ఉ//
గుమ్మడి వీరులందరును గూడియు రావలె నాటనాడగన్
ఇమ్మగు భాషణల్ గురియు నిచ్చట, నవ్వుల బువ్వులే కనన్
కమ్మని కావ్యకన్నియలుఁ గన్పడు వ్రాసిన గ్రంథసాంగులున్
సొమ్ములు పొందవచ్చునిటఁ జొచ్చిన సాహితి గుమ్మడాటనన్
ఉ//
పద్దతి పెద్దమొత్తములఁ బంచుట చెల్లదు బృందమందునన్
వద్దని దెల్పచూ హితులు, పండిత మాన్యులు నెంచిజూపగన్
దిద్దితి పారితోషికముఁ దీరిచి తక్కువ నివ్వగ గుమ్మడాటకున్!
పెద్దలు దోషమెంచకనె పేరిమి గూర్చరె యాటనందునన్!
సాహిత్య గుమ్మడి..1(5/10/22)
ఉ//
శ్రీ సుముఖుండు, హేరుకుడు, సిద్దిని, బుద్దిని గూర్చెడాతడే !
వ్యాసుడు బల్కగా వినుచు వ్రాసెను జక్కటి కావ్యమొక్కటిన్!
వాసిగ నాంధ్రమందునది వ్రాసిరి మువ్వురు గీర్తిమంతులున్ !
వ్రాసినదెవ్వరో వినుచు? వానికిఁ జోత త్రిగుమ్మడాటకై !
సరైన జవాబు---"వినాయకుడు"
మహా భారతము - వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. మహాభారతం మొదట వ్యాసుడు పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంథాన్ని లిఖించాడని పేర్కొనబడింది. అట్టి విఘ్న నాయకునికి నమస్సులు.
సాహిత్య గుమ్మడి..2--6/10/22
ఉ//
జ్ఞానమొసంగెఁ బల్వురకు జ్ఞానిగ తల్లిని గొల్చినంతటన్!
జ్ఞానమునొందె బ్రహ్మ, శివ, జ్ఞానుడనంతుడు, వ్యాస, వాల్మికిన్
జ్ఞానము గోరి కొల్చెదరు జ్ఞానపు మాతను నెవ్వరందురా
జ్ఞానికి మ్రొక్కి గోరితిని జ్ఞానము మూడవ గుమ్మడాటకున్
సరైన జవాబు..సరస్వతీదేవి
జ్ఞాన ప్రదాతగా సరస్వతి
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. నేడునాకీ అక్షర జ్ఞానమొసంగినదికూడా ఆ తల్లేకదా ఆతల్లికి నమస్సులు.
సాహిత్య గుమ్మడి..3--7/10/22
ఉ//
గండడు మారియేచరిత కావ్యముగల్లెను? గండడెవ్వరో?
తండిరి మాటకై యడవి దారులు బట్టె, తనాలిఁ జేగొనెన్
మెండగు తోకమూకఁగొని, మేటరి యయ్యది భక్తవల్లభున్
నిండుగ మ్రొక్కితాఘనుడు నెవ్వరు? మూడవ గుమ్మడాటకున్!
సరైన జవాబులు..
1) రామాయణము
2) వాల్మీకి మహరిషి
3) శ్రీరామచంద్రుడు
రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతం లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధం. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. చాలా గొప్పనైనది రామాయణం. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం.
రామాయణం ప్రాముఖ్యం
24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో, హిందూ ధర్మం చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో తులసీదాసు రామచరిత మానసము (కడీ బోలీ), కంబ రామాయణము (తమిళం), రంగనాధరామాయణం, రామాయణ కల్పవృక్షము, మందరము (తెలుగు) వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యం పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వాలు అంతర్గతంగా నున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు.
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము.
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు)అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'ర' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
**********************************************
సాహిత్య గుమ్మడి..4--8/10/22
ఉ//
యుద్ధము సేయలేదు ఘనయుద్దము నందున, సూత్రధారిగన్
సిద్ధము జేసె వీర్నొకని జేసియు బోధన యుద్దరంగమున్!
బద్దము నయ్యెనాసడులె పావన మార్గము మానవాళికిన్
బుద్ధినొసంగ గోరతనిఁ బూనితి నేమది? యెవ్వరందురో?
సరైన జవాబులు
1) శ్రీమద్భగవద్గీత
2) శ్రీకృష్ణ పరమాత్మ
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
గీతా సారము
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు. ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
***********************************************
సాహిత్య గుమ్మడి..5--9/10/22
ఉ//(షట్పది)
మర్మము సూక్ష్మకంబుగను, మంచిని బంచుపురాణ సంపదల్
ధర్మము నిల్పగా ధరణిఁ, ధాటిగ వేదములన్విభాగమున్
కర్మలు దెల్పుచున్ మనకు కమ్మని భాగవతంబుఁ వ్రాసె నా
దుర్మతి కౌరవాగ్రజుడుఁ దుష్టులు గూలిన భారతమ్మునున్ !
నిర్మల మానసంబుగొని నెంచితి గుర్వుగ, గట్టి సాహితీ
వర్మిత దాల్చెనెవ్వరది? వారివి మ్రొక్కియు పాదపద్మముల్!
సరైన జవాబు--
"వ్యాసమహర్షి"
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్లనే వ్యాసుడు వేద వ్యాసుడైనాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతం, అష్టాదశపురాణాలు రచించినాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు వారిని గురువుగా తలంచి వారిపాదపద్మములకు నమస్కరిస్తున్నాను.
***********************************************
సాహిత్యగుమ్మడి -6--10/10/22
మ.కో(షట్పది)
వేలుగా విషయంబులిందున బేర్చి వ్రాసిరి బెక్కుగన్
కాల, యక్షర, మాస, వార, త్రికాల, వత్సర నామముల్
మాల గూర్చిరి నొక్క తీరుగ మంచి సూచనలెన్నియో
బాల బాలిక పెద్దలున్చదవంగ నేర్చిరిబూర్వమున్
పైడివంటిది పుస్తకంబిది పట్టిజూడగ తెల్గునన్
మూల జేరెను నేటి కాలముఁ ముట్టకెవ్వరదెద్దియో?
సరైన జవాబు
"పెద్దబాలశిక్ష"
తెలుగు వారు చదవాల్సిన పుస్తకాల్లో పెద్దబాల శిక్ష అతి ముఖ్యమైనది, ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండవలసిన పుస్తకం పెద్దబాల శిక్ష. ఈ పుస్తకం బ్రిటీషువారు భారతదేశాన్ని పాలించే కాలంలో గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకంగా ఉండేది. పూర్వం పెళ్ళిసంబంధాలు మాట్లాడేటప్పుడు "మీ అబ్బాయి ఏం చదివాడు?" లేదా "మీ అమ్మాయి ఏం చదివింది?" అని అడిగితే "మావాడు పెద్దబాల శిక్ష పూర్తి చేశాడు", "మా ఆమ్మాయికి పెద్దబాల శిక్ష కంఠోపాఠం వచ్చు" అని గొప్పగా చెప్పేవారు. పెద్దబాలశిక్ష గ్రంథాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లు భావించేవారు. తెలుగు సంస్కృతి, తెలుగు కథలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, సాహిత్యం వగైరా విషయాలు గల పెద్దబాల శిక్షను తెలుగు ఎన్ సైక్లోపెడియాగా పేర్కొనవచ్చు. 1960, 1970 శకాల్లో ఆంగ్ల విద్య ప్రవేశం వలన ఈ పుస్తకం ఆదరణ కోల్పోయినా ఇటీవల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారు అత్యంత ప్రియంగా ఆదరించే పుస్తకంగా పేరొందింది.
1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. ఆ తర్వాత సాహిత్య విషయాలు, భౌగోళిక విషయాలు, సంస్కృత శ్లోకాలు చేర్చి 12 పేజీలు అదనంగా కలుపుతూ 90 పేజీలతో 1865 లో ఇది పునర్ముద్రణ పొందింది. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు. దానిని బాలవివేకకల్ప తరువు గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోఉన్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, వత్తులు, సరళమైన పదాలు, రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారిత్రక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పుదూరువారు పొందుపరచారు. ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో గుజిలీ ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. 1916 లో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ సంస్థ నుండి ఒక పెద్దబాల శిక్ష వెలువడింది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. భాషోద్దారకులు వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో ఇలా చెప్పారు: “ భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను. ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది. ”
1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడా చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్షను గుణశీల పేటికగా అభివర్ణించారు.
ఆ తర్వాత కాలములో ఎన్నో పెద్దబాల శిక్షలను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గ్రంధ్ర కర్తగా ఉండగా, విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ఫింటర్స్ ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది. మహా భారతంలో 18 పర్వాలున్నట్టే నేడు పెద్దబాల శిక్ష - భాషావిజ్ఞాన పర్వం, సంస్కృతీ సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కథా పర్వం, సంఖ్యా శాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత శాస్త్ర పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తు శాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్ర ప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం అను 18 పర్వాలతో మేటి పుస్తకంగా పేరు పొందినది.
***********************************************
సాహిత్య గుమ్మడి..7--11/10/22
చం// (పంచపాది)
పదము పదంబుకర్ధమునుబంచె తెలుంగుకు తెల్గునందునే
విధము నెరింగి గూర్చెనొక బెద్దది కోశము నక్షరోజుగన్
పదుగురు గాంచు నిత్యము, నిబంధమదే నెవరైనెరుంగగా
పదముల సంపదొందికగ, భాషను నేర్వగ శబ్దరత్నమై
పదిలముజేసి నాంధ్రమున, ప్రాణము బోసెనదెవ్వరెద్దియో?
సరైన జవాబులు
శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు.
శ్రీ శబ్దరత్నాకరము.(తెలుగు-తెలుగు)
శబ్దరత్నాకరము :-
నిఘంటువు అంటే భాషలోని పదసమూహాన్ని ఒకచోట చేర్చి, ఆ పద స్వరూపమును, అర్ధవిశేషములను, పర్యాయపదములను, సమానార్ధక పదములను తెల్పేది నిఘంటువని చెప్పుకోవచ్చు. ఈ నిఘంటువుకే కోశము, అనుశాసనము, అభిధానము అనే పర్యాయపదాలున్నాయి. ఈ నిఘంటువు అనే పదం ఇటీవల వచ్చిన పదం కాదు. ఇది చాలా ప్రాచీనమైనది. ఎందుకంటే భారతదేశమున వేదకాలమునందే వైదిక నిఘంటువు ఉన్నదట. బహుజనపల్లి సీతారామాచార్యులు రచించిన ''శబ్దరత్నాకరము'' అనే నిఘంటువుకు ఉన్న విశిష్టత ప్రత్యేకమైనది. అకారాది క్రమములో కూర్చబడిన మనిషి మరచిపోలేనటువంటి సామెతలు, మనిషి జీవన విధానానికి అవసరమైన సూక్తులు, భాషాప్రయోజనాలకు అనువైన జాతీయాలు, పదజ్ఞానాన్నిచ్చే పదసూచికలు చక్కగా తెలుస్తాయి. నిఘంటువును ఉపయోగించుకోవటం వలన అర్ధనిర్ణయము, వ్యాకరణ విషయములు, క్రియాపదాలు, విశేషణాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలు వంటి ఎన్నో విషయాలు అందునా భాషకు చెందిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.
శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు:-
బహుజనపల్లి సీతారామాచార్యులు (1827 - మార్చి 20, 1891) ప్రముఖ తెలుగు రచయిత, కవి. వీరు ద్రవిడదేశ వైష్ణవులు. సీతారామాచార్యుల వారి పేరు వినగానే అందరికీ స్పురించునది. "శబ్దరత్నాకరము".అచ్చ తెలుగులో (తెలుగు-తెలుగు) న వెలువడిన గ్రంథం. దీని తర్వాత శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. వీరు చెన్నపురి (ప్రస్తుత చెన్నై) లోని ఒక పాఠశాల నందు 1864లొ తెలుగు పండితులుగా ఉద్యొగమారంభించి ప్రథమ పండితులుగా కొనసాగారు. సీతారామాచార్యులుగారి పేరు చెప్పినంతనే "శబ్దరత్నాకరము", "ప్రౌడ వ్యాకరణము" జ్ణప్తికి వచ్చును. శబ్దరత్నాకరప్రాశస్త్యమును గనిపెట్టి చెన్నపురిలోని దేశభాషాగ్రంధకరణసభ వారాచార్యులుగారి కైదువేలు సన్మానముగా నిచ్చిరి. నిజమాలోచించినచో నైదులక్ష లిచ్చినను దెలుగువారు వారియప్పు దీర్చుకొనలేరు. "శరీరకష్టమును విత్త నష్టమును నించుకేనియుం బాటింపక" రేలుంబవళ్లు శ్రమించి రచించిన నిఘంటువని నిఘంటుకారులు వ్రాసికొనియే యున్నారు. శబ్దరత్నాకరములోని శబ్దముల రూపనిర్ణయము సర్థనిర్ణయము శాస్త్రసమ్మతమైనది. పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనది. అక్షరక్రమముగా రచింపబడిన నిఘంటువులలో యిదిశ్రేష్టము.
---------------------------------------
సాహిత్య గుమ్మడి..8--12/10/22
మ.కో/(షట్పది)
గొల్ల కాపరియావు పాలిడకుండె కారణ మెద్దియో !
మెల్లగామొదలిట్లు, కల్గగ మేలు స్వప్నమునందునన్
వెల్లివిర్సినదూరుఁ గట్టెను వేల్పుకై నొకదేవళమ్ !
తెల్లమౌకథఁ శాస్త్ర సాహితిఁ, దెల్పునాలుగువర్ణముల్,
తెల్ల, నల్ల దొరల్విధం, ప్రజ తీరు, గ్రామము పత్నమున్ !
అల్లిరెవ్వరు?, పొత్తమేమిటి? యందునాయకుడెవ్వరో?
సరైనజవాబు
1)అల్లినది---" శ్రీ విశ్వనాథ సత్యనారాయణ."
2) కావ్యము---- "వేయిపడగలు."
3) నాయకుడు--- "ధర్మారావు."
"వేయిపడగలు" నవల ప్రారంభం వినూత్నంగా ఉంటుంది, కాని అసలు కథకు ఈ ప్రారంభ కథకు సంబంధం ఉండదు. కథా విశేషాలలోకెళితే ఒక గొల్లవాని దగ్గరుండే ఒక ఆవు ఇచ్చే అపారమైన పాల వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని సర్పం వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి కలలో కనబడిన ఆసర్పము తనకు అక్కడ దేవాలయం నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక గ్రామం వెలసి విలసిల్లి కాలక్రమేణా ఎలా శిథిలమయిందనే దానిని కథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు శ్రీ విశ్వనాథ వారు "వేయిపడగలు".
**************************************
సాహిత్య గుమ్మడి..9--13/10/22
మ.కో(పంచపాది)
జైలు జీవితమందునే యొక జాతి నెంచియు వ్రాసెగా
పైడివంటిది పుస్తకమ్మిది పాత్రనాయక దాసరే
వాడిగా భవి ఘాతతో చిని బాలుడీలిగె, నాదటన్
వీడె నాలియు, సంతు, నాస్తియు, వీడనొప్పక ధర్మమున్
జైలు జేరును, వ్రాసెనెవ్వరు? జాస్తి గ్రంధమదెద్దియో ?
సరైనజవాబులు
1) శ్రీ ఉన్నవ లక్ష్మీ నారాయణ
2) "మాలపల్లి"
ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవల సాహిత్య వైతాళికుడు అయిన శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణచే 1922 లో తెలుగులో రచించబడిన ‘మాలపల్లి’ నవల ఆంధ్ర ప్రదేశ్ లో కులవర్గ దృక్పధంతో వెలువడిన తొలి అభ్యుదయ నవల. జాతీయోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలైన ఉన్నవ లక్ష్మినారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తి పూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు. ఈ 'మాలపల్లి' నవల ప్రగతి శీలక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మేలిమలుపుగా, సామాజిక దృక్పథంలో ఒక ముఖ్య ఘట్టంగా, సంఘ సంస్కరణ సాహిత్యంలో ప్రామాణికంగా నిలిచింది.
కథా సారాంశం
అట్టడుగు వర్గాలనబడే ‘మాలదాసరి’ కులస్థుడైన రామదాసు సాత్వికుడు. సాంప్రదాయ పరాయణుడు. గాంధేయవాది. కథంతా అతని కుటుంబం, సమాజాన్ని అల్లుకొని సాగుతుంది. రామదాసు భార్య మహాలక్ష్మి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు వెంకట దాసు, చిన్న కొడుకు సంగ దాసు, కూతురు జ్యోతి. పెద్ద కొడుకు వెంకట దాసు తండ్రికి సాయంగా సేద్యం చేస్తుంటాడు. చిన్నకొడుకు సంగ దాసు ఒక భూస్వామి వద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. పొలం పనులలో కూతురు జ్యోతి సాయం చేస్తుంటుంది. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి. ఆమె కొడుకు అప్పాదాసు కూడా తండ్రి లేకపోవడం చేత రామదాసు ఇంటిపట్టునే పనులు చేస్తూ పెరుగుతుంటాడు. ఈ విధంగా తమకున్న కొద్దిపాటి భూమితో ‘మాలపల్లి’లో రామదాసు కుటుంబమంతా శ్రమిస్తూ జీవనం సాగించేది.
ఆ వూరి మోతుబరి, 800 ఎకరాల ఆసామి అయిన చౌదరయ్య కొడుకులైన రామానాయుడు, వెంకటయ్య నాయుడు అనే అన్నదమ్ములు కూడా ఈ నవలలో ముఖ్య పాత్రలుగా వుంటారు. సంగ దాసు ఈ చౌదరయ్య వద్దనే పాలేరుగా పనిచేస్తుంటాడు. పనివాడైన సంగ దాసు, యజమాని కొడుకైన రామానాయుడుల ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో స్నేహంగా సఖ్యతగా వుంటారు. ఒక విధంగా రామదాసు కుటుంబంలోని వాళ్ళంతా కులమతాల పట్టింపుల్ని దుయ్యబట్టినవాళ్ళే. కొడుకులు వెంకట దాసు, సంగ దాసులు సంస్కరణ భావాలు కలిగినవాళ్ళు. కరడుగట్టిన భూస్వామి చౌదరయ్య చేసే అత్యాచారాలను ప్రతిఘటించేందుకు సంగ దాసు తోటి దళిత కూలీలను సంఘటితపరచి, వారిలో చైతన్యం కలిగించి, సమ్మెలకు నాయకత్వం వహిస్తాడు. దళితులకు విద్య నేర్పడం కోసం బడులు తెరుస్తాడు. దళితుల జీవితాలను సంస్కరించడానికి ఆతను చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ కృషిలో రామానాయుడు అతనికి సాయంగా వుంటూ ఆర్థికంగా చేయూతనిస్తాడు. ఇది భూస్వామికి కంటగింపుగా వుంటుంది. ఒకనాడు భూస్వామి సంగ దాసు తలపై గట్టిగా మోదడం వల్ల సంగ దాసు మరణించడం జరుగుతుంది. భూస్వామి పోలీసులకు లంచం ఇచ్చి విచారణ పరిది నుండి తప్పించుకొంటాడు. నష్టపరిహారంగా భూస్వామి ఇవ్వబోయిన ధనాన్ని నిరాకరించి తమ కొడుకు చంపబడ్డ విషాదాన్ని రామదాసు దంపతులు మౌనంగా భరిస్తారు. దీనితో రామానాయుడు పేద రైతులకు మరింత దగ్గరై, దళితాభ్యున్నతికి పూర్తిగా అంకితమవుతాడు. సంగ దాసు ఆదర్శభావాల వ్యాప్తి కోసం అతని స్మృతి చిహ్నంగా “సంగ పీఠం” గ్రామంలో నెలకొల్పబడుతుంది. క్రమేణా ఈ సంగ పీఠం కృషిలో దళితేతర అగ్ర కులాలు కూడా చేరతాయి.
వెంకట దాసు (రామదాసు పెద్ద కొడుకు) అడవులలో నివసిస్తూ తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతో ‘సంతాను’ లనబడే రహస్య కార్యాచరణ దళాలను ఏర్పాటు చేస్తాడు. ‘ధర్మ కన్నాలు’ వేయడం ద్వారా ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమానికి వెంకట దాసు నాయకత్వం వహిస్తాడు. అయితే పోలీసులతో జరిగిన సాయుధ ఘర్షణలో వెంకట దాసు గాయపడి పట్టుబడి చివరకు జైలు పాలవుతాడు. ఒక వ్యాజ్యంలో ఓడిన రామదాసు తన యావదాస్తిని భూస్వామి చౌదరయ్యకు స్వాధీనం చేయవలసి వస్తుంది. తన పొలం నుండి, ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన రామదాసు చివరకు ఒక సంపన్నుడి ఇంటిలో పనికి కుదురుతాడు. తక్కెళ్ళ జగ్గని సహచరులు ఆ సంపన్నుని ఇంటిని కొల్లగొట్టడంతో, ఆ “ధర్మ కన్నం”తో సంబంధం ఉందనే నెపంతో రామదాసును, అతని భార్య మహాలక్ష్మిని పోలీసులు అరెస్టుచేసి సెటిల్మెంటులో నిర్బంధ కూలీలుగా పనిచేయిస్తారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పెద్దకొడుకు వెంకట దాసుకు పరిచర్యల కోసం తల్లీ, తండ్రీ కొంతకాలం అక్కడుండటం జరుగుతుంది. వెంకట దాసు మరణిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కొడుకులుతో పాటు కూతురు జ్యోతి దుర్మరణం పాలవ్వడంతో అ బెంగతో భార్య మహాలక్ష్మికూడా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధలన్నింటిని రామదాసు సహనంతో తన సహజ వేదాంతధోరణిలో శాంతంగానే స్వీకరిస్తాడు. క్రమేణా సంగపీఠం కృషి దినదిన ప్రవర్ధమానమవుతుంది. సహాయనిరాకరణోద్యమాలు, కార్మికోద్యమాలు, ధర్మకన్నాల వంటి ప్రజాఉద్యమాల ఫలితంగా స్వాతంత్ర్యం లభిస్తుంది. ఖైదీలు విడుదలవుతారు. వయోజన వోటింగు ద్వారా ప్రజాప్రతినిధుల ఎన్నికవుతారు. రామదాసు కూడా జైలు నుండి విడుదలై తన గ్రామానికి వస్తాడు. రామానాయుడు తన యావదాస్తిని దళితుల అభ్యుదయానికి సమర్పించి రామదాసుని గ్రామంలోనే వుండి సంగ దాసు చేసిన కృషిని కొనసాగించమని కోరతాడు. కాని రామదాసు నిరాకరించి అడవుల కేగుతాడు. ఈ విధంగా అనేకానేక అంశాలు అల్లుకుపోయిన నేపద్యంలో చివరకు భూస్వాముల పొగరు అణిగిపోయి వారు తమ సర్వస్వాన్ని దళితుల అభ్యుదయానికి, గ్రామాభ్యుదయానికే సమర్పించుకొని, గ్రామసేవకి అంకిత మయినట్లుగా ముగుస్తుంది.
------------------------------------
సాహిత్య గుమ్మడి..10--14/10/22
మ.కో//
జ్ఞాన పీఠమునెక్కె తెల్గునఁ జ్ఞానిగా కవి యీతడున్!
కూన యెక్కటి నాయికైనది గొప్పగా సినిరంగమున్!
కానికార్యములెక్కువై తను కానకెవ్వరుకూలెగా
కానవచ్చెడిదొక్కటచ్చట గానుపించనివెన్నియో
దాని రంగులు జూపెనెవ్వరు? తట్టి లేపగ నెయ్యదో?
సరైన జవాబు:-
1) డా; రావూరి భరద్వాజ
2) "పాకుడురాళ్ళు"
డాక్టర్ రావూరి భరద్వాజ :-వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూక కంచికచర్ల సమీపంలోని మోగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. 1946లో నెల్లూరులోని జమీన్ రైతు వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు. 1948లో దీనబంధు వారపత్రికకు బాధ్యుడుగా ఉన్నాడు. జ్యోతి, సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు. తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన "పాకుడు రాళ్ళు" నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. గుర్తింపు నిచ్చిన రచన పాకుడు రాళ్ళు. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.
'పాకుడురాళ్ళు' కథాస్థలం గుంటూరు సమీపంలో ఓ పల్లెటూరు. కథాకాలం పద్య నాటకాలు అంతరించి, సాంఘిక నాటకాలు అంతగా ఊపందుకోని రోజులు. నాటకాలంటే ఆసక్తి ఉన్న మాధవరావు, రామచంద్రం కలిసి 'నవ్యాంధ్ర కళామండలి' ప్రారంభించి, సాంఘిక నాటకాలు ప్రదర్శించాలి అనుకుంటారు. వాళ్ళ నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడం కోసం వస్తుంది పదిహేనేళ్ళ మంగమ్మ. బళ్ళారి రాఘవ ట్రూపులో పనిచేశానని చెప్పుకునే నాగమణి పోషణలో ఉంటుంది మంగమ్మ. అప్పటికే మంగమ్మ మీద సంపాదన ప్రారంభించిన నాగమణి, నాటకాల్లో అయితే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చునని ఈ మార్గం ఎంచుకుంటుంది. మాధవరావు-రామచంద్రం తర్ఫీదులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది మంగమ్మ. కళామండలి కి మంచి పేరు రావడంతో, నాగమణి కి కొంత మొత్తం చెల్లించి మంగమ్మని నాగమణి చెరనుండి విడిపిస్తారు మిత్రులిద్దరూ.
కొంతకాలానికి కళామండలి మూతపడే పరిస్థితి వస్తుంది. మంగమ్మ, నాగమణి 'కంపెనీ' కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పాత మిత్రుడు చలపతి తనో సినిమా తీస్తున్నాననీ, మంగమ్మ అందులో నాయిక అనీ చెప్పి ఆమెని మద్రాసు తీసుకెడతాడు. చలపతి సినిమా తీయకపోయినా, మంగమ్మకి వేషాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. స్వతహాగా తెలివైనదీ, మగవాళ్ళని కాచి వడపోసినదీ అయిన మంగమ్మ సైతం -మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సినిమా హీరోయిన్ల వైభవం, ఐశ్వర్యం చూశాక తనుకూడా హీరోయిన్ కావాల్సిందే అని నిర్ణయించుకుని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో, ఓ సిద్ధాంతి సూచన మేరకు తన పేరు మంజరి గా మార్చుకుంటుంది. వేషాలు రానప్పుడూ, చివరివరకూ వచ్చి జారిపోయినప్పుడూ మంజరి నిర్ణయం మరింత పదునెక్కుతూ ఉంటుంది.
మెల్లగా అవకాశాలు సంపాదించుకుని, నాయికగా పేరు తెచ్చుకుని తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి నాయిక అవుతుంది మంజరి. అనుకున్నది సాధించాక ప్రపంచాన్ని లెక్కచెయ్యదు మంజరి. చలపతిని కేవలం ఓ సెక్రటరీగా మాత్రమే చూస్తుంది. నిర్మాతలని అక్షరాలా ఆడిస్తుంది. అయితే, తనని తీర్చిదిద్దిన మాధవరావు-రామచంద్రం మీద, కష్టకాలంలో తనని ఆదుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. అగ్రహీరోలతో కయ్యం పెట్టుకుని, దానివల్ల తనకి పోటీగా మరో నాయిక తయారవుతున్నప్పుడు కయ్యాన్ని నెయ్యంగా మార్చుకున్నా, తనని సినిమా నుంచి తీసేయాలని ప్రయత్నించిన నిర్మాతకి ఊహించని విధంగా షాక్ ఇచ్చినా మంజరికి మంజరే సాటి అనిపిస్తుంది. గుర్రాప్పందాల మీద లక్షలు నష్టపోయినా కొంచం కూడా బాధ పడదు. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే, హిందీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది మంజరి. ఇందుకోసం తన కాంటాక్ట్స్ ని తెలివిగా వాడుకుంటుంది. భారదేశం తరపున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళిన తొలి తెలుగు నటి మంజరి. అక్కడ మార్లిన్ మన్రో ని కలుసుకున్న మంజరి, సిని నాయికలందరి జీవితాలూ ఒకేలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటుంది. చివరికి చాలా విషాదంగా తన జీవితం ముగిసిపోతుంది.
---------------------------------------
సాహిత్య గుమ్మడి..11-- 15/10/22
ఉ//
వేలకు వేలుగా రచన, విద్యయు, నాటిక, సాంఘికాంశముల్ !
చూడగ నెన్నియో కథలుఁ, జొచ్చియు వెల్గెను హేతువాదమున్ !
బాలలకింపు గూర్చునటు బాగుగ దీర్చెను కాంతిమంతునిన్ !
పూడిపి జేయ సాహితిని ప్రోడయె యాఘనుడెవ్వరందురో ?
సరైన జవాబు:-
శ్రీ కొడవటిగంటి కుటుంబ రావు
కొడవటిగంటి కుటుంబ రావు :-(1909 అక్టోబర్ 28 - 1980 ఆగష్టు 17),
ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొ కు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. కొ కు గుంటూరు జిల్లా, తెనాలి లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. చిన్నవయసులోనే 1914లో తండ్రీ, 1920లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొ కు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేత వయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. 1925లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయనకు బాల్య వివాహము జరిగింది. మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగిన రెణ్ణెల్లకే రెండవ భార్య అనారోగ్యంతో మరణించడంతో 1945లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు 1925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికునిగా మారిపోయాడు.
వ్యాఖ్యలు
*సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
*నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు.., అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు.
*ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు.
*మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే.
*కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం.
-----------------------------------------
సాహిత్య గుమ్మడి..12--16/10/22
ఉ//
నాయిక పేరనే గలదు నాణ్యత గల్గిన రూపకంబునున్ !
కాయమునమ్ముటే ననువు కాసుల వేటకు, కొంచగాళ్ళు గై !
పాయెను మూగురందునొక బచ్చు, నియోగియు, పండితొక్కడున్
హేయపు పోకడన్ దునుము హీరమదెయ్యది? వ్రాసెనెవ్వరో?
జవాబులు
1) చింతామణి (నాటకం)
2) కాళ్ళకూరి నారాయణ రావు
కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - జూన్ 27, 1927) నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు. గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియుచున్నది.
చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి, చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు. ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడైన బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది చింతామణి. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి నిద్దురలో చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది. బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు.
"అత్తవారిచ్చిన అంటుమామిడి తోట" అనే పద్యము ప్రసిద్దం.
---------------------------------------
సాహిత్య గుమ్మడి..13--17/10/22
చం.//
తెలుగున గాథలల్లుటకు తీరును దెల్పిరి యొగ్గి సంస్కృతమ్
కలవుగ మారునామములుఁ గాసిరి దన్నుగ పంతులయ్యనున్!
కలిపెను భాషలోని నుడికారమునింపుగ చిన్నిగాథలన్!
కలదుగ యూరిపేరుఁవహి కట్టెడివస్త్రమునేది? యెవ్వరో?
జవాబులు
1) పుల్లంపేట జరీచీర
2) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 ఏప్రిల్ 23 న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను చదివారు. ఇతను గాంధీ, ఖద్దరు, హిందీ - ఈ మూడింటినీ వ్యతిరేకించారు. వ్యవహారిక భాషావాదిగా గిడుగు రాంమూర్తి పంతులుగారి ఉద్యమానికి అండదండలందిచారీయన. 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. ఇతని జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించాడీయన.
వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్ర పుస్తకాలైన అనుభవాలూ-జ్ఞాపకాలూనూ లో వివరంగా రాసుకొన్నారు. దాని ప్రకారం చిన్నతనం నుండి బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసారు. చాలాకాలం మునికూడలి (మురమళ్ళ) లో వారాలు చేసుకొంటూ విద్యాభ్యాసం కొనసాగించారు. చిన్న వయసులోనే అత్త కూతురు సీతతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. వీరు 1961 ఫిబ్రవరి 25 న రాజమహేంద్రవరం లో మరణించారు.
'పుల్లంపేట జరీచీర' 45 కథలలో ఒకకథ (పుస్తకం పేరుకూడా యిదే)
యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమస్తాగా వుండినప్పటి సంగతిఇక నెలా పదిహేను రోజులుందనగా, సంకురాత్రి పండక్కు రాధమ్మని పుట్టింటివారు తీసుకువెళ్ళరని తేలిపోయింది. అప్పటిదాకా పద్దెనిమిదేళ్ళ పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు.
దగ్గిరగా వున్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు, కానీ నెల్లూరికీ, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి. ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది. ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది; కాని వొక్కక్షణంలో తేరుకుని, ఆమె కళ్ళలోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు.
తరువాత 'మడి కట్టుకోండి' అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను తాపితా కట్టుకున్నాడు. కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు "రెండేళ్ళ కిందట విజయదశమినాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా, ప్రతీ సంవత్సరమూ నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే వున్నావు; కాని, పుట్టింటి వారిస్తూనే వున్నారు గదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే కాని రాధకి నువ్వొక చీర అయినా కొనిపెట్టావా, పాపం? చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన మురిపం యిదేనా? చివరికి ఒక్కరైకఅయినా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా?" అని యెవరో నిలవతీసి అడిగినట్టనిపించింది. దాంతో వల్లమాలిన సిగ్గువచ్చి వూదర గొట్టేసింది. దానిమీది 'ఇప్పుడైనా రాధకొక మంచిచీర కొనియివ్వా' లనుకున్నాడు. 'ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు' అని దృఢపరుచుకున్నాడు. కానీ, డబ్బేదీ? ఏనెల జీతం ఆనెలకే చాలీచాలనట్టుంది. అక్కడికీ నెల్లూరిలో యింటి అద్దెలు చౌక కనక సరిపోయింది; కాని లేకపోతే యెన్ని చేబదుళ్లు చేస్తూ యెన్ని వొడుదొడుగులు పడవలసివచ్చేదో? రాధమ్మ కూడా పొదుపయిన మనిషి కనక ఆటసాగుతోంది; కాని కాకపోతే, ఆ చేబదుళ్ళకు సాయం యెన్ని అరుపులు పెరిగిపోయివుండునో? ఏమయినా చీర కొనితీరాలని శపథం పట్టుకున్నాడు. ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మార్గాంతరం కనబడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారంకోసం రాధమ్మ చేసేవాటిలో తగ్గించడానికి వీలుకనబడదు. దానిమీద 'నా ఖర్చులు తగ్గించుకుంటా'నని అతను నిశ్చయించుకున్నాడు.
అది మొదలు, అతను నాటకాలకి వెళ్ళడం కట్టిపడేశాడు. పుస్తకాలు కొనడం చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడూ బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గిర ఫలహారం వొక్కటీ కాదు, కాఫీ కూడా మానుకున్నాడు.
పొద్దుటి పూట మాత్రం యింటి దగ్గర కాఫీసేవ మానుకోలేదు. అంచేత రాధమ్మ కిదేమీ తెలవకుండా జరిగిపోయింది.
ఆవేళ పెద్దపండుగ. మధ్యాహ్నం. రెండు గంటల సమయంలో యాజులు, రాధమ్మ యేం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్లి జంట వెదురుకుర్చీలో కూర్చున్నాడు.ఉన్న చీరల్లో మంచివి నాలుగు పట్టుకువచ్చి 'వీటిలో యేది కట్టుకోను చెప్పండీ' అంటూ రాధమ్మ పక్కని కూచుంది.
'నన్నడగడం యెందుకూ?'
'మంచిచీర కట్టుకోవడం మీకొసమా, నా కోసమా?'
'నా కోసమే అయితే, ఆ చీరలన్నీ మీవాళ్ళిచ్చినవి, వాటిమీద నాకేమీ అధికారం లేదు'
'అదేమిటండీ?'
'ఎకసెక్కం చెయ్యడం లేదు నేను'.
'చె-ప్పండీ పెడర్ధాలు తియ్యకా.'
ఇలా గునుస్తూ ఆమె కుడిచెయ్యి అతని నడుముకి చుట్టేసింది.
దానిమీది, ఆనందమూ, వుద్వేగమూ అతికష్టం మీద అణుచుకుంటూ అతను 'నేను మానెయ్యమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా?' అని గంభీరంగా ప్రశ్నించాడు.
'ఆ'
'అయితే అవన్నీ పెట్టిలో పెట్టేసి రా'
ఆమె కేమీ అర్ధం కాలేదు. అయినా, యేదో లేకుండా అతనలా చెప్పడని యెరుగును కనుక, అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనిక, వొక్కమాటు గంభీరంగా చూసి అవి యింట్లో పెట్టేసి వచ్చి, మళ్ళీ పక్కని కూచుని 'మరి చెప్పండి' అని అడిగింది.
వెంటనే అతనొక్కమాటు మందహాసం మొలిపించి, అతి తాపీగా లేచి, అతిదర్జాగా వాకిట్లోకి వెళ్ళి, మేజా సొరగులోనుంచి వొక పొట్టం తీసుకువచ్చిఅతిప్రేమతో ఆమెకందించి దగ్గిరగా కూచున్నాడు.ఆమె చేతులు గబగబలాడిపోయాయి. విప్పిచూడగా, అల్లనేరేడుపండు ఛాయతో నిగనిగ మెరిసిపోతూ పుల్లంపేట జరీచీర.
'ఇదెలా వచ్చిందండీ?' అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున వున్న జరీ నిగనిగ, ఆమె కళ్లలోనూ, చెక్కిళ్ళమీదా, పెదవులమీదా తళుక్కుమంది. దాంతో అతని మొగం మరీ గంభీరముద్ర వహించింది.
'చెప్పండీ'.
'వెళ్ళి కట్టుకురా'.
'మానేస్తానా యేవిటి చె-ప్పండీ'
'చెప్పనా యేవిటి కట్టుకురా'.
'ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా యేదో కింద పడింది.
'ఇందిలో పట్టు జాకెట్టు కూడా వుందండీ!
'ఇంకేం తొడుక్కురా'.
యాజులిక్కడ మాట్టాడకుండానే కూచున్నాడు. కాని 'మామిడిపిందె లించక్కున్నాయో! బాబోయ్ పద్దెనిమిది మూళ్ళ పొడుగున్నట్టుంది. మా అమ్మ యిలాంటిది వొక్కటీ పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళనుంచో మనసుపడుతున్నా నీరంగుకోసం. పాపం, చెప్పినట్టు తెచ్చిపెట్టారు' అంటూ అక్కడ రాధమ్మ రిమార్కులమీద రిమార్కులు దొర్లించేసింది.
అదివిని తన కష్టం పూర్తిగా ఫలించినందుకతను చాలా సంతోషించాడు.
తరువాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి వొళ్లోకూచుని ఆమె 'యిదెలా వచ్చింది చెప్పరూ?' అని మళ్ళీ అడిగింది.
'పుల్లంపేటలో వొక దేవాంగి నేశాడు'.
'ఊహూ'.
'అది తెప్పించి నాకా సుదర్శనశెట్టి నెల్లూరి పెద్దబజారులో పెట్టి అమ్మాడు'.
'సరే'
'నేను కొన్నాను'.
'బాగుంది'.
'నువ్వు కట్టుకున్నావు'.
'ఎలా వచ్చిందీ?'
'మళ్ళీ మొదలా?'
'మరి నా ప్రశ్న అలాగే వుండిపోయింది. కదూ!'
'లేదు, బాగా ఆలోచించుకో'.
'పోనీ, యిది చెప్పండి డబ్బెక్కడిదీ?'
'మిగిలిస్తే వచ్చింది.'
'ఎవరూ?'
'నేను.'
'ఎలా మిగిల్చారూ?'
అతను రెప్పవెయ్యకుండా చూశాడు.
'చెప్పరు కాదూ? అయితే నన్ను -'
'ఆగు ఆగు. ఇవాళ పెద్ద పండుగ. అలాంటి మాటలు రాకూడదు.
'అయితే మరి చెప్పండి'.
'యాజులు జరిగిందంతా చెప్పాడు; కానీ, నమ్మలేక, ఆమె 'నిజంగా?' అని చెయ్యి చాపింది.
'అక్షరాలా నిజం. ముమ్మాటికీ నిజం' అంటూ అతనాచేతిలో చెయ్యివేసి, ఆ చెయ్యి గిల్లాడు.
ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరయిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
'చూశారా? నా చీరకోసం కారెండలో నడిచివెళ్ళారా?' అక్కడ కడుపు మాడ్చుకుని వుసూరుమంటూ పని చేశారా? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళగనుకున్నారా? నేను రాకాసినా?' అని యిక మాట్టాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనికుని దుఃఖించసాగింది.
అది చూసి, మొదట అతను నిర్విణ్ణుడయిపోయాడు; కాని తరువాత ఛా! ఏడుస్తున్నావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడూ, అబ్బే! అయితే నాకూ నీకూ మాటల్లేవు. నాకూ నీకూ జతలేదు, అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటెచూపులు చూశాడు.ఏడ్పల్లా ఆమెకి నవ్వయిపోయింది.
'మరి నాతో యెందుకు చెప్పారు కారూ? నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా? దాంతో మీక్కూడా జామారు రాకపోవునా?'
'ఇప్పుడు రాకపోతేనా?'
'ఏదీ, చూపించరూ?'
ఇద్దరూ లేచారు. ఒకర్ని వొకరు పొదిపి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరగు లాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు.అది చూసి, ఆమె సంతోష విహ్వాల అయి 'మరి తొరగా కట్టేసుకోండి' అంటూ అతని భుజాలు వూపేసింది.
***
----------------------------------------
సాహిత్య గుమ్మడి..14--18/10/22
ఉ//
సంగడి జంటలోనొకరుఁ జక్కగ వ్రాసిరి బెక్కుగ్రంథముల్!
సింగమె హాస్యమల్లగను, జెక్కిరి యాత్మనొకాటపేరుతో!
బంగరు తెల్గులో గిడసఁ వ్రాసిరి మెచ్చగ పిల్లపెద్దలు, చె
ప్పంగను రండి యాత్మకథ వ్రాసిన పేరును, వారలెవ్వరో?
జవాబులు
1) కోతి కొమ్మచ్చి
2) ముళ్ళపూడి వెంకట రమణ.
ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 న ధవళేశ్వరంలో జన్మించాడు. ఇతని అసలుపేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్థిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి పుస్తక రూపంలో వెలువడింది.
1945లో "బాల" పత్రికలో రమణ మొదటి కథ "అమ్మ మాట వినకపోతే" అచ్చయ్యింది. అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయభాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయాడు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నాడు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరాడు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు (గిడస)వ్రాశాడు. కోతి కొమ్మచ్చి ఆయన జీవిత చరిత్ర స్వాతి పత్రికలో ప్రచురితమైంది.
సాక్షి, పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళి పుస్తకం,మిష్టర్ పెళ్ళాం, రాధా కల్యాణం, రాధాగోపాలం మున్నగు సినిమాలకు కథ మాటలు వ్రాసారు. ముళ్లపూడి వెంకటరమణ కథలు హాస్య, వ్యంగ్య కథలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగిఉన్నాయి. వైవిధ్యభరితమైన, విస్తృతమైన ఈ కథల నుంచి పలుకుబళ్లు, కొత్త పదాలు, విలక్షణమైన పాత్రలు తెలుగువారి మాటల్లో భాగమయ్యాయి. వీరు 24 ఫిబ్రవరి 2011 న అనంతలోకాలకు పయనమై వెళ్ళారు
*********************************************
సాహిత్య గుమ్మడి..15--19/20/22
ఉ//
మాటల యీటెలే కనగ మంచిగ వ్రాసిరి బుచ్చిభాషికల్
మూటను గట్టిజూపెనుగ ముత్యములోలెను రెండునొక్కటిన్
తేటగ నుయ్యలూపెనవి తేనియ వంటివి జిన్నివాక్యముల్!
దీటుగ నొక్కదేవి యభిధేయము నన్నిటదెద్ది యెవ్వరో?
సరైన జవాబులు
1) కూనలమ్మ పదాలు.
2) ఆరుద్ర.
ఓ కూనలమ్మ:-
ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన కూనలమ్మ పదాలు అనే చిన్ని చిన్ని మాటల ఈటెలు "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర. ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. ఈ కూనలమ్మ పదాలు ఇదివరకు జ్యోతి మాస పత్రికలో ప్రచురితమై విశేషంగా పాఠకుల అభిమానం పొందాయి. వీటి సంకలనమే ఈ పుస్తకం. ఈ కూనలమ్మ పదాలకు తోడు ముచ్చటయిన బాపు బొమ్మలు (కార్టూన్లు) అదనపు ఆకర్షణ.
ఆరుద్ర
ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీ గారికి వేలువిడిచిన మేనల్లుడు. రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.
1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులో నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం"తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి, దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ఠ. దీనికోసం మేధస్సునే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. వేమన వేదం, మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?, గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు, హేతువాది ఆరుద్ర. వీరు 1998 జూన్ 4 వ తేదీన మరణించారు.
మచ్చుకు కొన్ని కూనలమ్మ పదాలు ---
!
సగము కమ్యూనిస్ట్
సగము కాపిటలిస్ట్
ఎందుకొచ్చిన రొస్టు
ఓ కూనలమ్మ !
మధువు మైకము నిచ్చు
వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు
ఓ కూనలమ్మ !
శ్రీశ్రీ గురించి -
రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ !
కృష్ణశాస్త్రి గురించి -
కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ !
బాపు గురించి -
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
************************************************
(ఎండినఁ కుత్తుకాతనిది నింపుగ వ్రాసిరి జీవితాంతమున్!)
సాహిత్య గుమ్మడి..16--20/10/22
ఉ//(పంచపాది)
పండిరి సంఘసేవనముఁ, బ్రహ్మసమాజము నన్యభాషలన్!
మెండుగ వేశ్యకాంతలకు మేలును గూర్చెను సంఘమందునన్
దండన నిచ్చె బందుగులు తండము నుండి బహిష్కరించియున్
దండిగ గేయ, కావ్యములు దర్పము వంటివి వ్రాసిరెన్నియో
పండిత వంశమాతనిది, వారల పట్టమునేది?యెవ్వరో?
సరైన జవాబు
1) ఆంధ్రా షెల్లీ
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేవులపల్లి కృష్ణశాస్త్రి :-(నవంబర్ 1, 1897 - ఫిబ్రవరి 24, 1980) తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
జీవిత విశేషాలు
దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు. ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశాడు.
1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురమంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.
గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి1980 ఫిబ్రవరి 24 న మరణించాడు.
పురస్కారాలు
1975 - ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ
1978 - సాహిత్య అకాడమీ అవార్డు
1976 - పద్మ భూషణ్
రచనలు
కృష్ణ పక్షము: ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
సినిమా పాటలు
మల్లీశ్వరితో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు
మల్లీశ్వరి - మనసున మల్లెల మాలలూగెనే
సీతామాలక్ష్మి - మావి చిగురు తినగానే కోయిల పలికేనా
మేఘ సందేశం - ఆకులో ఆకునై, పూవులో పూవునై
గోరింటాకు - గోరింట పూచింది కొమ్మ లేకుండా
కార్తీక దీపం - ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
కృష్ణపక్షము నుండి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
కాలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (స్వేచ్ఛాగానము)
తలిరాకు జొంపముల సం
దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో
మల రేఖవొ! పువుదీవవొ!
వెలదీ, యెవ్వతెవు నీపవిటపీ వనిలోన్ ? (అన్వేషణము)
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? (ఏల ప్రేమింతును?)
**********************************************
సాహిత్య గుమ్మడి..17--21/10/22
మ.కో
సాహితీ సమరాంగణంబున సార్వభౌముడదెవ్వరో?
మోహితొక్కటి భక్తిఁ ముద్దియ మోహనాంగుని గొల్చుచున్
సాహసించియు సంహితైనది స్వామిచెంతకు జేరియున్
సాహితీ తెలుగందునిద్దియె పంచ కావ్యమదెద్దియో?
సరైన జవాబులు
1) శ్రీకృష్ణ దేవరాయులు
2) ఆముక్తమాల్యద
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం.
కృష్ణదేవరాయలు విజయవాడకు యాత్రపై వచ్చి విడిది చేసినపుడు శ్రీకుకాళాంధ్ర విష్ణువు ఆయన కలలో కనబడి తెలుగులో తనపై ఒక కావ్యమును రాయమని ప్రోత్సహించినట్టుగా ఒక కథనం ఉంది. ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ.
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో, 'శ్రీ' శబ్దంతో కావ్యామారంభించాడు.
శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియునుదారత దోప పరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతు లచ్ఛత బైకి దోపన
స్తోకత నందు దోచె నన శోభిలు వేంకట భర్త గొల్చెదన్.
సాధారణంగా శార్దూలముతో గాని, మత్తేభ విక్రీడితముతో గాని కావ్యమును ప్రారంభించుట పరిపాటియైన కాలములో, ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.
కథాంశాలు
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
ప్రధానకథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
ఈ గ్రంథమున 7 ఆశ్వాసములు ఉన్నాయి. మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంథకర్త ప్రశంస, కృతిపతి ప్రశంస, గ్రంథప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుని సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".
గ్రంథస్త విషయ క్రమము
1 ఆశ్వాసమున - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.
2 ఆశ్వాసమున - మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.
3 ఆశ్వాసమున - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.
4 ఆశ్వాసమున- విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.
5 ఆశ్వాసమున- గోదాదేవి, వసంతఋతువర్ణనము.
6 ఆశ్వాసమున - మాలదాసరి.
7 ఆశ్వాసమున- బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.
****************************************
సాహిత్య గుమ్మడి..18
ఉ//
కానగ రాజ్యపాలకుడుఁ గన్పడి వెల్గెను పద్యకారుడై
పూనిరి ద్వాదశంబు గుణముల్దెలుపంగగ నొక్కశాస్త్రమున్!
జానుతెలుంగునే రచన చౌకము మాత్రలె పద్యపద్యమున్
నానుచుఁ దెల్గుపన్నముల నాట్యములాడున దెద్దియెవ్వరో?
సరైన జవాబు
1) సుమతీ శతకము
2) శ్రీ బద్దెన
1 పా....కవియైన బద్దెన కాకతీయ సామ్రాజ్యములో ఒకసామంతరాజు.
2 పా.,, వీరు నీతిశాస్త్రము అనే గ్రంథములో భార్యాభర్తలిరువురకు ఆరారు చొప్పున పన్నెండు ధర్మగుణములు తెలియచేసారు.
3 పా...సుమతీ శతకము చతుర్మాత్రా కందపద్యములలో వ్రాయబడినది కందపద్యమే గణము తీసుకున్ననూ 4 మాత్రలే ఉంటాయి.
4 పా పన్నము అనగా నాలుక, సూమతీ శతక పద్యములు తెలుగు వారి నాలుకలపైనెప్పుడూనానుతుంటాయి.
బద్దెన
చిరకాలంగా తెలుగు ప్రజల నాలుకల మీద నానుచూ వారి అంతశ్చేతనలో భాగంగా కరిగిపొయిన సుమతీ శతకము పద్యాలను, సరసమూ, సరళమూ, సామాన్యులకు సైతం సూటిగా, సులభంగా అర్థమయ్యే శైలిలో రాసిన గొప్ప పద్యకారుడు బద్దెన. 162 పద్యాలు గల మరో లఘుకృతి నీతిశాస్త్ర ముక్తావళి వీరి రచనే. ఈయన కాకతీయ రాజ్యంలో ఒక చిన్నసామంత రాజు. క్రీ.శ.1260 ప్రాంతంలో జీవించి ఉంటారని భావిస్తున్నారు. తిక్కనకు శిష్యునిగా భావిస్తున్నారు. కమలాసన, కవిబ్రహ్మ అను బిరుదులు కలవాడు.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది. ఇది బద్దెన వ్రాసిన నీతి శాస్త్రంలోని శ్లోకములు. భార్యా భర్తలైన స్త్రీ పురుషులిరువురూ ఎలాఉండాలో తెలియజెప్పేవి ఈ శ్లోకాలు. వారిరువురు నిర్వహించవలసిన ఆరారు పన్నెండు ధర్మములూ పైశ్లోకములలో చూపారు బద్దెన గారు.
భార్యనుగురించి
ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని. ఇదీ మొదటి శ్లోకానికి అర్థం.
భర్తనుగురించి
'కార్యేషు యోగీ' - పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
'కరణేషు దక్షః' - కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి. సమర్థుడై ఉండాలి. 'రూపేచ కృష్ణః' రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషం గా ఉండాలి.
'క్షమయా తు రామః' - ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె, క్షమించే గుణం
కలిగి ఉండాలి.
భోజ్యేషు తృప్తః - భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా, వంకలు పెట్టకుండా తినాలి.
'సుఖదుఃఖ మిత్రం' - సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఇదీ రెండవ శ్లోకానికి అర్థం.
అయితే మన దురదృష్టవశాత్తు భర్తగారి ధర్మాలు ప్రచారములోలేవు. భార్యగారి ధర్మాలే ఎక్కువ ప్రచారములో నున్నాయి. అందునా 'కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా' ఈ నాలుగు ధర్మాలే మరంత ప్రచారములో ఉన్నాయి. నేటి సమాజములో కొందరు స్త్రీ వాదరచయితలు వీటికి వివిధరంగులు పులిమి మరంత వ్యతిరేక ప్రచారము కావించుటవలన ఎన్నో పచ్చని సంసారాలు పతనమైపోతున్నాయి. తల్లిదండ్రులు విడిపోయి నీతిమాలిన కార్యములకు బానిసలగుచున్నారు. చిరుప్రాయములోనే పసిపిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమౌతున్నారు.
*****************************************
సాహిత్య గుమ్మడి..19-23/10/22
చం.//
ననుగని పెంచినట్టి కరుణామయి నాతెలగాణమన్న యా
ఘన కవిసింహ యెవ్వరు?, నిగర్విఁ నిజాముయె జేర్చెజైలుకున్!
గునియెను గాయబడ్డ కవిగుండెల వ్రాయని కావ్యముల్గనన్
వినగనె విందుగూర్చు మనవీనుల కింపుగ వ్రాయగేయముల్
సరైన జవాబు
దాశరథి కృష్ణమాచార్యులు
దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987) జన్మస్థలం వరంగల్ జిల్లా చిన్న గూడూరు. కవి సింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదములేకాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు.
కవితా సంపుటాలు: అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమంజరి, దాశరథీ శతకం, మహాబోధి, తిమిరంతో సమరం, అలోచనాలోచనలు 'యాత్రా స్మృతి' వారి స్వీయ చరిత్ర
అవార్డులు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (కవితాపుష్పకం), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తిమిరంతో సమరం), ఏపీ ఉత్తమ అనువాద బహుమతి (గాలిబ్ గీతాలు), ఆంధ్రా విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.
నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న అభ్యుదయ కవి దాశరథి. నిజాంకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి... అక్కడ నుంచే తన కవిత్వం ద్వారా పోరాటాన్ని కొనసాగించిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టెద’ అని ఆయన నినదించారు. ‘ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ’ అని అంటూ దాశరథి పుట్టిన ప్రాంతంపై మమకారాన్ని చాటుకోవటంతో పాటు రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితమిచ్చారు. ‘అనాదిగా సాగుతోంది-అనంత సంగ్రామం అనాథునికీ ఆగర్భ శ్రీమంతునికీ మధ్య’ అంటూ తనలోని సామ్యవాద ఆలోచనలను దాశరథి వ్యక్తీకరించారు.
**********************************************
సాహిత్యగుమ్మడి - 20--25/10/22
చం//(పంచపాది)
గడచెను బాల్య మంత కడుకష్టముఁ, హేళనఁ దుష్ట సంస్కృతిన్!
నడిచెను దుష్ట సాంఘికపు నడ్వడినంతముజేయ సంఘమున్!
విడిచెను భావవీచికఁ గవీంద్రుడు చేగొనె జాతియున్నతిన్!
పొడిచిన పొద్దునోలిగె యపూర్వ సుకావ్యములల్లె గొప్పగన్!
పడచెను పద్మభూషణముఁ భారత కేంద్రమునివ్వ నెవ్వరో?
సరైన జవాబు
బోయి భీమన్న
డాక్టర్ బోయి భీమన్న గారు ఒక తెలుగు కవి . బోయి పుల్లయ్య బోయి నాగమ్మ నిరుపేద దంపతులకు 19 సెప్టెంబర్ 1911 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, గ్రామములో జన్మించారు. భీమన్న .. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. "గుడిసెలు కాలిపోతున్నయ్" అనే పుస్తకాన్ని రచించాడు, మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధనలచే ప్రభావితుడయ్యాడు . అతని రచనలు అణగారిన వర్గాల ఆందోళనను ప్రతిబింబిస్తాయి. అతను రచయిత, కవి, పాత్రికేయుడు మరియు విద్యావేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనువాద విభాగానికి కొంతకాలం డైరెక్టర్‌గా ఉన్నారు.
అతను ఇంగ్లీషులో కూడా వ్రాసాడు మరియు అతని ఆంగ్ల కవితా సంకలనమైన సెవెన్త్ సీజన్ అనే రచనకు మంచి ఆదరణ లభించింది. అతను తన కెరీర్లో డెబ్బైకి పైగా పుస్తకాలు రాశాడు, గుడిసెలు కాలిపోతున్నాయి (ఆంగ్లం: ది హట్స్ ఆర్ బర్నింగ్ ) అనే రచన అత్యంత ప్రజాదరణ పొందింది.
భీమన రచించిన అనేక సాహిత్య రచనలలో పాలేరు, జనబదుని జాబులు, ధర్మంకోసం పోరాటం మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి.
అన్ని గొప్ప సాహిత్య రచనలలో పాలేరు అనేక పేద మరియు దళిత కుటుంబాలలో మార్పులను తీసుకువచ్చిన ప్రధాన చిహ్నం. చాలా మంది వెనుకబడిన కులాల తల్లిదండ్రులు మంచి మరియు అందమైన భవిష్యత్తు కోసం తమ పిల్లలను పాఠశాలలో చేర్చడం ప్రారంభించారు
వారి రచనలు
1-గుడిసెలు కాలిపోతున్నాయి...2- నాకు తెలిసిన జాషువా 3-భీమన్న ఉగాదులు 4-రాజకీయ వీరుడు డాక్టర్ ఖాన్ 5-పాలేరు (నాటకం) 6-పిల్లి శతకం 7-పాలేరు నుంచి పద్మశ్రీ వరకు (ఆత్మకథ) 8-జనభదుని జాబులు 9-కూలి రాజు 10-రాగవాసిష్టం 11-ధర్మం కోసం పోరాటం 12-రాగం వైశాఖి 13-దీప సభ 14-రాభీలు 15-రాగోదయం 16-మధుబాల
17-మధుగీత 18-నా ఊహలలో వాల్మీకి 19-భీమన్న శంఖారావం, 20-గిల్లి చెప్తున్నా, 21-ఇదిగో, ఇదే భగవద్గీత 22-చాటువులు- స్వాగతాలు, 23-ఎంత చీకటి ఎన్ని దీపాలు
24-కుక్క మొరుగుతూనే ఉంది, 25-శ్రీశ్రీ కమ్యూనిస్టు కాదు 26-బాలయోగీయం, 27-ఏడవ సీజన్, 28-పరమాత్మ, 29-డ్రగ్ అడిక్ట్స్, 30-అనాది కోసం నుండి అనంతత్వం లోకి, 31-మానవుని మరోక మజిలీ, 32-చండాలికా, 33-పైరు పాట 34-అంబేద్కర సుప్రభాతం, 35-అంబేద్కర మఠం
36-మణి మానసం, 37-పంచమ స్వరం, 38-శివలకలు, 39-దేవుడు మందు, 40-వేద వ్యాసుడు, 41-ధర్మ వ్యాధుడు
42-ప్రగతి, 43-జగత్ సత్యం బ్రహ్మ మిథ్య, 44-ఓయీ కవి కవిత్వం రాయీ, 45-భీమన్న కావ్య కుసుమాలు
అవార్డులు
అతను 1975లో గుడిసెలు కాలిపోతున్నాయికి సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు . 1973 మరియు 2001లో వరుసగా పద్మశ్రీ మరియు పద్మభూషణ్‌లతో దేశంలోని నాల్గవ మరియు మూడవ అత్యున్నత పౌర పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. భీమన్నకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) బిరుదును కూడా ప్రదానం చేసింది . 1978 నుండి 1984 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. 2003లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి కళా రత్న పురస్కారం పొందారు. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు ప్రత్యేక పురస్కారం అందించింది మరియు 1996లో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ గౌరవం పురస్కారం (ఆంగ్లం: ఆత్మగౌరవ పురస్కారం)తో సత్కరించింది.
భీమన్న 1991 సంవత్సరానికి చెన్నైలోని శ్రీ రాజా-లక్ష్మీ ఫౌండేషన్ నుండి ప్రతిష్టాత్మక రాజా-లక్ష్మీ సాహిత్య పురస్కారంతో పాటు లోక్‌నాయక్ అవార్డును కూడా అందుకున్నారు.అతను పార్కిన్సన్స్ వ్యాధి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 16 డిసెంబర్ 2005 న 94 వ యేట మరణించారు
********************************************
సాహిత్య గుమ్మడి..21--26/10/22
చం//
ముసలికి నివ్వచూపు పిత బొట్టియఁ గోరియు గొంత సంకుడున్!
మసలునొకండు డాంబికపుఁ మాటలు, వేషము, చర్చ, చేష్టలున్!
అసురకు వేయుగాలము ధనాశకుఁ, బెండిలి గోరభర్తృకన్
పొసగొక యన్వవాయమువి పోకడలెంచవధాని శాస్త్రులున్ !
వసిగలదేమి? యెవ్వరది బాల్య వివాహములాప వ్రాసెనో?
సరైన జవాబులు:-
కన్యాశుల్కం(నాటకము)
శ్రీ గురజాడ అప్పారావు
కన్యాశుల్కంలో ప్రధానమైన ఇతివృత్తం సంఘ సంస్కరణ. అగ్నిహోత్రావధాన్లు తన రెండవ కుమార్తెను చిన్న పిల్ల అని చూడకుండా 70 ఏళ్ళు నిండుతున్న ముసలివాడు లుబ్దావధాన్లకి ఇచ్చి కన్యాశుల్కం కోసం పెళ్ళి చేయబోతాడు. అగ్నిహోత్రావధాన్లు కుమారుడికి ట్యూషన్ చెప్తానంటూ అప్పులు చేస్తూ, గొప్పలు చెప్పుకుంటున్న గిరీశం అనే మోసకాడు ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. అగ్నిహోత్రావధాన్లు అప్పటికే పెద్ద కూతురు బుచ్చెమ్మకి కన్యాశుల్కం తీసుకుని ముసలివాడికి కట్టబెట్టగా, ఆ పెళ్ళిచేసుకున్న వ్యక్తి పెళ్ళి పూర్తికాకుండానే మరణిస్తాడు. విధవగా ఇంట్లో ఉన్న బుచ్చెమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఆమెను మోసగించి వివాహమాడదామని ప్రయత్నిస్తాడు. మరోవైపు గతంలో గిరీశం పోషణలో ఉండే మానవత్వం కలిగిన సాని మనిషి మధురవాణి, లుబ్దావధాన్లును మోసం చేసి పెళ్ళికి ఒప్పించి డబ్బు తీసుకుందామని ప్రయత్నిస్తున్న రామప్పంతులు వద్దకు చేరారు. కుమార్తెకు ఆ పెళ్ళి చేస్తే, చనిపోతానని అగ్నిహోత్రావధాన్లు భార్య బెదిరించగా, ఆమె అన్నగారు కరటకశాస్త్రి ఆ పెళ్ళి తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన శిష్యుడికి ఆడవేషం వేసి రామప్పంతులుకు గుంటూరుశాస్త్రులుగా పరిచయం చేసుకుని, అగ్నిహోత్రావధాన్లు కుమార్తెతో లుబ్దావధాన్లుకు పెళ్ళి తప్పించి ఆడవేషం వేసిన శిష్యునికి ఇచ్చి పెళ్ళిచేసి కన్యాశుల్కం తీసుకునివెళ్ళిపోతాడు. కనిపెట్టినా, కరటకశాస్త్రి చేసే పని మంచిదన్న ఉద్దేశంతో పెళ్ళికి మధురవాణి సాయం లభిస్తుంది. ఆడవేషంలోని శిష్యుడు సాధ్యమైనంత బాధపెట్టి, నగలు, బట్టలు మూటకట్టుకుని వెళ్ళిపోతాడు. ఈలోగా పెళ్ళికి తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లు బంధుకోటిలోంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం లేచిపోతాడు. అగ్నిహోత్రావధాన్లు ఈ పరిణామాలకు ఆగ్రహం చెంది, రామప్పంతులుతో కలిసి లుబ్దావధాన్లుపై దావా తెస్తాడు. ఈ కేసులో లుబ్దావధాన్లు పక్షాన్ని ధర్మాత్మునిగా, సంఘసంస్కర్తగా, వేశ్యా వ్యతిరేకిగా పేరొందిన లాయరు సౌజన్యారావు పంతులు వకాల్తా పుచ్చుకుంటాడు. చివరికి నిజం తేలడంతో పాటుగా, మధురవాణి సౌజన్యారావు పంతులుకి గిరీశం నిజస్వరూపం తెలియజేయడంతో బుచ్చెమ్మను శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది.
********************************************
సాహిత్యగుమ్మడి - 22--27/10/22
ఉ//
జీవిత మెన్నడైన తన జీవిత నావకు మాత్రమేననిన్
భావన హేతువాదముగ వ్రాసెను, నాయక నిట్టిగ్రంథమున్
జీవి మనోవికాసమది జీర్ణమునైతను బొందెకష్టముల్
తావుయెలేదు సంఘమున తర్గగనాస్తుల నంత్యకాలమున్
చావును గోరిదెచ్చుకొనె, జక్కగ వ్రాసిరదెద్ది? యెవ్వరో?
సరైన జవాబులు
1) అసమర్థుని జీవయాత్ర
2) త్రిపురనేని గోపిచంద్
అసమర్థుని జీవయాత్రకు దాదాపుగా 78 యేళ్లు
జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. తెలుగు నవలా సాహిత్యంలో ఆధునిక యుగం పందొమ్మిది వందల నలబైలలో ప్రారంభమయ్యిందని విమర్శకులు నిర్ణయించారు. 1946లో వెలువడిన త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’తో ఈ ఆధునిక యుగం మొదలైందన్నారు. దీనికి ముందు వెలువడిన నవలల్లో సంఘ సంస్కరణ దృష్టి ప్రధానంగా కనిపించేది. మానవుల కష్టసుఖాలకు సంఘమే ప్రధాన కారణమనీ, సంఘం మారితే తప్ప వ్యక్తులు సుఖంగా జీవించలేరనీ ఆనాటి నవలాకారులు భావించేవారు. కానీ మానవుల కష్టాలకు గానీ, సుఖాలకు గానీ ఆయా వ్యక్తుల మనస్తత్వమే కారణమౌతుందని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’లోనూ, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లోనూ ప్రతిపాదించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, యూంగ్, అడ్లర్ మొదలైన మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన మనోవిశ్లేషణా సూత్రాల ప్రభావంతో పందొమ్మిది వందల ఇరవైలలో పాశ్చాత్య సాహిత్యంలో డి.హెచ్.లారెన్స్, జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్ మొదలైనవారు నవలలు రచించారు. ఈ తరహా మనస్తాత్విక నవలలను ‘మనోవైజ్ఞానిక నవలలు’ అన్నారు. ‘అసమర్థుని జీవయాత్ర’ను తెలుగులో వెలువడిన మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవల అని చెప్పొచ్చు.
ఈ నవలలోని వస్తువు సీతారామారావులోని మానసిక సంఘర్షణను చిత్రించటం! సీతారామారావు మీద అతని తండ్రి ప్రభావం బలంగా ఉంది. సీతారామారావులో ‘గోపీచంద్’ కనిపిస్తాడు. ఒక రకంగా గోపీచంద్ ‘ఆత్మకథాత్మక’ నవల అనొచ్చు. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాదాన్ని ప్రచారం చేశాడు. ఈ హేతువాదం ప్రభావం బాల్యంలోనే గోపీచంద్ మీద పడింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు కారణమేమిటి?– ప్రతి సమస్య ‘ఎందుకు?’ ఉత్పన్నమైందని ప్రశ్నించుకోవటం హేతువాదుల ప్రధాన లక్షణం. అయితే, ఎవరి జీవితం కూడా హేతువాదం ప్రకారం జరగదు. తండ్రి ప్రభావంతో హేతువాదాన్ని వంటపట్టించుకున్న గోపీచంద్ తన జీవితాన్ని హేతువాదం ప్రకారం మలుచుకోబోయి ఎదురుదెబ్బలు తిన్నాడు. ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు, ‘‘తెలుగుదేశంలో హేతువాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన తండ్రి రామస్వామి చౌదరి మరణించాక గోపీచంద్ అనుభవించిన మనోవైకల్యానికి ప్రతిబింబమే ఈ నవల. ఈ మనోవైకల్యం సామాన్యమైనది కాదు. మృత్యువుతో హుటాహుటి పోరాటం. నవలలో నాయకుడైన సీతారామారావు మృత్యువు చేతిలో ఓడిపోయాడు. కానీ ఈ నవల రాయడం ద్వారా తనలోని సీతారామారావు మృతి చెందడం ద్వారా, గోపీచంద్ వ్యక్తిగతంగా పునర్జన్మ వంటి అనుభూతిని పొంది, కొత్త దృక్పథంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు’’. సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర విషాదానికి కారణం అతడు జయించలేని మానసిక శక్తులే. ‘‘ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది వంశ గౌరవమే’’ అన్న భావాన్ని పెకిలించటానికి సాధ్యం కానంత శక్తిమంతంగా నాటిపోయాడు. తండ్రి
సంపాదించి పోయిన ఆస్తి ఉన్నంత కాలం సీతారామారావు వంశ గౌరవాన్ని నిలుపగల్గాడు. అయితే, ఆస్తిపోతే వంశ గౌరవం కూడా పోతుందన్న ప్రాథమిక సత్యం అతని అవగాహనలో లేదు. వేలకు వేల ఆస్తిని మంచినీళ్ళలా ఖర్చు చేసిన సీతారామారావుకు తన భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేని దుస్థితి యేర్పడటంతో నైతికంగా పతనమైపోతాడు. అయినా తన పతనానికి కారణం తాను కాదనీ, తన భార్యాపిల్లలు, మామ, మేనమామ మొదలైనవాళ్ళనే భ్రమలో బతుకుతాడు. తన పతనానికి కారణం తండ్రే అయినా, తండ్రి నేర్పిన పాఠాలను తన జీవితానుభవాల ద్వారా మార్చుకోలేకపోయిన తన అసమర్థతే తన పతనానికి కారణమనే జ్ఞానోదయం కల్గటంతో తన పట్ల తనకే విపరీతమైన ద్వేషం, కసి జనించి, తనను తాను నిర్దాక్షిణ్యంగా హతమార్చుకోవటంతో ‘అసమర్థుని జీవయాత్ర’ పరిసమాప్తమౌతుంది.
త్రిపురనేని గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించాడు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు హేతువాది సంఘసంస్కర్త. గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి నాస్తికోద్యమమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసాడు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగాడు.
గోపిచంద్ ఒక చోట ఇలా అంటాడు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. 1963లో వీరు రాసిన 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది. తెలుగు వారిలో తండ్రి, కొడుకులు ఇద్దరికి తపాల బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది.
1962 నవంబర్ 2 నాడు 52 సంవత్సరాల వయస్సులో బహుముఖ ప్రతిభాశాలి అయిన గోపీచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.
*******************************************
సాహిత్యగుమ్మడి -23--28/10/22
మ.కో//
ఏడు సంపుటముల్గనంగ నదెద్ది? యంతరమద్నమే
పాడినంతది పాట, తూటయు, వ్రాసిచూపగ కయ్యమే
మాటువేసిన మందుపాతర మంచిగంధపు వాసనే
బాట యుద్యమమే, స్వతంత్రపుబాట, చిక్కడు దేనికిన్
ఓటుపాటను వ్రాసె, రాష్ట్రము నొందబోరినదెవ్వరో?
సరైన జవాబులు
1) నా గొడవ
2) కాళోజీ నారాయణ రావు
కాళోజీ నారాయణరావు (1914-2002)జన్మస్థలం: మడికొండ (వరంగల్ జిల్లా), అసలు పేరు రఘువీర్
బిరుదు: ప్రజాకవి
పురస్కారం: పద్మవిభూషణ్ (1992)
రచనలు: నా గొడవ (కవితాసంపుటాలు), అణాకథలు, కాళోజీ కథలు, తెలంగాణ ఉద్యమ కవితలు.
కాళోజీ తన కవితల్ని ‘నా గొడవ’ పేరుతో ఏడు సంపుటాలుగా ప్రచురించారు. ఖలీల్ జిబ్రాన్ ‘ద ప్రాఫెట్’ను కాళోజీ ‘జీవన గీతి’గా తెలుగు వారికి అందించారు. ఆయన ముందుగా ఓటర్లు మేల్కొనాలని ‘ఓటు పాట’ పాడారు. ‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలను కోవటం దురాశ’ అన్న సందేశాన్ని ఇచ్చిన అచ్చమైన ప్రజాకవి కాళోజి. ‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అంటూ సమాజంపై తనదైన ప్రభావాన్ని చూపారు.
అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు
పతిత మానవు జూచి చితికిపోవును మనసు
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
తప్పు దిద్దగ లేను దారి చూపగ లేను
తప్పు చేసినవాని దండింపగా లేను
కష్టపడువారలను కాపాడగా లేను
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
అవకతవకలు నేను సవరింపలేనప్పుడు
‘పరుల కష్టాలతో పనియేమి మాక’నెడు
అన్యులను గనియైన హాయిగా మనలేను
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’
అప్పుడే నడుస్తున్న సమాజ చరిత్రను అవగతం చేసుకుంటూ, తనకున్నపాటి ఎరుకతో కవిత్వం రాయబూనిన యువకవి ఏమీ చేయలేనితనాన్ని, తనకూ కొంత బలముంటే ఏమైనా చేయాలన్న తెగువనూ పట్టిచ్చే ధ్వని ఈ కవితలో కనిపిస్తుంది కదూ! తూటాల్లాంటి మాటలువాడి అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ తనదైన ముద్రవేసి, అటు రచనలతోనే కాక, ఇటు వ్యక్తిగత జీవనాదర్శంతోనూ ప్రజల హృదయాలను చూరగొన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులివి.
మనకు కాళోజీగా సుపరిచితులైన ఈయన కవిత్వపు సంపూర్ణ సంకలనం “నా గొడవ“. దాశరథి రంగాచార్య అన్నట్టు కాళోజీ కవి నిరంకుశుడు. అతనికి దురాశలు లేవు. ఆశల ఉచ్చులు లేవు. అతడు దేనికీ చిక్కడు – వేదనకు ఆవేదనకు నివేదనకు తప్ప. ఏడు పదుల కాలంలో రాసిన, చెప్పిన, వినిపించిన కవితల సంకలనమే ఈ “నా గొడవ”. కవిగా కాళోజీ కవితత్వం ఏమిటని ప్రశ్నిస్తే కాళోజీ దగ్గర సమాధానం లేదు. ఎలాంటి చట్రపుటుచ్చులలోనూ ఇమడకుండా, ఏమరపాటు పడకుండా తన సుదీర్ఘ, స్వతంత్ర జీవన ఛాయలు వెలువరించిన కాళోజీ తన జీవనతత్వాన్ని కొన్ని కవితల్లో చూచాయగా చెప్తారు.
“నీ బానిస కాను నేను
తొత్తు కొడుకు నసలే కాదు
నా ఇష్టం వచ్చినట్లు
నా మనసుకు నచ్చినట్టు
మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా
నరుడు నేను, నరుడ నేను
మనిషి బ్రతుకు బ్రతుకుతాను
నా మతమును ప్రకటిస్తా
అది నా స్వతసిద్ధమైన హక్కు
జన్మ హక్కు
ఆ మాత్రం లేకుండా
నే బ్రతికెందుకు“
సంఘాలు, నియమాలు, సిద్ధాంతాలు, నిర్మాణాలను తీవ్రంగా నిరసించడమే కాదు, రాజకీయాల్లోనూ డొల్లను అంతే తీవ్రంగా ఎండగట్టిన కాళోజీ ఒక మారు రాజకీయాల్లో పాల్గొన్నా, ఏ పార్టీలోనూ చేరకుండా ‘పార్టీవ్రత్యం’ పాటించిన నిబద్దత గల కవి. ప్రాథమిక హక్కులపట్ల ఆయనకు గల స్పష్టమైన అవగాహన ఏర్పరచిన ప్రాపంచిన దృక్పథం కాళోజీలోని సృజన కళాకారుడి ఎదుగుదలకు తోడ్పడింది. కాని కాళోజీ గాంధేయవాది. నేను పిరికితనం కన్నా హింసను బలపరుస్తానన్న గాంధీ మాటను కాళోజీ తరచి ప్రస్తావిస్తారు. దాంతోపాటే అధీకృత హింసకు ప్రతిఘటనగా ప్రతిహంసను సమర్ధిస్తారు. ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యమే కాదు, ఇతర విధాలా ఈ భిన్న ధృవాలుగా సమాజం విడిపోవడాన్ని ‘వ్యత్యాసాలు’ కవితలో ఎత్తిచూపుతారు.
“అన్నపురాశులు ఒకచోట
ఆకలి మంటలు ఒకచోట
హంస తూలికలొకచోట
అలసిన దేహాలొకచోట
అన్న ప్రజాకవి కాళోజీ 2002 నవంబరు 13 వ తేదీన అప్పటి వరంగల్ జిల్లా హనుమకొండలో మరణించారు.
*******************************************
సాహిత్యగుమ్మడి - 24--29/10/22
ఉ//
పీడిత వర్గబాంధవుడు బేర్కొన తెల్గున రాజకీయ పో
రాటము సాహితిన్సలుపఁ ప్రాణము బోసిన యాద్యుడీతడున్!
వేడెను కావ్యపేరు నెరవేర్చగ బెక్కురు పండితార్యులన్!
పోడిమిఁ యెవ్వరందురయ? పొత్తము వ్రాసిరి కారనందునన్!
సరైన జవాబు
వట్టికోట ఆళ్వారుస్వామి
వట్టికోట ఆళ్వారుస్వామి తెలుగు రాజకీయ నవలకు ఆధ్యుడిగా, తెలంగాణ ప్రజాసాహిత్యానికి ప్రాణం పోసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. 1952లో తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంలో రచించిన 'ప్రజల మనిషి' నవల చాలా ప్రాచుర్యం పొందింది. వట్టికోట 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక, ప్రజా ఉద్యమాల గురించి గంగు నవల రచించారు. నిరుపేద వైష్ణవ కుటుంబంలో జన్మించి కడు సామాన్య జీవనం సాగించిన వట్టికోట నిరంతర అధ్యయనం ద్వారా, రచనల ద్వారా, దేశోద్ధారక గ్రంథమాల పుస్తక ముద్రణల ద్వారా, ఊరూరా తిరిగి పుస్తకాలను ప్రజలకు అందించడం ద్వారా నిజాం రాష్ట్రంలో ప్రజలను చైతన్య వంతులను చేసి తెలంగాణ వైతాళికునిగా నిలిచారు. వట్టికోట చిన్నతనంలోనే తండ్రిని పొగొట్టుకున్నారు. పూట గడవడం కష్టమైన ఆ రోజుల్లో నకిరేకల్లులో కాంచనపల్లి సీతారామ రావు అనే గురువు దగ్గర వంట పని చేస్తూ అతని వద్దనే విద్యాబుద్ధులు నేర్చుకొన్నారు. ఆళ్వారుస్వామి జ్ఞాన సముపార్జన ప్రధానంగా గ్రంథాలయాల ద్వారానే జరిగింది. 1933లో హైదరాబాద్ వచ్చారు. కోదాటి నారాయణ రావు సాయంతో గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరారు. అక్కడే సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, బూర్గుల రామకృష్ణారావులతో పరిచయం ఏర్పడింది. 1938లో ఆళ్వారు స్వామి కాశీనాథుని నాగేశ్వర రావు పేరు మీద ‘దేశో ద్ధారక గ్రంథమాల’, ‘దేశోద్ధారక గ్రంథ సూచి’ స్థాపించారు. ప్రజల వద్దకే పుస్తకాలను తీసుకెళ్ళడం ప్రయోజనకరమని భావించి నల్లగోండ, వరంగల్లు జిల్లాల్లో పర్యటించి దేశోద్ధారక గ్రంథమాలలో 800 పై చిలుకు సభ్యులను చేర్పించారు. ‘దేశోద్ధారక గ్రంథమాల’ నుండి దాదాపు 35 పుస్తకాలు వచ్చాయి. సురవరం ప్రతాప రెడ్డి నవలలు, కాళోజి ‘నా గొడవ’ ఇందులో భాగంగా వచ్చినవే. రావి నారాయణ రెడ్డి ప్రభావంతో వారి అనుచరుడిగా 1946లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. స్వాతంత్ర్యోద్యమంలో మూడు సార్లు జైలు జీవితం గడిపారు. ఈ అనుభవాలు, అక్కడి ఖైదీల పరిస్థితులు వారి ‘జైలు లోపల’ కథల్లో వ్యక్తమయ్యాయి. వారి ‘ప్రజల మనిషి’ తొలి తెలంగాణ నవలగా ప్రాచుర్యం పొందింది. ‘గంగు’ అనే అసంపూర్ణ నవల, ‘రామప్ప రభస’ వ్యాస సంపుటి మెదలగు రచనలు చేశారు. దాశరథి కృష్ణామాచార్యులు ‘అబద్ధాసురుల పాలిట తల్వార్ మా ఆళ్వార్’ అని వట్టికోట ధైర్యాన్ని శ్లాఘించాడు. తన ‘అగ్నిధార’ను వట్టికోటకు అంకితమిచ్చారు. 1961 ఫిబ్రవరి 5 వ తేదీన నలభై ఏడవ యేటనే గుండెపోటుతో మరణించారు వట్టికోట.
**********************************************
సాహిత్యగుమ్మడి - 25
ఉ//
నైషధమాంధ్రమందున తనల్లెను ప్రౌఢగ నెవ్వరందురో?
భూషణమాంధ్రమందునది, భూరిగ జీవన సంప్రదాయముల్
వేషము రాచఠీవి, కవి పెద్దగు డిండిమ ఢంఖ గూల్చె, పీ
యూషమె కావ్వకన్నియలు, యోగము మృత్యువె శిస్తు రూపమున్!
సరైన జవాబు
శ్రీనాథుడు.
శ్రీనాథుడు ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడు. తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందిన వాడు. విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు. అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు. ఆయన కాలంలోనేనేమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!
శ్రీనాథుడు తను పర్యటించినప్పుడు గమనించిన అనేక విషయాల మీదా, దృశ్యాలూ వ్యక్తుల మీదా ఆశువుగా చెప్పిన చాలా పద్యాలు చాటువులుగా ప్రచారం పొందాయి. ఈ చాటువులకు సాహిత్య ప్రపంచంలో తక్కువ విలువేమీ లేదు. ఆ కాలపు జానపద సామాజిక జీవనం ఈ చాటువుల్లో ప్రతిఫలిస్తుంది. రకరకాల సామాజిక వర్గాల వ్యక్తులను గురించి ఈ చాటువుల్లో చేసిన వర్ణనలు – వారి నవ్వులూ, దుస్తులు ధరించే తీరూ, రాట్నం వడికే వైనమూ, ఇండ్లలోని పరిస్థితులూ – ఆయా ప్రాంతాల సాంఘిక చారిత్రక పరిశోధనకు పుష్కలమైన ముడిసరుకుని అందిస్తాయి.
ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు.
*************************************************
No comments:
Post a Comment