Thursday, June 23, 2016

రావా నేస్తం..,?ఎప్పుడొస్తావు నేస్తం..(నా వచన కవిత)

1--రావా నేస్తం?---27/1/2016

కటిక చీకటిలో
కరదీపిక అనుకున్నాను

వలపు కొలనులో
కలువ పూవనుకున్నాను

నా వంకర బ్రతుకుకు
ఊతం దొరికిందనుకున్నాను

క్షణికావేశంలో
కనపడకుండా పోతావనుకోలేదు,

 రావా నేస్తం  ?

*******************************
*2--కరుణించవా నేస్తం?...,28/1/2016

వినపడుతూనే ఉన్నాయ్ నీ నవ్వులు!
గలగలా ప్రవహించే గోదారి ఉరవడిలా!!

కోయిల కంఠంలా ప్రతిధ్వనిస్తూనే ఉంది!!
నీ కొంటె పిలుపు "ఓయ్ ఓయోయ్ ". కవ్విస్తూ

"లేరా చిన్నా లే"..వలపు నింపిన నీ
లాలిత్యపు పిలుపు ,నా పై అధికార మొలికిస్తూ.,!!

అయ్యో...మరచేదెలా? నేస్తం
నేను మరణించే వరకు కరుణించవా నేస్తం?!!

రావా నేస్తం!

*******************************
3--ఎక్కడున్నావు  నేస్తం----29/1/2016

నా  మనసు వీణ పై గుసగుసల
సరిగమలాలపించి ఆనందాన్ని అందించినదీ నీవే !!

నా యెద పలకము పై నాట్యమాడిన
నీ చేతి వేళ్ళస్పర్శతో అనంత తీరాలకు చేర్చినదీ నీవే !!

మమత ఉలి వలపు సుత్తీతో ఈ రాయిని
అద్భుతమైన సుందర  శిల్పంగా  మలుస్తానన్నదీ నీవే !!

వీణ మూగబోయిందే? నాట్యమాగిపోయిందే?
ఉలి పరుగు, సుత్తి దెబ్బ లేవి? అసలెక్కడున్నావు నేస్తం?

రావా నేస్తం !!

*******************************
*4--మరిచావా నేస్తం...? 30/1/2016

నీ తడబడు అడుగుల మంజీర నాధం !
నా యెద  లోతులలో నాగస్వరంలా మారుమ్రోగిందే!!

ధవళ వర్ణపు  మేలిముసుగుతో నిశరాత్రి !
నువ్వు నన్ను చేరితే శశి మబ్బుల మాటున చెరెనే!!

తడి యారని పెదవుల తహతహలతో నీవు! నాలో !
సగమైన వేళ అర్థనారీశ్వరుడే అమ్మకు కను సైగ చేసెనే!!

పొన్న చెట్టు పైన నున్న చిన్ని గువ్వలు రెండు మన!
గుసగుసలకు ముక్కులు రాసుకుంటూ కువకువ లాడెనే!!

మనోహరమైన నీ మేని సువాసనలకు మన్మధుడే !
మతి తప్పి మౌనిగా మారిన ఆ రేయి! మరిచావా నేస్తం?!!

రావా నేస్తం?
*******************************
5--తరించానన్నావుగా  నేస్తం!--?  31/1/2016

ఆ సుదినం నువ్వు "నన్నెక్కడికో " కొనిపోయావే!
ఆక్షణం నామనసు తనువూ నా అధీనం తప్పినపుడు!

నీ పెదవుల గుసగుసల ప్రతి అక్షరమూ నా మదిలో చేరి!
ఆ అక్షరాలే నా మనో ఫలకముపై అముద్రిత గ్రంధాలై!!

మన ప్రతి కదలికా రతీ మన్మధుల భంగిమలై
ప్రతి భంగిమా నాకనుపాపలలో కదలాడే వర్ణ చిత్రాలై!!

నీ నిశ్వాసలోని వేడి నిట్టూర్పులే,  మన్మధ బాణాలై
క్రీగంటి చూపులే వెన్నెల కాంతి రేఖలై నేపరవశిస్తూ!!

జుంటె తేనె కంటే తియ్యనైన నీ అధరామృత ధారలు
గ్రోలి నే విశ్రమించిన వేళ ఆదమరచి నాయెదపై వాలి !!

తరించానన్నావుగా నేస్తం!.....రావా నేస్తం?

*******************************
6--ఎలా ఉన్నావు నేస్తం....3/2/2016

ఒక్క రోజు నే కనపడకపోతే వడలిన సన్న జాజిలా!
ఒంటరి గువ్వలా , జడి వానకు వంగిన పుష్పంలా!!

ఒక్క రోజు నా స్వరం వినకపోతే తీగలుతెగిన వీణలా!
శృతి తప్పిన నాదంలా గతి తప్పిన నాట్య మయూరిలా!!

ఒక్క రోజు నా స్పర్శలేకపోతే! ముడుచుకున్న మందారంలా!
రేక లూడిన గులాబిలా !గానం మరచిన కోయిలలా మారి!!

అరక్షణం జాగుకు వేగ లేక  వేగి పోతూ క్షణక్షణం నా!
ఆలింగనం కోసం ముందా తొందర చర్య కై తపించి!!

కన్నులలో కన్నీరు.కనుపాపలలో నారూపు నింపుకొని!
చెకోరంలా ఎదురు చూచిన నువ్వు ఎలా ఉన్నావు నేస్తం!!

రావా నేస్తం?

*******************************
7--మరవాలెలా? నేస్తం..?.,4/2/2016

"నువ్వక్కడే నేనిక్కడే మరెక్కడో కలుద్దామొస్తావా"!
నిన్న మొన్న నువ్వన్న పిలుపు నన్నింకా ఊరిస్తూనే ఉంది!!

"ఒరేయ్ కన్నయ్యా-నవ్వించకురా నన్నిలా ఊఁ ..చంపుత."
నీ చిరుకోపపు చిలిపి పదం నా యెదలో మ్రోగుతూనే ఉంది!!

"ట్యాబుతెరిసి చూడు" "పిలవరా" మేఘసందేశం మేసేజ్
అడిగి మరి అల్లరి నామదినిండా అలజడి వల్లరి గిలిగింత

చీకటి మాటున చిలిపిగా నీ చీరకుచ్చిళ్ళు  చేపట్టి నేను
చిరు చెమటలతో నుదురు, నుదురుపై చెదరిన ముంగురులు!!

మేడపై నీ ముగ్ద మనోహర రూపం! రాకుమారిని బోలి
రాయంచ నడక ! ఆ నడకే నాకు రాచ బాట...మరవాలెలా నేస్తం!!

రావా నేస్తం  !!

*******************************
8--బ్రతక గలనా నేస్తం ?---5/2/2016

నక్షత్రాలు రాలినట్లుండే నీచిరుధరహాసాలకు దూరమై!
చిలక పలుకులను మరపించు నీ చిరు సవ్వడికి దూరమై!!

సుందర మృదు మనోహర నీ రూప లావణ్యం.పున్నమి!
చంద్రునికే ఈర్ష్యను కలిగించు నీముఖారవిందం చూడక!!

వెన్నెల కురిపించు నీ చల్లని చూపులకు దూరమై!
నీకరములు నా కరముతో ఆటలాడి బంధనము లేయ

అరవిరిసిన గూలాబీల సోయగాలద్దుకున్న నీ చెక్కిళ్ళపై!
చిలిపి గుర్తులు చిత్రించక.నీ చిగురు పెదవులు రుచి చూడక!!

మన్మధ ధనుసును బ్రోలు నీ నడుము ఒంపుసొంపులపై!
నా మునివేళ్ళు నాట్యమాడించక నే బ్రతుక గలనా నేస్తం  !!

నేనున్నానన్న నమ్మకమే నీ జీవిత గమనానికి చిరుదీపిక
గానెంచి అలసి సొలసిన  నన్నిడిచి నీవు ఎటో ఎగిరిపోతే

బ్రతుక గలనా నేస్తం? రావా నేస్తం.,

******************************
9--ఎప్పుడొస్తావు నేస్తం?..,6/1/2016

ఓహో ఓహో నేస్తమా! ఆహా నా ఆరాధ్య రూపమా!!
ఏమి నీ మహొజ్వల శక్తి !ఇంతటి బడబాలనమా!!

మురళీ నాదమే నీ స్వరం!మృధు మనోహరం నీ రూపం!!
జలపాతం నీ ధరహాసం! సుశోబితం నీ అభినయం!!

కంటి నిండా నీరూపమే!లేదు మరేది అంతా శూన్యమే!!
మనసు నిండా నీతలంపే! వలపుల విరులన్నియు.నీ పైనే!!

నీకైశ్రమించి తపించి పరితపించి మసిబారిన నేను
నీ యెడబాటును మోయలేక కృంగి పోయిన  నేను

ఎరుపెక్కిన కన్నులతో!  యెద సవ్వడి నిట్టూర్పులతో!!
చెట్టు పై చెకోర పక్షిలా !ఎదురు చూపులు నీకొరకే !

ఎప్పుడొస్తావు నేస్తం?------రావా నేస్తం?
*******************************
10--దయలేదా నేస్తం?--7/2/2016

మాటలతో మత్తెక్కించి!అంతలోనే అగాధంలో తోచావు!!
చేతి కందినట్లే అందావు!అందనంత దూరాన దూకావు!!

శూన్యంలో మన్యం పండించావు!చీకటిలో కరాళ నృత్యం చేయిస్తావు
వలపు రూపమే నాకు శాపమా? ఆ శాపమే నాకు మోహమా?

మురిపెము మూడు దినాలా?ముసలం ముప్పది యేండ్లా?
వడిదుడుకుల జీవితానికి  వలపు సంకెళ్ళు ఆభరణాలా?

చిరు ధరహాసాలే గురిచూసి వదిలిన శరాఘాతాలా?
నీ క్రీగంటి చూపులే యమ పాశాలా?దయలేదా నేస్తం!!

...రావా నేస్తం?
*******************************
11..ఎలా తీర్చుకోను నేస్తం.,,,?--8/2/2016

తడబడు అడుగులతో వచ్చి నీ బాహు బంధనములో చిక్కి
పరవశించి నే గోముగ నీ యెద పై వాలి దేనికో వెదకంగ

అక్కన జేర్చుకొన జక్కగా పయ్యెదమాటున జేరినే
ధారలు గ్రోలుచు..మునిపంట కొరికితే చిరుకోపముతో

చెంపపై చిటికేసి తమకంగా నావేపే చూస్తూ మైమరచి
నామోముపై ముచ్చటగొని ముద్దులిడి పరవశించితివే

తనువంతా తడిమి  ముద్దులిడుతూ జలకమాడించిన
నీ స్పర్శకు నా వడలంతా పులకరించి నే పరవశించితినే

మేడపై సన్న జాజులు సుతారంగా నువ్వు తుంచెడి వేళ
తుంచిన జాజులు మురిపంగా నీ ముని వేళ్ళు మాల కట్టు వేళ

నీ ప్రక్కన పక్కపై చేరి నే చేసిన చిలిపి అల్లరి జడలో జాజులు
నా చేతులలో పడి చిందర వందరగా రూపు మారిన వేళ

అల్లరి చేష్టలతో నీతో ఆడుకొని అలసి సొలసి నిద్రించగ
నుదురుపై ముద్దిడి చమట బిందువులద్ది అలరించిన నీ

ఋణమెలా తీర్చుకోను నేస్తం?  రావా నేస్తం?
*****************************
12--నాకు గుర్తే నేస్తం ! 9/2/2016

నల్లని నాగకన్యను బోలిన నీజడ పాయలలో తురిమి
పుడమంతా  పున్నమి వెన్నల పూసినట్లున్న మల్లెలు

ఘల్లు ఘల్లున మ్రోగు నీ కాలి గజ్జెల సవ్వడి నాకు
చెయ్యి తిరిగిన మృదంగ వాద్యకారుని నాదములా

చెదరిన ముంగురులతో ,మంచిముత్యాల వలే చిరుచెమట
బిందువుల పాలభాగాన, చక్కని సింధూరపు బిందువు తో

గలగలా పారే గోదారి వరదలా  పరుగున నన్నల్లుకు పోయి
జలజలా పారే గంగా ప్రవాహంలా నీ కంటరాలే అశృధారలు

కనినంత  నా మదిలో యెన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు
పొర్లి పొర్లి సెలయేటి ఉరవడిలా నన్ను చుట్టు ముట్టిన వేళ

నగుమోముతో నా కరమందుకొని బంధించి  నేనున్నానన్న
రవ్వంత గర్వం నీ కనుపాపలలో కదులాడిన నారూపం

నాకు గుర్తే నేస్తం !    ----రావా నేస్తం?

******************************
13---మరలిరా నేస్తం....10/2/2016

మదిలో మెదిలిన నీ మమతానురాగాలు మహా వృక్షమై
వేళ్ళూని  నలుదిశలా విస్తరించి  నన్నూరడించిన వేళ

నీ మేని స్పర్శ  చల్లని చిరుగాలిలా నన్నాదరించి లాలించి
నీ సత్తువ నంతా నాకై రంగరించి నాపై గంధంలా చిలుకరించి

నీ గంభీర వదనారవిందంగని నే గువ్వలా ముడుచు కున్న వేళ
ఫక్కున నవ్వి నన్ను  నీ బాహు బంధనములో బంధించితివే

కను చూపులతోనే మనమిరువురం కచాలనం చేసుకుంటూ
మూగ భాషలోనే మురిపమొలుకు ముచ్చటులెన్నో కదా

నీకై ఎదురుచూపులతో నాకు తెల్లవారిన ఉషోదయాలు ఎన్నో
నా రాకకై పరితపించి నీకు ఉదయించిన చంద్రోదయాలెన్నో

వసంతాలకు వసంతాలు వస్తూ.,,పోతూనే ఉన్నాయ్
చక్రభ్రమణం ఇసుమంతైనా మనకోసం ఆగింది లేదు

మళ్ళొస్తారా నానా అన్న నీ కమనీయ కంఠం మరలా మ్రోగదే?
నీ అమృతమొలుకు చల్లని చూపుల తాకిడి తగలదే నాకు

మరలిరా నేస్తం....రావా నేస్తం?

*******************************

14--నేను నువ్వే నేస్తం,,,11/2/2016

వసంత కాలంలో మావి చిగురు తిన్న కోయిల రాగంలా
ముని వేళ్ళ తాకిడికే వీణ తంత్రులు పలికే సప్త స్వరాలలా

బారులు తీరిన మేఘాలు చూసిన నెమలి నాట్యంలా
చిరు పెదవుల చిరుగాలికి చిగురించే మురళీ నాదంలా

ఆకాశంలోని చంద్రుని చూసి కలువ భామ వికసించినట్లు
నీ పిలుపు వినగానే పరవశంతో నా మనసు వికసించింది

నువ్వు నన్ను కోరుకోవటం నేను నీకు మనసివ్వటం
నువ్వన్నట్లు మనం సగం సగం  ఈ ప్రకృతిలో చెరిసగం

నాలో నువ్వో సగం నా కలతలు పంచుకుంటూ ప్రేమగా
నీలో నేనో సగం మమతలమాధుర్యమందుకుంటూ ఆశగా

ఈ చరాచర జగతిలో నువ్వు నేను అణువంతే అయినా
మన ప్రేమ మధురిమ ఈ ప్రకృతి ధర్మంలో కలసిపోయింది

నేను నువ్వే నేస్తం...రావా నేస్తం?

*******************************
15- ఎన్నాళిలా నేస్తం? -12/2/2016

నీ చల్లని పలుకులకు వేడి నిట్టూర్పులకు పరవశించె నా
బ్రతుకో ఏకాంతం, మహా బడబాలనంతో నిండిన సంద్రం

మూగబోయిన నా మది భావాలను తట్టి లేపిన నువ్వు
ముడుచుకు పోయిన శరీర సుగంధాలను కుదిపి లేపిన నువ్వు

ఎడారి లోని ఒంటరి ఒయాసిస్సు లాంటి నా బ్రతుకు
వలపు కొలనులో కలువలు పూయించిన నీ చిరునవ్వు

నీ ఓర గంటి చూపులు వలపు బాణాలై నాహృది తాకితే
మంచు బిందువు లద్దుకున్న ముద్ద మందారంలా నేను

నీ నోటి నుండి వెలువడే ఒక్కో మాట నా చెవులకు సోకితే
అవి ఓం శబ్దంలా చర్చి గంటల్లా,అల్లాహో నమాజు నాదాలై

నిద్రకు నోచుకోని నాకళ్ళల్లో కదులాడే నీ రూపలావణ్యం
నే వ్రాసే ప్రతి అక్షరమూ నీతో గడిపిన మధుర క్షణాలై

సజీవ చిత్రాలలా నా మనోఫలకంపై చెరగని ముద్రవేసి
ఆరిపోయే దీపానికి ఆముదమందించి వెలిగిస్తూనే ఉన్నాయ్

ముసురుకొనే కారు చీకటికి చిరుదీపపు వెలుగులా
ఆరిపోయే జ్యోతికి అరచేయి అడ్డులా  ఎన్నాళిలా ప్రియా?

రావా నేస్తం?

***********************
16-- తగునా నేస్తం?--13/2/2016

కాలం మగ్గంపై నేసిన కలనేత  రంగుల చీరలోని ,పడుగూ
పేకలా మంచి చెడులను విడమర్చి చెప్పెడి ప్రియతమా!

చిరుగాలులకు నటనమాడు చిగురాకుల గుసగుసలలా
నవ యవ్వన బింభాధరాల అరుణారుణ కాంతిరేఖ శోభినీ!

చెలీ !నీ కోమల కరకంకణముల సవ్వడి ఆమని ఝుంకారములా
నవ యవ్వనికి ఝుంమ్మని రేగిన మదన కోరికల ప్రేమ లేఖలా!

ప్రియా! నీవలపు విందుకోసం తత్తరపాటుతో బిత్తర పోతూ,గాలికి
ఎండుటాకు కదిలినా నీ కాలి యందియల సవ్వడేగా నాకు!

ప్రియతమా! నిరతం నీ గాత్ర మాధుర్య లాలనా పరవశంలో
మైమరచి నీ నవ్వుల పానుపుపై హాయిగా పవళించ గోరెదనే!

నాకై విరబూసిన నీ వలపు వృక్షపు నీడలో పరుండి సేద
తీరెడి నాకు నీ మనసు సున్నితత్వం  తెలియదా?

నాకు మరియొక అతివతో నేస్తమా? హాహాహా  లలనా ?
సహజమైన స్త్రీ  మనో దౌర్భల్యమునకు నీవునూ బానిసవేనా

లేక నాపైనున్న మోహామృత ధారలు నీమనసునలా
సందేహ సంశయములో వేసి వేపు చున్నవా చెలియా?

కలనైనా మరో కలికి రూపము కానని నాపై నీ కాఠిన్యమా?
ఏమి నీ వలపు వైపరీత్యము? ఔరా! ఎంతటి నెరజాణవు?

నీకిది తగునా నేస్తం,.?  రావా నేస్తం?
*****************************
17--అనుమతిస్తావా నేస్తం,.?---14/2/206

రోజు రోజుకూ నువ్వు మారతావన్న ఆశ కొడిగట్టి పోతూ ఉంటే!
కనులలో నీరూపం నింపుకొని నే జీవచ్చవంలా మారిన వేళ

భూమండలం బ్రద్ధలైనట్లూ... ఆకాశం కుప్పకూలినట్లూ!!
సూర్య చంద్రులు అపసవ్య దిశలో ఉదయించారా అన్నట్లు

కాలి క్రింద నేల కంపించి నేనగాధంలో కూరుకు పోయినట్లు
ఆకాశంలో ఇంద్ర ధనస్సు విరిగి ఏడేడు ముక్కలైనట్లు

సప్త సముద్రాలు ఒక్కసారిగా  ఇంకి పోయి నెర్రెలు వారినట్లు
చరాచర జగత్తు మొత్తం ఒకేసారిగా చలనం కోల్పోయినట్లు

నీ నోట "నిలువదురా మనబంధం" అన్న ఒకే ఒక్క మాట
నా నవనాడులూ తెంచి నాహృదిని ముక్కలు చేసింది!!

నాకే సంబధమూలేని విచిత్రమైన ఈ వైకుంటపాళి ఆటలో
నువ్వు గెలిచి ఓడావో నేను ఓడి గెలిచానో కాలమే కదా చెప్పాలి!!

అంతులేని ఈ వేదనాభరితమైన పలుకులు భరించగల శక్తి
నా సున్నితమైన మనసుకు లేదు, అంతభారం మోయనూలేదు!!

నీవు వలదన్న పిమ్మట ఈ రమణీయ మనోహర ప్రకృతి సౌంధర్యముతో నాకింకా పనేముంది. నిష్క్రమిస్తున్నా ప్రియా..!
నీవలదన్న పిమ్మట అర్హతకోల్పోయిన  ఉత్తమ ఆటగాడిగా-నాకీ విశాల ఆటస్థలంలో  పనేముంది వెళ్ళిపోతున్నా చెలీ !

ప్రేమికులంతా  ప్రేమదినోత్సవంనాడు ప్రేమసాగరంలో మునిగి తరిస్తున్న వేళ !
మరలి రాని మరోలోకాలకేగ నాకు నేనే మరణ శాసనం వ్రాసుకున్నా చెలియా!

రోధించకు ప్రియా! నీ కనులలో నీరు నే చూడలేను! ప్రియతమా
మరో జన్మంటూ ఉంటే నీ అడ్డాలలో బిడ్డగానైనా తిరిగి రావాలనుంది!

నీ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనుంది.. అనుమతిస్తావా నేస్తం?.మరలి రానా నేస్తం?

*******************************
18--వచ్చావా నేస్తం...15/2/2016

మరణ శయ్యపైనున్న నన్ను కనులారా చూడటానికొచ్చావా నేస్తం?
నీ కనుకొలకలనుండి జారే ప్రతి నీటి బిందువులోను నా రూపే!

బరువెక్కిన గుండెలతో బాధాతప్త హృదయంతో పరుగు పరుగునా వాయువేగంతో కదిలొచ్చావా
మమతానురాగాల మేళవింపుతో మదిలో మాలిన్యాన్ని
మచ్చుకు కూడా లేకుండా కడిగేసుకోని  మహా పునీతగా

పసిపాపగా.నవ యవ్వనిగా..చెల్లిగా, అక్కగా, అమ్మగా,
ఆలిగా ,ప్రేయసిగా, నా ఆరాద్య దేవతా మూర్తిగా, నిలవాలని

నీవేపేరులో ఉన్నా ఈ మానవాళికంతటికీ మహోన్నత
మార్గదర్శినివి మమతానురాగాలు పంచే మాతృమూర్తి నువ్వేనని

నీవు లేని నాడు ఈ సువిశాల ప్రపంచలో మానవాళికి
అవతరణేది? ఆలంబనేది ? అత్యున్నత శిఖరాలకు దారేదని?

ఒర్పు సహనం ఆభరణాలు గా అవతరించిన నీరూపం
అమృత మూర్తిగా, నీవు అవనితో సమానం కదా?ఆందుకే

నీ వనుమతించవని ,నా మరణ శాసనం రద్దు చేసుకోవాలని
ఆఖరి ఘడియలలోనైనావచ్చి ఆదుకుంటావని..నాకు తెలుసు

కరుణించిన నీ బాహుబంధాలలో బంధీనై. నీ ప్రేమామృత
దారలలో తడిచి ముద్ద కావాలని నా మనసు ఉవ్వీళ్ళూరుతుంది

వచ్చావా నేస్తం......,పయనిద్దాం పద నేస్తం.......

*******************************




No comments:

Post a Comment