్మీకి రామాయణాన్ని మార్చబూనాడట పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. కన్న కొడుకును కసాయితనంతో ఏట్లో త్రోసేసిన కఠినాత్మురాలు అని నలుగురూ అనుకునే కుంతీకుమారి అంతరంగంలోకి పోయి కరుణను కురిపించారు కరుణశ్రీ. కులవివక్షతో బాధలు పడ్డ కర్ణుని గురించి జాషువాలాంటివారు ఎందరో వ్రాశారు. కైకేయిని పూర్తిగా మార్చి ఒక కారణజన్మురాలైన మహాదేవిగా తీర్చిదిద్దారు విశ్వనాథ. నూరు శాతం మంచి లక్షణాలున్న ఒక పాత్రలోని ఒక చిన్న అప్రధాన విషయాన్ని పట్టుకొని, అది తప్పు అని తాను తప్పు అభిప్రాయం పెంచుకొని, మొత్తం మంచినీ చెడుగా దృశ్యమానం చేసి విషవృక్షాలు మొలిపించేకన్నా, చెడు అని చెప్పబడేదాంట్లో మంచిని చూపించాలనుకోవడం నిజంగా సహృదయత గదా! కాటూరు వెంకటేశ్వరరావు పౌలస్త్య హృదయములో అదే చేశారు. రావణునిలోని విష్ణుభక్తి పారవశ్యాన్ని దర్శించారు. అతను కావించిన లోకక్షోభ కారకాలయిన కార్యాలకు ఒక సముచితమైన కారణాన్ని అన్వేషించారు. వాటి వెనకుండే ఆయన ఆర్తికి కేతనం ఎత్తారు. తన అసలు స్థానమైన వైకుంఠం చేరడానికి జరుగుతున్న ఆలస్యానికీ, తనకు విముక్తి కలిగించాల్సిన స్వామి, రామచంద్రుడు రావడంలో జరుగుతున్న జాప్యానికీ, ఆ జాప్యాన్ని తగ్గించి ఆయన్ను తొందరించడానికి తనెన్ని ఘోరాలు చేస్తున్నా ఇంకా రాడేమీ, నా సంగతి తెలిసీ ఆలసిస్తూ నన్నింకా మోసగిస్తున్నాడే అనీ వాపోతున్నాడు. రావణునిలోని ఈ ఆర్తిని ఎంతో సుందరంగా, ఆర్ద్రంగా రంగరించి వింగడించారు కాటూరువారు.

కాటూరు వేంకటేశ్వరరావు భావకవిత్వ కాలంలోని శిఖరాయమాన కవుల్లో ఒకరు. వీరూ, పింగళి లక్ష్మీకాంతంగారూ పింగళి-కాటూరి జంట కవులుగా గొప్ప సాహిత్యాన్ని పండించారు. పదహారో శతాబ్దం తర్వాత బాగా చప్పబడిపోయి ఏమాత్రం స్ఫూర్తి కలిగించలేని ధోరణిలో వెర్రిపూలు పూస్తున్న తెలుగు కవిత్వం మీద తిరుగుబాటులాగా వచ్చిన భావకవిత్వోద్యమం కేవలం ముప్ఫై, ముప్ఫై అయిదేండ్లకే – శ్రీశ్రీ అనే ఆయన కావించిన దారిమళ్ళింపు వల్ల – తన ఉరవడిని చాలావరకు కోల్పోయింది. అయితే ఏం, ఆ మూడూ మూడున్నర దశాబ్దాల్లో ఎంత పుష్పఫల సంపన్నమైన ఉద్యానంగా మారిపోయింది తెలుగు కవిత్వ సీమ! తెలుగు పద్యానికి ఎంత శోభ సమకూరింది ఆ సమయంలో! పద్యం లోని భావాలే కాక, పద్యం యొక్క రూపం కూడా ఎంత ఆహ్లాదకరమైన మార్పు పొందింది! అంగాంగ వర్ణనలూ విరహబాధలూ మదనోపాలంభాల స్థానంలో మధురమైన ప్రేమభావం వచ్చింది. శర్వరీకౌముదులు, శీతపవనపక్షాలు, తవిరాకుజొంపాలు, తుహినకిరణ కోమలరేఖల వంటివి పద్యాలను కమ్మేశాయి. చాలామంది వీటిని ఆహ్వానించారుగాని, పద్యంలోని ప్రౌఢిమ కొట్టుకుపోయి లాలిత్యమే ప్రధానమైపోయిందని బాధపడ్డవారూ వున్నారు. వారి బాధనూ పూర్తిగా కొట్టిపారవేయలేం. ఎందుకంటే శ్రీనాథ, పెద్దనాది కవుల పద్యాలూ వాటి ప్రభావమూ పద్యప్రియులను వదలడం జరిగే పనికాదు. పద్య నిర్మితిలో లాలిత్యాన్నీ ప్రౌఢిమనూ ఏక కాలంలో చూపించిన భావకవుల్లో కాటూరివారు ముఖ్యులని నా వినమ్రోద్దేశం. పౌలస్త్య హృదయము నలబై పద్యాలు కూడా లేని చిన్న ఖండిక అయినా, ఎంతో సుందరమైన పద్యాలన్నీను. అలానే వారే రచించిన గుడిగంటలు అనే మరో చిన్న 42 పద్యాల లఘు కావ్యం కూడా. ఈ రెండూ కాటూరు వారు స్వయంగా వ్రాసినవైతే, తొలకరి, సౌందరనందము అనేవి పింగళి-కాటూరి జంటగా వ్రాసినవి.

పరిమాణంలో చిన్నవైనా పరిణాహంలో దొడ్డవి- పౌలస్త్య హృదయము, గుడిగంటలు. వారి పద్యాలు మననం చేసుకోవడం ఎంతో హాయిగానూ తృప్తిగానూ ఉంటుంది.

(పౌలస్త్య హృదయము క్రింది లింకులో చదవగలరు)

https://andhrabharati.com/kavitalu/kATUri/paulastya_hRidayamu.html

-----------------------------------------
డెబ్బది రెండు గాథలకు టెక్కెము నియ్యది నూరుపేరుతో!

సాహిత్య గుమ్మడి..57--2/12/22
ఉ//
అబ్బుర మొక్కతీరు పదయందము, కొప్పెర వృక్షవాటికల్,
దిబ్బలు ద్వీపినీ సికత, తీరగు సవ్వడిఁ రోకపైనమున్,
పబ్బము తీరు తెన్నులును, పండెడి పంటలుఁ, చిన్న గ్రామమే
ఇబ్బడి యైనపొత్తమది యింపుగ నెయ్యది? వ్రాసెనెవ్వరో?

జవాబులు
1) మా పసలపూడి కథలు.
2) శ్రీ వంశీ.

"మా పసలపూడి కథలు" ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన వంశీ కలం నుండి వెలువడిన అందమైన కథలు. స్వాతి వారపత్రికలో ఈ కథలు అశేష ప్రజాధరణ పొందినవి. ఈ కథలకు ప్రసిద్ధ చిత్రకారుడు బాపు వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు. స్వాతి వారపత్రికలో ధారా వహికంగా వచ్చిన ఈ కథలను కుట్టి మాస్ ప్రెస్, హైదరాబాద్ వారు పుస్తకరూపంలో పాఠకులముందుకు తెచ్చారు.
ఈ కథలలో రచయిత కథా వస్తువుగానూ, ప్రతీ పాత్ర యొక్క పూర్వాపరాలనూ తూర్పు గోదావరి జిల్లాను మూలంగా తీసుకొన్నాడు. పాత్రల భాష, అలవాట్లు అన్నీ అదే ప్రాంతముల నుండి తీసుకున్నాడు. కథా వస్తువేదైనా తనదైన శైలి, రచనా నైపుణ్యంతో రసవంతమైన వ్యవహారిక భాషలో, దృశ్సీకరణ సంవిధానంతో రచన సాగించడం వంశీ ప్రత్యేకత. పుస్తకము మొదలెడితే చివరివరకు ఆపకుండ చదివించే ఆకర్షణ ఈపుస్తకము లోని కథలకుంది. ఈకథలలోని కథా కాలనేపథ్యము ఇంచుమించు 60ఏళ్ల క్రితం మొదలై, ఈమధ్యకాలము 20 సంవత్సరములముందు వరకు జరిగినవిగా భావించాలి. పట్టణాలలో పుట్టిన వారిని మినహాయించి, పై మధ్యకాలంలో గ్రామాలలో పుట్టినవారు ఈ కథలను చదువుచున్నప్పుడు, ఈ కథలలోని పాత్రలు తన నిజజీవితంలో ఎక్కడొకచోట తనకు పరిచయమున్నట్లు అన్పిస్తుంది.

ఈ 72 కథలలోని ముఖ్య పాత్రలు అతి సామాన్యంగా ఉంటూనే అత్యధ్భుతంగా మలచబడ్డాయి. మనిషికి కావలసింది చదువు, డబ్బు – నిజమే. కానీ వీటి కంటే ముఖ్యమయినది ఒకటుంది. అదే సంస్కారం. అది లేనప్పుడు మిగితావి ఎన్ని ఉన్నా లేనట్టే. ఆ సంస్కారం ఉట్టి పడుతూ ఉంటాయి ఈ పాత్రలు. వారు పెద్దగా చదువుకున్న వారో, బాగా డబ్బున్న వారో కాకపోవచ్చు, కానీ గొప్ప సంస్కారం ఉన్నవారు. వంశీ గారి కథలలో వర్ణనకి పెద్ద పీట వేస్తారు. తన వర్ణనలతో, మనల్ని ఆ ప్రదేశాలకు తీసుకువెళతారు. ఆ పాత్రలు కూడా మనం రోజూ కలిసే వ్యక్తుల లాగ కనిపించడం, మనం వాళ్ళలో ఒకరిగా అనిపించడం వుంటుంది. కథలలో చివరగా సున్నితమైన చిన్న మెలిక పెట్టటం (“వాళ్ళ బంధం”, “రామభద్రం…” కథలలో ముఖ్య పాత్ర మరణం, “కోరి రావులు గారి బస్ కండక్టర్ ”లో అందరికి సాయ పడే భద్రం చివర్లో కనిపించకుండా పోవటం..) తో, హృదయాన్ని ఎక్కడో సుతి మెత్తగా ఓ ఆవేదనా తరంగం స్పృశిస్తుంది.

------------------------------------------
సాహిత్య గుమ్మడి-- 58--3/12/22
ఉ//
ఊరును పేరులేనతివ నోముగ నొచ్చె కనీయునింటికిన్
కూరిమి జాపినొందతివ గోకుల నందుఁ తపస్సుజేసియున్
కోరియు మిక్కుటంబుగను కూటిని, బ్రోచెగ నొక్క గోమలిన్
వారెవ! వ్రాసెనెవ్వరది? వాసిని బొందిన దెద్దియందురో?

సరైన జవాబులు
1)  తెనాలి రామకృష్ణుడు
2) పాండురంగ మహాత్మ్యముt

వీరికి తెనాలి రామకృష్ణుడనీ, రామలింగడనే పేర్లతో రాయల కాలం తర్వాత ఉద్భటారాధ్య చరిత్ర, పాండురంగ మహత్యం కావ్యాలను ఈ కవి రచించాడు. ఘటికాచల మాహాత్యము కూడా ఈతని గ్రంథమే. 16వ శతాబ్ది వాడైన విరూరి వేదాద్రి మంత్రికి పాండురంగ మహాత్మ్యము అంకితమిచ్చాడు. తెనాలి అగ్రహారం వీరిది. సరసకవి, వికటకవి అనే పేర ఈయన చాటువులు కొన్ని లోకంలో ప్రచారంలో వున్నాయి. రాయల ఆస్థాన కవుల అష్టదిగ్గజాలలో ఇతనొకడని ప్రతీతి. అయితే రాయల కాలం నాటికి వయోరీత్యా చిన్నవాడు ఈ కవి. ఆంధ్రప్రాంతానికి చెందిన ఇతడు మహారాష్ట్రకు చెందిన పండరినాథుని ప్రశంసిస్తూ కావ్యం వ్రాయడం విశేషం. దానికి విజయనగరకాలపు ఆలయాలలో విఠలనాథుని ఆలయం ప్రసిద్ధి పొందడమే కారణం.

రామకృష్ణుని పదగుంఫనం ప్రసిద్ధం. వ్యర్థ పదాలకు స్థానం లేదు. భాశా ప్రయోగంలో ఘనుడు. అందుకే కాకుమాను మూర్తి కవి "పాండురంగ విభుని పదగుంఫనం" అని ప్రశంసించాడు.
ఆరుద్ర అంటారు "మారుమూల పదాలను, ఔచిత్యం లేని సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయత ఉట్టిపడేలా తెలుగు పదాలు జోడించి సమాసాలు కట్టడం అతనికే తెలుసు.” విశ్వనాథ వారు శైలీ నిర్మాణంలో పాండురంగ మహత్యం 'కైలాస శిఖరం' వంటిదన్నారు.

నిగమశర్మ కథ
పూర్వం పిఠాపురంలో నిగమశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు. పేరు మాత్రం గొప్పగా నిగమశర్మ (నిగమములు = వేదములు) అని వుంది కాని అతనికి లేని పాడు బుద్ధులు లేవు. జూదరి, వేశ్యాలంపటుడు. వాడి ప్రవర్తన మార్చడానికి వాడి భార్యా, తల్లీతండ్రులూ ఎంతో శ్రమపడతారు. కానీ వాడిది పిల్లి శీలము. చదువులు చిలుక చదువులు. వాడు తాత తండ్రులు సంపాదించిన ఆస్తి అంతా వేశ్యలకు ధారపోశాడు. తల్లి నగలు తాకట్టు పెట్టాడు. దొరికిన చోట్లల్లా అప్పు చేశాడు. బంధువులను యాచించాడు. ఈ రకంగా భ్రష్టు పట్టిపోయిన వీషయం తెలుసుకొని అతని అక్క, తమ్మునికి మంచిబుద్ధి చెప్పడానికి భర్తనూ, పిల్లలనూ తీసుకొని పుట్టింటికి వస్తుంది.

ఇక్కడ నిగమశర్మ అక్కను గురించి విపులంగా ముచ్చటించుకొని తీరాలి. ఎందుకంటే, ఈమె తెలుగు సాహిత్యంలో మర్చిచిపోలేని పాత్రల్లో ఒకటి. తెనాలి రామకృష్ణ  కవి ఈమెకు పేరేమీ పెట్టలేదు. అయినా ఏమి, ఎంతో పేరు ఆమెకు ఆమే సంపాదించుకున్నది. పెద్దన వరూధినిలాగా, తిమ్మన సత్యభామలాగా, గురజాడ మధురవాణిలాగా, కలకాలం గుర్తుండిపోయే పాత్ర ఈ అక్కది. ఇప్పుడు చెప్పుకున్న మిగతా నాయికలందరూ ఆయా కావ్యాల్లో చాలా దీర్ఘమైన కార్యక్రమాలే నిర్వహించారు గాని, నిగమశర్మ అక్క మాత్రం కావ్యంలోని ఒక చిన్న ఉపాఖ్యానంలో ఒక క్షణం పాటు జిగేల్మని మెరిసి పోయిన మెరుపు మాత్రమే. అయినా మరపు రాని మగనాలు. పుట్టింటికి వచ్చిన ఎన్నో రోజుల తర్వాత గాని తమ్ముడు ఇంటికి వచ్చి ఆమెను కలవడు. ఈ లోపల ఆమె ఆ ఇంట్లోనిర్వహించిన వ్యవహారం – ఒక ముఖ్యమైన నేపథ్యం. ఆ తర్వాత, తమ్ముడు వచ్చిన పిమ్మట అతనితో మాట్లాడబోయే ముందు జరిగిన తతంగం మరో నేపథ్యం. ఈ రెండు నేపథ్యాలూ ఆమె పాత్రను ఎంతో అద్భుతంగా ప్రోత్తుంగపరచినవి.

రాధ కథ
ఈ కావ్యంలో మరికొన్ని కథలున్నాయి. అందులో రాధాదేవి కథ, సుశీల కథ, హంస, పాము, చిలకల వృత్తాంతం, అయుతునియతుల గాథ వివరంగా చెప్పబడ్డాయి.

నందునికి దగ్గర చుట్టం శతగోపుడు. అతని కూతురు రాధ. ఆమె చాలా సౌందర్యవతి. కృష్ణుడు ఆ సమయంలో గోపికల వెంటబడి తిరుగాడుతున్నాడు. రాధ స్వామి కంటబడినది మొదలు ఆమె కోసం తపించాడు. రాధ స్వామి కోసం తపస్సు చేసింది. స్వామి ప్రత్యక్షమై శివుడు పార్వతిని స్వీకరించినట్లు రాధను ప్రేమతో స్వీకరించాడు.

సుశీల కథ:
శ్రీకృష్ణుని శిరస్సుపై పాలధార వదిలిన ఒక ఆవు మరుజన్మలో వైష్ణవ కుటుంబంలో సుశీలగా జన్మించింది. సుశీల భర్త కర్కోటకుడు. హింసలు పెట్టేవాడు. ఆమె సుగుణశీల. భగవంతుడామెను పరీక్షింప నెంచి బ్రహ్మచారి వేషంలో వచ్చి 'ఆకలి వేస్తోంది! అన్నం పెట్ట'మని గోల చేశాడు. ఇంట్లో వున్న పదార్థాలన్నీ వడ్డించినా తృప్తి పడలేదు. చివరకు భగవంతుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. భర్త మర్యాదగా ప్రవర్తించసాగాడు. వారికి నలుగురు కొడుకులు పుట్టారు. ఆమె చివరి దశలో ముక్తిని పొంది భర్తతో కుడా విమానంలో వైకుంఠం చేరింది.
************************************************
సాహిత్య గుమ్మడి-- 59--4/12/22
ఉ//
సిద్ధిని బొందఁ వారలను చేగొని శైవము నెంచి బెక్కుగన్
సుద్దులు జెప్పుకాపరులఁ జూపుచు, నాటివి సాంఘికాంశముల్
దిద్దిరి పశ్వురోగముల, తేటగ దెల్పిరి శాస్త్ర వ్యాప్తినిన్
బుద్ధిగ యంకితంబిడెగ పొత్తముఁ స్వామికి నెవ్వరెద్దియో?

సరైన జవాబులు
1) గౌరన
2) నవనాథ చరిత్ర

నవనాథ చరిత్ర 14-15వ శతాబ్దానికి చెందిన ద్విపద కావ్యము. దీనిని గౌరన రచించెను. దీనిని కోరాడ రామకృష్ణయ్య సంపాదకత్వంలో మద్రాసు విశ్వవిద్యాలయం 1937లో ముద్రించింది.

శ్రీగిరికవి రచించిన నవనాధ చరిత్రను అనుసరించి గౌరన ఈ నవనాథ చరిత్ర ద్విపద కావ్యాన్ని రచించాడు. ఇందులో తొమ్మిది మంది శైవ సిద్దుల మహాత్మ్యం వర్ణించబడిండి. వీరిలో మీననాధుడు అపార మహిమాన్వితుడు. ఆనాటి జనసామాన్యంలో వ్యాప్తిలో ఉన్న సారంగధర కథను రెండు ఆశ్వాసాలలో రచించాడు. చేమకూర వెంకటకవి గౌరన సారంగధర చరిత్రను అనుసరించే సారంగధర కథను రచించాడు. 15వ శతాబ్దంలోని తెలుగు దేశ సాంఘిక స్థితిగతులను తెలుసుకోవడానికి గౌరన రచన ఉపకరిస్తుంది. ఇందులో గొల్లవారికి సంబంధించిన విశేషాలు, పశురోగ వివరణలు ఉన్నాయి.

దీనిని శ్రీశైలంలో ఒక మఠాధిపతిపదియైన భిక్షుకవృత్తి శాంతరాయడు గౌరనమంత్రిని ప్రోత్సాహించినట్లుగా చెప్పుకున్నాడు; కావ్యాన్ని శ్రీశైల మల్లికార్జునికి అంకితమిచ్చాడు.

విషయసూచిక
ప్రథమాశ్వాసము:
కృతి ప్రశంస, ముక్తికాంత భిక్షావృత్తిరాయ ప్రశంస, కృతికర్త వంశావళి, అంకితము, కథాప్రారంభము, కైలాసవర్ణనము, శివుని కొలువు, వసంతవర్ణనము, శివుని యధ్యాత్మ విద్యోపదేశము, మీననాథుని జన్మప్రకారము, శివుడు మీననాథునికి వరము లొసంగుట, శివుడు కైలాసమున కేగుట, మీననాథుని దేశాటనము, మాంధాతపురమున గొల్లడు మీననాథుని దర్శించుట, సారంగధరుని కథ.
ద్వితీయాశ్వాసము:
చౌరంగి వృత్తాంతము, గోరక్షసిద్ధుని కథ, సర్పరూపమొందిన గంధర్వుని కథ
తృతీయాశ్వాసము:
మేఘనాథసిద్ధుని కథ, విరూపాక్షనాథుని కథ, వంచక పురోహితుని కథ, కపోత వృత్తాంతము
చతుర్థాశ్వాసము:
నాగార్జునసిద్ధుని కథ, ఖణికాఖ్యసిద్ధుని కథ, మీననాథుని పరకాయప్రవేశము, మీననాథుని హిమవత్ ప్రయాణము
పంచమాశ్వాసము:
మీననాథుడు శిష్యుల మతవ్యాప్తి జేయ బంపుట, గోరక్షుడు శ్రీశైలంబునకు బోవుట, అల్లమప్రభుని రాక, గోరక్ష-ప్రభువుల సంవాదము, నాగార్జునశిష్యుడు-రసవాదము, విష్ణువు నాగార్జునశిష్యుని బంపుట, వ్యాళిసిద్ధుడు-కాయసిద్ధి, గోరక్కుని వృత్తాంతము, కృష్ణకంధారభూపుని కథ
***********************************************
సాహిత్య గుమ్మడి-- 60--5/12/22
మ.కో(పంచపాది)
భూమి సూనుడొకండు. భూమినె ప్రోవుజేసియుఁ నేర్పుగా
భూమిసామిగనయ్యెనాతడు, భూమిగల్గియునొక్కడున్!
భూమిఁ గానక దర్పమున్ కడు భూవిహీనుడునయ్యగా!
ఏమిలేకనె మాటకారియు నేలె గ్రామమునంతటిన్!
భూమి చుట్టుత దిప్పి వ్రాసెగ పొత్తమెవ్వరదెద్దియో?

సరైనజవాబులు--
1) శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి.
2) "మట్టిమనిషి"

పరిచయము:-
మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి రాసిన తెలుగు సాంఘిక నవల. ఈ నవలకు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వర రావుగారు ఆరుద్రగారు ముందుమాటలు వ్రాసినారు. వంద సంవత్సరాల కాలంలో నాలుగు తరాల నేపథ్యంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను, భూస్వామిక, ధనిక రైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతను సమగ్రంగా చిత్రించిన నవల. ఈ నవల 1970లో ఆంధ్రప్రభ దినపత్రిక లో రెండేళ్ళు ధారావాహికగా వచ్చింది. షుమారు ఆరు వందల పేజీల నవల ఇది. ఈ నవల నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా ద్వారా పద్నాలుగు భారతీయ భాషలలోకి అనువదించబడింది. ఈ నవల ఆంగ్ల అనువాదం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీసుకువచ్చింది. రచనలో గుంటూరు జిల్లా మాండలికం, ప్రజల నుడికారం విస్తృతంగా కనిపిస్తుంది.
-----------------------------------------+
సాహిత్య గుమ్మడి-- 61--6/12/22
మ.కో(షట్పది)
పెక్కు సాంఘిక, సంఘ, సాహస, ప్రేమ వర్ణన లింపుగన్
కుక్కటమ్ములు, సంప్రదాయపు గొప్పలెంచియునిందునన్
పెక్క గాథలతోడనల్లిరి బేర్చి వాస్తవ మించుకన్
చక్కగా సహవాస, సాహస చర్చ యంతమునందునన్
ఒక్కగానొక నాయకుండుకు నుగ్గడించుగ యందరున్
నిక్కవంబుగనూక్తమంబుగనేరు వ్రాసిరి? యెద్దియో?

సరైన జవాబులు
మూలఘటిక కేతన
దశకుమార చరిత్రము

రచయిత గురించి
ఈ కావ్యాన్ని రచించిన కేతన వేంగీ దేశమున వెంటిరాలు అనే అగ్రహారానికి అధిపతి. కౌండిన్యస గోత్రుడు. ఈయన ఇంటి పేరు మూలఘటిక వారు. తండ్రి పేరు మ్రానయ్య. దండి రచించిన ప్రముఖమైన ఈ కావ్యాన్ని తెలుగులోకి అనువదించడం చేత ఈయనకు అభినవ దండి అనే పేరు వచ్చింది. ఈయన దశకుమారచరిత్రముతోబాటు విజ్ఞానేశ్వరీయము, ఆంధ్రభాషాభూషణము అనే మరో రెండు పుస్తకాలు కూడా రచించాడు.

దశకుమార చరిత్రము దండి మహాకవి రచించిన సంస్కృతం గద్య కావ్యానికి కేతన అనువదించిన తెలుగు పద్యకావ్యం. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాధలను కవి పద్యాలలో వర్ణించాడు. ఇది 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్న కావ్యం. ఇందులో కేతన ఆనాటి సంఘం స్వరూపాన్ని,"  ఆచారాలను. ఆభరణాలను వర్ణించాడు. సంస్కృత మూలంలో లేని పెక్కు సంప్రదాయాల వర్ణన ఈ కావ్యంలో కేతన పొందుపరచాడు. ఆంధ్ర ప్రాంతపు "కోడి పందేలాట"ను కూడా కేతన వర్ణించాడు. ఇది మరొక కవియైన తిక్కనకు అంకితం ఈయబడింది. ఈ గ్రంథం 1901 లో ఒకసారి ప్రచురించగా, తర్వాత 1925 లో శేషాద్రి రమణ కవులు పరిష్కరించగా వావిళ్ళ వారు ప్రచురించారు.

సారాంశం
కేతన మూలగ్రంథం లోని కథల వర్ణనాంశాలను కొంచెం తగ్గించి కొన్ని కథాంశాలను పెంచి రాశాడు. పన్నెండవ ఆశ్వాసములో ఉన్న అపహారవర్మ కథలో మాత్రం అక్కడక్కడ మూలగ్రంథంతో తేడాలున్నాయి. ఈ గ్రంథం అద్భుత గాధలతో కూడుకుని ఉన్నప్పటికీ కథలలో తరచుగా వాస్తవికత కూడా కనిపిస్తూ ఉంటుంది. పేరులో చెప్పినట్లుగా ఇది పది మంది యువకుల కథ. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగిన ఈ పదిమంది సాహసయాత్ర చేస్తూ విడిపోతారు. తిరిగి వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు ఆ పదిమందిలో నాయకుడిగా చెప్పబడేవానికి మిగతా వారు తామ అద్భుత అనుభవాలను చెప్పడం ఈ గ్రంథ వృత్తాంతం. ఈ కథలు శాఖోపశాఖలుగా విస్తరించినప్పటికీ ఒక మూలకథకు ముడివేస్తాడు కేతన.
------------------------------------------
సాహిత్య గుమ్మడి-- 62--7/12/22
మ.కో(షట్పది)
పెక్కు సాంఘిక, సంఘ, సాహస, ప్రేమ వర్ణన లిప్తమున్
చిక్కి కానలలోన వీడియు చేరియందరు నేకమై
చక్కగా సహవాస, సాహస చర్చ యంతమునందునన్
ఒక్కగానొక నాయకుండుకు నుగ్గడించుగ యందరున్
నిక్కమంబుగలభ్యమిందున నెట్టె గ్రందపు భాగముల్
వక్కణించగరారె ప్రాజ్ఞులు వ్రాసెనెవ్వరదెద్దియో?

సరైన జవాబులు
1) వెన్నెలకంటి అన్నయ్య
2) షోడశకుమార చరిత్ర

తెలుగు సాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాలలో షోడశకుమార చరిత్ర ఒకటి. దీనిని క్రీ. శ. 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలానికి చెందిన వెన్నెలకంటి అన్నయ్య రచించాడు. తెలుగులో భేతాళ పంచవింశతి కథలపై వెలువడిన తొలి ప్రాచీన గ్రంథం షోడశకుమార చరిత్ర. ఇతడిని దూబగుంట నారాయణ కవికి (క్రీ. శ. 1470) సమకాలికునిగా భావిస్తారు. అన్నయ్య తన షోడశకుమార చరిత్రను తన తండ్రి వెన్నెలకంటి సూరామాత్యునికే అంకిత మిచ్చాడు.
షోడశకుమార చరిత్రకు మూలం ఇది అంటూ నిర్దుష్టంగా చెప్పదగిన కావ్యం లేదు. అలా అని స్వతంత్ర రచన అని భావించనవసరం లేదు. సంస్కృత భేతాళ పంచవింశతి నుండి కొన్ని కథలను యథాతదంగా స్వీకరించి, సమకాలిక తెలుగు కథాకావ్యాలలోని కొన్ని కథలనుండి ప్రేరణపొంది అన్నయ్య తనదైన శైలిలో కథలల్లుతూ షోడశకుమార చరిత్రను రాయడం జరిగింది.

సంస్కృతంలో వున్న భేతాళ పంచవింశతిలో భేతాళుడు చెప్పే 25 అద్భుత సాహస కథలున్నాయి. చిక్కు ప్రశ్నలతో ముగిసే ఈ కథలకు ప్రతీ రాత్రి భేతాళుడు చెపుతుంటే వాటికి విక్రమసేనుడు సమాధానాలను చెపుతూ వచ్చి చివరకు 25 వ కథలోని చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతాడు. షోడశకుమార చరిత్రలోని జ్ఞానవిజ్ఞానశూరుల కథ, మదనమంజరి కథ, దేవసేనచరిత్రం వంటి కొన్ని కథలకు ఈ భేతాళ పంచవింశతి లోని కథలు మాతృకగా ఉన్నాయి. అందుచేతనే ఈ కథాకావ్యం చాలాకాలం వరకూ భేతాళ పంచవింశతి అనే పేరుతోనే ప్రసిద్ధమైంది. దీనిలోని కథలకు కేతన దశకుమార చరిత్ర లోని కొన్ని కథలతో పోలికలు, జక్కన విక్రమార్క చరిత్ర లోని కొన్ని సంఘటనలతోను అనుకరణలు కూడా కనిపిస్తాయి. ఇంతేకాక కథాసరిత్సాగరం, మంచెన కేయూరబాహు చరిత్రల ప్రభావం ఈ కథాకావ్యంపై కనిపిస్తుంది.

కావ్య ఇతివృత్తం
విడిపోయి చెల్లాచెదురైన 16 మంది స్నేహితులు (షోడశ కుమారులు) తిరిగి కలుసుకొని తాము పొందిన అనుభవాలను కథల రూపంలో రాకుమారునితో పంచుకోవడం ఈ కథాకావ్యంలో ప్రధాన ఇతివృత్తం. దీనిలో ప్రధాన నాయకుడు కమలాకరుడనే రాకుమారుడు. ఇతనికి 8 మంది మంత్రి కుమారులు (కరుణాకరుడు, చిత్రకారుడు, కాంతిమంతుడు, బుద్ధిసహాయుడు, వివేకనిధి, ప్రభాకరుడు, యశఃకేతుడు, నీతిమంతుడు), 4 గురు దండనాయక కుమారులు (భీమభటుడు, విక్రమకేసరి, దీర్ఘ బాహుడు, దృఢముష్టి) ముగ్గురు పురోహిత కుమారులు (వసంతకుడు, మతిమంతుడు, కళానిధి) - వెరసి మొత్తం 15 మంది స్నేహితులుంటారు. రాకుమారునితో కలుపుకొని వీరు మొత్తం 16 మంది- షోడశ కుమారులవుతారు.ఈ 16 మంది స్నేహితులు ఒకరోజు అడవిలో అనుకోకుండా ఆపదలో చిక్కుకొని విడిపోయి చెల్లాచెదురవుతారు. కొంతకాలానికి ఒకరి తరువాత ఒకరుగా తిరిగివచ్చి తమ తమ విచిత్ర అనుభవాలను రాకుమారుడు కమలాకరునితో చెప్పిన కథలు ఇవి.

8 అశ్వాసాలు గల ఈ గ్రంథం పూర్తిగా లభ్యం కాలేదు. 3,4 అశ్వాసాలు దొరకలేదు. దొరికిన ఆశ్వాసాలలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి.
రెండవ ఆశ్వాసం: షోడశకుమారులు విడిపోవడం గురించి, కమలకరుడు, భీమభటుడు, కరుణాకరుడు, చిత్రకారుడు, కాంతిమంతుడు, బుద్ధిసహాయుడు, వసంతకులకు సంబంధించిన కథలున్నాయి.
మూడవ ఆశ్వాసం: అలభ్యం
నాలుగవ ఆశ్వాసం: అలభ్యం
ఐదవ ఆశ్వాసం: విక్రమకేసరికి సంబంధించిన కథలున్నాయి. దీనిలోనే భేతాళుడు చెప్పిన కథలున్నాయి. అవి భోజనవనితాశయ్యాచంగుల కథ, జ్ఞానవిజ్ఞానశూరుల కథ, మదనమంజరి కథ, దేవసేనచరిత్రం, వైశ్యకన్యకథ, ధర్మరాజుకథ.
ఆరవ ఆశ్వాసం: వివేకనిధి, ప్రభాకరులకు సంబంధించిన కథలున్నాయి.
ఏడవ ఆశ్వాసం: దీర్ఘ బాహుడు, దృఢముష్టి లకు సంబంధించిన కథలున్నాయి.
ఎనిమిదవ ఆశ్వాసం: రాకుమారుని వివాహ వివరాలున్నాయి
------------------------------------------
సాహిత్య గుమ్మడి-- 63--8/12/22
ఉ//(పంచపాది)
జంటగ నిర్వురున్గలసి జక్కగ నొక్కటి నామధేయమున్!
మెండుగ వ్రాసి సాహితిని మిక్కిలి కీర్తిని నొందెవారలున్!
నిండుగ గ్రామ, పట్టణముఁ నెంచి దళారుల, వర్తకంబులన్
పంటకు నప్పుజేయనొక ఫాలుని తిప్పల నిందుజేర్చియున్
మంటలు రేగవ్రాసెవరు? మాన్యులు దెల్పరె పొత్తమెయ్యదో?

సరైన జవాబులు
1) బీనాదేవి
2) పుణ్యభూమీ కళ్ళు తెరు

బీనాదేవి (జ: 1935 ఫిబ్రవరి 11) తెలుగు రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె భర్త భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు. తెలుగు సాహిత్యంలో బీనాదేవిది ప్రత్యేక స్థానం. భార్యాభర్తలు ఒకే పేరుతో రాయటం వీరితో ప్రసిద్ధమయింది.
బీనాదేవి విశాఖపట్నంలో చోడవరంలో 1935 ఫిబ్రవరి 11 న జన్మించింది. బి.ఏ ఉత్తీర్ణురాలైంది. ఈమెపై రాచకొండ విశ్వనాథశాస్త్రి ప్రభావం ఎక్కువ. ఆమె 1965 నుండి రచనలు కొనసాగిస్తుంది. ఆమె రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది అనే కథానిక సంకలనాన్ని ప్రచురించింది. ఆమె భర్త భాగవతుల నరసింగరావు సబ్‌జడ్జి, రచయిత. భర్త మరణం తర్వాత 1990 నుండి స్వయంగా కథలూ, వ్యాసాలూ రాస్తూ బీనాదేవి కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించింది.

బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం  విస్మయం కలిగించే తీరులో సాగుతుంది.  రావి శాస్త్రి ప్రభావం నీడలా వెన్నాడుతుంటుంది. పుణ్యభూమీ కళ్లు తెరు, మార్క్సిజం ప్రభావంతో రాసిన హేంగ్ మీ క్విక్ లాంటి ఎన్నో రచనల్లో ప్రతీ అక్షరం ప్రజల తరుఫున వకాల్తా పుచ్చుకొని సమాజాన్ని, పాలకులను బోనెక్కిస్తుంటుంది. రావి శాస్త్రి రచనా వ్యక్తిత్వానికి  బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం అని అంటారు కొడవటిగంటివారు. ఆమె రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర పలుకుతుంటుంది. ఆమె పేరు వినగానే చప్పున స్ఫురించేది 'పుణ్యభూమీ  కళ్లు తెరు'. 'హేంగ్ మీ క్విక్' పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. వారు రాసిన నవలల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నవల తెలుగు సాహిత్యంలో కూడా ముఖ్యమైన నవలల్లో ఒకటిగా నిలిచింది.1972 లో వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

రచనా నేపథ్యం
ఈ నవలను బీనాదేవి రచించగా 1969-70 మధ్యకాలంలో ఆంధ్రజ్యోతిలో హేంగ్ మీ క్విక్ అన్న పేరుతో  సీరియల్ గా ప్రచురితమైంది. సీరియల్ గా ప్రచురితమౌతున్నప్పుడు నవల సంచలనం కలిగించింది. సీరియల్ పూర్తయ్యాకా దీన్ని పుస్తకరూపంలోకి తీసుకువచ్చినపుడు పుణ్యభూమీ కళ్ళు తెరు అన్న పేరు పెట్టారు. నవల నేపథ్యం 1960 దశకం నాటి కళింగాంధ్ర ప్రాంతం, మొదట కళింగాంధ్ర ప్రాంతంలోని ఓ పల్లెటూరులో ప్రారంభమై, విశాఖపట్టణంలో ముగుస్తుంది.

ఇతివృత్తం
కళింగాంధ్రంలోని ఓ పల్లెటూళ్ళో మహాలక్ష్మమ్మకి రాజమ్మ పుడుతుంది. రెండో ఏటనే మేనత్త కొడుకు సింహాచలానికి రాజమ్మనిచ్చి పెళ్ళిచేయాలని అనుకుంటారు, చిన్నతనంలోనే చేస్తారు. సింహాచలం, రాజమ్మలు ఓ వయసుకు వచ్చాకా కాపురానికి పంపేస్తారు. రాజమ్మ పేదవేషం వేసుకున్న యువరాణిలా ఉంటుంది. ఆమె చాలా ఆరోగ్యకరంగా, అందంగా ఉంటుంది. ఐతే అందుకు భిన్నంగా సింహాచలం బక్కగా, డబుల్ టైఫాయిడ్ వచ్చి కోలుకుంటున్న నక్కలా ఉంటాడు. వాళ్ళకి ఓ అరెకరం పొలం ఉంటుంది. సింహాచలానికి ఆరుగాలం కష్టపడి, కాస్తో కూస్తో పండించినా చివరికి మనకేమీ మిగలదన్న చేదునిజం మొదటి నుంచీ తెలుసు.
సింహాచలం కుటుంబంలో భార్య, ముసలి తల్లి, కొడుకు ఉంటారు. హఠాత్తుగా సింహాచలం తల్లికి పక్షవాతం వస్తుంది, ఆమెకు వైద్యం చేయించేందుకు తగ్గ డబ్బు అతని వద్ద ఉండదు. చెరుకు తోట వెయ్యడానికైతే అప్పుపెట్టే షావుకారు, తల్లికి వైద్యం చేయించడానికంటే అప్పివ్వడు. ఇక వేరే దారి లేక గవర్రాజు మావ దగ్గరికి వెళ్తాడు. గవర్రాజు సాధారణ స్థాయి నుంచి మొదలై మున్సిపల్ కాంట్రాక్టరుగా పదెకరాల పొలం, అంటుమామిడితోట, డాబా ఇల్లు, పట్నంలో చదువుతున్న కొడుకు, జీవితంలో ఇంకా ఎదుగుతానన్న నమ్మకం సంపాదించుకునేందుకు చేయని పాపం, అన్యాయం లేదు. గవర్రాజు షావుకారుతో మాట్లాడి సింహాచలానికి అయిదొందలు అప్పు ఇప్పిస్తూ ఓ ప్రోనోటు, బండి ప్రశస్తమైన బెల్లాన్ని షావుకారు కొట్టుకే తోలుతానన్న షరుతుతో అగ్రిమెంటూ రాయించాడు. సింహాచలం తల్లిని పట్నంలోని ఆసుపత్రికి తీసుకుపోవడానికి సాయం కూడా పడ్డాడు. అమాయకుడైన సింహాచలం నుంచి గవర్రాజు ఇప్పుడూ, అప్పుడు డబ్బు బాగానే లాగాడు. చివరకు డబ్బంతా ఖర్చైపోయి తల్లి మరణించింది. మరణించిన తల్లిని పట్నంలోనే దహనం చేసి, డబ్బు మొత్తం వదిలించుకుని ఊరు తిరిగొచ్చాడు సింహాచలం. ఇప్పుడతనికి తల్లి పోయి, షావుకారు అప్పు మాత్రం మిగిలింది. తల్లి అనారోగ్యానికి, చెరుకుపంట పెట్టుబడికీ షావుకారు ఇచ్చిన బాకీ అసలు, వడ్డీతో కట్టాలి. ఈ పరిస్థితుల్లో తాను రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారం షావుకారుకు అమ్మకుండా వేరే వాళ్ళకి బెల్లం అమ్ముకున్నాడు సింహాచలం. తన బాకీదారు తన ద్వారా బెల్లం అమ్మాలి. కొన్నవాడి దగ్గర కమిషన్, అమ్మిన రైతు దగ్గర కన్యకాపరమేశ్వరి ధర్మం, వర్తక సంఘానికి చందా, తన గుమాస్తాలకు, కళాసీలకు రుసుం వంటివన్నీ కట్టుకునేది ఉండగా, తాత అప్పు, తండ్రి అప్పు తీర్చకుండా తాను వేరేగా అప్పుచేసి మూడు అప్పులూ అలా ఉండనిచ్చి తన ముందే వేరొకడికి అమ్ముకోవడం చిరచిరలాడించింది షావుకారును.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -64--9/12/22
ఉ//
'మీకిది ధర్మమౌనె మము మీమది గోరుట నాలిరూపుగన్
మీకునుమాకు సఖ్యమెటు మీరలయందునె మాదుజన్మమున్
తేకువ చెల్లునౌన తన దేహజఁ గాంచుట కామకోరికన్
జోకయె గాదనాపగయె' జూపెనిదెందున వ్రాసెనెవ్వరో?

తేకువ=గౌరవము, జోక=యుక్తము, ఆపగ=నది (కాదని+ఆపగ=కాదనాపగ)

సరైన జవాబులు
1) వసుచరిత్రము
2) శ్రీ భట్టుమూర్తి
(రామరాజ భూషణుడు.)

రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది. ఒక గొప్ప ఆంధ్రకవి. ఈయన జన్మభూమి బల్లారికి సమీపము లోని పాలమండలము అను ప్రదేశంలో ఉండే భట్టుపల్లె. ఇతడు శాలివాహనశకము 13 వ శతాబ్ద మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతడు రచియించిన గ్రంథములు వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెలుగులో లేదు. రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉంది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటే కనబడుతూ ఉంది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నాయి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి రామరాజభూషణుఁడు, భట్టుమూర్తి అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.

నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము, నరసభూపాలీయము అని కావ్యములను రచించాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము

ఇతనిని గూర్చి పింగళి లక్ష్మీకాంతం ఇలా వ్రాసాడు - "ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. .... ఇతనికి శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు.[1]

భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడు. అధిష్ఠానపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలాహలునికి, శుక్తిమతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం.

వసుచరిత్రలో శుక్తిమతీ కోలాహల వృత్తాంతం అత్యంత రమణీయమైన ఘట్టం. ఈ సందర్భంలో కవి నదీ పర్వతాలకు దైవీరూపాన్ని ఆపాదించి రచించాడు.ఇలా రచించడం చమత్కారానికి మాత్రమే కాదు లౌకికానుభవానికి సంబంధించిన రాగబంధు రీతులను తెలియపరచాడానికి అని అనవచ్చును. ఇంకా భౌగోళిక సంబంధాన్ని మానవ దృష్టితో పరిశీలించి విమర్శించడం కోసం అని కూడా అనుకోవచ్చును. శుక్తిమతి యొక్క నిత్యనిర్మలాకార కాంతిధార కు కోలాహలుడు వశుడవడం విచిత్రమైన మనోవిలాసం. శుక్తిమతి తనని ఆదరిస్తుందని కోలాహలుని నమ్మకం. ఆమె అభిమతం తెలుసుకోకుండా ఆమెను పొందడానికి నిశ్చితాత్ముడు అవుతాడు కోలాహలుడు. కావ్యదృష్టితో పరికించేవారు శుక్తిమతీ కోలాహల వృత్తాంతాన్ని రసాభాసమన్నారు.ఏకత్రైనురాగం కారణంగా ఈ సన్నివేశంలో పోషింపబడినది రసాభాసమనడం సమ్మతమే. ఇందుకు ఇంకొక కారణం కూడా ఉన్నది: నదులకు, పర్వతాలకు ప్రణయం పొసగదని శుక్తిమతి ఇందులో వాచ్యం చేస్తుంది. పర్వతాలకు, నదులకు సఖ్యమా? వినటానికే యుక్తంగా లేదు పర్వతాల నుండి నదులు పల్లానికి ప్రవహిస్తాయి.ఆ నదీ జలం పర్వతానికెక్కడం ప్రకృతి విరుద్ధం. జన్య జనక సంబంధంలో పుత్రికా వాత్సల్యం ఉండాలి కాని అనుచతిమైన ప్రణయానురాగం ఉండకూడదని శుక్తిమతి ఉగ్గడిస్తుంది.వావి వరసలు తెలిసి వర్తించాలని బోధిస్తుంది. మదనవికారంలో గౌరవాన్ని మరచిపోకూడదు అంటుంది. పుణ్యదేశాలు తిరిగి భర్తృవియోగ తపనంచేత శరీరం కృశించగా, భర్తను (సముద్రుని) వెదకికొనిపోయె అభిసారికనని వాచ్యం చేస్తుంది. నదులు కొండలలో పుట్టి పుణ్యప్రదేశాలలో ప్రవహించి సముద్రాన్ని చెందుట లక్షణం. ఇటువంటి తనపై ఉద్దతి పనికిరాదని అతడు తరుణులైన రంభాదులను ఆశ్రయించడం యుక్తమని శుక్తిమతి చెబుతుంది. దీనికి కోలాహలుడు తనది పూర్వజన్మజన్మలప్రేమ అని అతడు చివరికి బలముతో పొందుతాడు.అందుకే వసురాజు దీనిని ఖలగోత్ర ధ్వంసనం అంటాడు. ఇది ఇలా ఉండగా రామరాజభూషణుడి వర్ణన, కవిత్వ పటిమ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.

-----------------------------------------
సాహిత్య గుమ్మడి-- 65--10/12/22
ఉ//(పంచపాది)
పాదుగొనంగబాల్యమున వాసిగలొక్కటి మానసంబునన్
బాధలు పౌరులందరివి పాతుకుపోయిన రాచదుష్కృతుల్
చేదగు రాజకీయములు, చేర్పులు నేర్పడ యాంధ్రరాష్ట్రమున్
పేదల పోరు ఘర్షణలఁ బేర్కొని యా తెలగాణమందునన్
మోదము తోడవ్రాసెనిడి ముచ్చటలెన్నియొ యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
అంపశయ్య నవీన్
కాలరేఖలు

కాలరేఖలు ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ వ్రాసిన నవల. ముఖ్యంగా 1944లో భువనగిరిలో జరిగిన పదకొండో ఆంధ్ర మహాసభ నుంచి నేటివరకు తెలంగాణ సామాజిక చిత్రాన్ని విశ్లేషిస్తూ ఆయన ఈ నవలలు రాశారు. నవీన్ రాసిన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

కాలరేఖలు
నేపథ్యం
బాల్యంలో పిల్లవాడిగా నవీన్ వరంగల్లో జరిగిన 11వ ఆంధ్రమహాసభను చూశాడు. ఆ సభ ప్రారంభోత్సవంలో వేడుకగా అలంకరించిన బండిని 11 జతల ఎద్దులతో నడిపిస్తూ వీధుల వెంట ఉత్సవంగా ఊరేగించి అందులో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సన్నివేశం నవీన్ పై చెరగని ముద్రవేసింది. యువకునిగా సాహిత్వంతో పరిచయమేర్పడినప్పుడు, ఈ ఊరేగింపు సన్నివేశం ప్రారంభ సన్నివేశంగా ఒక్క పెద్ద నవలను వ్రాయలని అనుకున్నాడు. అదే కాలరేఖలు నవలకు బీజం వేసింది 1996 లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీవిరమణ చేశాక నవీన్ ఈ నవలను రాయడం మొదలు పెట్టాడు. కాలరేఖలు 1944 నుండి 1995 వరకు తెలంగాణా ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దంపడుతుంది. 1600 కు పైగా పేజీలున్న ఈ గ్రంథాన్ని పాఠకుల సౌలభ్యం కోసం “కాలరేఖలు”, “చెదిరిన స్వప్నాలు”, “బాంధవ్యాలు” అనే నవలాత్రయంగా విడుదల చేశారు. 2004లో కాలరేఖలు రచనకు, అంపశయ్య నవీన్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు.

సమీక్ష
‘కాలరేఖలు’ నవల విస్తృతమైన తెలంగాణ చరిత్రను పొదివికొని ఉంది. ఆంధ్రమహాసభ దగ్గర మొదలై ఆంధ్రప్రదేశ్ అవతరణలో ముగుస్తుంది. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం, విశాలాంధ్ర భావన, భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు, ముల్కీ ఉద్యమం, దొరలు మళ్లీ గడీలకు రావడం, వినోభాబావే భూదానోద్యమ విషయాలు, కమ్యూనిస్టు, కాంగ్రెస్ రాజకీయాలు, ప్రజాపోరాటాలు, రజాకార్ల ఉద్ధేశాలు, సంగం కార్యకలాపాలు, పోలీస్ చర్య, 1952 నాటి జనరల్ ఎలక్షన్లు, తెలంగాణ గ్రామీణ జీవితానికి చెందిన సాంస్కృతికాంశాలు, మొదలగు విషయాలు నవలలో కనపడతాయి. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక రాజకీయ చరిత్రకు ఈ నవల దర్పణంగా నిలుస్తుంది.

కల్లోల కాలానికి చిత్రికపట్టడం ఎంత ముఖ్యమో ప్రశాంత సమయంలోనూ ప్రజల బతుకులు ఎంత కల్లోలంగా ఉంటాయో చిత్రించడం అంతే ముఖ్యం. ఈ రెండు కీలకమైన అంశాలు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాసిన కాలరేఖలు నవలలో మనకు కనిపిస్తాయి. కేవలం పోరాటాలు, ఉద్యమాలు, ఉద్రేకపరిచే సన్నివేశాలే కాక, బతుకు పోరాటం కోసం సామాన్య ప్రజలు పడే ఆరాటం కూడా సాహిత్యంలో రికార్డు కావలసిన అవసరం ఎంతో ఉంది. జమిలిగా ఈ రెండు అంశాలు కలిసిన నవల ఇది. అందుకే ఈ నవలకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ పల్లెలోని అమాయక జీవితాన్ని కల్లాకపటం ఎరుగని మనసులను, నిర్మల హృదయులైన వారి మానసిక స్పందనలను తెలుసుకోవడానికి, బొమ్మకు బొరుసున్నట్లుగా ఆ మనస్తత్వానికి వ్యతిరేకులైనవారు ఉండటం సహజం. అలాంటి వారి గురించి కూడా పాఠకుడు తెలుసుకునేందుకు ఈ నవలలో అనేక అంశాలున్నాయి. కల్లాకపటం ఎరుగని ఓ బాలుని దృక్కోణం నుంచి కథను నడపడంతో ఇందులో మరింత స్వచ్ఛత, పరిశీలన, కుతూహలం, తెలుసుకోవాలన్న జిజ్ఞాసా ధోరణి కనిపిస్తుంది. పాఠకుడు ఆ ధార వెంట ముందుకుపోతూ ఉంటాడు. కథనంలో ఎక్కడా శ్రీ నవీన్ రచయితగా తన అభిప్రాయాలను ఉటంకించలేదు. పాత్రలు ఆయా సన్నివేశాలలో, ఆయా విషయాల గురించి ఘర్షిస్తాయే కాని, ఎక్కడా లాలూచీ పడవు.

చరిత్రలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా సామాన్య జన నిజజీవితాన్ని అత్యంత వాస్తవికతతో పాఠకుని ముందుంచే క్రమంలో రచయిత చూపిన సంయమనం ఎంతోమెచ్చుకోదగింది. "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదనే" మహాకవి మాటను నిజం చేస్తూ ఈ నవల రూపొందింది. రజాకార్లు అనేది ఉర్దూపదం. రజాకార్లు అంటే అసలు అర్థం వాలంటీర్లు. కాని రజాకార్ల దుర్మార్గ కార్యక్రమాలను ప్రజలు అసహ్యించుకోవడంతో రజాకార్లు అంటే దుర్మార్గులు అనే అర్థం ప్రజలలో ప్రబలింది. ఈ నవలలో రజాకార్ల వ్యవవాహర సరళిని రచయిత వివరించారు. కాలరేఖలు' ఒక నవలకాదు. ఇది సాంఘికాచారాలకు దర్పణం, చారిత్రక సంఘటనల కాసారం. నాటి నిజాం నవాబు రాచరిక వ్యవస్థకు సజీవసాక్ష్యం.

-----------------------------------------
సాహిత్య గుమ్మడి-- 66--11/12/22
ఉ//(పంచపాది)
చక్కని సూనఁగొందరట చావుకు దగ్గర చేయబూనగన్
తగ్గకఁ నాల్గుమందినొక దారిని చేగొని సాగురక్షగన్
నిక్కముఁ సంప్రదాయముల నెంచెడి మాతయు జూచువిజ్ఞతన్
ఒక్కరు గోరి శ్రేయమును నిచ్చెగ సాయము బిడ్డబాగుకున్
నిక్కము నేదిముఖ్యమని నెంచియు జూపరె యెవ్వరెందునో?

1) యండమూరి వీరేంద్రనాథ్
2) తులసి దళం

తులసి దళం అత్యంత ప్రజాదరణ పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల. ఆంధ్రభూమి వారపత్రికలో 1980లో సీరియల్‌గా వచ్చింది. తరువాత సినిమాగా కూడా నిర్మించబడింది. ఈ నవల విడుదలైన సమయం నుండి అనేక సార్లు ప్రచురితమై యండమూరి రచనలలోకెల్లా అధికంగా అమ్ముడుపోయిన నవలలో ఒకటి. కన్నడంలో కూడా ఇతోధికంగా జనాదరణ పొందింది.

తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. అతనిపై కక్ష కట్టిన కొందరి కుతంత్రం వల్ల ఆ బిడ్డపై కాష్మోరా అనే దుష్ట శక్తి ప్రయోగమౌతుంది. ఇందులో కాద్రా అనే మాంత్రికుడి పట్టుదల ఉంది. అందువల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆ పాప రోజురోజుకూ మరణానికి దగ్గరవుతుంది. ఆ బిడ్డను రక్షించుకొనే క్రమంలో నలుగురు మనుషుల ప్రయత్నం ఈ కథలో చాలా పట్టుగా చెప్పబడింది. ఇస్మాయిల్ అనే సాధకుడు చేతబడికి విరుగుబడి చేయిస్తాడు. ఆధునిక ధృక్పథం కల తులసి తండ్రి చేతబడిని నమ్మి అందుకు విరుగుడు చేయించడానికి తంటాలు పడుతాడు. వారి శ్రేయోభిలాషి అబ్రకదబ్ర (అబ్బూరి కేదారేశ్వరరావు) అతనికి సాయపడతాడు. సంప్రదాయాలను నమ్మే తులసి తల్లి, క్రమంగా వైజ్ఞానిక ధృక్పథంలో ఆలోచించసాగింది. పాఠకులు ఎంతో ఆసక్తిగా వచ్చేవారం కోసం ఎదురు చూసిన ధారావాహికలలో ఇది ఒకటి. రచయిత వైజ్ఞానిక విశ్లేషణను, తాంత్రిక విధానాలను సమాంతరంగా చూపడానికి ప్రయత్నించాడు గాని చివరకు ఎటూ తేల్చకుండా నిర్ణయాన్ని వదిలేశాడు. ఈ నవలతో 'కాష్మోరా' అనే మాట ఆంధ్రదేశంలో పరిచయమై అనేక వ్యంగ్య సందర్భాలలో వాడబడింది. ఈ నవలకు పొడిగింపుగా యండమూరి వీరేంద్రనాథ్ 'తులసి', 'కాష్మోరా' అనే నవలలు వ్రాశాడు. విలియం పీటర్ బ్లాట్టీ వ్రాసిన "ది ఎక్జార్సిస్ట్" (The Exorcist) కు తులసీదళం నవలకు పోలికలు ఉండటాన్ని యండమూరి ఒప్పుకున్నా, కథనాన్ని నడిపించిన శైలి, శిల్పంలో భేష్ అనిపించుకున్నాడు.
ఈ నవలను, దానిని అనుకరిస్తూ వచ్చిన అనేక రచనలను విమర్శకులు "క్షుద్ర సాహిత్యం" అని తెగనాడారు. వ్యంగ్యంగా "వేపమండలు" అనే నవల కూడా వచ్చింది.
----------------------------------------
సాహిత్య గుమ్మడి-- 67--15/12/22
చం//
విడివడిఁ జుట్టుఁజుట్టి, యెరుపెక్కగఁగన్నులు, కొంగుఁజెక్కియున్
'పొడమగ నిట్టనోకహముఁ పొందగనేరునగారి గాదిలిన్
దిటవగు నామగండుగొనె దిర్గిగొనంపనె నాథుఁ' నీ విధిన్
గడుసుగ బల్కెరోషమునఁ, గావగ నెద్దిది? వ్రాసెనెవ్వరో?

సరైన జవాబులు
1) పారిజాతాపహరణము
2) నందితిమ్మన

పారిజాతాపహరణము” కావ్యం తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి. ఈ కావ్యాన్ని రచించినది “నంది తిమ్మన“. ఈయన అష్టదిగ్గజాల్లో ఒకరు. ఈయన్ని “ముక్కు తిమ్మన” అని కూడా అంటారు. ఈయన శైలి మృదుమధురంగా, సహజసుందరంగా, అలంకార ప్రయోగాలతో మనోహరంగా ఉంటుంది. ఈయన కవిత్వం ముద్దుగా ఉంటుందని “ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు” అని అంటారు.

పారిజాతాపహరణం ఐదు ఆశ్వాసాల కావ్యం. కథ కృష్ణుడు దేవతల తల్లి అయిన అదితీదేవి కుండలాలు అపహరించిన నరకాసురుని వధించిన తరువాత మొదలౌతుంది. ఒకరోజు నారదమునీంద్రులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉన్నప్పుడు వచ్చి దర్శిస్తారు. దేవలోకంలో ఉన్న ఇంద్రుని నందనోద్యానం నుంచి తెచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. దానిని రుక్మిణి కి ఇవ్వాలో సత్యభామకి ఇవ్వాలో కృష్ణుడు తేల్చుకోలేకపోతే నారదుడు తన కనుసైగ ద్వారా దాన్ని రుక్మిణికి ఇప్పిస్తారు. రుక్మిణీదేవి ఆ పుష్పాన్ని ధరించడం వలన దివ్యంగా కనిపిస్తుంది పారిజాతాపహరణము, నాల్గవ ఆశ్వాసములోని  సత్యభామ ప్రగల్భోక్తులు క్రింది పద్యములు.
ఉ.
నా విని సత్యభామ వదనంబున లేనగ వంకురింప, నే
మే వచియింపఁ బూను హృదయేశ్వరునిం గనుసంజ్ఞ మాన్చి, చ
న్గ్రేవల జాఱుకొంగు సవరించుచు, వీడినకొప్పుఁ బల్మఱుం
జే వెడ దోఁపుచుం, బలికెఁ జెందొవచూపులు క్రేళ్ళుదాఁటగ\న్‌.

సీ. వినుఁడు! సురేశ్వరు వనపాలకులు! వార్ధిఁ -
   బొడమిన యీ దివ్యభూరుహమున
కింద్రాణి యెవ్వతె? యింద్రుండు నెవ్వఁడు? -
      తోడి యిందిరను గౌస్తుభము నెవ్వఁ
డధిపుఁ డై ధరియించె నతఁడె చేకొనుఁగాక -
      తెకతేర యిది యేమి యొకరి సొమ్మె?
యిదె నాదు విభునిచే నీవదాన్య నగంబు -
     నొడియించుకొని యేఁగుచున్న దానఁ
తే. బలుకు లేటికిఁ, దా వీరపత్ని యేని
మీ శచీదేవి తనదుప్రాణేశుఁ డైన
మఘవు నిటఁ బంపి సత్యభామావిధేయు
వలన మరలంగఁ గొనుటె పో వాసితనము.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం పెకలించుకొని తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.

తెర వెనక కథ
ఈ గ్రంథము వ్రాయడానికి నంది తిమ్మన గారికి ఒక కారణము ఉన్నది అంటారు. ఒక రోజు అనుకోకుండా తిరుమలదేవి రాయల వారిని పాదాలతో తాకుతుందట. దానితో రాయల వారు కోపగించుకొని, తిరుమలదేవిని చూడటం మానేస్తాడు, తిరుమలదేవికి అరణంగా వచ్చిన నంది తిమ్మన ఆ గొడవని రూపు మాపడానికి స్వయంగా కృష్ణులవారే తన్నించుకున్నారు మీదేముంది అని చెప్పడానికి ఈ కథ వ్రాసినాడు అని ఒక జనశ్రుతి.

------------------------------------------
సాహిత్య గుమ్మడి-- 68--16/12/22
ఉ//
చోర గణేశుమాతఁగొని, సుందర రూపము నెంచిజూపుచున్
భైరవి, పంచబాణి,రమ, పంచమి, మండలి, యమ్మనీవనిన్
పేరభిరామి యమ్మగట బేర్కొని యర్వము భక్తునొక్కనిన్
తీరుగ వందనొక్కటిగ తెల్గున స్తోత్రము నంత్యమాదిగన్
పూరణజేసి వ్రాసిరొక పొత్తము జక్కగ నెవ్వరెద్దియో?

సరైన జవాబులు.
అభిరామి అంత్యాది
భావరాజ పద్మిని ప్రియదర్శని

అభిరామి అమ్మవారు - సంబంధిత గాథ

తమిళనాట తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది. అక్కడ పార్వతీ అమ్మవారు అభిరామి అనే పేరుతో కొలువై ఉంది. అమ్మ దేవాలయంలో నిత్యం అమ్మను ధ్యానిస్తూ ఉండే ఒక భక్తుడు అభిరామ భట్టర్. నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్, ఒకరోజున అమ్మ దర్శనానికి విచ్చేసిన శరభోజీ మహారాజు గారు ఈ ధ్యాననిమగ్నుడై తనని గమనించకుండా ఉన్న అభిరామ భట్టర్ గారిని చూసి కొంచెం ఆగ్రహం చెందుతాడు. సాధారణంగా రాజు కాని, రాజకుటుంబం కాని వచ్చినప్పుడు భద్ర ఆలయం ఖాళీ చేయిస్తారు. అర్చకులు తప్ప గుడిలో ఎవర్నీ ఉండనివ్వరు. ఐతే గుడిలో అయ్యరు ఉండటమే కాక తనని పట్టించుకోలేదు! ఆగ్రహం రాదూ మరి?

అక్కడి అర్చకులు పరిస్థితిని చక్కదిద్దటానికి  ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక పిచ్చివాడిలాగా ఎప్పుడూ అక్కడే అమ్మని ధ్యానిస్తూ కూర్చుంటాడనీ, ఎవర్నీ పట్టించుకోడనీ తామూ అతడి ఉనికిని పట్టించుకోమనీ ఆగ్రహించవద్దనీ మనవి చేసారు రాజుగారికి. సరే ఇతని సంగతి ఏమిటో కనుక్కుందాం అనుకొని రాజుగారి సరాసరి సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరకు వెళ్ళి పలకరించాడు. కొంచెం ధాటీగా మాట్లాడినట్లున్నాడు. అయ్యరుకు ధ్యానభంగం ఐనది. అంతవరకూ అమ్మ ముఖారవిందాన్ని తిలకిస్తూ మైమరచి ఉన్నాడేమో ఉలిక్కిపడి చూసాడు రాజును..

“ఈరోజు తిథి ఏమిటి” రాజుగారు ప్రశ్నించారు. వెంటనే అయ్యరు "పౌర్ణమి" అని అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. రాజు ఐతే ఉగ్రుడే అయ్యాడు. "అలాగా. సంతోషం. ఈరోజు రాత్రికి వస్తాను. నాకు నిండు చంద్రుణ్ణి చూపించండి" అని ఆజ్ఞాపించి చక్కాపోయాడు. చుట్టూ ఉన్న అందరూ కంగారుగా, "ఎంత పని చేసావయ్యా, ఈరోజు అమావాస్య!" అని సుబ్రహ్మణ్య అయ్యరుతో అన్నారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా ఆశ్చర్యపడి, జరిగిందేదో జరిగింది. అంతా అమ్మ చూసుకుంటుంది అని నిబ్బరంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో అని అర్చకులూ ఊరిజనమూ అందరూ ఆందోళన పడ్డారు. సాయంత్రానికి గుడివద్ద జనం గుమిగూడారు. రాత్రి అయ్యింది. రాజుగారు మళ్ళా గుడికి వచ్చారు. ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ సంగతి ఏమిటో చూద్దామనే వచ్చారు. వందతాళ్ళు కట్టిన ఊయల కింద అగ్నిని ప్రజ్వలింప చేసి, అయ్యరును దానిమీద నిల్చో పెట్టారు. ఇదేమీ పట్టని అయ్యరు, ఆ సమయానికి తన్మయత్వంతో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. అ స్తోత్రం అద్భుతంగా ఉంది. దాన్ని అంత్యాది అంటారు. అంటే ఒక చరణం ఏ మాటతో ముగుస్తున్నదో, దానితోనే తరువాతి చరణం చెప్పుతూ ఉండాలి. ఇలా నడుస్తోంది స్తోత్రం. ఈ అంత్యాదిని తమిళులు అందాది అంటారు. రాజుకు అశ్చర్యం అనిపించింది. ఈయన ఇంతటి కవీ భక్తుడూ అని ఆయనకు ఇంతవరకూ తోచనే లేదు.

సుబ్రహ్మణ్య అయ్యర్ అంత్యాది చెబుతూనే ఉన్నారు మైమరచి 78 పద్యాలు పూర్తి ఐనవి. అప్పుడు మరొక అద్భుతం జరిగింది. అభిరామి అమ్మ తన చెవి కమ్మ ఒకదాన్ని ఆకాశంలోని ఎగురవేసింది. అదే నిండుచంద్రుడిలా వెన్నెల వెలుగులు కురిపించ సాగింది. అమావాస్య కాస్తా పున్నమిగా మారిపోయింది. వెన్నెల వెలుగులతో ఇలాతలం నిండిపోయింది. అంత్యాది స్తోత్రం నూరు పద్యాలతో ముగించి పరమానందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ కనులు తెరచి చూస్తే తన పాదాల వద్ద కన్నీళ్ళతో రాజు గారు. ఈరోజునుండీ తమరు సుబ్రహ్మణ్య అయ్యర్ కాదు అభిరామ భట్టర్ అని అయ్యరుకు కొత్త పేరు పెట్టి గౌరవించి ఆయన పాదాలకు వంగి నమస్కారం చేసాడు. ఇంతటి ప్రభావంతమైన స్తుతి ఈ అభిరామి అంత్యాది.

శ్రీ అభిరామి అంత్యాది (సులభ తెలుగులో) నాంది ప్రస్తావన

నేను అమ్మవారి దయతో వ్రాసిన 'తిరుప్పావై' చదివిన భక్తులు, సన్మిత్రులు, శ్రీ వెంకట వినోద్ పరిమి గారు "మీరు 'అభిరామి అంత్యాది' వ్రాస్తే బాగుంటుంది”, అన్నారు. నిజం చెప్పాలంటే, ఆ నిముషం వరకూ నాకు ఆ తమిళ కావ్యం గురించి ఏమీ తెలీదు. ఆ మాటకొస్తే, నాకు తమిళం అసలు రాదు. కాని, రెండు మూడు వ్యాఖ్యానాలు చూస్తాను. బాగా పరిశోధించి, మూల భావం ఏమిటో తెలుసుకుని వ్రాస్తాను. ఇది నా అలవాటు, మూల భావం తెలుసుకుని, ఇష్టమైన బాణీలో పాడుకునే 'తిరుప్పావై' రచన లాగా సులభ తెలుగులో వ్రాయడమే మంచిదని భావించాను. ప్రతి కవిత ముగింపులో వచ్చే పదాన్ని, తరువాతి కవిత మొదటి పదంగా తీసుకున్నారు భట్టర్. ఆ పద్ధతిని నేను అనుసరిస్తూ, వీలున్న చోటల్లా, అమ్మ స్తోత్ర ప్రియురాలు కనుక, లలితా సహస్రనామ స్తోత్రం లోని అమ్మ నామాలని కూడా వాడాను. మొత్తానికి వినోద్ గారి సంకల్ప బలం, అభిరామి అమ్మ దయ కలిసి, జనవరిలో మొదలు పెట్టిన ఈ అంత్యాదిని దసరాలోపు ముగించి ఇదిగో, ఈ పుస్తకంగా మీ ముందుకు తీసుకుని రాగలుగుతున్నాను. ఈ ప్రయత్నంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా ఐదో పుస్తకంగా వస్తున్న ఈ అంత్యాది రచన, నా జీవితంలో నాకు దక్కిన గొప్ప అనుగ్రహంగా భావిస్తున్నాను. ఆదరిస్తారని, మీ దీవెనలు అందజేస్తారని, భావిస్తూ...

భావరాజు పద్మిని.

*******************************************
సాహిత్య గుమ్మడి-- 69--17/12/22
ఉ//
చక్కని వ్యాససంపుటిది జాణల నెంచియు గానమాధురిన్
లెక్కకు మించియున్చెణుకు లింపుగ గాయక గాయనీమణుల్
నిక్కమునిందుజూపె బహు నేతల పోషణ గానసంపదన్
పెక్కురు గొప్పవారలను బేర్కొని వ్రాసిరి యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
1) శ్రీ సామల సదాశివ
2) మలయ మారుతాలు

మలయ మారుతాలు పుస్తకం సామల సదాశివ హిందూస్తానీ సంగీతం గురించి రాసిన వ్యాససంకలనం. మలయ మారుతాలు
రచనా నేపథ్యం
హిందూస్తానీ సంగీత విద్వాంసులు, శ్రోతలు, పోషకులు, కచేరీలు వంటి విషయాలను గురించి రాసిన ఈ వ్యాసాలను సంకలనం చేసి మలయ మారుతాలుగా ప్రచురించారు. ఈ పుస్తకాన్ని మే, 2001లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. ఈ రచనకు సదాశివను సంగీతజ్ఞుడు, సాహిత్యవేత్త కె.సదాశివరావు ప్రేరణ కలిగించారు. పద్మాసచ్ దేవ్, రేఖాసఫ్రూ, బాల్ కవి బైరాగి, శంభూనాథ్ మిశ్రా తదితరుల హిందీ రచనలను, మోహన్ నాద్ కర్ణి, జి.ఎన్.జోషి లాంటి సంగీత మర్మజ్ఞుల ఆంగ్ల రచనలను, పద్మభూషణ్ దేశ్ పాండే, రాజారాం వంటి మరాఠీ రచయితల రచనలను ఈ వ్యాసాలకు ఆధారంగా తీసుకున్నారు. కొన్ని రచనలకు ప్రముఖ పాత్రికేయుడు జి.కృష్ణ ఆంగ్ల, తెలుగు వ్యాసాలు, అప్పుడప్పుడు ఆయన స్నేహితుడైన జి.కృష్ణ కబుర్ల కొన్ని వ్యాసాలకు ఆధారమని రచయిత పేర్కొన్నారు.

ప్రధానాంశాలు
మలయ మారుతాలులో సదాశివ హిందూస్తానీ సంగీతాన్ని గురించి ఎన్నో అంశాలను వివరించారు. సంగీత విద్వాంసుల విశిష్టతలు, ప్రత్యేకతలు, శ్రోతల రసజ్ఞత, విద్వాంసుల జీవితంలో చెణుకులు, వివిధ రాగాల ప్రత్యేకతలు వంటి అంశాలు ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. సంగీత రసజ్ఞుడు, స్వదేశీ సంస్థానాధీశుల వద్ద దివాన్ గా పనిచేసినవాడు ఐన కిషన్ సింగ్ చావ్ డా తన అనుభవాలను ఆమాస్నాతారా అనే గుజరాతీ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం అంధేరీ రాత్ కే తారే పేరిట హిందీలో అనువాదమైంది. ఎందరో సంగీతవిద్వాంసుల గురించి రాసున్న ఆ అనుభవాలను మలయమారుతాల్లో క్లుప్తంగా రాశారు సదాశివ. ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసులు హైదరీజాన్, మలికాజాన్, గోహర్ జాన్, హీరాబాయి బారోడేకర్, అంజనీబాయి మాల్ఫేకర్, విద్యాధరీదేవి, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, అన్నపూర్ణాదేవి, హరిప్రసాద్ చౌరాసియా, పండిత్ రవిశంకర్, అలీబఖష్ తదితరుల ప్రస్తావనలు, వ్యక్తిత్వాలు, జీవనశకలాలు ఈ గ్రంథంలో వస్తుంది.
' -----------------------------------------
సాహిత్యగుమ్మడి -70--18/12/22
ఉ//(షట్పది)
త్రోవను దప్పినార్యుడొక తొయ్యలి బ్రేమను గానకేగినన్!
ఆ వనితందుకోర్కెగల యావల నొక్కడు రూపుమార్చియున్
సేవలుబొందె, సంతుగనె చేగొనియాలిగ, కోర్కెదీరగన్
పోవగ నాతడున్సుదతి బొట్టియఁ బెంచెను దీక్షదక్షతన్
బ్రోవగ కైటభారియునుఁ బొట్టియ బిడ్డడు నేలెసర్వమున్
ఈ విధి వ్రాసెనెవ్వరది? యేమది పొత్తము? దెల్పరేబుధుల్

సరైన జవాబులు
1) అల్లసాని పెద్దన
2) మనుచరిత్రము

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో, ఆయన భువనవిజయ అష్టదిగ్గజాలలో పేరొందిన పెద్ద కవీంద్రుడు అల్లసాని పెద్దనామాత్యుడు. ఆయనే “ఆంధ్ర కవితా పితామహుడు” అన్న బిరుదు కలవాడు. ఏదైనా మంచి ప్రబంధ కావ్యం రచించి లోకానికి పరమోపదేశం చేయాలని భావించిన అల్లసాని పెద్దన్న మనుచరిత్ర రచన చేశాడు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రంథానికి కృతిపతి. కృతిని అందుకొనే సమయంలో పెద్దన ఎక్కిన పల్లకిని తన చేత్తో లేవనెత్తి రాయలు ఆయన పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించాడు.

స్వారోచిషమనువు జన్మ వృత్తాంతం ఇతిహాసంగా రచించబడిన మార్కండేయ పురాణం ఆధారంగా అల్లసాని మనుచరిత్ర రాశాడని అంటారు. మనుచరిత్రలోని ప్రతిపదం ‘అల్లసానివాని అల్లికజిగిబిగి’ అన్న మాటను సార్థకపరుస్తున్నది. పెద్దన మనుచరిత్ర రచనానంతరం అనేక ప్రబంధాలు దానికి ప్రతిరూపాలుగా వచ్చాయి.

           ఇక మనుచరిత్ర కథ విషయానికొస్తే......ఆర్యావర్త దేశంలో, వరణానది ఒడ్డున, అరుణాస్పదం అనే ఒక పురం వున్నది. ఆ పురంలో ప్రవరాఖ్యుడు అనే సద్బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆయన వేదవేదాంగ పారంగతుడు. ధనికుడు. సఛ్చీలుడు. ఆయన భార్య సోమిదమ్మ భర్తకు అన్ని విధాల అనుకూలవతి. ప్రవరుడికి అతిథి పూజ అంటే పరమానందం. భర్త ఆనందానికి అనుగుణంగా ఆయన భార్య సోమిదమ్మ ఎంతమంది అతిథులు వచ్చినా వంటచేసి వడ్డించడానికి వెరువదు. అతిథులు అర్థరాత్రి వచ్చినా మహానందంతో వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది.
         ఇలా వుండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారింటికి అతిథిగా వచ్చాడు. ఆయనకు సకలోపచారాలు చేసిన తరువాత, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడని, ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాడని ప్రశ్నించాడు ప్రవరుడు. అయన చూడని ప్రదేశం లేదని చెప్పి అదంతా తన దగ్గరున్న పాదలేపం మహిమని చెప్పాడు. ప్రవరుడి ప్రార్థనను మన్నించి సిద్ధుడు ఆయనకు ఆ పసరు ఇచ్చి పాదాలకు పూసాడు. తక్షణమే ప్రవరుడు హిమగిరిని చూడాలనుకోవడం, వెంటనే అక్కడికి పోయి నిలవడం జరిగింది. అక్కడ అనేక దివ్యస్థలాలను చూసి మధ్యాహ్నానికల్లా ఇంటికి పోదామని అనుకున్నాడు. అయితే ఆయన కాలికున్న పసరు హిమాలయాల మంచుకు కరిగిపోవడం వల్ల ఎగరలేకపోయాడు. దిగులుతో ఏంచేయాలో తోచక అటూ-ఇటూ తిరగసాగాడు.  

ఇంతలో సమీపంలో ఆయనకొక గంధర్వ రమణి వీణ వాయిస్తూ కనిపించింది. ఆమె ఎవరని అడిగి, తన విషయం చెప్పి, తనకు ఇంటికి పోవడానికి దారి చూపమని కోరాడు ప్రవరుడు. అతడిమీద ఆపాటికే మది తగిలిన ఆమె, తన పేరు వరూధిని అనీ, తన చెలికత్తెలతో అక్కడు వుంటున్నాననీ, తన ఇంటికి రమ్మనీ, విందు ఆరగించమనీ అన్నది. తానక్కడ వుండడానికి వీలులేదని, అగ్నిహోత్రాది కర్మకాండలు చేయాలని, తనను ఇంటికి పంపే ఏర్పాటు చేయమని కోరాడు ప్రవరుడు. అక్కడే వుండిపోయి తనను కూడి సుఖించమని వరూధిని కోరినప్పటికీ ప్రవరుడు అంగీకరించలేదు. ఆయన తిరస్కారానికి వరూధిని భంగపడ్డది, బాధ పడింది, కోపం తెచ్చుకున్నది. కళ్లల్లో నీరు తెచ్చుకుంటూ, వరూధిని, ప్రవరుడి మీద పడి కౌగలించుకొని పెదవులను నొక్కడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొనసాగనీయకుండా ప్రవరుడు ఆమెను తోసాడు. ఆమె తనకు జరిగిన పరాభవానికి దుఃఖించింది. చివరకు ఆమెను వదిలి ప్రవరుడు ఏదో విధంగా స్వస్థలానికి చేరుకున్నాడు.
         ఇదిలా వుండగా, అంతకు పూర్వం నుండి వరూధినిని మోహించి తిరస్కారానికి గురైన గంధర్వుడు ఒకడు, ఈ వృత్తాంతాన్ని ఆసాంతం గమనించి ప్రవరుడి రూపంలో ఆమెను చేరాడు. వరూధిని అతడిని చూసి నిజమైన ప్రవరుడనే భావించింది. కాసేపు అసలైన ప్రవరుడి లాగానే వరూధిని అంటే ఇష్టంలేనట్లు ప్రవర్తించాడు. చివరకు కొన్ని నిబంధనలు పెట్టి ఆమె పొందుకు అంగీకరించాడు. ఆ తరువాత వారిద్దరూ చిరకాలం సుఖాలను అనుభవించారు. వరూధిని గర్భవతి అయింది. తనకు పాదలేపనం ఇచ్చిన సిద్ధుడు కనిపించాడని అబద్ధం చెప్పి వరూధినిని ఒప్పించి, ఆమె దగ్గర సెలవు తీసుకొని, తన మార్గాన తాను పోయాడు ప్రవరుడి రూపంలో వున్న గంధర్వుడు. వరూదినికి అసలు విషయం తెలియదు.
         ఒక శుభ ముహూర్తాన వరూధిని చక్కటి కుమారుడిని కన్నది. అతడికి స్వరోచి అని పేరు పెట్టింది. సకల విద్యలు నేర్పించింది. అతడు ఆ ప్రాంతంలో రాజ్యపాలన చేయసాగాడు. ఒకనాడు ఒక మహారణ్యానికి వేటకు పోయాడు సైన్యంతో. ఆ సమయంలో ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ఒక అనాథ రమణిని బాధించడం చూసాడు. ఆమె గురించిన విషయాలు తెలసుకున్నాడు. ఒక ముని శాపం వల్ల తన చెలికత్తెలు క్షయ రోగం పాలయ్యారని, తనను ఒక రాక్షసుడు వెంటాడుతున్నాడని ఆమె చెప్పింది. తానొక గంధర్వ కన్యను అన్నది. తాను ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి కుమార్తె మనోరమను అని చెప్పింది. తనకు తెలిసిన ‘అస్త్రహృదయం’ అనే విద్యను స్వరోచికి నేర్పింది. దాని సహాయంతో తనను వెంబడిస్తున్న రాక్షసుడిని చంపమన్నది. స్వరోచి రాక్షసుడిని చంపాడు. అతడి దేహం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. తాను శాపవశాన వున్న ఇందీవరాక్షుడు అనే గంధర్వుడిని అన్నాడు. తనకు, తన కూతురుకు చేసిన మహోపకారం కారణాన ఆయుర్వేద విద్యను నేర్పుతానని, తన కూతురు మనోరమను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు స్వరోచితో. ఇరువురి అంగీకారంతో వారి పెళ్లి జరిగింది.
         తనకు తెలిసన ఆయుర్వేద విద్య ద్వారా మనోరమ చెలికత్తెలకు చికిత్స చేసాడు స్వరోచి. వారికి వారి పూర్వ సౌందర్యం వచ్చింది. వారిద్దరిని కూడా స్వరోచి వివాహం చేసుకున్నాడు. ఆ ముగ్గురితో స్వరోచి చాలా కాలం సుఖంగా జీవించాడు. ఆ తరువాత ఆ అరణ్యంలోని వనదేవత కోరిక మీద ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు స్వరోచి.
         కొన్ని దినాలకు స్వరోచి ద్వారా వనదేవత గర్భం దాల్చింది. నవమాసాలు నిండిన తరువాత ఒక చక్కటి కుమారుడిని కన్నది. స్వారోచిషుడు అనే పేరుకల ఆ బాలుడు యుక్తసమయంలో శ్రీహరిని గురించి తపస్సు చేసాడు. శ్రీహరి ప్రత్యక్షమై, భూలోకంలో ధర్మాన్ని రక్షించమని, రెండవ మనువై పాలించమని ఆదేశించాడు స్వారోచిషుడిని. స్వారోచిషుడు మనుత్వాన్ని పొంది శాస్త్ర పద్ధతిన దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ, భూమిని పాలించాడు. స్వారోచిష మనువుగా ప్రసిద్ధికెక్కాడు. చివరకు దైవత్వాన్ని పొందాడు.
+++++++++++++++++++++++++++++++++++
సాహిత్యగుమ్మడి -71--19/12/22
ఉ//
మంగళ గీతిలోనతివ మారుతిఁ జూపుచుఁ భక్తి శ్రద్ధ తో
నింగికినేగదొల్తనిడి, నిల్చుట లంకన, రోయుఁ జానకిన్
భంగముజేయ తోపులను, వ్రక్కలి రాక్షస వీరశూరులన్
లాంగుల జ్వాలఁ చుఱ్ఱుకొని లంకను రాముని జేరనంతమున్
మంగళమౌగమీకనిరి మాన్యుని బేర్కొని యెవ్వరెద్దియో?

సరైన జవాబులు
శ్రీమతి నాగజ్యోతి సుసర్ల
సుందర కాండ
     సుందరమంగళగీతులు
కవయిత్రి గురించి వారిమాటలలోనే.......
పూర్తి పేరు : నాగజ్యోతి వేంకట రమణ సుసర్ల
జననం: శ్రీ ప్రమాదీచ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి తల్లితండ్రులు : కీ.శే. శ్రీ ఈమని రాధాకృష్ణమూర్తి, కీ.శే లీలావతి గార్లు, తెనాలి వాస్తవ్యులు
విద్యాభ్యాసం: తెనాలి తాలుకా హైస్కూల్, తాలుకా జూనియర్ కాలేజీల్లో మొదటినుండి ఇంటర్మీడియెట్ వరకూ, VSR & NVR కాలేజ్, నాగార్జునా యూనివర్సిటీ నుండి సైన్స్లో గ్రాడ్యుయేషన్... ఉస్మానియా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ వివాహం అయి అమెరికా ప్రయాణం..... అక్కడ వర్జీనియాలో స్ట్రేయర్ యూనివర్సిటీ నుండి SQL Server DBAగా సర్టిఫికేషన్.

అయిదుగురు అన్నయ్యలూ, అయిదుగురు అక్కయ్యలకు కడగొట్టు చెల్లిగా... అమ్మా నాన్నల చిన్నమ్మగా, వారందరి దైవభక్తి నెరిగినదానిగా స్వతహాగానే దైవభక్తి మెండుగా అలవడింది. షిరిడీ సాయినాథుని నా నియత గురువుగా భావించి పూజ చేయటం నాకెంతో ఆనందదాయకం. ... అలాగే చిన్నప్పటినుండి తెనాలి చిట్టి ఆంజనేయస్వామివారు, రాములవారి దర్శనం చేసుకోవటం... అక్కడి శ్రీరామనవమి వేడుకలలో పాలు (పానకం) పంచుకోవటం ... రివాజు.. మా నాన్నగారు ఈ రాములవారి గుడి వెనకాల ఉన్న తెనాలి కో ఆపరేటివ్ బాంక్ లో ఉద్యోగం చెయ్యటం కూడా మాకు ఈ సీతారామునితో పరిచయాన్నీ, చనువునూ పెంచింది ......
చిన్నప్పుడు అమ్మ ప్రోత్సాహంతో భావకవితలు వ్రాసినా ఇపుడ పద్యరచనా, కవితలూ, వెబ్ మేగజైన్స్లో కొన్ని కథలు ప్రచురణతో Facebookలో నాదయిన గుర్తింపు లభించటం నా అదృష్టంగా, మా అమ్మ. ఆశీర్వచనంగా భావిస్తున్నాను.
సరిగ్గా 2014 .. డిసెంబర్ 23వ తేదీ, మంగళవారమునాడు మంగళ గీతిలో సుందరకాండ వ్రాయాలని అదాటున మొదలు పెట్టాను.... అందుకు తక్కువ భాషాపరిజ్ఞానమూ, భావపరిణితి, వ్యాకరణ సూత్రాల అవగాహనా లేమీ ఇవేమీ ఆలోచించనీయలేదు హనుమ....
మొత్తానికి ఒక ఏడాది పాటు సాగిన సుందరకాండ ఎన్నోసార్లు హనుమదర్శనం చేయించింది నాకు ఎన్నో శుభకార్యాలు చేయించింది. మా ఇంట్లో... అంతే కాక ప్రతి చిన్నదానికీ డీలా పడిపోయే నాకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా తట్టుకుని నవ్వుతూ పరిష్కరించుకోగలిగే మానసికస్థైర్యాన్ని కూడా అనుగ్రహించింది. అలాగే ఈ రచనకు మూలం శ్రీ వాల్మీకి విరచిత రామాయణాంతర్గత, సుందరకాండము, గోరఖ్ పూర్, గీతా ప్రెస్ వారి ముద్రణ.... అలాగే శ్రీయుతులు M.S. రామారావ్ గారి సుందరకాండ వింటూ ఉన్నప్పటి సుపరిచయం.... హనుమ నావల్ల జరిగిన దోషాలను మదిదలపక... కృప జూడాలని ప్రార్థిస్తున్నాను...
సాధారణ గృహిణిని అయిన నాకు అన్ని విధాల సహకరించి, నా రచనలను ఎంతగానో ప్రోత్సహించి చేదోడు వాదోడుగా ఉన్న నా పతిదేవులు శ్రీ వేంకటరమణ సుసర్లగారికి ఈ పుస్తకముఖంగా అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మా పిల్లలు సౌమ్యశ్రీ సాయి నాగకామాక్షి, వెంకట లీలాకృష్ణ సుబ్రహ్మణ్య సాత్విక్ కు కూడా ఈ సందర్భముగా కృతజ్ఞతలు తెలుపు కోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ పుస్తక పారాయణము ద్వారా భక్త జనావళి శ్రీలక్ష్మణ భరత శతృఘ్న సపరివార ఆంజనేయ సమేత సీతారాములవారి అనుగ్రహానికి పాత్రులయి, మనోవాంఛలు ఈడేరి సంతోషమును బడయవలెనని కోరుకుంటున్నాను.

నాగజ్యోతి సుసర్ల
---------------------------------------
సాహిత్యగుమ్మడి -72--20/12/22
చం//(షట్పది)
రచనిది సంపదే గనగ వ్రాసిరి రాముని బుట్టుకాదియున్
అచటన ధోనిభంగమున నాలియు దక్కినఁ జేరెకానలన్
సచివుని మేలుఁ గోరియట జంపియు వాలినిఁ, గట్టిపాథిఁ పా
లి, చమరి రావణాదులను లెక్కగఁ బూమిజఁ దెచ్చి సామియే
వచనము తూలఁ జావడియె పంపెగ కానలకాలినీవిధిన్
వచనమునన్నదేగనగ వర్జితమేదది వ్రాసె నెవ్వరో?

సరైనజవాబులు
నిర్వచనోత్తర రామాయణము
తిక్కన సోమయాజి

నిర్ అనగా లేకుండా అనర్థము వచనములేకుండా వ్రాసిన ఉత్తర రామాయణము కావున దీనికి "నిర్వచనోత్తర రామాయణము" అనే సార్ధకనామధేయమిచ్చారు కవిబ్రహ్మ తిక్కన
నిర్వచనోత్తర రామాయణము తొలి తెలుగు ప్రబంధముగా ఖ్యాతిగాంచినది. హిందూ పురాణమైన రామాయణం ఆధారం చేసుకొని, దీనిని తెలుగులో మన కవిబ్రహ్మ తిక్కన ఉత్తరరామాయణాన్ని వచనం అనేది లేకుండా, మొత్తం పద్యాలతోనే నిర్వచనోత్తర రామాయణం అనే పేరుతోవ్రాసి మనకు అందించాడు. రామాయణంలో చివరికాండను ఉత్తరకాండ అంటారు. మనవారందరూ యుద్ధకాండవరకే పారాయణం చేస్తూ ఉంటారు. ఉత్తరకాండలో సీతమ్మ కష్టాలు మళ్ళీ ఉంటాయి కబట్టి దానిని పరిహరిస్తుంటారు. అందుకే యుద్ధకాండవరకు రామాయణమనీ, తర్వాతి కాండను ఉత్తర రామాయణం అని వ్య్వహరిస్తుంటారు. ఈ ఉత్తరరామాయణాన్ని సంస్కృతంలో భవభూతి రసరమ్యంగా ఉత్తరరామ చరితం అనే పేరుతో వ్రాసాడు.

ఈ కావ్యంలోని పది ఆశ్వాసాలలో 1280 పద్యాలు ఉన్నాయి.
అయోధ్యకు మహారాజైన దశరథునికి శ్రీరామాదులు నలుగురు పుత్రులు జన్మించారు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడాడు. సీతాలక్ష్మణులతో వనవాసం చేస్తూ, శూర్పణఖ గర్వమణచి, రావణకుంభకర్ణాదుల్ని వధించాడు. ఆ మహానుభావుడు అగ్ని దేవతా సన్నిధిని సీతను పరిగ్రహించి, విభీషణ సుగ్రీవ వాయునందనుల్ని ఆదరించి, దేవేంద్రాదులచే స్తుతింపబడి, లక్షణుడు పుష్పక విమానం తేగా అందులో సీతాసమేతుడై సపరివారంగా అయోధ్యా పట్టణానికి సంతోషంగా వెళ్లి, ప్రజల మన్ననలు పొంది, రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని కొలువుకూటానికి జనకాదులు వచ్చారు. అగస్త్యుడు శ్రీరామునికి విశ్రవసువు, వైశ్రవణుడు, సుకేతువు, మాల్యవదాదులు, రావణకుంభకర్ణ విభీషణుల వృత్తాంతం తెలిపాడు. సీతారాములు ఉద్యాన జలవిహారాలు సల్పారు. సీతాదేవి గర్భవతి అయింది. శ్రీరాముడు లోకాపవాదభీతిచే, సీతను అడవిలో విడువమన్నట్లు లక్షణుడామెతో చెప్పాడు. వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి మునిపత్నుల కప్పగించాడు. శ్రీరాముడు అశ్వమేధయాగం చేశాడు. కుశలవులు యాగశాలలో రామాయణం గానంచేసి, శ్రీరామునిచే సన్మానించబడ్డారు. వాల్మీకి శ్రీరామునికి సీత వృత్తాంతం చెప్పి కుశలవుల్ని అతనికి అప్పగించాడు. సీత తన పాతివ్రత్య మహిమచే భూమిలో ప్రవేశించింది. శ్రీరాముడు లవకుశుల్ని అయోధ్యకు తీసికొనిపోయి రాజవిద్యలు నేర్పించాడు. శ్రీరామచంద్రుడు సకల జనానందకరంగా రాజ్యపాలన గావించాడు.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -73--21/12/22
ఉ//
ముచ్చట గొల్పుపొత్తమిది ముప్పది తొమ్మిది గాథలిందునన్
అచ్చము తెల్గువారలవి యద్భుత మన్నియునెంచిజూడగన్
ముచ్చట పిల్లకాయలది ముందర, పండుది యంతమందునన్
అచ్చర రూపమొందెనిది యాయువు చెల్లిన నెవ్వరెద్దియో?

కీ.శే శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి
పిల్లలరాజ్యం

పెయ్యేటి శ్రీదేవి గారు  పుట్టిన ఊరు, విద్యాభ్యాసం నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా.
తండ్రి : శ్రీ ఆత్రేయపురపు కపిలమల్లేశ్వర స్వామిగారు.
తల్లి : శ్రీ శ్రీమతి లక్ష్మీసుందరీశ్వరీ జ్ఞానప్రసూనాంబగారు.
(ఆవిడ గొప్ప వేదాంతి. వందలలో అధ్యాత్మిక కీర్తనలు వ్రాసిన కవయిత్రి).

భర్త : శ్రీ పెయ్యేటి రంగారావు గారు, (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేసారు).ఆయన రచయిత, కవి, నటుడు,దర్శకుడు బహుముఖప్రజ్ఞాశాలి. అచ్చంగా తెలుగు బృంద నిర్వాహకులు.

వారికి ఇద్దరు కుమార్తెలు. ఇరువురు అచ్చంగా తెలుగు బృందనిర్వాహకులు
1. శ్రీమతి విజయమాధవి గొల్లపూడి గారు ఆస్ట్రేలియాలో ప్రభుత్వోద్యోగి. ఆవిడ కూడ రచయిత్రి. ఆస్ట్రేలియాలో వాహిని మాసపత్రికకు సంపాదకురాలు.
2. శ్రీమతి కాంతి కలిగొట్లగారు అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగి. వారు కూడ మంచి రచయిత్రి.
అకాలమరణం: 15/2/2021.

పెయ్యేటి శ్రీదేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత్రి, కవయిత్రి, కార్టూనిస్ట్, గాయని, స్వరకర్త. వారి కథ "ప్రాచీనహోదా" కు సి.పి.బ్రౌన్, స్వాతి వారు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతి లభించింది. వారి కార్టూన్కు, కవితకు కెనడా తెలుగుతల్లి వారు నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. వారి కథలు టోరీ (తెలుగువన్) రేడియోలోను, ఆకాశవాణి లోను, సిడ్నీ, బ్ర్బిన్ (ఆస్ట్రేలియా) లోని తెలుగువారి ఎఫ్.ఎమ్. రేడియోలలోను ప్రసారమైనాయి. వారి నాటకం "శ్రీకృష్ణసాక్షాత్కారం" సిలికానాంధ్ర (అమెరికా) వారి ప్రచురితమైనది. వారి కథలు అన్ని తెలుగు పత్రికలలోను ప్రచురితమైనాయి. వారికి "లేఖిని" (రచయిత్రుల సమాఖ్య) వారి మాతృశ్రీ పురస్కారం లభించింది. వారి కథల సంపుటి "బియ్యంలో రాళ్ళు" లోగడ వెలువడింది. "పిల్లలరాజ్యం” వారి రెండవ కథల సంపుటి. వారికి టైలరింగ్ లోను, వంటలలోను ఉన్న ప్రావీణ్యం వేరే చెప్పనవసరం లేదు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు, వారు దేని మీదైనా అవలీలగా కథలను అల్లగలరు. బూజులకర్ర, పిన్నీసు, కళ్ళజోడు, ఉత్తరాలస్టాండు... ఇలా అన్నిటి మీదా వారు చక్కని కథలను వ్రాసారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు స్పందించి, ఆవేదనతో వారు ఎన్నో సందేశాత్మకమైన కథలు వ్రాసారు. అలాగే బాబాలు, రాజకీయనాయకులను దృష్టిలో పెట్టుకుని సున్నితమైన హాస్యంతో చక్కని కథలు వ్రాసారు. వారిది ప్రత్యేకమైన శైలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలనే వారు హృదయాలకు హత్తుకునేలా కథలుగా మలిచారు. ఈ సంపుటిలోని ప్రతి కథ ఒక ఆణిముత్యం. ఇది ప్రతి సాహిత్యప్రియుల ఇంటను వుండవలసిన పుస్తకం. వీరు 25/2/2021 తేదీన శివసాన్నిధ్యం పొందినారు. వారి మరణానంతరము వారి కుటుంబీకులు "పిల్లల రాజ్యం" కథలసంపుటి పుస్తకమును పాఠకులకందించారు.  వారిపాదపద్మములకు ప్రణామములు.

************************************************
సాహిత్యగుమ్మడి -74--22/12/22
ఉ//
రూపసి దేవవేశ్యలిరు రూపము లిందున, సాధువొక్కడున్
రూపరి రాజరాజుసుత రూపులు రెండును, పోరిదిండియున్
రూపరి భోగినొక్కజని రూపము మార్చిన కామకోరికన్
సాపెన కత్తి ఘాతమున చక్కనగెవ్వరువ్రాసె నెద్దియో?

సరైన జవాబులు
1) శ్రీ పింగళి సూరనార్యుడు
2) కళాపూర్ణోదయము.

కళాపూర్ణోదయం అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన తెలుగు కావ్యం. దీనిని ప్రప్రథమ పరమ స్వతంత్రాంధ్ర నవలగా అభివర్ణించారు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి వంటి ప్రసిద్ధ విమర్శకుల ఆదరానికి పాత్రమైన ప్రబంధం. దీనిని ఉషశ్రీ పురాణపండ తెలుగు వచనంలోనికి అనువదించారు. ఇది తెలుగు భాషలో వచ్చిన మొదటి పద్య కావ్యమైన నవల.
కళాపూర్ణోదయం ప్రబంధం యొక్క కథావస్తువు రచన కాలం నాటిది కాకున్నా రచనలో అప్పటి స్థితిగతులు ప్రతిబించింది. యుద్ధానికి పోతున్న సైన్యం వర్ణన ఇందులో దొరుకుతోంది. సైన్యంతో పాటు కళాకారులు, కవులు, పండితులు, వారకాంతలు, కుటుంబం వంటి జనాన్ని తీసుకుపోయేవారు. ఇందరు వెళ్తుండడంతో ఆ సైన్యం వెళ్ళే ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకుని అక్కడ వ్యాపారస్తులు గుడారాలు వేసుకుని అమ్మేవారు. అలా యుద్ధానికి వెళ్తుంటే భాగ్యవంతులు తమ ఇళ్ళలో అనుభవించే అన్ని రకాల సౌఖ్యాలు కూడా అనుభవించేవారు. ఇలా సైన్యం వెళ్తుంటే ఓ నగరమే తరలివెళ్తోందా అనిపించిస్తోందన్న వివరాలు కళాపూర్ణోదయంలో ఉన్నాయి. విజయనగరాన్ని రాయల కాలంలోనూ, ఆయన అనంతరమూ చూసిన యాత్రాచరిత్రకారుడు న్యూనిజ్ వ్రాసిపెట్టిన రచనలో కూడా ఇదే విధమైన వర్ణన ఉంది.

ఒక అద్భుత కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. దీనిని రచించినవాడు పింగళి సూరనామాత్యుడు. భావబంధురమైన కవితారచనలో నేమి, అపూర్వకల్పనా సామర్ధ్యంలో నేమి, తిక్కన వంటి వారిని మినిహాయిస్తే, సూరనార్యుడికి సాటి వచ్చేవాడు ఆంధ్ర కవులలో మరొకడు లేడు. ఇతను సంస్కృతాంధ్రము లందు అసమాన పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అల్లసాని పెద్దనాదుల వలె ఇతను ఐశ్వర్యంలో మునిగితేలినవాడు కాడు. ఆత్మగౌరవం, స్వవంశాభిమానం కలిగి నిరాడంబరంగా జీవించాడితడు.

మహాకవి సూరనార్యుడు కళాపోర్ణోదయ కథను ఎనిమిది ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యద్భుతమైనదిగా కనిపిస్తుంది. కథను వివరంగా చెప్పే పద్ధతులు సాధారణంగా రెండు. సంఘటనలు జరిగిన కాలక్రమానుసారంగా కథను అల్లుకునిపోవడం ఒక పద్థతి. అలాకాక, కాలక్రమాన్ని వదిలిపెట్టి, సందర్భోచితమైన ఏదో ఒక సంఘటనతో కథ ప్రారంభించిన తరువాత ముందు వెనుకలుగా కథను పెంచుకుంటూ పోయి ఒక ఘట్టంలో పూర్తి చేయడం రెండవ పద్ధతి. దీనిని మరోవిధంగా చెప్పాలంటే, మొదటిది కాలక్రమం, రెండవది కార్యకారణక్రమం. మామూలుగా కథా రచనలో కాలక్రమ పద్ధతికే ప్రచారం బహుళం. పాఠకుడికి కూడా అదే సులువు. అయితే మహాకవి సూరన ఈ పద్థతి విడచి రెండవదియగు కార్యకారణక్రమంలో కథను వర్ణించాడు. ఇట్టి పద్ధతిని అనుసరించిన ఆంధ్రకవి ఇతను తప్ప ఇఒకొకరు లేరు. ఇంకా చెప్పాలంటే కళాపూర్ణోదయం తెలుగులోనే కాక, దక్షిణ భారత సాహిత్యంలోనే తొలి నవల.

కాలక్రమాన్ని బట్టి చూస్తే కళాపూర్ణోదయం కథకు మొదలు, అందలి పంచమాశ్వాసం. మామూలుగా మరొక కవి అయితే పంచమాశ్వాసాన్ని ప్రధమాశ్వాసంగా చేసి కథ చెప్పేవాడు. అసమాన ప్రతిభాశాలి అగు సూరనార్యుడు అలా కాక కథలోని కడపటి విషయంతో కథ ప్రారంభించాడు. కథ మధ్యభాగాన్ని ముందు వెనుకలు చేశాడు. చేసి కథ మొదటి భాగాన్ని చివర చేర్చాడు. అలా చేర్చి ప్రధాన కథతో చాలా దగ్గర సంబంధం ఉన్నప్పటికీ, ఆ విషయం తెలియకుండానే అనేక అవాంతర కథలు చమత్కారంగా కల్పించాడు. కార్యాలు ముందు చూపి, మారుస్తూ ఒక ఇంద్రజాలం చేశాడు. ఆది నుంచి అంత్యం వరకూ కనపడీ కనపడకుండా ప్రధాన కథ మహావేగంగా పరుగెత్తేటట్లు కావ్యం రచించాడు.

----------------------------------------
సాహిత్యగుమ్మడి -75--23/12/22
చం//
మిసిమియె యంతరింద్రియము, మేటిగ వ్రాసిరి యెవ్వరందురో
వసిగలవారు పద్యములు వ్రాయగఁ నేర్పరి, నింపుగూర్చుచున్
విసురుగ రాక్షసేంద్రులను పేరడయించిన మాతనెంచియున్
వసువుఁను బొందగోరిజను వారల పొత్తున తల్లిదండ్రులన్
పసిడిది బోనమెంచియును, పైడివి యాకుల గూడు జూపియున్

సరైన జవాబు
శ్రీమతి  పోలంరాజు శారద

రచనలు
1. శ్రీచక్రసంచారిణి. 2. స్వర్ణకుటీరం. 3. రెప్పపాటు ప్రయాణం.
4. బంగారుకంచం. 5. సంధ్యారాగం. 6. తోడొకరుండిన

ధవళధవళయైన ఆ సారస్వత లక్ష్మి తనని కొలిచే వారిని ఏ పాళ్ళలో కరుణిస్తుందో తెలియదు. కాని తన పేరు పెట్టుకున్న వారిని సముచితంగా కటాక్షిస్తుందని "శారద గారి రచనలు చదివుతున్నప్పుడు విశదమౌతుంది.
కాసంత పెద్ద బొట్టులో నిండు ముఖంతా కనిపించే శారద పోలంరాజు గారిని చూస్తే మా అమ్మ మాత్రమే కాదు ’ముగ్గురమ్మలకు మూలపుటమ్మ’ కూడా తలంపుకొస్తుంది.  ఆవిడ రచనలలో ఆథ్యాత్మిక భావ పరంపరల వెల్లువలూ, ఆదర్శవంతమైన మధ్యతరగతి కుటుంబగాథలూ అందమైన భావసరళితో తెలుగుదనం పరిఢవిల్లే పద్యసుమాలూ అలవోకగా జాలువారుతాయి.
సాంఘిక నవలలు కథలతో పాటు.......
లలితాదేవి ఆవిర్భావము, భండాసురవధ, లలితా సహస్రనామ వివరణతో పాటు మణిద్వీప వర్ణన అన్నిటా తలమానికమైనది. "శ్రీచక్ర సంచారిణి"
ఆడపిల్లల జీవితం... బంగారుకంచానికైనా గోడ చేరువు కావాలన్న బూజుపట్టిన సామెతను కొట్టిపారేసే విధంగా ఒక ఆడపిల్ల జీవిత గాథ. "బంగారు కంచం"
అన్నిటికన్న ముఖ్యమైనది, "స్వర్ణకుటీరం" నవల. ఒంటరితనం శాపం కాకుండా  మనిషికి  మనిషి  తోడుగా ఎలా  ఉండాలో  తెలుసుకోవాలంటే  ఈ స్వర్ణకుటీరంలోకి  పాఠకులు  ప్రవేశించాలి. ఆహ్లాదకరమైన  అనుభూతిని పొందుతారు.

"రెప్పపాటు ప్రయాణం," ఈ పుస్తకంలో 25 కథలు వున్నాయి.
దేశంలోని అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, ఆకలి, కష్టాలు వంటి వాటి జోలికి పోలేదు రచయిత్రి. కుటుంబం, అందులో తలెత్తే సమస్యలు, వాటి కథాంశాలుగా ఎంచుకున్నారు.
వాటికి పరిష్కారాలూ సూచించారు. కుటుంబం నేపథ్యంగా తీసుకునా మూస పోసినట్లు కాకుండా వేరు వేరు సమస్యలు, సంఘటనలు ఎంచుకోవటవల్ల అన్ని కథలూ ఆసక్తితో చదివిస్తాయి.రెప్పపాటు ప్రయాణం, అపరాధ భావం, అంతర్మధనం, గృహప్రవేశం బలిపశువు మొదలైన కథలు ఇందుకు ఉదాహరణలు.ఇప్పుడు మనచుట్టూ చోటు చేసుకుంటున్న పోకడలకు చురక పెట్టే కథలు వున్నాయి. గానీ, త్రిశంకుస్వర్గం, పద్మినీపత్ర జలబిందు కథలలో విషయం కనిపిస్తుంది స్పష్టంగా. శారదగారిది చక్కని శైలి, హాయిగా చదువుకోవచ్చు. ఆమె రచనలలో హాస్యం పాలు కూడా కనిపిస్తుంది. సీరియస్ కథలతో బాటు కొన్ని హాస్య కథలూ వున్నాయి. హాశ్చర్యం, అచ్చుతప్పు తంటా, రచయిత్రి ఆత్మహత్య, స్థానచలనం, ధ్యానం, ఇవన్నీ మినీ కథలు. గమ్మత్తుగా, ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే పీచు మిఠాయిలా వున్నాయి.
ఏది రాసినా చదివించే గుణం వుంది ఈమె రచనలలో, మొదలు పెడితే ఎక్కడా గొంతుకి అడ్డం పడకుండా చివరిదాకా చదువుకోవచ్చు.
                             *****
వారి గురించి వారి మాటలలో
చదివితే అర్ధము చేసుకునే వయసు కూడా కాదు. అక్కయ్య తమ్ముడితో పాటు  ఒళ్ళో కూర్చొ పెట్టుకొని ఎన్నెన్నో కథలు చెప్పటమే కాదు. పాఠ్య పుస్తకాలు తప్ప నవలలు వారపత్రికలు చదవకూడదన్న ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లో పదేళ్ళు నిండగానే దగ్గర కూర్చోబెట్టుకొని స్పష్టమైన ఉచ్ఛారణ కోసం పాఠ్యపుస్తకాలతో బాటు  ఇంగ్లీషు తెలుగు భాషలలో వివిధ పుస్తకాలు, వార్తాపత్రికలు  చదివిస్తూ ఆరుగురు సంతానాన్ని విద్యాధికులుగా తీర్చి దిద్దిన ఘనత నాన్నదైతే   ఎటువంటి ఉన్నతవిద్య లేకపోయినా నాన్నకు ధీటుగా తెలుగు పుస్తకాలూ చదవటమే అభిరుచిగా, చివరి రోజు తులసి కోట వద్ద చేతిలో పుస్తకముతో కనిపించిన అమ్మ మాకు ఆదర్శము.
అటువంటి తల్లితండ్రులు, వల్లూరి సుబ్బరాజుగారు, సుబ్బమ్మలకు సంతానముగా జన్మించినందుకు గర్వపడుతూ వారి పాదాలకు శతకోటి వందనాలు.
14-15 సంవత్సరాల వయసులో  మొదలెట్టిన పఠనా స్రవంతి ఈ నాటికీ సాగుతూనే ఉన్నది.
అట్లా చదుతూనే చిన్నచెల్లెలు తమ్ముడికి చిన్నతనం నుండే భారత భాగవత రామాయణ  చందమామ కథలు చెప్పడం అలవాటై, తరువాత నా పిల్లలకు ఇప్పుడు నా మనుమలకు చెప్పుతూ కథాస్రవంతి సాగుతూనే ఉన్నదనుకుంటే ఈ నాడు అత్యంత ప్రాచుర్యము పొందిన ఫేస్ బుక్‌లో అచ్చంగా తెలుగు మాధ్యమం ద్వారా ఎన్నోకథలు రాసే అవకాశం కలగటంతో మరింత ఉత్సాహంగా నా రాతలు కొనసాగించ గలుగుతున్నాను.
ఎన్నెన్నో పుస్తకాలు చదవాలన్న దాహం తీర్చుకోవటానికే లైబ్రేరియన్ ఉద్యోగంలో చేరి తనివితీరా   తెలుగుతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి ఆ ఆర్తి కొంత తీర్చుకోగలిగాను.

పదవీ విరమణ తరువాత మొదలు పెట్టిన కథారచన కేవలం అక్కచెల్లెళ్ళతో  చదివించటముతో ఆగిపోయేదేమో.
ఆత్మీయులు ఒకరు  నా కథల గురించి తెలుసుకొని అవి  తీసుకొని ఆంధ్రభూమి వారమాస పత్రికలకు  పంపించటంతో నా పేరు ప్రింట్ లో చూసుకొనే అదృష్టం కలిగింది.  రెండు సంవత్సరాలు కథల పోటీలలో, నవల పోటీలో  బహుమతి అందుకునే భాగ్యము కూడా కలిగింది.
అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక ఏటా నిర్వహిస్తూన్న కథలపోటిలో వరుసగా మూడు సంవత్సరాలు ప్రధమ బహుమతి అందుకోవడం మరీ సంతోషం.
అవన్నీ పక్కకు పెడితే, శ్రీ కట్టుపల్లి ప్రసాదుగారి చందస్సు పాఠాలు, నా పురాణ కథలు కలిపి దాదాపు 100 పద్యప్రహేళికలు  మన సమూహంలో నిర్వహించటంతో నేను సభ్యులకు బాగా గుర్తుండిపోయాను.
ఇంక కథల విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబాల జీవన విధానములో సమాజములో కళ్ళెదురుగా జరుగుతున్న సంఘటనలే కథాంశాలు. ఒక మధ్య తరగతిలో పుట్టి మరో మధ్యతరగతి కుటుంబములో మెట్టి నే చూసిన కుటుంబములోని వ్యక్తులే నా కథలలో పాత్రలు.
బడుగు జీవితాల బ్రతుకులు నాకు తెలియవు. అత్యంత ధనికుల జీవన శైలి అంతకన్నా తెలియదు.

-