సాహిత్యగుమ్మడి ..26--31/10/22
ఉ//(పంచపాది)
మూడట సంవిభాగములు ముచ్చటగొల్పుచు హాస్యపుంజముల్
కూడగ బండమున్గమము కూడుగ పట్నము నొక్కటందునన్
హోడన పైనమున్నుడుగు యోగముఁ మళ్ళుట రెండునందునన్
పీడన బాపఁ బోరుటను, బేర్చిన సంపద నివ్వమూడునున్
పోడిమిఁ వ్రాసెనెవ్వరది? పోత్తముఁ దెల్పరె చంగలించుచున్!
సరైన జవాబులు
1) శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి
2) బారిష్టర్ పార్వతీశం
మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. ఇతడు 1892, అక్టోబర్ 9న తూర్పుగోదావరి జిల్లా, గొల్లల మామిడాడ సమీపంలో వున్న గండ్రేడు గ్రామంలో మహాలక్ష్మమ్మ, పేరిశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతడు పిఠాపురంలో హైస్కూలు చదువు ముగించాడు.తర్వాత బందరులో ఇంటర్మీడియట్ చదివాడు. ఆ తర్వాత స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో 1913-17 మధ్యకాలంలో చదువు కొనసాగించాడు. చదువు పూర్తి కాకుండానే తిరిగి స్వదేశం చేరుకున్నాడు.
రచనలు
ఏకోదరులు....ప్రతిబింబములు ...మొక్కుబడి..కన్నవి - విన్నవి
చిత్తరువు (పెద్దకథ).....బారిష్టర్ పార్వతీశం
బారిష్టర్ పార్వతీశం మొదటిభాగము
పార్వతీశం మొగల్తూరు నుండి బయలు దేరి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాడు చేరుతాడు. ఈ భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు నుండి మద్రాసు వెళ్ళే రైలు ప్రయాణం చాలా హాస్యరసంగా చిత్ర్రించడం జరిగింది. మద్రాసు నుండి ఇంగ్లాండు వెళ్ళడానికి కావలసిన సరంజామా కొనుక్కొనే సన్నివేశాలు చాలా హాస్యవత్తరంగా ఉంటాయి. ఈ నవలను తెలుగు అకాడమీ పుస్తకాల్లో పదవ తరగతి తెలుగు ఉపవాచకముగా అందించారు.
బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం
ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్లాండ్లో ఎడిన్‌బరా నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టుగా చేరుతాడు. ఒక లా కళాశాలలో చేరుతాడు. ఆంగ్లం కూడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడంతో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగంలో తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకంలో బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.
బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం
మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -27--1/11/22
ఉ//
'చిందగ స్వేదబిందువులు చెందియు సందెడు చీరకుచ్చిళుల్
అందముఁ జిందులాడ తనయందెలుఁ జర్దుచు ముందు ముందుకున్
సందెన జాము ప్రొద్దుఁ పిడి చందము నెందుల కేగుచుండెనో '
చందన చందమెందుఁ నలిజక్కని బంధము వ్రాసెనెవ్వరో?
సరైన జవాబులు
1) తృణకంకణము
2) శ్రీ రాయప్రోలు సుబ్బారావు
తృణకంకణము!
తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధమైన ఖండకావ్యం. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంపై గొప్ప ప్రభావాన్ని ప్రసరించిన భావకవిత్వ యుగంలో మొదటి రచనగా చారిత్రిక ప్రాధాన్యత కలిగివుంది. 1913లో విడుదలైన ఈ రచన ప్రబంధ బంధురమైన తెలుగు సాహిత్యాన్ని ఇతివృత్తం, శైలి, శిల్పం పరంగా గొప్ప మార్పు సూచిస్తూ నూతన యుగానికి నాంది పలికింది. ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది.
వీరు 1892 మార్చ్ 13 తేదీన , గుంటూరు జిల్లా, బాపట్లలో జన్మించారు. కవి, అనువాదకుడు, రచయిత.
కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు. అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.
రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీతి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్‌తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు. వారిని గురించి రాస్తూ సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్యజీవితాన్ని ముట్టనయినా ముట్టలేదు. ‘అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదమూ ఉందని ఆంధ్రపత్రికలో వ్రాశారు. వీరు 1984 జూన్ 30 తేదిన స్వర్గస్తులైనారు.
************************************************
సాహిత్యగుమ్మడి -28--2/11/22
చం//
తియ్యదనంపు భాష నొకతీరగు తెల్గున గాథలెన్నియో
నెయ్యము సత్యమన్న, దయ, నిర్మల తత్వము, జాలిగుండెయున్
నియ్యతి గానుపించుఁ గడునెక్కువ జక్కగ గాథలందునన్
వొయ్యిము లింపుగూర్చినవి భూమిని జూపుచు మూడు రీతులన్
సయ్యన దెల్పరండిట జక్కని నామము, నెవ్వరందురో?
సరైన జవాబు
1) శ్రీ బలివాడ కాంతారావు
బలివాడ కాంతారావు సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జూలై 3, 1927 న జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకి తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు. బలివాడ కథలన్నీ 'చదువు- ఆగు- ఆలోచించు- సాగు ' అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కాంతారావుగారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకి వదిలేసి, వెల్లడి చేసినదానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి.
యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం 'బలివాడ కాంతారావు కథాకలశం'.
మంచి కథల్ని చదవాలనుకునేవారు, తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాలివి.
తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని
కాంతారావుగారు తమవంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారని యీ సంపుటిలోని కథలన్నీ రుజువు చేస్తాయి. కథలేగాక కథకుడు కూడా సౌజన్యశీలియై వుండటం వర్తమానంలో చాలా అరుదు. మూడు నవలలు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి వారి రాజకీయ దృష్టికోణాల్ని ప్రతిబింబిస్తాయి. ఒక ప్రభుత్వోద్యోగిగా యథార్థ పరిస్థితులను చిత్రించలేనప్పటికీ, ఒక ఊహాప్రపంచపు పోకడలుగా అయితే అభివర్ణించానని చెప్పుకొచ్చారు. తను కల్పించే పాత్రల పట్ల నిజాయితీతో ఉంటూ ప్రతీ సూక్ష్మమైన అంశం పట్లా జాగ్రత్తగా ఉండడం సరియైన పద్ధతని నమ్ముతారు. స్వంత కథల సంకలనం ‘బలివాడ కాంతారావు కథలు’ లోని ముందుమాటలో అందులోని కథలన్నీ తన స్వంత జీవితంలో గమనించిన విషయాలపైనేననీ, అన్ని పాత్రలూ తన జీవితంలో తారసపడినవే ననీ అన్నారు. వీరు 2000 సం. మే 6 వ తేదిన స్వర్గస్థులైనారు.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -29--3/11/22(రద్దుచేయబడినది.)
ఉ//
చెండెను బాల్యబెండ్లి, నిరసించె సమాజమునంటురోగమున్
మెండుగ సంస్కరింపగను మిక్కిలి వ్రాసెను నాటకంబులన్
అండయె కాంతవిద్యగొన నాయవనుండును బోరెగొప్పగన్
దండిగ దేశభక్తియును, ధార్మిక పోకడ నెవ్వరందురో ?
సరైన జవాబు
డా; ఉమర్ అలిషా
డా; ఉమర్ అలిషా గారు మొహియుద్దీన్ బాద్షా - I, చాంద్ బీ దంపతులకు 1885 ఫిబ్రవరి 28 పిఠాపురం లో జన్మించారు
బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు. ప్రధానంగా అతను ప్రతి రచనలో స్త్రీ పక్షపాత వైఖరి కన్పిస్తుంది. సమాజంలో అతను ఆశించిన మార్పులను తన రచనలలోని పాత్రల ద్వారా చాలాబాగా వ్యక్తం చేశారు. అతను రాసిన కళ అను నాటకంలో కుటుంబ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను-నష్టాలను వివరంగా పేర్కొన్నారు. గృహ బాధ్యతలను మోసే ఇల్లాలి కంటే మంచి నెచ్చలి ఎవరుంటారంటూ, భార్యను స్నేహితురాలిగా గౌరవించాలని పురుషులను ఆదేశించారు. ఈశ్వర తత్త్వము నామె హృదయంతరబునన్ పరిణితమైన ప్రేమయును పాఠము లోపల చేర్చుకొమ్ము! గురువునేల కొల్పెదవు! అంటారు. భార్య నుండి ప్రేమ తత్వమును, ఈశ్వర తత్త్వమును నేర్చుకో, భార్య కంటే గురువు మరెవ్వరూ లభించరని హితవు పురుషులకు హితవు చెబుతారు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాతూ, లింగభేదంతో పని లేకుండా అర్హతలు, యోగ్యతను బట్టి స్వతంత్రం ఇవ్వాలంటారు. సమాజంలోని ప్రతి మహిళ విద్యసభ్యసించాలని వాంఛించారు. ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడియన్న ఆంక్షలు అతనులో క్రోధాన్ని పెంచాయి. స్త్రీ విద్యను వ్యతిరేకించేవాళ్ళ విూద అక్షర రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తుం చేస్తూ, తరుణీ వివేకమన్ జదవ ధర్మము జ్ఞానముతత్వ దీక్షలన్-గురువుల చెంగటన్ బడయ గోరిన వారల మాన్పువారునూ-సూకరులై పుట్టు చుంద్రు.. అని శపించారు. స్త్రీ విద్య మాన్పించేవారు, అమెను చదువుకోనివ్వనివారు సుకరాలై పుడతారని అత్యంత తీవ్ర పదజాలంతో శపించటం ఆనాడు సాహసమే, అయినా ఉమర్అలీషా ఏమాత్రం ననెనుకాడలేదు.
సమాజంలో నెలకొనియున్న సామాజిక అంతరాల పట్ల ఉమర్ అలీషా తన అభ్యంతరాలను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటరానితనం, అసృశ్యత, సామాజిక వెలివేతల మీద అతను అక్షరాయుధంతో దండయాత్ర సాగించారు. మానవులలో జన్మతా: ఉచ్ఛనిచాలను నిర్ణయించడాన్ని విమర్శించారు. 1921 మార్చి మాసం 18వ తేదీన ఏలూరులో అదిమాంద్ర అంటుదోష నివారణ సభ జరిగింది. ఆ సభలో ఉమర్ అలీషా ప్రసంగిస్తూ, అంటరానితనం నిర్మూలనకు తగు సూచనలు చేశారు. కులాధిపత్యాన్ని విమర్శించారు. ఏకులం వారైనా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా, విద్యా బుద్ధుల ద్వారా అగ్ర స్థానాలను అలంకరించవచ్చని అతను అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మేధా సంపత్తిని సంతరించుకోవాలని సూచించారు. ..పందిని, కుక్కను, నక్కను, పిల్లిని గూడా ముట్టుకొను వారలకు మనిషిని ముట్టుకొనుట దోషములోనిది కాదు కావున, యీ యీషద్భేదములను సరకుచేయక వెంటనే దానిని (అంటరానితనం) సంస్కరించుటకు అందరు తోడుపడవలెను.., అని డాక్టర్ ఉమర్ అలీషా అంటారు.
1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటి ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాసు శాఖకు ఉపాధ్యకక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించారు. జాతీయోద్యమ కాలం నాటి ప్రజా పోరాటాలకు స్పందిస్తూ, దేశభక్తి ప్రపూరితమైన పలు పద్యాలను రాసారు. 1945 జనవరి 23 న ఈ మహాకవి నర్సాపురంలో కన్నుమూసారు.
*************************************************
సాహిత్యగుమ్మడి -29--4/11/22
మ.కో
చిన్ననాటనె నాటుకొన్నది శేషశైలెడ భక్తియున్
మిన్నగాయమకీర్తనల్బహు మేలుకొల్పులె స్వామికిన్
తిన్నగానొకమంచి గ్రంథముఁ దెచ్చెగా ద్విపదందునన్
కన్నులారగ స్వామిచెంతనె కట్టెవీడినదెవ్వరో?
సరైన జవాబు
1) తరిగొండ వెంగమాంబ
తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రీకుడైన కానాల మంగమాంబా,కృష్ణయా మాత్య అను నందవరీక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించింది.వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యంను సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలంలోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకినదట. వేంగమాంబ గంభీరమైన యోగరహస్యాలను సరళసుందరమైన భావమధురమైన శైలిలో వివరించింది. లలితమైన శృంగార భావనలను కూడా రమణీయశైలిలో చెప్పింది. యోగతత్వ విషయాలను ఎంతో విజ్ఞానప్రదంగా చెప్పింది. ప్రణయకోపాలను, సవతి మాత్సర్యాలను, నర్మగర్భసంభాషణలను, స్త్రీల ఎత్తిపొడుపు మాటలను, శ్రీకృష్ణుని శృంగారలీలలను, సహజంగా, రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసంతో మధురభక్తి కాక, జ్ఞానాత్మకమైన యోగభక్తితో, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రచనలు చేసింది. ఈమె పాడుకోడానికి వీలైన సింగారపు పాటలు, నలుగు పాటలు, ఆరగింపు పాటలు, నిద్ర పుచ్చే పాటలు, మంగళహారతి పాటలు వ్రాసి, తన రచనలను సంగీతసాహిత్యసమ్మేళనాలుగా రూపొందించింది.
వేంకమాంబ తాను భాగవతం ద్వాదశస్కంధాలను ద్విపదకావ్యాలుగా రచించినట్టు, వేంకటాచలమాహాత్మ్యంలోని ఒక పదంలో చెప్పుకొంది. ఈ ద్విపద భాగవతంలో, తత్వార్థాలను పామరులకు కూడా సరళసుబోధకం చేయడానికి, వేంకమాంబ తేటతెలుగు పదాలను ప్రయోగించి సంక్షిప్తసుందరం గావించినట్టు, ఈ ద్విపద పంక్తులను బట్టి తెలుస్తున్నది.
వెంగమాంబకు పూర్వం తెలుగులో ద్విపదభాగవతాలు కొన్ని వెలసి ఉన్నప్పటికీ, వెంగమాంబ కృతి యొక్కటే పోతనగారి రచనను ఆమూలాగ్రం సమర్ధవంతంగా అనుసరించిన ప్రఖ్యాతికి, ఆభక్తి గౌరవాలను నోచుకున్నది.ఇందువల్ల ఆనాటి (18వ శతాబ్దం) వెంగమాంబకు అందుబాటులో ఉన్న పోతన భాగవతిప్రతిలోని పాఠాలను గుర్తించగల పదవకాశం ఈనాడు మనకు ఆమె ద్విపదికృతి వల్ల సిద్ధిస్తూఉంటుంది. వెంగమాంబ పోతన రచనను యధాతధంగా ద్విపదీకరించినప్పటికీ, ఆమె అచ్చటముచ్చట కధలో కొన్ని చిన్న మార్పులు చేర్పులు చేసింది.
పలు ప్రక్రియలలో ఇన్ని గ్రంథాలు వ్రాసిన కవయిత్రులు ఆ కాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవిత విశేషాలను, రచనల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును తిరుమల తిరుపతి దేవస్థానములు ఉద్యోగుల శిక్షణా సంస్థ డైరెక్టర్ భూమన్ ప్రారంభించాడు. ఆమె కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో "జీవనగానం" అవే సి.డి.ని 2007లో విడుదల చేశారు.
తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెంగమాంబ ప్రతిమ తరతరాలుగా పూజలు అందుకొంటున్నది. జనవరి 1న, ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయ.
ఉత్తర మాడ వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందునుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది .ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తుంది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో, ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం సా.శ. 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది. ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు సా.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ స్వామిలోనే ఐక్యమైంది.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -30--5/11/22
ఉ//
హాలమునొక్కచేత పదహారములింపుగ ఘంటమందునన్
'బాలరసాలసాల నవపల్లవ కోమల..' పద్యసంపదల్
పాలనవెన్న భావముగ వ్యక్తము జేసినమాత్యుపెమ్మెనున్
శీలముఁవ్రాసె వారెవరు? జెప్పరె పొత్తమదెద్ది? హర్షమున్
1) పోతన చరిత్రము.
2) వానమామలై వరదాచార్యులు
వానమామలై వరదాచార్యులు గారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో ఆగష్టు 16, 1912కి సరియైన పరీధావి సంవత్సర 'శ్రావణ బహుళ ఏకాదశి' నాడు జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి ఆంధ్ర సంస్కృత భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. వైష్ణవ మతావలంబి.
రైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివాడు. అయినప్పటికీ సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు. తన 18వ యేట మేనమామ కొదుమగోళ్ల జగన్నాథాచార్య ఏకైక కూతురు వైదేహితో వివాహం జరిగింది. ఈయన అన్నలైన వానమామలై వేంకటాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు కూడా సాహిత్యకారులే.
ఇతని సహజపాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతాకళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించాడు. ఆ తర్వాత ఇతడు ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నాడు. విశారద పూర్తయ్యాక చెన్నూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశాడు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పాడు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ఇతడిని శాసనమండలికి నామినేట్ చేశాడు. 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగాడు. 1984 అక్టోబరు 31వ తేదీన వీరు స్వర్గస్థులైనారు.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -31--6/11/22
ఉ//(పంచపాది)
వందితనామెయన్నిటొక బాత్రయు నిర్వురు ముఖ్యులేయనిన్!
చిందులు ద్రొక్కునామె పతి చేష్టలు గాంచియు, నెమ్మికెక్కువే!
కొందరి తీరుతెన్నులనుఁ గూర్చియు నింపుగ వ్రాసెనెవ్వరో
అందరు శ్రోతలైరివిన యద్భుత రీతిన పొత్తమెయ్యదో?
సరైనజవాబులు
1) శ్రీ మునిమాణిక్యం నరసింహారావు.
2) కాంతం కథలు.
మునిమాణిక్యం నరసింహారావు తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898 న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఈయన తెనాలిలో ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ చదవడానికి తాహతు లేకపోతే కొండా వెంకటప్పయ్య గారి ఆయన సహాయం వల్ల బి.ఎ చదివారు.ఆయన భార్య కాంతం. ఆయనకు బందరు హిందూ హైస్కూలులో ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణిలో పనిచేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది. ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా చేసుకున్నారు.
కాతం కథలు
సాహిత్యంలో కొన్ని పాత్రలను కొందరే సృష్టించగలరు. నండూరి వారికి ఎంకిలా, గురజాడ వారికి మధురవాణిలా, ముళ్లపూడి వారికి బుడుగులా .. మునిమాణిక్యం గారికి కాంతం అలా అన్నమాట. మునిమాణిక్యం గారు తన ఇల్లాలిని చూసే ఈ పాత్రను కనిపెట్టారేమో అని అనిపించకమానదు. వివాహం చేసుకున్న రోజే.. గంధం పూసే పేరుతో మొగుడు తాకబోతే లెంపకాయ కొట్టిన ఘనత కాంతమ్మది.
తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆచేష్టలుయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు. ఆయన కుమారుడు మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య కూడా రచయితగా రాణించాడు.
గిడుగు వారి వ్యవహారిక భాషా ఉద్యమ ప్రభావం అప్పట్లో ఏ స్థాయిలో ఉండేదో కూడా పాఠకులకు అవగతమవుతుంది. అలాగే కాంతం భర్త, భార్య పోరు పడలేక.. బయట భోజనం చేద్దామని అరవ హోటలుకి వెళితే.. అక్కడ ఎదురయ్యే భాషా ఇబ్బందులు.. మనకు మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశంలోని.. మద్రాసు ప్రయాణ ఘట్టాన్ని గుర్తుచేస్తాయి.
కాంతం భర్త తనను తాను సోక్రటీసుతో పోల్చుకుంటాడు. ఎన్ని తిట్లు తిన్నా.. నవ్వుతూ ఉండడమే ఆయన లక్షణమట. కాంతం కూడా అన్ని వేళలా ధైర్యంగా ఉండదని ఆయనకు తెలుసు. కొన్నిసార్లు కాంతం భయపడుతుంది కూడా. కానీ కాంతం కంటే భయస్తుడు ఆమె భర్త. కానీ తన ఆలికి ఏమైనా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే మాత్రం దైర్యంగా నిలబడగలడు.
తన హీరోయిజం చూపించగలడు. ఎందుకంటే.. తనకు లోకం పోకడలు తెలుసు. కానీ కాంతానికి కుటుంబాన్ని ఎలా నడపాలో తెలుసు.. ఎలా పొదుపు చేయాలో తెలుసా. ఒక సంసార బంధం నిలబడాలంటే.. ఆ ఇంటికి ఇద్దరూ ముఖ్యమే.
కాంతం కథల పుణ్యమా అని.. ఆమెను పోలిన పాత్రలు తర్వాత తెలుగులో సినిమాల్లో చాలా వచ్చేశాయి. బాపు తీసిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాళం లాంటి చిత్రాలలోని ఇల్లాళ్ల పాత్రలు కచ్చితముగా కాంతాన్ని పోలే ఉంటాయని చెప్పేయచ్చు. ఈ పాత్రలను చూస్తుంటే నాకెందుకో ముళ్లపూడి వారి మీద కూడా ఎక్కడో మునిమాణిక్యం గారి కాంతం ప్రభావం పడిందేమో అనిపిస్తుంది. అలాగే కాంతం కథలను సీరియల్‌గా దూరదర్శన్ కేంద్రం వారు కూడా కొన్నాళ్లు ప్రసారం చేశారు.
--------------------------------------
సాహిత్యగుమ్మడి -32--7/11/22
ఉ//(షట్పది)
అప్పుకు తిప్పలొచ్చొనొక యప్పకుఁ, చెప్పగ నూరుపెద్దకా
యప్పయె జెప్పెతీరుపుగ నప్పరొ గట్టకదప్పదప్ప నీ
యప్పని, ఒప్పుకున్నతన యప్పను గాంచిన యప్ప బిడ్డడున్
జప్పున యింటికేగి తన జక్కని సూనుని వ్రక్కలించియున్
గొప్పగ దెచ్చెనప్పకడఁ కూడలినందరు నివ్వెరొందగన్
చెప్పరె యప్పలప్పలిట చేదుగ వ్రాసిరి యెవ్వరెందునన్?
సరైన జవాబులు
1) శ్రీ కాళీపట్నం రామారావు
2) యజ్ఞం
సాహిత్యగుమ్మడి -33--8/11/22
చం
యజనముఁ జేసెనిక్కముగ సాహితికారులు సంతసించగా
నిజముగ గాథలున్నతికి నిల్చెను మేటిగ నేకధాటిగన్
విజయమునొందె సాహితిని బేర్చియు శ్రామిక వర్గరీతులన్
యజనముతీరునొక్కటది యందరికోసము గట్టెగీమునున్
స్వజనమునండనివ్వనది వాసిని బొందెను వారలెవ్వరో?
సరైన జవాబులు
1) శ్రీ కాళీపట్నం రామారావు
కారా మాస్టారుగా పిలువబడే "కాళీపట్నం రామారావు" 1924, నవంబరు 9 న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకలో జన్మించాడు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల వివిధ ఉద్యోగాలు చేసినా స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము చేసాడు. అతను 1972లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసారు.
రచయితగా
ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశాడు. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పాడు - ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు. 1964లో వెలువడిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన కథానిలయం విశిష్టమైన యత్నం.
25 వసంతాల తెలుగు కథ పుస్తక ఆవిష్కరణలో మాట్లాడుతున్న కాళీపట్నం రామారావు గారు
"యజ్ఞం" కథా రచయితగా సుప్రసిద్ధుడు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడో ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించాడు - బ్రహ్మానందరెడ్డి హయాంలో కావచ్చు. ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు. కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు. పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి.
యజ్ఞం కథమీద చాలా విమర్శలే ఉన్నాయి. రంగనాయకమ్మ వంటి పెద్దలుకూడా విమర్శలుచేసారు. ఈ కథముగింపు నాకు కూడా నచ్చలేదు. అందుకే నా పద్యము చివరి పాదములో 'చేదుగ' అనే పదము చేర్చవలసి వచ్చింది. వీరు
2021 జూన్ 4 వ తేదీన వృద్దాప్యములో స్వర్గస్తులైనారు.
-----------------------------------------
-----------------------------------------
సాహిత్యగుమ్మడి 34--9/11/22
చం//(పంచపాది)
నవనవ చిన్ననొక్కరు కనంగ గనంపడు ప్రేమచిత్తమున్
అవసరమొచ్చెనేమొ తనకంపగ పక్షిని రాయబారమున్
వివరణ నిచ్చెపక్షి గనువిప్పుగ నంతయు పూసగుచ్చియున్
రవముల భేదబింకములు రంజిల నూర్పుల నింపుగూర్చుచున్
సవరనిలానె వ్రాసెవరు? జక్కగ దెల్పగరాద యెద్దియో?
సరైన జవాబులు
1) ముద్దుపళని
2) రాధికా సాంత్వనము
పద్యవివరణ
1)చిన్న=బుచ్చి (చిన్నన+ఒక్కరు =చిన్ననొక్కరు) ఇళాదేవి రాధ కన్నా చాలాచిన్నది. ఈరేడేవరకు రాధఇంటనే పెరిగింది. రాధ శ్రీకృష్ణుడు యెడల అమితమైన ప్రేమచిత్తముకలిగినదనందరకూ తెలుసు)
2) ఇళా కృష్ణుల వివాహమైనపిదప వారిరువురు ఇళా పుట్టినినింట ఉన్నప్పుడు రాధ అచట జరిగేవిషయాలు తెలుసుకోవడానికి ఒకచిలకను రాయబారిగా పంపుతుంది.
3) ఆ చిలక అక్కడ మూడు రోజులుండి వచ్చి ఇళా కృష్ణుల సరససల్లాప, సంయోగముల సమాచారమంతా రాధకు పూసగుచ్చినట్లు చెబుతుంది.
4) సంభోగసమయములోని శబ్దాలు, అలకలు, ఊర్పులు మొదలనవన్నీ తెలియచేస్తుంది.
5) (సవర=అందము- సవరన్ +ఇలా ) అందమైన ఇలా (ఇళా)నె
తెల్పగరాద (రాధ) కావ్యములో ప్రాధాన్యత గల ఈ రెండుపేర్లు సూక్షరూపములో సంకేతముగా ఇవ్వబడినాయి.
ఏ కవీ రచయితా వ్రాయసాహసించని, పక్షి, జంతు, మానవ జాతుల సంతానోత్పత్తికి మూలమైన సంభోగ ప్రక్రియను కృష్ణ పరమాత్మనెంచుకొని అత్యంత మనోహరముగా పద్యరూపములో పొందుపర్చి వ్రాసిన ముద్దుపళని తల్లి పాదపద్మములకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నాను. (మచ్చుకు కొన్ని పద్యాలు క్రింద ఇవ్వబడినాయి. మనస్కరిస్తే చదువగలరు)
ముద్దుపళని 18వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. దేవదాసీల కుటుంబములో జన్మించిన ముద్దుపళని తల్లి పోతిబోటి, అమ్మమ్మ తంజనాయకి కూడా కవియిత్రులని, తండ్రి పేరు ముత్యాలు అని రాధికా స్వాంతనముకు ఈమె రాసిన ప్రవేశికలో తెలుస్తున్నది. ఈమె 1739 నుండి 1763 వరకు తంజావూరు నేలిన మరాఠ నాయక వంశపు రాజు ప్రతాపసింహ యొక్క భోగపత్ని. ఈమె ప్రతాపసింహుని ఆస్థానములో నెల్లూరు శివరామకవితో పాటు ఆస్థాన కవయిత్రి కూడా. ముద్దుపళని యొక్క గురువు తిరుమల తాతాచార్యుల వంశమునకు చెందిన వీరరాఘవదేశికుడు.
ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము. అలిగి కోపముతో ఉన్న రాధను కృష్ణుడు బుజ్జగించడము ఈ కావ్య ఇతివృత్తము. దీనికి యిళా దేవీయము అని కూడా పేరుకలదు. చిన్ని కృష్ణునికి అంకింతమైన ఈ గ్రంథములో నాలుగు భాగములలో 584 పద్యములు ఉన్నాయి.
బాల్యవివాహాలు ముద్దుపళని కాలానికి సహజమైన విషయం. పాపం అదే తీరులో గోపాలుడికీ ఇళా ఈడేరక మునుపే భార్య కావడంతో మేనత్త వరసైన రాధ ఇంటిలో ఇళాతో మకాం పెడతాడు కృష్ణుడు. ఇళ సంసారానికి సిద్ధమయ్యేలోగా అందులోని మెళకువలన్నీ కృష్ణుడికి కంఠతా వచ్చేస్తాయి. రాధ వాటిని నేర్పిందో, కృష్ణుడే వాటిని నేర్చుకున్నాడో ముద్దుపళని మనకెక్కడా చెప్పరు. కాని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ. కామం. ఇళాను రాధే పెంచుతుంది. వయసొచ్చిన ఇళాతో కృష్ణుడికి శోభనం ఏర్పాట్లు చేయాలి. చేయడమే కాదు ఇద్దరికీ విడివిడిగా ఎన్నో జాగ్రత్తలు, మెళకువలు చెప్తుంది. ఇళా కృష్ణులను ఒకటి చేస్తుంది గాని, రాధ మనసు మనసులో లేదు. ఇంకా తెల్లవారకముందే వారి గదిని చేరుకుని ఇళాను పక్కకు పంపించి కృష్ణుడి చెంత వాలిపోతుంది. తనతో కూడా కూడాక తొలిరాత్రి ముచ్చట్లు అడుగుతుంది. కృష్ణుడు అత్యంత సరసుడు కదా- గడుసుగా లేలేత మొగ్గ, చిన్న పిల్ల ఇళా దగ్గర అంత సుఖమేం ఉంటుందని, రాధకు ఇళాకు పోలికే లేదని రాధను మెప్పించబోతాడు. విననట్టే నటించిన చిన్నారి, గడసు ఇళా అన్నీ వినేసిందని ముద్దుపళని ఒక్క వాక్యంలో రెండో ఆశ్వాసపు తొలి పద్యంలో చెప్తారు. అదికూడా ఇలా-
” అటు లా రాధిక, గోపీ
విటు నటు రతికేళి నేలి విడువంగ, నిలా
కుటిలాలక జేరి తనదు
కుటిలత్వ మెఱుంగనీక కూరిమి చెలగన్ “
ఆనక ఇళా పుట్టింటికి కృష్ణుడు వెళ్లాల్సివస్తుంది. తన దరిని గోపాలుడు లేకపోవడం రాధది వెలుతురు లేని ప్రపంచం. విరహ వేదన భరించలేక తప్పనిసరి మానసికావస్థలో చిలకను రాయబారంగా పంపుతుంది. అలా వెళ్లిన చిలక మూడు రాత్రులు ముగిసేనాటికి గడసరి ఇళా తన కొంగున కృష్ణుని కట్టేసుకోవడం చూసి అదే రాధకు విన్నవిస్తుంది. అక్కడితో రెండో ఆశ్వాసం ముగుస్తుంది. ఈ రెండో అధ్యాయంలోనే శృంగారం పాలు శృతిమించిందని విమర్శకులు గగ్గోలు పెడతారు. రసవత్తరమైన మూడో ఆశ్వాసంలో టైటిలుకు న్యాయం చేసే అసలు సిసలు కథ జరుగుతుంది. చిలుక చెప్పిన సంగతులు విని రాధ అసూయతో భగ్గున రగిలిపోతుంది. ఇళా కృష్ణుల సఖ్యత విని కలవరపడుతుంది. అన్నింటిని మించి గడసు ఇళా రాధికను పరిత్యజించమని మాధవుని బతిమాలడం చిలక చేరవేస్తుంది. అంతే రాధకు మండుతుంది. అలకపానుపు ఎక్కుతుంది. నాలుగో ఆశ్వాసంలో రేపల్లె చేరిన గోపాలుడు రాధికను ఇదీ అదీ అని చెప్పలేని విధంగా బతిమాలుకుంటాడు. రగిలిపోతున్న రాధ మాధవుని తూలనాడుతుంది. అవేవీ పట్టించుకోని గోపాలుడు తనదైన శైలిలో కాళ్ల బేరానికి వచ్చి ఆమెను ప్రసన్నం చేసుకుంటా. ఇదీ కథ.
కవయిత్రి పచ్చి శృంగార భరితంగా అల్లిన..........
ఎటు తాళనున్నదో యీ కొమ్మ కెమ్మావి
కై టభారాతి పల్గాటునకును?
ఎటు లోర్వ నున్నవో యీ కన్నె చన్నులు
గోపసింహుని గోటి కుమ్ములకును?
ఎటు లాన నున్నవో యీ తన్వి లేదొడల్
చాణూరహరు మారు సాదనలకు?
ఎటు లాగ నున్నదో యీ నాతి నును మేను
దంతిమర్దను కౌగిలింతలకును (మొదటి ఆశ్వాసం 65వ పద్యం)
అంటూ బెంగపడిన రాధ ఇళాదేవికి ఎన్నో కామ శాస్త్ర రహస్యాలు చెప్పినపుడు కాస్త పచ్చిగా ముద్దుపళని రాయడం జరిగినదని చెప్తారు. . అలాంటి మరి నాలుగు పద్యాలు .
“నాతి యింతకు మున్నె, నా సామి మధు రాధ
రామృతమ్మును జూఱలాడ కున్నె?
యతివ యింతకు మున్నె, హరి విప్పు టురముపై
గుబ్బల కసిదీఱ గ్రుమ్మ కున్నె?
రమణి యింతకు మున్నె, రమణు కౌగిట జేరి
పారావత ధ్వనుల్ పలుక కున్నె?
చాన యితకు మున్నె, శౌరి పై కొన వెను
దియ్యక యెదురొత్తు లియ్య కున్నె? “
పుట్టింటిలో కృష్ణుని భోగం గురించి చిలుక రాధకు వర్ణించి చెప్పే ఘట్టం ఇది: (2 లో 139, 140)
కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప,
జేరి తొడ లేచి పురికొల్పె గీరవాని,
నీలవర్ణిడి పైకొని కేళి నేల,
బాళి నెదురొత్తు లిచ్చె నిళా లతాంగి. (139)
కిలకిల నవ్వులు, గిలిగింతలును, బంధ
భేదపు రవములు, వింత వగలు,
పావురా పలుకులు, వాతెర నొక్కులు,
చిగురు మకారముల్, మరుగు తిట్లు,
దురుసు పైసరములు, తొందర ముద్దులు,
బిగి కౌగిలింతలు, బింకములును,
గొనగోటి మీటులు, గోర్గింపు, లుబుకులు,
కొసరులు, బొమ ముళ్ళు, కురుచ సన్న, (140)
రాధ అలకను తీర్చిన మాధవుడు ఆమెతో కూడినపుడు (4లో 103)
హత్తుకొని, యిన్ని విధముల
దత్తఱపడ ననగి పెనగి, తనివారక యా
బిత్తరి పై కొనె హరిపై,
మత్తేభముమీద నెక్కు మావంతు డనన్.
వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. కాని భారతీయ సాహిత్యం అంటే ఇష్టం లేని బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించినది. కందుకూరి వీరేశలింగం నుండి బ్రిటిష్ ప్రభుత్వం వరకు అందరూ ఈ కావ్యాన్ని విమర్శించారు.
స్వంతంత్రం అనంతరం1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ఈ కావ్యంపై నిషేధం ఎత్తేయించారు. అయినా అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు. ఆరుద్ర గారు 'కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని' అన్నారు. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే తిరుపతి వేంకట కవులు, మల్లాది రామకృష్ణ శాస్త్రి తదితరులు మాత్రం రాధికా సాంత్వనానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు.
------------------------------------------
సాహిత్య గుమ్మడి..35--10/11/22
ఉ//
కాలము తీరుతెన్నులను కట్టడ మొత్తము నెంచిజూపుచున్
నేలన జీవజాలముల నేలెడి వారల తిండితిప్పలలన్
పూలను, జంతుజాలమును, బుర్వును, కీటక, పక్షి పంటలన్
లీలగ కావ్యకన్నియలుఁ లెస్సగ జూపిరి యెందునెవ్వరో?
సరైనజవాబులు
1) ఋతు సంహారము
2) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
ఋతు సంహారము కావ్యాన్ని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. దీనినే తెలుగు ఋతువులు అన్న మరో పేరుతో వ్యవహరిస్తారు. పలు ఋతువులు తెలుగు నాట కలిగించే ప్రకృతి మార్పులు, ప్రజల జీవితాలలోకి తీసుకువచ్చే సున్నితమైన చేర్పులు వంటివాటిని వర్ణిస్తూ రాగరంజితమైన ఈ కావ్యాన్ని ఆయన రచన చేశారు.
విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ ఋతు సంహార కావ్యానికి మూలకథావస్తువు, కావ్యరచన విషయంలో కాళిదాసు రచించిన ఋతు సంహారము కావ్యం ప్రభావం ఉంది. ఆ ప్రభావం నేరుగా ఆయన ఎంచుకున్న కావ్యనామంపైనే కనిపిస్తోంది. కానీ విశ్వనాథ సత్యనారాయణ రచనలోని వర్ణనలపై మాత్రము ఆ ప్రభావమేమీలేదు సరికదా ఆయన చిన్నతనంలో చూచిన తెలుగు వాతావరణం వర్ణనలే ఉన్నాయి. ఈ కావ్యాన్ని నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో చూసిన పల్లెజీవితంలోని తెలుగు ఋతువులనే వర్ణించానని తెలిపారు
కథావస్తువు
తెలుగు ఋతువులు కావ్యానికి కథావస్తువు తెలుగు నాట వసంత, గ్రీష్మాది ఋతువులు ఎలా ప్రవర్తిల్లుతాయి, వాటి వల్ల ప్రజాజీవితంలో సూక్ష్మమైన భేదాలు ఎలా వాటిల్లుతాయి, ఆచార వ్యవహారాలు ఎలా వుంటవి మొదలైన విషయాలతో కూడివుంటుంది. ఇది వర్ణన ప్రధానమైన కావ్యము. కేవల ఋతువర్ణనలకే పరిమితం కాకుండా ప్రత్యేకించి తెలుగు నాట ఆయా ఋతువులు ఎలా వుంటాయన్నది రచించడం వల్ల ఈ కావ్యానికొక ప్రత్యేకత ఏర్పడింది. ఇదే పేరుగల తన కావ్యాన్ని కాళిదాస మహాకవి గ్రీష్మ ఋతువుతో ప్రారంభించగా విశ్వనాథ సత్యనారాయణ మాత్రం దీనిని వసంతంతో ప్రారంభం చేశారు. వసంత ఋతువు అందరికీ ప్రీతిపాత్రమైనదనే కాక తెలుగు వారి తొలి పండుగైన సంవత్సరాది వసంతంలోనే ప్రారంభమవడమూ కారణం కావచ్చు. తెలుగు నేల మీద పల్లె ప్రకృతిని సర్వాంగ సుందరంగా అభివర్ణించిన కావ్యంగా దీనిని పలువురు విమర్శకులు పేర్కొన్నారు.
వసంత ఋతువు
వసంతఋతువు వర్ణనను విశ్వనాథ సత్యనారాయణ ప్రియురాలి ఎదచెమర్చడంతో, బాలికల వాలుజడల్లో మల్లెమొగ్గలు కనిపించడం, వేపకొమ్మ చిగురించి కోకిల కుహూరావాలు చేయడం వంటివాటితో ప్రారంభమైనాయని మొదలుపెట్టారు. భార్యాప్రవాసివోలె గొంతెత్తి కూజితాలు చేసే కోకిలనూ, కొబ్బరిమొవ్వు గెలను తొలచి కలాలిలాగ అందులోని కల్లు రుచికి మరిగిన ఉడుతను, ఇతరుల కోసం లోభివానిలాగా ప్రతిపువ్వునూ వెతికి తేనెబొట్లు సేకరించే తుమ్మెదలను వర్ణించారు. క్రింది సీసపద్యములో మల్లెపూవులను తెలుగు రసికలోకాన్ని మురిపించే హరవిలాసము, కళాపూర్ణోదయం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్యము, మనుచరిత్ర మొదలైన కావ్యాలుగా వర్ణించడం విశేషం.(నా పద్యము నాలుగవ పాదము ఇదేకీలకము)
దీప్తి మాధుర్యావధి శిరస్సుధాంశు భా
సన్మనోహర విలాసమ్ము లగుచు
క్లిష్టబంధ విచిత్ర కేళీప్రశస్తి ర
హఃకళాపూర్ణోదయమ్ము లగుచు
కృష్ణ పదాగ్రభక్తి సుగృహీతాముక్త
మాల్యదాచ్ఛప్రౌఢ మధువు లగుచు
అనితరలభ్య వర్ణాత్తశయ్యా హేతు
వై పాండు రంగమహత్తు లగుచుఁ
దీయఁదనములు మెఱుగులుఁ దెచ్చుకొన్న
ప్రియలు ప్రియులు కూడి మనుచరిత్ర లగుచుఁ
దెలుగు రసికలోకముల కందిచ్చె నసువు
లత్తుకొని మల్లెపూల్ క్రొత్త క్రొత్తరుచులు.
----------------------------------------++
సాహిత్య గుమ్మడి..36--11/11/22
చం//
కలిపియు మేలుకొల్పెడివి, కాల్పనికంబగు కైతలల్లె, తా
విడిచిన యక్షరాల్కటలవే కలకంఠములాడు బిడ్డలున్!
పులి సరిగొన్నలేటి బలమున్బులమంగగలేను నేననెన్!
వెలసెను కూర్పరంతకముఁ వెన్కన పొత్తమునెయ్యదెవ్వరో?
1) 'అమృతం కురిసిన రాత్రి'
2) శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.
తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యం..... చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతో బాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశితా సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడాని ఆయన కవి , కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాధులు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటి బజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముండ నిలబెట్టాడు.
మొదట కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం రాశినా, వచన కవితా ప్రక్రియని తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కళనేత.
'అమృతం కురిసిన రాత్రి' దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.
ఇందులో ఉన్న కవితా ఖండికల పేర్లు
ఆర్తగీతం, సి.ఐ.డి., రిపోర్ట్, వెళ్ళిపొండి - వెళ్ళిపొండి, టులాన్ మాగ్నకార్టా, గొంగళి పురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవు పట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్థన, మైనస్ ఇంటూ ప్లస్
కొన్ని వ్యాఖ్యలు
ఆధునిక వచన కవిత్వంలో ఇదొక గొప్ప ఖండిక. .. కవిత్వంలో అత్యంత కారుణ్య భావపూరితాలూ, ప్రజాశక్తిని పరిదీప్తం చేసే చైతన్య శిఖలూ, రసార్ద్ర భావనోద్దీప్తి కలిగిన సుందర దుమధుర రసగుళికల సమాహారమే తెలుగు కవిత్వ ప్రియులకు త్రిల్ అందించిన "అమృతం కురిసిన రాత్రి"
“ఒక నిశార్ధ బాగంలో నక్షత్ర నివహగగనం
ఓరగా భూమ్మీదకు ఒంగి ఎదో రహస్యం చెప్తున్న వేళ
ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను”
ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉండును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే. ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వంగా కూడా అనిపించనూ వచ్చు. కనురెప్పల మాటున మెరుపువీణలు మీటిన - 'అమృతం కురిసిన రాత్రి - ఆధునిక కవితారంగంలో ముగ్గురిని ప్రముఖంగా పేర్కొనాలి. వారి కవితా సంపుటాలు రాకుండానే వారికి దేశం పట్టనంత పేరొచ్చింది. ఆ ముగ్గురు- తిలక్, శ్రీశ్రీ, అజంతాలు. . తిలక్ శైలీ రమ్యత, తీసుకున్న వస్తువులు అన్నీ కూడా కవితాప్రియుల మన్ననలు పొందాయి. ఆయన వచనకవితా ప్రక్రియను పరిపుష్ఠం చేశారు. ఆయన శైలి రమ్యత పద్యకవితాభిమానులను సైతం ఆకట్టుకుంది. అంతేకాదు కవిత్వం అంటే ఇష్టంలేని వారికి కూడా అది చేరువైంది. ఆయన తన కవిత్వాన్ని నిర్వచించే కర్తవ్యంలో భాగంగానే ఈ సంపుటిలోని తొలికవిత రాశారు. తన కవిత్వానికి వెనుక ఏతత్వం లేదని అంటారు. ప్రత్యేకించి ఏ వాదాన్ని సమర్థించనంటారు. అలాగే అయోమయం సృష్టించడం తన అభిమతం కాదంటారు. ఇక తన కవిత్వంలోని సుందర చిత్ర విచిత్రాలేమిటో చెబుతూ 'గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ, జాజిపువ్వుల అత్తరుదీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలూ'... ఇవన్నీ ఆయన కవితా చంద్రశాలలోని విశేషాలే. ... అమృతం కురిసిన రాత్రి'లో అందరూ నిద్రపోతుంటే ఆయన జీవితాన్ని హసన్మందార మాలగా భరించారు..... అమృతం కురిసిన రాత్రి' చదివితే ఎవరికైనా కవితామృతం గ్రోలినంతానందం కలుగుతుంది. ఉత్తేజంతో కొత్త వెలుగుతో జీవితాన్ని సరికొత్తగా చూడగల నేర్పు అలవడుతుంది.
'అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నాకళా కరవాల ధగద్ధగ రవాలు'
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన 'నా కళా 'కరవాల' ధగద్ధగరవాలు' అన్నారు. ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అన్న అంశాన్ని ఇందులో చాలా స్పష్టం చేశారు. ఆ కవితలోనే ఇంకా అంటారు -
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'
ఈ మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.
దేవరకొండ బాలగంగాధర్ తిలక్ సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా వుండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలభై అయిదేళ్ల నడిప్రాయాన 1966 జూలై 1 న అనారోగ్యంతో అమరుడైనాడు.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి 37--12/11/22
చం//
నియతిని దప్పినొక్కరట నేమరపాటున గాంచియూఢనున్
పయనముఁ గీమునొగ్గియు, వివాహము సంతుయు సంగడాధిలన్
దయనిడ మాతయల్లుడట దక్కగ గుమ్మడి శాంతి క్రీడగన్
నయమున వ్రాసెనెవ్వరిది? నామమునేమది? దెల్పరండయా
సరైన జవాబులు
1) చేమకూర వేంకటకవి
2) విజయ విలాసము
(ఊఢ=భార్య, సంగడి=రెండు, ఆధి=చోటు, సుభద్ర=గుమ్మడి, శాంతి=(పార్వతి),విజయ, విలాసము=క్రీడ) మాతయల్లుడు-కుంతీదేవి మేనల్లుడు శ్రీకృష్ణుడు, కృష్ణుడు కరుణించబట్టే సుభద్రార్జులవివాహం జరుగుతుంది
సా.శ.1630 కాలానికి చెందిన చేమకూర వెంకన్న స్వయంగా కవియైన రఘునాథ నాయకుని ఆస్థానంలోని ప్రముఖ కవి. దక్షిణాంధ్ర కాలానికి సంబంధించిన శృంగారభరితమైన ఇతివృత్తాన్ని చేమకూర వెంకన్న చమత్కారభరితమైన శైలితో మేళవిస్తూ 'విజయ విలాసము' కావ్యాన్ని రచించారు.
విజయుడు అనగా అర్జనుడు. అతడి విజయగాధను తెలిపేది కనుక ఇది విజయవిలాసం అనబడింది. ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు. విజయ విలాసంలో కథ భారతంలోనిది. బ్రాహ్మణ గోసంరక్షణార్థం, విల్లంబుల కోసం అర్జునుడు ధర్మరాజు అంతఃపురం వైపు వెడతాడు. ఆ ఏడాది ద్రౌపదీదేవి ధర్మరాజు సన్నిధిని ఉంది. నియమం ప్రకారం అర్జునుడు అటు వెళ్లకూడదు. కానీ పరాకున వెళ్ళాడు. దానికి ప్రాయశ్చిత్తంగా ఇల్లువిడిచి భూప్రదక్షిణకు, పుణ్యక్షేత్రముల దర్శనార్ధము బయలుదేరాడు. తోడుగా విశారదుడనే నర్మసచివుడు కూడా వెళ్ళాడు. గంగానది యొక్క పరీవాహక ప్రాంత పుణ్యక్షేత్ర సందర్శనలో ఉలూచి అనే నాగకన్య అతడిని మోహించి తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళడం వారిరివురకూ ఇలావంతుడు జన్మించడం, తదనంతరం పాండ్యరాజ్యం సంధర్శనలో మలయధ్వజ మహారాజు కూతురు అయిన చిత్రాంగదను వివాహమాడి బబ్రువాహనుని కని అతడిని మామగారికి దత్తతివ్వడం, తర్వాత ద్వారక సంధర్శనలో శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రనీ వివాహమాడడం ఇదీ కావ్యంలోని ఇతివృత్తం...నేటిమన సాహిత్యగుమ్మడి లోని విషయము.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -38--13/11/22
మ.వి(పంచపాది)
తెలిపెన్దేశము రాజ్యవిస్తరణ నేదేవాదిపుండెట్లునో
నిలిగెన్పిమ్మట నెవ్వరెట్లు చరితందేరీతి దెల్పాదినిన్
తెలగాణంబున పోరుబాటకు తనందించెన్గవిత్వమ్మునున్
కలమే యాయుధమైన మువ్వురొక సంఘంబైరిగా సంపుటిన్
నలిగే జీవులు వానలున్కృతులునంత న్నూతనంబెవ్వరో?
సరైన జవాబు
శ్రీ కుందుర్తి ఆంజనేయులు
కుందుర్తి ఆంజనేయులు. 1922 డిసెంబర్ 16 న కామయ్య , నరసమ్మ దంపతులకు నర్సారావు పేట సమీపంలోని కోట వారి పాలెంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. నిఘంటువులు అవసరంలేని భాషలో కవిత్వం రావాలని ఆశించాడు. 1976 లో ప్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించి వచన కవితోద్యమానికి మూల స్తంభంగా నిలిచాడు . సాహిత్యంలో ప్రాచీనం , ఆధునికాలకు ఎంత వైవిధ్యం ఉందో, గ్రాంధికం , వ్యవహారిక భాషలకి ఎంత వైరుధ్యం కలదో , పద్యానికి , వచనానికి అంతే వ్యత్యాసం ఉంది . ప్రాచీనులకి పద్యం , ఆధునికులకి వచనం ఆలవాలమైంది . సాహిత్యాన్ని పామరులకు సైతం దగ్గరగా తీసుకు వెళ్లిన ఘనత వచనానికే దక్కుతుంది . అందుకే ఆధునిక సాహిత్యం వచనంతోనే ప్రకాశిస్తుంది అంటూ “ పాత కాలం పద్యమైతే / వర్తమానం వచన కవిత్వం “ వచనానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చిన కవి , వచన కవితా పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి కుందుర్తిద .కుందుర్తి గా ప్రసిద్ధి చెందినారు .
సోవియట్ ల్యాండ్ నెహ్రు అవార్డు , ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు . నయాగరా , తెలంగాణ , నగరంలోని వన , యుగే ..యుగే , నాలోని నాదాలు , మాతృ గీతం , ఇదేనా దేశం మొదలైనవి వీరి రచనలు . కుందుర్తి , బెల్లంకొండ రామదాసు , ఏల్చూరి సుబ్రహ్మణ్యం వీరిని నయాగరా కవులు అంటారు . కుందుర్తి రచనల్ని కుందుర్తి కృతులు పేరుతో ప్రచురించబడ్డాయి .
తెలంగాణ కవితా సంపుటిలో మొత్తం 26 కవితలున్నాయి . మొదటి కవిత ప్రస్తావన లో భారత దేశం యొక్క చరిత్రని , వర్తమానాన్ని ఈ కవితలో వివరించాడు . భారత దేశంలోని రాజులు గురించి , రాచరికాలు గురించి తెలుపుతూ
“పూర్వం ఒకనాడు
ఒక రాజు యింకోరాజును
దండెత్తి ఓడించాడు
ఓడినరాజు వారసులు విజేత రాజును బలిగొని
అతని రాజ్యం ఆక్రమించాడు .” అంటూ పూర్వం భారత దేశం లో రాజుల గురించి , ఒకరు మీద ఒకరు ఏవిధంగా ఆధిపత్యం చెలాయించాలి అని ఆరాట పడేవారో చివరకి అందరు కలిసి పాలన అధికారాన్ని విదేశీయుల పరం చేసారో చెప్పాడు .
రాను రాను కొన్నాళ్లకు
వారు రాజులయ్యారు
ప్రజలు బానిసలయ్యారు “ అనడంలో విదేశీయులు మనపై అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నారో తెలుస్తుంది . అలాగే సింహాసన కవితలో హైదరాబాద్ సంస్థానం గురించి , అక్కడి ప్రజల అవస్థలను చెబుతూ …” దేశంలోని సంస్తానాలన్నింటిలో / హైదరాబాదు పెద్దది / భూస్వామికుల బాధల్ని ప్రజలు సహించిన / చిట్టచివరి హద్ద అది “ తెలంగాణాలోని హైదరాబాద్ స్థానంతెలుస్తుంది . ప్రజలు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని “ప్రజోద్యమ” కవితలో …
“ఏ రోజు కారోజు రాజు గారి కొలువులో
వెట్టి చేసే వాడు
ఏ పూట కాపూట కడుపును
నిందించుకునే వాడు
చరిత్ర రధ చక్ర గమనాన్ని
శాసించ బూనుకున్నాడు “ బానిసత్వం , పేదరికం ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతాయి .
కుందుర్తి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే కవిత “ నగరంలోని వాన “. ఈ కవిత నగరంలోని వాన కవితా సంపుటిలోని మొదటి కవిత . నగరంలో కురిసే వాన మనుషులతో ఆడే దాగుడుమూతలు , నగర వాసులకు కలిగించే ఇబ్బందులు , అలాగే వాళ్ల మీద అప్పుడప్పుడు చూపించే కనికరం అన్నింటిని హృద్యంగా వర్ణించాడు కుందుర్తి . ఈ కవితలో రచయిత తనకు తెలిసిన నగరంలోని వాన అంటే హైదరాబాదు నగరంలోని వాన అని ముగిస్తాడు . కాని ఈ వాన ప్రతి నగరం లో కురిసే వానకి ప్రతీకగా ఉంటుంది .
“ నగరంలో వాన
కవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు
జల్లులు జల్లులై కురుస్తుంది “ అంటూ మొదలవుతుంది . నగరంలోని భవానాలు , రోడ్లపై , పడే వర్ష వలన అవి ఎలా కన్పిస్తున్నాయో ఈ విధంగా వర్ణిస్తాడు రచయిత . “నున్నగా తెల్లగా తళతళలాడే/ సిమెంటు రోడ్డు అద్దాలోకి /మింటి నుంచి మెడలు వంచి” మిల మిలా మెరుస్తున్నాయి మేఘాలు అంటాడు కవి . నగరంలో కనిపించే రెండతస్తుల బస్సులను చూసి గిరిశిఖరాలు అనుకుని మేఘాలనుకుని భ్రాంతి పడ్డాయని చమత్కరిస్తాడు .
నగరంలోని బ్రతికే మధ్య తరగతి వాడికి వర్షం వస్తే పడే అవస్థను వివరిస్తూ , వాడి ఆర్ధిక పరిస్థితిని మించి కొనలేనిస్థితిలో తడిసి ఇంటికి వచ్చి కుంపటి ముందు కూర్చుని ఉన్న ఉద్యోగి చూస్తూ తను చేసిన ఘన కార్యం కనులార చూసుకోవాలని /కిటికీ లోంచి తొగి చూస్తుంది చిటపట చిలిపి జల్లుల్తో . నగరంలో కురిసే వాన గడుసరిదే దానికి కాస్తో కూస్తో జాలి , దయ ఉన్నాయని మూడునాళ్ల పసిపాపను /ముద్దుగా ఒడిలో గుండెలకు కద్దుకుంటూ / ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చే బాలెంతరాల మీద పూలజల్లు కోరుస్తుందే కాని జోరున వర్షం పడదు , అంటూ వర్ష జాలిని తెలియజేస్తాడు .
ఇదీ నా దేశం కవితలో ఇది నా దేశం / అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంది “ అంటూ మొదలైన ఈ కవితలో ప్రతి పాదం తరవాత ఈ పదాలు కన్పిస్తాయి . సమాజంలోని ధర్మం గురించి , జరిగిన దోపిడీ వ్యవస్థను , దానిని క్రమబద్దంగా చేయలేని నిస్సహాయతని ప్రశ్నించుకుంటూ ,
ఈ విధంగా కుందుర్తి కవితలన్నింటిలోనూ మానవీయత , దేశభక్తి , ప్రకృతి , సామాజిక సమస్యలు , సంఘటనలు , మహనీయుల గురించి వచన రూపంలో ఆవిష్కరించారు . సామాన్య చదువరునికి కూడా చేరేలా చేయవచ్చని నిరూపించారు .....
సామాన్యుడి పరిస్థితిని చెబుతూ “ దేశ స్థితిని వివరిస్తూ / తినేది తక్కువా తీసి పారేసేది ఎక్కువ /సీతాఫలం పండులా ఉంది నా దేశం “అని దేశలోని పరిస్థితిని వివరిస్తాడు .25-10-1982 న వీరు స్వర్గస్తులైనారు.
------------------------------------------
ఉ//
సాహిత్యగుమ్మడి -39--14/11/22
ఉ//
నేరక సాహితీ సిరులు నేరక నేస్వరమెంతమాత్రమున్
నేరిచి దైవచింతనము నిండుగ నల్లెఁగవిత్వమింపుగన్
కోరిరి పెద్దలిర్వురును కూరిమిఁ బాపగ దూషణమ్ములన్
కోరితిఁ జెప్పరే ఘనలుఁ గూర్పరి నామము నెవ్వరందురో?
సరైన జవాము
1) మొల్ల
ఆతుకూరి మొల్ల, (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయం (16వ శతాబ్దం) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైంది, రమణీయమైంది.
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా సా.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు. వంగడమునుబట్టి కుమ్మరి మొల్ల అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనశెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుడుని స్మరించియుండుటచే ఈమె శ్రీనాధుడు తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు. ఈమె స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం .ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందినదని మొల్ల రామాయణంలోని ఈ క్రింది తే.గీ పద్యం ద్వారా తెలుస్తుంది.
గావ్య సంపద క్రియలు నిఘంటువులును-
గ్రామ లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత -
నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి"
(పై పద్యానికి కొంత భాగము ప్రతిరూపము నాపద్యము)
నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయం గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన మరియు తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్ల గారిని దర్శించినట్లు ఆమెపై చేసిన దూషణను మన్నించవలసినదిగా ప్రాధేయపడ్డారు.
వాఙ్మయ మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాబంగా పెంచెనని తెలుస్తుంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం. చివరి దాకా తండ్రి ఇంటి పేరునే ఉపయోగించడం మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -40--15/11/22
మ.కో(పంచపాది)
ఈ మహావహి బూర్వ కాలము నెప్పుడాతడు వ్రాసిరో
యా మహా మునివర్య యద్భుతమందు ద్వాదశ స్కందముల్
హేమశంఖవతార రూపము యేవిధా నుదయించెనో
ఏ మహాదివిజుండు దుష్టులనెట్లుగీటడగించెనో
ఈ మహాభువిఁ హిందుధర్మమునేక మైనదదెద్దియో?
సరైన జవాబు:-శ్రీమద్భాగవతము
భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం హిందూ మత, ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భాగవత అవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.
ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని 21 అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది. శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. ఈ మహా గ్రంథం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంథం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
***********************************************
సాహిత్యగుమ్మడి -41--16/11/22
ఉ//
చూడగ మేటి భావములు జోడున గన్పడు నేకవేల్పుకున్
వేడుచు సూటిగానొకడు వేదన దెల్పెడి రీతినెంచియున్
వాడుక మాటలందొకటి వ్రాయగ గన్పడు దైవసన్నిదిన్
చూడమరొక్కటెంచియు జూపెను రూఢిగ సత్యసేవనున్
వాటముఁ దెల్పరేబుధులు వ్రాసినదెవ్వరవెవ్వియందురో?
సరైన జవాబులు
1) దూర్జటి
2) శ్రీ కాళహస్తీశ్వర శతకము
3) శ్రీ కాళహస్తి మాహాత్మ్యము
ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ, రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం, శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి, ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నాయి.
ధూర్జటి తానీ శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ సా.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగ రాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదంశం. శ్రీకాళహస్తీశ్వర శతక కవి ధూర్జటి. ఈతఁడు శ్రీకృష్ణ దేవరాయల సభలో అష్ట దిగ్గజములు అనబడు ఎనిమిది మందిలో ఒకడు అని వాడుక. శ్రీ కాళహస్తి మాహాత్మ్యమును బట్టి ఈ కవి సింగమ రమా నారాయణ (జక్కయ నారాయణ) తనూభవుడు అని తెలియును. కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటలలో ‘ఈ కాళహస్తి మాహాత్మ్యము వంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ (ధూర్జటి) కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గండె పాటు దాటి, దూరాన శివుడు కనిపించునట్లు చేయును’. ధూర్జటి రచనలుగా మనకు లభించునవి రెండు. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము భాష విషయమున ఈ రెండు రచనలును రెండు వేరువేరు మార్గములలో నడచినట్లు కనబడును. శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తి క్షేత్ర పతియగు శ్రీకాళహస్తీశ్వరుని మహిమమును బహువిధములుగా తెలుపు స్థల పురాణము. కావ్యముగా ఇది ప్రబంధము. ఎందుకంటే ఇది పంచభూత లింగములలో ఒకటిగా వాయు లింగ రూపుడగు శివుడు వర్ణనీయుడుగా రచించబడిన వస్తుప్రధాన కావ్యము. శ్రీకాళహస్తీశ్వర శతకము, భక్తుడు తన మనస్సులోని భక్తి మొదలగు భావములను భగవంతునితో సూటిగా చెప్పుటకై రచించబడిన కావ్యము. కవి తన హృదయమును అనుదినమును మాటలాడు వాడుక భాషలోనే భగవంతుని ఎదుట ఉంచుటకై చేసిన రచన ఇది. అందుకు తగినట్లే ఈ శతక రచమలోని భాషను, అంటే వాక్యనిర్మాణాన్ని, వాడుక తీరులోనే చేయడమైంది.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -42--17/11/22
ఉ//(పంచపాది)
వీడియు నాదిఁ మధ్యలనుఁ బెన్మిటిఁ, బోవ గడామె మింఠడున్
వాడిన గౌరవంబులును వాటికిజుట్టుర నేడ్పుబొబ్బలున్
నేలకు గూల భూజములు, నేలల నమ్మెడి తీరుదెన్నులన్
కాలము మారుతీరు, కలుగంగను సంపద నెట్లునుండునో
పోడిమిఁ గద్యమందు, చిరుపొత్తము నెయ్యది? వ్రాసెనెవ్వరో?
సరైన జవాబులు
1) మూలింటామె
2) శ్రీ నామిని
చిత్తూరు జిల్లా మాటల్తో మనిషిలోతు కొలిచిన పసందైన ఆట ఇది కథ కాదు.. కళ్లముందర నుంచీ నడుచుకుంటా వెళ్లిపోయిన పల్లె బతుకు. ఇది వట్టి నామిని పైత్త్యం గాదు... డబ్బు కళ్లజూడాలన్న మనుషుల వికారపు కోరికలు షికారు తిరిగే మరుభూమి. ఒక కాలంలో ఒక ఊరు, ఆ ఊర్లో చొక్కాలు, పంచెలు, చీరా-జాకెట్టూ తగిలించుకోని తిరిగిన మనుషుల ఆనవాలు ఈ నవల. చాలా చిన్నదే.
నారాయడు సంగతేమో, లేచిపోయిన నారాయుడు పెళ్ళాం సంగతేమో గానీ, మూలింట్లో ఉన్న ముసలామె, ఆమె కూతురు, కడుపులో కుళ్లి కుళ్లి ఏడ్చిన తీరు, రచయిత పరిణితికి తార్కాణం. గ్రామీణ మహిళల జీవితాన్ని ఇంత లోతుగా చిత్రించడం నామినికే చెల్లింది. చాలా చిన్న వయసులో భర్తపోయినపుడు, మూలింటామె, తన ఇద్దరు బిడ్డలను పెంచుకున్న తీరు. కుటుంబాన్ని నిలుపుకున్న తీరు పట్టుదలకు, దీక్షకు గుర్తు. కష్టేఫలే అన్న నానుడికి చిహ్నం. ఏమో, తన మనవరాలిపై అవ్యాజమైన ప్రేమబంధం కారణంగా చివరికి మూలింటామె తన శీలానికీ మచ్చ ఆపాదించికోని ఉండవచ్చు. ఒక గీత ముందు మరింత పెద్ద గీత గీయడానికి ఆ ముసల్ది ప్రయత్నించి ఉండవచ్చు. తద్వారా మనవరాలి తప్పును చిన్నదిగా చూపెట్టాలనుకుని ఉండవచ్చు. ఆ వయసులో ఆ నిజం వెలుగు చూడ్డం, అందువలన ఆమెకు వచ్చేనష్టం ఏమిటి? తను పెంచుకునే పిల్లి పిల్లలకోసం తను వక్కా, ఆకు వేసుకోవడం మానుకున్న మనిషి మనసు అర్థంజేసుకోగలగాలి. తాంబూలం కోసం పెట్టే ఖర్చుతో పిల్లులకు కోడిగుడ్డో, ఉప్పుచేపో కొనిపెట్టాలనుకునే మూలింటామె ఒబ్బిడి తనం పాఠకున్ని కదలించివేస్తుంది.
కేవలం ఓ ఏడాదిలో మూలింటిపరిసరాల్లో వచ్చిన మార్పులు. ఈ ముప్పై ఏళ్లలో దేశ అంతటా వచ్చేసింది. ఈ మార్పు గుర్తించాలంటే, పరిశీలన అవసరం. ఇపుడు జిల్లాలో పెద్ద మాన్లు ఎక్కడా లేవు. ఏ గ్రామంలోనూ బండి, ఎద్దులూ లేదు, ఎవరూ సంగటి తినడం లేదు. అసలు సంగటి చేయటమే చాలా మందికి తెలియదు. అన్ని వంట గదుల్లోనూ మిక్సీలు, వొవెన్లూ, ఇడ్లీ కుక్కర్లు, దోశలే.. అందువల్ల వాతవారణంలో ఎంత మార్పు వచ్చింది. వేసవి తీవ్రత ఎంత పెరిగింది. బూముల్లో నీళ్లు ఎంత కిందకు పోయాయి ఇవన్నీ పందోసంత బృందం వంటి వారి అకృత్యాల వలనే కదా. ఇది గుర్తించాలి ఈ నవల్లో ....
చిత్తూరు జిల్లా గ్రామీణజీవనం. మూలింటామె . . . . కన్నుచెదిరే జిల్లా మాండలికాల సొగసు జిలుగు చూసి అవాక్కు కావలసిందే. తెలుగు నుడికారానికి ఆకారాన్నిచ్చి నవరత్న ఖచిత కిరీట ధారణ చేయించిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ల ప్రయోగయోగవిద్యా విశారదుడు నామిని.
మనవరాలి సిగ్గుమాలిన పనిని మూలింటామె ఎందుకు కడుపులోనే దాచుకుంది, నడిపామె ఒక్క మాటతో కన్నకూతుర్ని ఎందుకు చచ్చినదానితో సమంగా భావించుకుంది. ఒక మహిళకు సంబంధించిన సంఘటన, ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు ఆడవారిలో రెండు పరస్పర విరుద్ద భావాలు ఎందుకు కలిగించింది? దీని నేపథ్యం ఏమిటి? ఇదే ఈ నవలకు సంబంధించిన మనోవైజ్ఞాక విశ్లేషణ. కథ చిన్నది. అందులో నామిని నడిచి వెళ్లిన జాడ తీరు తెన్నులు లెక్కించ వలసి ఉంది. చివర్లో ముసలమ్మమరణం, మనవరాలి ఆత్మహత్య వంటివి లోతైన వ్యక్తిత్వాలకు నిదర్శనం.
ప్రపంచం అంతా విస్తరించిన విచ్చల విడి మార్కెట్ శక్తుల విషపు కత్తులు లేత పల్లెబాలికలను హతమారుస్తున్న దృశ్యాలను, హెచ్చరికలూ నామిని యొక్క మూలింటామె నవలలో చూడలేక పోతే, ఇక పుస్తకాలు చదవడం వృధా. ఇవ్వాళ నడుస్తున్న నయా మార్కెట్ పోకడలు చెట్లను నరికేయటము, పచ్చని పంటభూములను అమ్మేయటము, దళారీ వ్యవస్థ మున్నగునవన్నీ పందొసంత రూపంలో నామిని ఎట్లా చెప్పాడో తెలుస్తుంది. మనిషిని మోసగించే కళకు ఏ విధంగా పేరు పెట్టారో అవగతమవుతుంది.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -43--18/11/22
ఉ//
అందగ విద్యనందరికి నాయనకోరెను మిక్కుటంబుగా
డెందము విద్యనందు, ఘనులింపుగ బంచిరి పల్కబల్పముల్
ముందుగ సంఘమేర్పరచె భూరిగ మేలిడ కోడెగాళ్ళకున్
పొందగ స్త్రీలు విద్య తనె పోరెను మెండుగ నెవ్వరందురో?
సరైన జవాబు
1) కందుకూరి వీరేశలింగం
కందుకూరి వీరేశలింగం గారు సుబ్బారాయుడు (తండ్రి)
పున్నమ్మ (తల్లి) దంపతులకు 1848 ఏప్రిల్ 16 తేదీన రాజమండ్రిలో జన్మించారు- సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసారంగములో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. ఆరోజులలో అంటరాని కులాలవారని పిలవబడే తెగల పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పవెలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు. ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.1919 మే 27 వ తేదీన చెన్నైలో మరణించారు.
----------------------------------------
సాహిత్యగుమ్మడి -44--19/11/22
చం//
హలమును చేతఁబూనియు ప్రయత్నముఁ జేయునతండె సత్కవై
కలమును చేతఁ బూని నొక గ్రంథము నాంధ్రమునందు గూర్చెగా
లలితముఁ, గౌసలేయుడుయె లాలనఁ నానతినివ్వ ధ్యానమున్!
కుడువగ నొప్పడాయెతను కూళలకిచ్చియు గ్రంథమెవ్వరో?
సరైనజవాబు
శ్రీ బమ్మెర పోతన
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు. బమ్మెర పోతన నేటి జనగామ జిల్లా లోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసయ్య దంపతులకు జన్మించాడు. అతని అన్న తిప్పన. ఇతను బమ్మెర వంశానికి చెందివాడు, శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి “సోమనాథుడు”.అతను ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.
తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు; కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయారు.బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృతమయ్యాయి. కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయసమీపంలో గల ఒక చిన్న గుట్టపై పోతన విగ్రహం ఉంది. ఆలయంలో స్వామివారికి పోతన పేర తాంబూలం సమర్పించే ఆచారం ఉంది. ఆలయానికి 1-1/2 కి.మీ. ల దూరంలో "బమ్మెర గడ్డ" అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో గల చెరువు క్రింద "పోతన మడి" ఉంది. అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు పోతన జన్మస్థలం బమ్మెర అయినప్పటికీ ఒంటిమిట్టలోనే తన భాగవతాన్ని రచించాడని అభిప్రాయపడ్డాడు. కాని, అతని భాగవత రచనను రాచకొండలో ప్రారంభించి ఒంటిమిట్టలో పూర్తి చేసాడు. పోతన ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చాడు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తం పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.
యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచన చేశాడు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దండకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాసాడు. దానశీలము అనే ఒక పద్యకావ్యముకూడా రాసాడు. భావి కవులకు శుభం పలికి రచన ఆరంభించిన సుగుణశీలి అతను. సి.నారాయణరెడ్డి వ్యాసం భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యంలో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -45--20/11/22
మ. వి
కులహంకారమె పాఠశాలకడ తాగూర్చుండనడ్డాయెగా
కలమేయాయుధమయ్యె, చీవుక జనాక్రందన్లు దెల్పెంగ, బొం
దలగడ్డందున లేదనంటు తెగనిందల్జేసెఁ గావ్యంబునన్!
లలితన్పెండియ చెళ్ళపిళ్ళగవి నిండారంగ దొడ్గెన్గదా
వలపున్గోరితి దెల్పరే కవి సమాహ్వంబేమియో గెల్వగన్!
సరైన జవాబు
శ్రీ గుఱ్ఱం జాషువా
గుఱ్ఱం జాషువా
ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా 1895 సెప్టెంబర్ 28 న గుంటూరు జిల్లా వినుకొండలో వీరయ్య లింగమ్మ దంపతులకు జన్మించారు. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:
గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు. ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -46--21/11/22
ఉ//
మువ్వురు నొక్కకావ్యమును ముచ్చట గొల్పుచు నాంధ్రమందునన్
కవ్వము తీరుగా చిలికి కమ్మగ నైదవ వేదమిచ్చెగా
మువ్వము భాషనిందుగన, పోరుటనందునె బుట్టెగీతయున్
మువ్వురనూక్తమంబిడగ పొందిరి నామము నొక్కటెద్దియో?
సరైన జవాబు
కవిత్రయము
మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి ఈమహాభారతం. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు. మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ఈ ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో 'కవిత్రయం' అని మన్ననలందుకొన్నారు.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -47--22/11/22
ఉ//
వాడుక భాషకుద్యమముఁ వాసిగ జేసె పితామహుండు, దా
కూడదు గ్రాంథికంబు వనగూర్చుదు యెల్లరు నేర్వవిద్యనెన్
వేడుకఁ జేసెగా సవర విద్యకు రూపము నాంధ్రమందునన్
వీడియునంటుసంస్కృతిని విద్యను నేర్పిరి యెవ్వరందురో?
సరైన జవాబు
శ్రీ గుడుగు రామ్మూర్తి పంతులు.
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి ఆగష్టు 29, 1863 శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది
గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింప జేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
రామమూర్తికి చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. సవరలు, హరిజనులూ అంటరాని జనాలని అప్పటి సంఘం అంటుండే ఆ కాలంలోనే, అతను సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి, భోజనం పెట్టేవాడు. 1930 లలో ఒడిషా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒడిషా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిషాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936 లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం. గిడుగుకు తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా తనకు పేరు రావాలన్న ఆలోచన, పట్టింపు ఉండేవి కాదు. ఒక వ్యాకరణంలో గిడుగును ప్రస్తావించకుండా అతని రచనలోని భాగాలు వాడుకున్నారని భావరాజు వెంకట కృష్ణారావు బాధపడితే "అక్షరాలు కనిపెట్టినవాడి పేరెవరికైనా తెలుసునా? అట్లాగే నా పేరు తెలిస్తే నేం, తెలియకపోతేనేం?" అని గిడుగు రామ్మూర్తి ఓదారుస్తూ జవాబిచ్చాడు. ఈ మహానుభావుడు జనవరి 22, 1940 వతేదీనాడు స్వర్గస్థులైనారు.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -48--23/11/22
ఉ//
తాపముఁ వ్రాసినా తెలిపె ధర్మము లెన్నియొ సంఘజీవికిన్!
చూపెను హేతువాదమును జోరుగ నన్నియు వ్రాతలందునన్!
బాపగ మూఢనమ్మికలవాట్లను, వింతగు కచ్చడమ్ములన్!
కాపరి వేగుచుక్కయను కమ్మని దొక్కటి గ్రంథమాలకున్!
తాపిగ దెల్పరారెయిట ధర్మము జూపిన వారలెవ్వరో?
సరైన జవాబు
శ్రీ తాపీ ధర్మారావు
ఈయన జన్మనామం బండారు ధర్మారావు. ఈయన పూర్వీకులు సైన్యంలో పనిచేశారు. బండారు వంశంలోని లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగం నుండి తిరిగి వచ్చి తాపీపనిలో స్థిరపడ్డాడు. అందరూ ఆయనను తాపీ లక్ష్మయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు. లక్ష్మయ్యకి అప్పన్న అని మనవడు పుట్టాక కొడుకు, కోడలు ఇద్దరూ మరణించారు. దాంతో అప్పన్న శ్రీకాకుళంలో లక్ష్మన్న దగ్గరే పెరిగాడు. లక్ష్మన్నకు మనవడిని బాగా చదివించాలనే కోరిక. కానీ అప్పన్నకు అయిదు సంవత్సరాల వయసులోనే లక్ష్మన్న కూడా మరణించాడు. దాంతో అప్పన్న పోషణ భారమంతా లక్ష్మయ్య భార్యమీద పడింది. అప్పన్నను బడిలో చేర్చినపుడు తాపీ లక్ష్మయ్య మనవడు అప్పన్న అని రాశారు. అప్పుడే అతని అసలు ఇంటి పేరైన బండారు మరుగున పడి తాపీ అని మారిపోయింది. అప్పన్న శ్రీకాకుళంలో మెట్రిక్ పూర్తి చేసి మద్రాసులో వైద్యవిద్య నభ్యసించాడు. అప్పన్న మంచి తెలివితేటలతో డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై శ్రీకాకుళానికి తిరిగి వచ్చాడు. అప్పన్న భార్య నరసమ్మ. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలిసి మొత్తం ఐదు మంది సంతానం. వీరిలో రెండవ వాడు ధర్మారావు.
తాపి ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం) జన్మించాడు. ఈయనను చిన్నప్పుడు ఢిల్లీరావని కూడా పిలిచేవారు. ఈయన ప్రాథమిక విద్యను విజయనగరం రిప్పన్ స్కూల్లో చదివాడు. చిన్నప్పుడు గణితం బాగా చదివేవాడు. మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. మిత్రులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడి అభ్యుదయ వాదం, ప్రజా సమస్యలపై చర్చలు చేసేవారు. కొద్దిగా చిత్రకళ కూడా నేర్చుకున్న ధర్మారావు మిత్రులు వేసే నాటకాలకు రచన, నిర్వహణ, వేషధారణ మొదలైన పనులన్నీ చేసేవాడు. మ్యాజిక్ కూడా నేర్చుకుని అప్పుడప్పుడూ ప్రదర్శించేవాడు. అమిత బలశాలిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు ఈయనకు వ్యాయామ గురువు.
ధర్మారావుకు 1904 లో దూరపు బంధువు అయిన అన్నపూర్ణమ్మతో వివాహం జరిగింది. అప్పటికి ఆయన మెట్రిక్ ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత ఎఫ్. ఎ చదవడానికి పర్లాకిమిడి వెళ్ళాడు. అది రాజా గారి పోషణలో నడుస్తున్న కళాశాల. అక్కడే గిడుగు రామ్మూర్తి పంతులు చరిత్ర బోధించేవాడు. ఎఫ్. ఎ చదువు తర్వాత తండ్రి సంపాదన అంతంతమాత్రమే కావడం, అన్న వైద్య విద్య ఇంకా పూర్తి కాకుండా ఉండటం వల్ల ఆయన కొన్ని చిరుద్యోగాలు చేయవలసి వచ్చింది. 1906 లో ఒక సంవత్సరం పాటు టెక్కలి, బరంపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యాక రాజమహేంద్రవరంలో చేరడానికి వెళ్ళాడు కానీ అప్పుడే మద్రాసు నుంచి పచ్చయప్ప కళాశాలలో సీటు వచ్చిందని తండ్రి తెలియజేయగా మిత్రుల సలహా మేరకు మద్రాసు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. అక్కడ నుంచి 1909 లో బి. ఎ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. మద్రాసులో విద్యార్థి దశలో ఉన్నపుడే తమిళ సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని శిలప్పదికారం, మణిమేఖలై, కంబ రామాయణం లాంటి పుస్తకాలు అధ్యయనం చేశాడు.
ఇతని తొలి రచన 1911లో ఆంధ్రులకొక మనవి అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతనికి మంచి పేరు ఉంది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.
వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్వీరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితులు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది. ''దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?'' గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథం. కోవెలంటే ఏమిటి? బూతు బొమ్మలెందుకు? ఈ వెంట్రుకల మొక్కుబళ్ళేమిటి? దేవదాసీలెందుకు? కామదహనాలేమిటి? ఇలా ముసురుకొని వచ్చే ప్రశ్నల పరంపరకు ముచ్చటైన సమాధానాలిస్తుందీ గ్రంథం.
-----------------------------------------
సాహిత్యగుమ్మడి -49--24/11/22
తరళము //
తెలుగు భాషన వార్తలందగ తెల్గుతేజమునీతడే
మలుపు దిప్పెను, గ్రంథమాలొకమాలయేగన నాంధ్రమున్
తలకు బాధను బాపగా యమృతాంజనమ్మును వీరిదే
వెలిగె దానముఁ 'విశ్వదాత' గ వీరలెవ్వరు? దెల్పరే!
సరైన జవాబు
శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు
కాశీనాథుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనిని ప్రభావితం చేసాయి.
నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. అతను స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.
సెప్టెంబరు 1908లో బొంబాయినుండి అతను ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు అతను సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై అతను అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభించారు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి ప్రారంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతులకు సంబంధించిన ఇతర విషయాలలోనూ అతను తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు అతనును దేశోధ్ధారక అని సత్కరించారు.
ఆంధ్ర గ్రంధమాల
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.
టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ అతను వివరించాడు.
నాగేశ్వరరావు అసమాన దానశీలి. అతని ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవా కార్య కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతని ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. అతను దాతృత్వానికి అబ్బురపడి గాంధీజీ అతనిని "విశ్వదాత" అని కొనియాడాడు.
తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ అతని సేవ ఎనలేనిది. వీరు అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలు చాలా కాలం నడిపి అభివృద్ధి చేశారు. శివలెంక శంభు ప్రసాద్ గారి కుమారుడు శివలెంక రాధాకృష్ణ ఆంధ్రపత్రిక నడిపారు. కాశీనాథుని నాగేశ్వరరావు 1938 ఏప్రిల్ 11 న మరణించాడు.
------------------------------------------
సాహిత్యగుమ్మడి -50--25/11/22
మ.కో//
అమ్మరూపమునెంచి కమ్మగ నన్నిజీవుల కమ్మగన్
అమ్మ రక్కస సంహరమ్మది యందునించుక క్రుమ్మకన్
అమ్మయంతర సుందరమ్మది నాత్మనందునెకమ్మగా
' అమ్మ దీనులమమ్మ గావవె యమ్మమమ్ములనెమ్మిగా'
కమ్మకమ్మగ యమ్మనిట్టుల కావమన్నదియెవ్వరో?
సరైన జవాబులు
1) శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరభగవత్పాదులు
2) సౌందర్యలహరి
అపర కైలాసశంకరుడు, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి అందించిన అత్యద్భుతమైన స్తోత్రం సౌందర్య లహరి. ఆదిశంకరులు మొట్టమొదట కనకధారాస్తవంతో మొదలుకొని ఎన్నో స్తోత్రాలను మనకి అందించారు. కానీ, శంకరులు ఇచ్చిన అన్ని స్తోత్రాలలోకి తలమానికం ఈ ‘సౌందర్యలహరి’.
సౌందర్యం అంటే అమ్మతనం. సౌందర్య-లహరి అంటే అమ్మవారి సౌందర్యమును వర్ణించే ఆనంద తరంగాలు. అమ్మ సౌందర్యం అంటే ఏమిటి? లోకంలో ఎవరైనా మా అమ్మ అందంగా ఉంటుంది లేదా అందవిహీనంగా ఉంటుంది అని అనరు కదా! ఇక్కడ అమ్మసౌందర్యం అంటే బాహ్యసౌందర్యం కాదు. అమ్మయొక్క అంతఃసౌదర్యం. లోకంలో మనం చూసే బాహ్యసౌందర్యం ఒకప్పుడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. ఏది కాలము నందు నశించదో, దేనిని గురించి తెలుసుకోవడం వల్ల సకల జీవులకు అన్ని కాలములలోనూ క్షేమాన్ని హితమును కలిగించి ఉద్ధరించగలదో అదియే నిజమైన సౌందర్యము. అది కేవలం అమ్మతనమే. శ్రీలలితాత్రిపురసుందరీ అమ్మవారి యొక్క అమ్మతనము గురించి వర్ణించే ఆనంద అమృత తరంగాలే సౌందర్యలహరి. లోకంలో సౌందర్యంగా కనబడేవి అన్నీ మనకి హితము చేసేవి, క్షేమకరములైనవి అని చెప్పడం కష్టం. కానీ లోకానికంతటికీ క్షేమకరమైనది అభయప్రదాయిని “అమ్మవారి యొక్క మాతృత్వ సౌందర్యము”. అదే శ్రీమాతా, లోకమాతా, విశ్వమాతా, జగజ్జననీ, ఆబ్రహ్మకీటజననీ, జగన్మాత యొక్క అమ్మతనము వర్ణించే అద్భుత స్తోత్రమే సౌందర్యలహరి.
సౌందర్యలహరిలో ప్రతీ శ్లోకములోనూ అమ్మా నేను దీనుడినమ్మా, అజ్ఞానంతో ఉన్నవాడిని అని భక్తితో శరణాగతి చేశారు శంకరులు. నిజానికి శంకరులు రాశీభూతమైన జ్ఞానస్వరూపము. కానీ వారు జగద్గురువులుగా మనం కూడా ఈ శ్లోకాలు చదివినప్పుడు, ఆ శ్లోకం మనమే అమ్మవారి ఎదుట విన్నవించినట్టు అవుతుందని ఎక్కడా ఈ శ్లోకం శంకర కృతము అనే భావం వచ్చేలా వ్రాయలేదు. అంతేకాక సౌందర్యలహరిలో బీజాక్షరములు, మంత్ర, తంత్ర యంత్ర యోగ రహస్యాలు, శ్రీవిద్యామంత్ర రహస్యాలు ఎన్నో ఇచ్చారు ఆదిశంకరులు. మన చేత ధ్యానం చేయించడం కోసం శంకరులు సృష్ఠించిన నాటకీయ సన్నివేశాలు, శంకరులు వాడిన సంస్కృతము, ఈ శ్లోకాలను ఉచ్ఛరించిన మాత్రాన ఉత్పన్నమయ్యే శక్తివంతమైన మరియు పవిత్రమైన శబ్ద తరంగాలు ఇలా ఏ కోణంలో చూసినా సౌందర్యలహరి అత్యద్భుతం. అత్యంత సరళమైన సంస్కృతములో చెప్పాలన్నా, అత్యంత జటిలమైన భావనిక్షిప్త పదప్రయోగం చెయ్యాలన్నా రెండిటికీ జగద్గురువులు ఆదిశంకరులు వారికి వారే సాటి. మరొక విశేషమేమంటే సౌందర్యలహరిలో ఒక్క శ్లోకములో కూడా అమ్మవారి రాక్షస సంహార లీలలను గురించి ఆదిశంకరులు చెప్పలేదు. కేవలం అమ్మవారి అవ్యాజమైన కరుణతో కూడిన మాతృత్త్వం గురించి, అమ్మవారి యొక్క ప్రహృష్ట వదనంతో కూడిన స్వరూపాన్ని మాత్రమే వర్ణించారు. అందుకే ఇది సౌందర్యలహరి. పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారి ప్రవచనములలో చెప్తూ ఉంటారు, మన వైదిక వాఞ్మ యములో అత్యంత శక్తివంతములైనవి రెండు – ఒకటి సుందరకాండ, రెండవది – సౌందర్య లహరి.
సౌందర్యలహరిని కూడా ఏ కోణంలో చూసినా అంతా సౌందర్యమే. ‘శాంతం శివం సుందరం’ అని పరమశివుడి గురించి చెప్తారు, ఆయనయే సుందరేశ్వరుడు. అలాగే ‘సుందరస్య పత్నీ సుందరీ’ అనే మాటలో సుందరేశ్వరుడి పత్ని అమ్మవారు సుందరీ – లలితాత్రిపురసుందరీ. ఈ రకముగా సౌందర్యలహరి అమ్మవారికి అయ్యవారికి అభేదమైన పరబ్రహ్మ తత్త్వం యొక్క సౌందర్యమును వర్ణించే లహరి – ఆనంద తరంగాలు.
ఈ సౌందర్య లహరి మొత్తం నూరు శ్లోకములలో ఉంటుంది. మొదటి 41 శ్లోకములను కలిపి ‘ఆనందలహరి’ అనీ, చివర 59 శ్లోకములను కలిపి ‘సౌందర్యలహరి’ అని పిలుస్తారు. కానీ మొత్తం నూరు శ్లోకాలను కలిపి సౌందర్యలహరి గానే పిలుస్తారు. ఆనందలహరిలో అమ్మవారి యొక్క నిర్గుణ తత్త్వము, కుండలినీ యోగ రహస్యాలు వివరించారు శంకరులు. చివరి యాభైతొమ్మిది శ్లోకాలలో అమ్మవారి సగుణ రూప సౌందర్యమును (ఇక్కడ సగుణ సౌందర్యం అంటే అమ్మతనం-జగన్మాత యొక్క కేశాదిపాదాది సౌందర్యం) గురించిన వివరణ ఇచ్చారు శంకరభగవత్పాదులు.
భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినవారికి, జీవితంలోని ఐహిక కష్టాలను అలాగే ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అవరోధాలను రెంటినీ తొలగించి, ఇహములో సుఖసంతోషాలను, పరమునందు మోక్షాన్ని రెండిటినీ ఇవ్వగల అమృతభాండం ఆదిశంకరులు ఇచ్చిన సౌందర్యలహరి. భక్తి శ్రద్ధలతో సౌందర్యలహరి పారాయణ చేస్తే తీరని ధర్మబద్ధమైన కోర్కే లేదు. అందుకే ప్రపంచ వాఞ్మయములో సౌందర్యలహరికి అంత గొప్ప స్థానం.
అమ్మవారి అనుగ్రహంతో ఆదిశంకరభగవత్పాదులు మనకోసం ఇచ్చిన పరమ శక్తివంతమైన స్తోత్రం సౌందర్యలహరి అనే పూనిక కలిగి, ఆ శ్లోకాలలో ఉన్న అమృతాన్ని కొంతైనా గ్రహించగలిగితే మన జన్మ ధన్యమయినట్లేనని నా అభిప్రాయము. జగద్గురు ఆదిశంకరులు ప్రారంభ శ్లోకములోనే అంటారు, పూర్వకృత పుణ్యము ఉంటేనే కానీ, అమ్మవారికి నమస్కరించడం కానీ, స్తోత్రం చేయడం కానీ ఈ లోకంలో ఎవరూ చేయలేరు అని. పూర్వం నాకు తెలిసి నేను ఏమి పుణ్యము చేశానో నాకు తెలియదు, కానీ అమ్మ అవ్యాజకరుణామూర్తి కదా, కామాక్షీ అమ్మవారి నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల వలన నేనీనాడు ఈచిన్ని పద్యము మీ ముందుకు తీసుకొచ్చాను.
నాకు పెద్దగా సాధనా బలము లేకపోయినా, సౌందర్యలహరి వంటి సర్వోత్కృష్టమైన స్తోత్రం గురించి ఇలా వ్రాయడం కేవలం అమ్మవారిచ్చిన బుద్ధిప్రచోదనం మేరకు మాత్రమే చేయగలిగాను. నా స్థాయికి మించిన సాహసంగా పెద్దలకు అనిపిస్తే మన్నించగలరు.
----------------------------------------
*************************************************
పేరు గణములు యతి మొ గ అక్షరములు
ఉత్పలమాల ----భ ర న భ భ ర వ యతి 10
చంపకమాల------ న జ భ జ జ జ ర 11 న 21,
శార్దూలము------- మ స జ స త త గ 13 మ 19
మత్తేభము ---- స భ ర న మ య వ 14 స 20
మత్తకోకిల -----ర స జ జ భ ర 11 ర 18
తరలము ------న భ ర స జ జ గ 12 న 19
పంచచామరము -జ ర జ ర జ గ 10 జ 16
మానిని -------భ భ భ భ భ భ భ గ 7 -13-19 భ 22
మాకిని -------న న మ య య 9 న 15
స్రగ్ధర --------మ ర భ న య య య 8, 15 మ 21
**********************************************
భిన్నూరి నరసింహశాస్త్రి (బి.ఎన్ శాస్త్రి )
సంపాదకత్వం: మూసీ (సాహిత్య మాస పత్రిక)
నవలలు: సంధ్యారాగం, రాధాజీవనం, తీరనికోరిక, వాకాటిక మహాదేవి,
గేయకావ్యాలు: తపోభంగం, పాపాయి పతకం
ఇతర రచనలు: భారతదేశ చరిత్ర- సంస్కృతి (21 సంపుటాలు), నల్గొండ జిల్లా కవులు- పండితులు, విప్లవ జ్వాల (తెలంగాణ సాయుధ పోరాటం)
బిరుదురాజు రామరాజు
జన్మస్థలం: వరంగల్ జిల్లా దేవనూరు
ప్రసిద్ధి: గొప్ప జానపద సాహితీవేత్త
రచనలు: తెలుగు జానపదగేయ సాహిత్యం, త్రివేణి (జానపద పాటల సంకలనం), పిల్లల పాటలు, తెలంగాణ పల్లె పాటలు. బిరుదురాజు రామరాజు తెలుగులో జానపద సాహిత్య పరిశోధనకు శ్రీకారం చుట్టారు.
ఆదిరాజు వీరభద్రరావు (1890-1973)
జన్మస్థలం: దెందుకూరు గ్రామం, మధిర(ఖమ్మం జిల్లా)
బిరుదు: తెలంగాణ భీష్ముడు
రచనలు: జీవిత చరితావళి, దేశభక్తుల జీవిత చరితావళి, ప్రాచీనాంధ్రనగరములు, మన తెలంగాణము, నవ్వులు-పువ్యులు, మిఠాయి చెట్టు.
బూర్గుల రామకృష్ణారావు (1889-1967)
ప్రసిద్ధి: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదుడు
తెలుగు రచనలు: శ్రీకృష్ణశతకం, పుష్పాంజలి, తొలిచుక్క నివేదన, కవితామంజరి
అనువాద రచనలు: ఉమర్ ఖయ్యూం రుబాయిలు, పండిత రాజ పంచామృతం, సౌందర్యలహరి
ఇతర రచనలు: సారస్వత వ్యాస ముక్తావళి (సాహిత్య విమర్శన వ్యాసాలు),పారశీక వాజ్మయ చరిత్ర, బూర్గుల పీఠికలు
ఒద్దిరాజు సోదర కవులు
పేర్లు: ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవరంగారావు
ప్రసిద్ధి: తెలంగాణ సోదర జంట కవులు, తెలంగాణ వైతాళికులు
రచనలు: ఉపదేశ రత్నమాల, సంస్కృత వ్యాకరణం, శశ విషాణం (కావ్యం), సౌదామినీ పరిణయం (కావ్యం), రుద్రమదేవి(నవల), పాణినీ అష్టాధ్యాయికి వ్యాఖ్యానం, భక్తిసార చరిత్ర నాటకం
***************
అందె వేంకటరాజముఅవధాన చతురానన,అవధాన యువకేసరి, కవిశిరోమణి
అందే నారాయణస్వామిఆంధ్రమొపాసా
అంబల్ల జనార్థన్ముంబయ్ తెలుగురత్న
అక్కిరాజు సుందర రామకృష్ణఅభినవ తెనాలిరామకృష్ణ, కవితాగాండివీ,పద్యవిద్యామణి
అడవి బాపిరాజుకళామూర్తి, రసద్రష్ట
అద్దేపల్లి రామమోహనరావుసాహితీ సంచారయోధుడు
అద్దేపల్లిసత్యనారాయణకవికేసరిఅనంతామాత్యుడుభవ్యభారతి
అబ్బూరి రామకృష్ణారావుకళాప్రపూర్ణ
అల్లసాని పెద్దనఆంధ్ర కవితా పితామహుడు
ఆచార్య తిరుమలకవికౌస్తుభ
ఆచార్య ఫణీంద్ర పద్య కళాప్రవీణ, కవి దిగ్గజ, ఏకవాక్య కవితా పితామహ
ఆదిభట్ల నారాయణదాసు సంగీత సాహిత్య సార్వభౌమ
ఆదిరాజు వీరభద్రరావు చరిత్ర చతురానన
ప్రకాశరావుఅవధానాచార్య,కళాతపస్వి, బాలకవి, వాణీవరపుత్ర
ఉండేల మాలకొండారెడ్డి కవికిరిటీ,బాలకవి,బాలసరస్వతీ
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మఆంధ్రవిధుషీకుమారి,ఆంధ్రసరస్వతి, కళాప్రపూర్ణ,కవయిత్రీతిలక,తెలుగుమొలకఎర్రనప్రబంధపరమేశ్వరుడు,శంభుదాసుడు
ఎలకూచివెంకటకృష్ణయ్యబాలసరస్వతి,మహోపాధ్యాయ
ఎస్.ఆర్.భల్లం కవిసుధానిధి
ఏలూరిపాటి అనంతరామయ్య ఆంధ్రవ్యాస, కవికులతిలక
ఐతా చంద్రయ్య కథాకళానిధి, కథాశిల్పి,కవిశేఖర
ఓలేటి పార్వతీశం సాహిత్యరత్న
కందుకూరి రామభద్రరావుకవితల్లజ
కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకాగ్రేసరచక్రవర్తి, కళాప్రపూర్ణ
కత్తి పద్మారావు మహాకవి
కనుపర్తి వరలక్ష్మమ్మకవితాప్రవీణ
కపిలవాయి లింగమూర్తి కవికేసరి, కవితాకళానిధి,గురుశిరోమణి,పరిశోధనాపంచానన,వేదాంతవిశారద,సాహిత్యస్వర్ణసౌరభకేసరి
కపిస్థానం దేశికాచార్యులుకళాప్రపూర్ణ
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఆంధ్రబిల్హణ,సాహిత్యశిరోమణి
కల్లూరు అహోబలరావు కవికోకిల,కవితిలక,కవిభూషణ, కవిశేఖర
కవికొండల వెంకటరావు కథకచక్రవర్తి
కవి చౌడప్ప సరసాగ్రేసర చక్రవర్తి
కాంచనపల్లి కనకమ్మ కవితావిశారద, కవితిలక
కామసముద్రం అప్పలాచార్యా ఆంధ్రజయదేవ, విద్వత్కవికుంజర
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి విమర్శకాగ్రేసర
కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు
కొండవీటి వెంకటకవికవిరాజు, కళాప్రపూర్ణ
కొంపెల్ల జనార్ధనరావు చండప్రచండశిలాభినవకొక్కొండ
కొక్కొండ వేంకటరత్నం పంతులుఆంధ్రభాషా జాన్సన్,కవి బ్రహ్మ, కవిరత్న,మహామహోపాధ్యాయ
కొటికెలపూడి వీరరాఘవయ్య నూతన తిక్కన సోమయాజి
కొప్పరపు సోదరకవులు అవధానపంచానన,ఆశుకవీంద్ర సింహా,ఆశుకవి చక్రవర్తి,ఆశుకవిశిరోమణి,ఆశుకవి సామ్రాట్,కథాశుకవీశ్వర,కవిరత్న,కుండినకవిహంస,బాలసరస్వతి,విజయఘంటికా
కొలకలూరి ఇనాక్ పద్మశ్రీ,సాహితీవిరించి
నవయుగ కవిచక్రవర్తిగౌరనలక్షణ చక్రవర్తి
చింతలపూడి ఎల్లనార్యుడురాధామాధవ కవి
చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆంధ్రా స్కాట్, ఆంధ్రా మిల్టన్
చిలుకూరి నారాయణరావు ఆంధ్రా బెర్నార్డ్ షా
తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి సభాపతి
తాతా సుబ్బరాయశాస్త్రి వైయాకరణ సార్వభౌమ, ఆంధ్ర భర్తృహరి, ఆంధ్రకైయటుడు
తిక్కన కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
తిరుపతి వేంకటకవులు అభినవ సరస్వతులు
తుమ్మల సీతారామమూర్తి చౌదరి అభినవ తిక్కన, తెనుగులెంక
త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు
దుర్భాక రాజశేఖర శతావధాని అవధాని పంచానన
నన్నయఆదికవి, శబ్ధశాసనుడు/వాగానుశాసనుడు
నాళం కృష్ణారావు మధురకవి
నేదునూరి గంగాధరంవాస్తు విశారద, జానపద వాఙమయోద్ధారక
న్యాపతి సుబ్బారావు...ఆంధ్రభీష్మ
పసుపులేటి రంగాజమ్మ.,.రంగాజీ
పిల్లలమర్రి పినవీరభద్రుడు మహామతి
పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీపుత్ర
పువ్వాడ శేషగిరిరావు కవి పాదుషా
పుష్పగిరి తిమ్మన కవిమిత్ర
పెద తిరుమలయాచార్యుడు వేదాంతాచార్య
పెన్మెత్స సత్యనారాయణ రాజు తెలుగు రాజు
భమిడిపాటి కామేశ్వరరావు హాస్యబ్రహ్మ
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి,..ఆంధ్రకల్హణ
మల్లాది రామకృష్ణశాస్త్రి.,.కథకుల గురువు
మల్లికార్జునా పండితారాధ్యుడు..కవిమల్లుడు
మారేపల్లి రామచంద్రశాస్త్రికవిగారు
రఘునాథ నాయకుడు అభినవ రాయలు
రాయప్రోలు సుబ్బరామయ్య ఉభయభాషా ప్రవీణ
వడ్లమూడి గోపాలకృష్ణయ్య వాఙమయ మహాధ్యక్ష
విజయరాఘవ నాయకుడు చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ, మన్నారుదాసుడు
వేంకట పార్వతీశ్వర కవులు కవిరాజహంస
వేదం వేంకటరాయశాస్త్రి మహామహోపాధ్యాయ
వేదుల సత్యనారాయణశాస్త్రి గౌతమీ కోకిల
*************************************************
:
No comments:
Post a Comment