Saturday, October 24, 2026

సరళంగా తెలుగు వ్యాకరణం (అలంకారములు)

 

కాంతకు ఆభరణాలెంత శోభనిస్తాయో, కావ్యకాంతకు అలంకారాలంత శోభనిస్తాయి. అది పద్యమైనా గద్యమైనా సరే.

1.శబ్దాలంకారం...2-అర్ధాలంకారం,., 3-ఉభయము (అర్ధ శబ్దాలంకారము) ఇలా విభజించ బడిన వానిలో   శాఖోపశాఖలుగా వందల సంఖ్య లో ఉన్న అలంకారాలలోనుండి ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి కొన్ని వాటిని గురించి తెలుసుకుందాము

శబ్దాలంకారములు: శబ్దం  ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి శబ్దాలంకారములు.

అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి అర్థాలంకారములు.

ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవాటిని ఉభయాలంకారములు అంటారు.

అర్థాలంకారాలు 'ఉపమా' అనే అలంకారంతో ప్రారంభం అవుతాయి. అయితే ఈ అలంకారాల్లో తరుచుగా 'ఉపమానం, ఉపమేయం, విషయం వర్ణ్యం, అవర్ణ్యం వస్తువు" ఇలాటి మాటలు వస్తూ ఉంటాయి. వర్ణం, ప్రకృతం, విషయం, ఉపమేయం, ఇవన్నీ పర్యాయ పదాలు అవర్జ్యం, అప్రకృతం, విషయి - ఉపమానం - ఇవి పర్యాయ పదాలు.

ఉపమేయం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటి ? సాధారణంగా ఒక విషయాన్ని గురించి, లేదా ఒక వస్తువు గురించి మనం చెబుతాము. మనం చెప్పే విషయం ఏదుందో  దాన్ని ఆలంకారికులు 'ఉపమేయం' అన్నారు. అంటే చెప్పదలచుకున్న విషయం- ఉపమేయం అన్నమాట.

ఒకవిషయము దేనితో అయితే పోల్చి చెప్పబడుతుందో దానిని ఉపమానము అంటారు. అనగా ఈ 'పోలిక' అనేదానికే "ఉపమానము" అని నామకరణం చేయబడినది

శబ్దాలంకారములు:

నాలుగు అనుప్రాసములు, ఒక యమకము,  ఒక ముక్తపదగ్రస్తము కలసి మొత్తము ఆరు శబ్దాలంకారములున్నాయి. ఈ అలంకారములారూ ముఖ్యంగా శబ్దము ప్రధానంగా కలవి. ఈ అలంకారములుపయోగించి పద్య గద్యములను వ్రాసేసమయములో మనకు అక్షరకూర్పులో ప్రతిభ చాలాఅవసరము. ఒకే అక్షరాన్ని మరల మరల ప్రయోగించి, రెండు మూడేసి అక్షరాలను జంటలు జంటలుగా ప్రయోగించి అర్థతాత్పర్య భేదములను సూచించి వ్రాసే ప్రక్రియే ఈ శబ్దాలంకారములు.

1)వృత్త్యనుప్రాస        2)చేకానుప్రాస            3)లటానుప్రాస

4)అంత్యానుప్రాస      5)యమకము            6)ముక్తపదగ్రస్తము

 

వర్ణవిన్యాసమును అనుప్రాసము అని అంటారు. అనగా అక్షరాలకూర్పుతో పద్యముగాని గద్యముగాని సౌందర్య భూషణముగా వ్రాయటమే అనుప్రాసమౌతుంది

1)వృత్యనుప్రాసము:

లక్షణము "ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసానామ్నా వృత్త్యను ప్రాస ఇష్యతే".

ఒకటి, రెండు, మూడు, నాలుగు మొదలయిన హల్లులను పెక్కుసార్లు ఆవృత్తి చేయుట వృత్త్యను ప్రాస" అని పైశ్లోకం తాత్పర్యం. ఒకే హల్లు (వర్ణము) మరల మరల అనేక సార్లు తిరిగి తిరిగి వస్తే అది వృత్త్యనుప్రాస' అని మనం మామూలుగా చెప్పుకోవచ్చు.

ఉదా: "పుట్టక పుట్టక పుట్టిన నా పట్టిపై ఈ పుట్టభోగికినేల గిట్టకలిగె" (గద్యరూపములో)

కం: జొన్న కలి జొన్న యంబలి

జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్

సన్నన్నము సున్న సుమీ

పన్నుగ బలినాటి సీమ ప్రజలందరకున్    (శ్రీనాథ కవి, పద్యరూపంలో)

 

2)ఛేకానుప్రాసము:

లక్షణము : "వివేదవ్యవధానేన ద్వయోర్వ్యంజన యుగ్మయ్యో"!

రెందు కాని అంతకంటె ఎక్కువ కాని అక్షరాలున్న పదాలు  అర్థభేదముతో వెంటవెంటనే (అవ్యవధానంగా) వచ్చుటను ఛేకానుప్రాసము అని అంటారు.

ఉదా:"గుడిలో పూజ పూజ చేస్తున్నది."

"కాళింది మడుగున కాళీయుని పడగల

ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని"

సూచన 1: వెంట వెంటనేరావాలి.

సూచన 2: అర్థబేధం ఉండాలి.

 

3)లాటానుప్రాసము:

లక్షణం: "శబ్దార్థయోః పౌనరుక్త్యం యత్ర తాత్పర్య భేదవత్

              కావ్య తాత్పర్య విదాం లాటాను ప్రాస ఇష్యతే."

ఒకే అర్థము ఉన్న పదములను శరభేదం, శబ్ద భేదం లేకుండా తాత్పర్యభేదముతో మరల మరల చెప్పుటయే లాటానుప్రాసము.

ఉదాహరణ :

"కమలాక్షునర్చించు కరములు కరములు

శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ"

"మానవత్వము గలుగు మనిషి మనిషి" (లక్ష్మీ నృసింహశతకము) -

సూచన: పదాలు రెండు వెంటవెంటనె రావాలి.(అక్షరసమూహాలు కాక పదాలు అయి ఉండాలి). అర్థభేదము గాని శబ్దభేదము గాని ఉండారాదు. 

4)అంత్యానుప్రాసము:

పద్యములోని పాదాలకు కాని, వాక్యములకు కాని చివరిభాగములో ప్రాస కలుగునట్లు అవే అక్షరములు మరల మరల చెప్పుటను అంత్యానుప్రాసము అని అంటారు.

ఉదా:ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై

నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై

నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

 

5)యమకము:

"పౌనరుక్త్యేన ద్వయో ర్వ్యంజన యుగ్మాయోః"

లక్షణం: రెండు లేక, అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదాలు అర్థభేదముతో మరల మారల చెప్పుటను యమకము అని అంటారు.

ఉదా:ఓ హారిక! జోహారిక!!

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు

సూచన : పదాలు వెంట వెంటనె రానక్కరలేదు.

6) ముక్తపదగ్రస్తము :

 మొదటి పాదము చివరి పదాన్ని  రెండవ పాదము మొదటి పదముగా, రెండవ పాదము చివరిపదము మూడవ పాదము మొదటి పదముగా, మూడవ పాదము చివరి పదమును నాలుగవ పాదమునకు మొదటి పదముగా ఉపయోగించడమే ముక్తపదగ్రస్తము.

ఉదా:సుదతీ నూతన మదనా !

మదనాగతురంగపూర్ణ  మణిమయ సదనా !

సదనా మయగజరదనా !

రదనాగేంద్ర నభ కీర్తి రస నరసింహా !


అర్ధాలంకారములు

అర్థము వలన కవితకు అందాన్ని ఇచ్చేవి అర్థాలంకారములు. ఇవి వందకుపైగా ఉన్నాయి. ఎందుకంటే ఒకో కవికి అలంకారాన్ని వ్యక్తీకరించటంలో చెప్పటంలో ఒక పద్ధతిలో ఊహలు సాగుతాయి. అవి ఆ కవి యొక్క భావనా శక్తికి, ఆ బలానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. భావనా ధన బలాన్ని బట్టి రకరకాల ఊహలతో అలంకారాలను కూర్చి కవులు తమ కావ్య కన్యకకు సొగసులు చేకూరుస్తారు. ఎవరి గొప్పతనం వారిది. ఎవరి సొగసులు వారివి. ఎవరి సోయగాలు వారివి. వెగటులేకుండా ఆభరణములు ధరించి లోకంలో స్త్రీలు ఎలా తమ సహజ సౌందర్యాన్ని పెంచుకుంటారో ఊహల బంగారంతో అలంకారాలు కూర్చి కవులు తమ సహజ కావ్య కథా వస్తువుకు అందాల్ని చేకూర్చి తమ కావ్యకన్యలను సుందరీ మణులుగా తీర్చిదిద్దుతారు.

ముందుగా కొన్ని ముఖ్యమైన నిర్వచనములు :

ఉపమేయము: వర్ణించదలచిన విషయము (దేని గురించి చెప్పదలుకున్నామో అది).

ఉపమానము:-     పోల్చడానికి ఎంచుకున్న విషయము (దేనితో పోలుస్తున్నామో అది).

సమానధర్మము   : ఉపమేయములోను, ఉపమానములోను సమానముగా ఉన్న లక్షణము లేక ధర్మము.

ఉపమావాచకము    : ఉపమానకు ఉపమేయమునకు ఉన్న పోలికను తెలుపుతూ అన్వయము కుదిర్చే పదము.

ఇప్పుడు సాధారణముగా ఉపయోగించే కొన్ని అర్థాలంకారములు కొన్ని నేర్చుకుందాము.

 

1)ఉపమాలంకారము:-

"ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లనతి ద్వయోః"

1. ఉపమానము: పోలికగా చెప్ప బడినది.

2. ఉపమేయం: పోల్చబడింది.

3. సమాన ధర్మం: ఉపమేయ ఉపమానాలకున్ను సమాన ధర్మాన్ని తెలిపేది.

4. ఉపమా వాచకం: ఉపమేయ సమాన ధర్మాలను కలిపి చెప్పడానికి ఉపయోగించే అక్షరాలు, పదాలు. ఉపమాలంకారము లో ఈ నాలుగు అంశాలు ఉంటాయి. ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. అప్పుడు దాన్ని లుప్తోపమాలంకారము అంటాము. లుప్తోపమాలంకారములను మనం చలనచిత్ర గీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదా//"ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా నున్నది."

మనమేవిషయమును గురించి చెప్పుకొనుచున్నామో, అది ఉపమేయము,

ఆమె ముఖము = ఉపమేయము

మనమే ప్రసిద్ధమైన వస్తువుతో పోల్చామో అది ఉపమానము.

చంద్రబింబము = ఉపమానము

ఆమె ముఖమునకు - చంద్రబింబమునకుగల సమానగుణము = సమానధర్మము

వలె =ఉపమా వాచకము

ఉపమానపదములు - వలె - రీతి - వగిరి - వంటి - చందము - మొదలైనవి. ఈ నాల్గింటిలో ఏ ఒక్కటి లోపించినను లుప్తోమమాలంకారమగును. లోపించుట అనగా చెప్పుచున్న వాక్యము నందు లేకపోవుట.

"ఆమె చిగురుంకేలు నంటుకొంటివి."

 

చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులో

​వలె, అను ఉపమావాచకము లేదు. మెత్తని అను సమానధర్మము లేదు. చిగురు అను ఉపమానము, కేలు అను ఉపమేయము ఈ రెండుమాత్రమే కలవు - కాన నిది లుప్తోపమ.

 

2)అన్వయాలంకారం:

"ఉపమానోపమేయత్వం యదేకస్త్యవ వస్తునః"

ఉపమానము, ఉపమేయము ఒకటే వస్తువైనచో అది అన్వయాలంకారం.

ఉదా//

"చంద్రుడు చంద్రుని వంటివాడు."

"ఆకసమాకసము వంటిది."

 

3)ఉపమేయోపమ అలంకారం:

"పర్యాయేణ ద్వయోస్తచ్ఛేదుపమేయోపమా మతా"

రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమాలంకారం.

రెండవది ఉపమేయమైనప్పుడు మొదటిది ఉపమానమౌతుంది.

ఉదా//

 "ధర్మము అర్ధము వలెను, అర్ధము ధర్మము వలెను, అలరారుచున్నది."

 "కొండవలె ఏనుగును, ఏనుగువలె కొండయు, నుండ, వాగువలె మదధారయు, మదధారవోలె వాగు నొప్పుచున్నవి."

 

4)ప్రతీపాలంకారం :

"ప్రతీపముపమానస్యోపమేయత్వ ప్రకల్పనమ్"

ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది.

ఉదా//"పద్మముు నీ లోచనము తో సమానం."

"చంద్రుడు నీ ముఖము తో సమానుడు."

 

5)రూపకాలంకారం :

"విషయ భేద తాదౄప్య రంజనంవిషయ స్వయత్"

లక్షణము : ఉపమాన, ఉపమేయములు, రెండింటికి భేదమున్నను, భేదములేనట్లు చెప్పుట - (లేక) ఉపమేయమునందు ఉపమానధర్మమును ఆరోపించుట, రూపకాలంకారము. ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.

 

ఉదా// "లతాలలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లిరి."

 

ఇందు లతలుపమేయము. లలన లుపమానము. కుసుమము లుపమేయము. అక్షతలు ఉపమానము. అక్షతలు చల్లుట ఉపమానములగు స్త్రీల ధర్మము. ఆపని ఉపమేయములైన లతలు చేసినట్లు వర్ణింపబడినది. రాజు ఉద్యానవనమునకు పోయినపుడు, లతలనుండి పువ్వులాతనిపై రాలినవని సారాంశము.

 

6) పరిణామాలంకారం :

ఉపమానము ఉపమేయముతో తాదాత్మ్యమును పొంది క్రియను నిర్వహించిన అది పరిణామాలంకారం.

ఉదా//"ప్రసన్న మగ, ధృగబ్జమున హరిమిమ్ము వీక్షించును."

ఇందు దృక్కు అబ్జముగా (మారినను) ఆరోపింపబడినను, వీక్షించుట అబ్జమునకు సంభవింపదు. కాన ఉపమేయమగు దృక్కుగా మారి క్రియను నిర్వర్తించినది.

 

7)ఉల్లేఖాలంకారం :

"బహుభిః బహుధోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే."

ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం.

ఉదా//;ఆ రాజు ప్రజల చేత దేవుని గాను, యాచకుల చేత కల్ప వృక్షము గాను, విరోధుల చేత రౌద్రుని గాను చూడ బడుతాడు."

 

"అతడు వక్తృత్వ మునందు బృహస్పతి, కీర్తి యందు అర్జునుడు, విలువిద్య యందు భీష్ముడు"

 

8)భ్రాంతిమద అలంకారం :

ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమద అలంకారం.

ఉదా//

శ్రీరాముని కీర్తి లోకమున వ్యాపింప చంద్రకాంత శిలలు జలము లూరు చున్నవి.

ఇందు శ్రీరాముడు కీర్తి యందు చంద్రుడని భ్రాంతి కల్గినది

 

9)ఉత్ప్రేక్షాలంకారము :

"సంభావన్యాస్యా దుత్ప్రేక్షా"

 ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.

ఉదా// "ఈవెన్నెల పాలవెల్లయా యనునట్లున్నది."

 "క్రోధతామ్రాక్షుడైన శ్రీరాముడు ప్రళయకాలరుద్రుడా యనునట్లున్నాడు."

 

10)అతిశయోక్త్యలంకారము :

 సంబంధం లేని చోట్ల సంబంధం ఉన్నట్లు చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.(తుల్యయోగిత)

ఉదా//"ఆ పురము నందలి సౌధములు మిన్నంటియున్నవి."

 

11)ప్రతివస్తూపమాలంకారం :

"వాక్యయోరేక సామాన్య ప్రతివస్తూ మా మతా"

రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.

ఉదా//"సూర్యుడు తాపము చేత భ్రాజిల్లును. శూరుడు చావము చేత రాజిల్లును."

 

12)దృష్టాంతాలంకారము :

"చేదింబ ప్రతి బింబత్వం దృష్టాంతః తదలంకృతిః"

ఉపమేయముతో ఉపమానమును బింబ ప్రతిబింబ భావముతో, దృష్టాంతీకరించుటయే, దృష్టాంతాలంకారమనబడును. ఇందు రెండు వాక్యములుండును. ​

గుణము తెలియకుండినను సుకవి వాక్యము కర్ణ రసాయనముగానుండును. (ఉపమేయము) పరిమళమును ఆఘ్రాణింపకుండినను మాలతీ కుసుమ మాలిక నేత్రపర్వముగా ఉండును గదా ! (ఉపమానము)

 

13)వ్యతిరేకాలంకారం :

"వ్యతిరేకోవిశేషశ్చేదుపమేయోపమేయయో :"

ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.

ఉదా//

"శ్రీరాముడు కల్పవృక్షమేకానది భూమిలో ఉన్నది.

ఇనుము విరిగిన నదుకును, మనసు విరిగిన నదుకదు.

 

14)శ్లేషాలంకారము :

"నానార్థ సంశ్రయః శ్లేషః వర్ణా వర్ణోభయా శ్రితః"

అనేకార్దములు గల పదముల, నుపయోగించి చెప్పిన శ్లేషాలంకారము.

ఉదా//

1) మానవ జీవితం సుకుమారం. మా నవ జీవితం సుకుమారమైనది

2) మీ  సంగతి ఏమిటి?    మీసం గతి ఏమిటి?

3)గురూజీ వనం బాగుందా? గురూ జీవనం బాగుందా?

 

15) క్రమాలంకారము :

"యథాసంఖ్యం క్రమేణైవ క్రమికాణాం సమన్వయః;

మొదట చెప్పిన వస్తువుల క్రమమునకు, భంగము లేకుండ, అనుగుణముగా తరువాత వస్తువులంజెప్పిన క్రమాలంకారము.

 

ఉదా//"ధనమును, విద్యయు, లక్ష్మీ సరస్వతులిత్తురుగాక."

ధనమిచ్చునది లక్ష్మి - విద్యనిచ్చునది సరస్వతి. అందు వల్ల ఒకే క్రియ ఇరువురికి అన్వయించినది.

 

 "కసవుచే - నీటిచే - మోద కలవచేత బ్రదుకు మృగ - మీన - సజ్జన ప్రకరములకు శబర కైవర్త సూచకజనులు జగతి కారణము లేని పగవారు కారెతలవ."

గడ్డిచే బ్రదుకుచున్న లేళ్లకు బోయవాండ్రును నీటిచే బ్రదుకుచున్న చేపలకు బెస్తవాండ్ర వల్లను ఆనందముచే బ్రదుకు సజ్జనులకు కొంటెవాండ్రను కారణము లేని శత్రువులు. ఇట్లు క్రమముగా అర్ధము స్వీకరింపవలెను.

 

​16) కారణమాలాలంకారము :

"గుంభః కారణమాలా స్యాద్యధా ప్రాక్రాన్త కారణై :"

ఒకదానికొకటి, కారణముగా వర్ణించి వ్రాసినది కారణమాలాలంకారమగును.

 

ఉదా//విద్యయెసగును వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రతవలన ధనము, ధనమువలనను ధర్మంబు, దానివలన యైహికాముష్మిక సుఖంబులందు నరుడు.

 

17)వ్యాజస్తుతి అలంకారం :

"ఉక్తిర్వ్యాజ స్తుతిః నాదా స్తుతిభ్యాం స్తుతి నిందయోః"

పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.

ఉదాహరణలు:(ఓ గంగా పాపాత్ములను కూడా స్వర్గమునకు చేర్చు నీకు వివేకము లేదు)

( ఓ ధూ తిక, బాగు బాగు! నా కోసం నీవు దంతాల చేత, గోర్ల చేత గాయాలు పొందావు. ఇంతకంటే ఏమి చేయగలవు.)

 

18). లోకోక్తి - అలంకారం

"లోకప్రవాదాను కృతిర్లో కోక్తి రితి కథ్యతే."

'లోక ప్రవాదాన్ని అనుసరించి ఒకసామెతో, నానుడో చెప్పటం లోకోక్తి అలంకారం,

ఉదా//'ఇంకనొక్కటి వినుము పూర్ణేందువదన

వ్రతము చెడ సౌఖ్యమైన వలయు"మనుచరిత్ర-పెద్దన

ఈపై ఉదాహరణంలో 'వ్రతం చెడినా సుఖం కలగాలి' అనే జాతీయం వాడటంవలన ఇదిలోకోక్తి.

 

19). ఛేకోక్తి - అలంకారం)

"ఛేకోక్తిర్యత్ర లోకోక్తి:స్యాత్ అర్ధాన్తర భావగర్భితా"

లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం గూడా ఉండటం ఛేకోక్తి అలంకారం' ఉదాహరణ: దొంగను దొంగయే పట్టవలెను.

 

వివరణ: దొంగను మరొకదొంగే పట్టుకుంటాడు. దొంగ నడవడి, గుర్తులు గ్రహించటం  మరొక దొంగకే చేతనౌతుందది. ఇది చెబుతూ దొంగను పట్టుకునే వాడుకూడ దొంగే కావలెను  అనే మరొక అర్థాంతర స్ఫూర్తి కలుగుతుండటం వల్ల ఇది 'ఛేకోక్తి'.

 

20) స్వభావోక్తి -అలంకారము

"స్వభావోక్తిః స్వభావస్య జాత్యాది స్థస్య వర్ణనమ్."

జాతి, గుణ, క్రియాదులు, ఉన్నవియున్నట్లు మనోహరముగా, వర్ణించి చెప్పుట స్వభావోక్తి.

ఉదా//"ఆ ఉద్యానవనమున, లేళ్లు చెవులురిక్కించి, చంచల నేత్రములతో, నిటునటు గంతులిడుచున్నవి.;"

ఇందు లేళ్లయొక్క స్థితి, మనోహరముగా, లేళ్ళయొక్క స్వభావమును ఉన్నదున్నట్లు, వర్ణింపబడినది.

 

21)అర్థాంతరన్యాసాలంకారం :

"ఉక్తిరర్ధాంతర వ్యాస స్స్యాత్సామాన్య విశేషయోః"

సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం.

ఉదా//శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు వీరులకు సాధ్యము కానిది లేదు కదా!"

"ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాద లేపనము కరిగిపోవడం తెలియలేదు దైవ కృతము నకు అసాధ్యం లేదు కదా."

 

22) తద్గుణాలంకారం :

"తద్గుణ స్వగుణత్యాగాదన్యదీయ గుణ గ్రహ"

స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.

ఉదా//"తరుణాంగుళి చ్చాయ దంతపు నరకట్టు

లింగిలీకపువింతరంగులీన"(మనుచరిత్ర - పెద్దన)

లేతవైన వ్రేళ్ళ యొక్క ఎఱ్ఱని కాంతి వీణ కమర్పబడిన దంతపు మెట్లు సహజమగు:తెల్ల రంగును పోగొట్టి ఎర్రబరచినవి.

ఇందు దంతపు మెట్లు తమ తెలుపు రంగును విడిచి, కోమల అంగురుల ఎఱువును గ్రహించినవని వర్ణింపబడినందున తద్గుణాలంకారం,

 

23) వ్యాజనిందాలంకారం :

"నిందయా నిందయా వ్యక్తి ర్వ్యాజనిందేతి గీయతే "

నిందచేత మరియొక నింద స్ఫురిచటం వ్యాజనింద.

ఉదా//"ఓ బ్రహ్మ ! పూర్వం నీతలల్లో ఒక్క దానిని మాత్రమే ఖండించిన శివుడు నిందింప దగినవాడు."(చంద్రాలోకం)

 బ్రహ్మతలను ఖండించిన శివుడు ఇక్కడ నిందింపబడటం ప్రధానం. శివుడు నిందింపబడటానికి ఒక్క తల ఖండించి, మిగిలిన నాలుగు తలలతోనూ బ్రహ్మని మిగల్చ టమే. అన్ని తలలను ఖండించినట్లయితే అసలు బ్రహ్మే ఉండేవాడు కాదని, ఇలాటి సృష్టి ఉండేది కాదని, సుఖ దుఃఖాలుండేవి కావని శివనింద. కాని ఇచ్చట ఈ నిందచేత బ్రహ్మ తప్పుడు సృష్టి చేస్తున్నాడనే మరో నింద కనబడటం చేత ఇది 'వ్యాజ నింద అయింది.

 

24)విరోధాభాసాలంకారం :

"అభాసత్వే విరోదస్య విరోధాభాన ఉచ్యతే."

విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం.

ఉదా//"ఓ రాణీ! హారములు లేకున్ననను నీ స్తనాలు హారులైయున్నవి". (చంద్రాలోకం)

 

హారాలు లేకున్నా హారాలుగా ఉన్నాయి అనటం విరోధం. 'హారాలు' అంటే నగలని, 'హారులు' అంటే మనోహరులు అనే అర్థం ఉండటం వల్ల 'నగలు లేకపోయినా నగలున్నట్లుగా గానే స్తనాలు ఉన్నాయనే అర్ధం విరోధాన్ని లేకుండా చేస్తోంది. కనుక ఇది విరోధాభాసాలంకారము.

 

25)సారాలంకారం :

"ఉత్తరోత్తర ముత్కర్షస్సార ఇత్యభిధీయతే."

పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.

ఉదా//

"తేనె తీపి – తేనె కన్న అమృతముతీపి - అంత కన్న హరినామము తీపి."

 

"రాజ్యము నందు భూమి గొప్పది. భూమిలో కూడ పట్టణం గొప్పది. పట్టణంలోనూ భవనం గొప్పది. భవనంలో శయ్య గొప్పది. శయ్యమీద సర్వాంగ శోభిత యైన జవరాలు గొప్పది.

 

26) దీపకాలంకారము

““వదంతి వర్ణ్యా౭వర్ణ్యానాం ధర్మైక్యం దీపకం బుధాః” 

ప్రకృతాప్రకృతములకు ధర్మాలను వర్ణించడం దీపకాలంకారం అవుతుంది. ఒక వస్తువు ప్రకృతము (సహజమైనది) రెండవది అప్రకృతము అయి ఉండాలి.

ఉదా//“మదముచే, కలభమును, ప్రతాపముచే సూర్యుడును ప్రకాశింతురు.”

ప్రకాశించుట అను ధర్మము ఉపమేయమగు కలభమునకు, ఉపమానమగు సూర్యునకు చెప్పబడినది.

27).విషమాలంకారము:

"విషమం వర్ణ్యతే యత్ర ఘటనా౭ననురూపయోః"

కార్యము కారణమునకు విరుద్ధవర్ణముగా జనించుట (పుట్టుట),గుణములకు ఘటనను చెప్పుట ,ప్రయత్నమువిఫలమగుట ,ప్రయత్నమువలన కీడు కల్గుట విషమాలంకారమనబడును

ఉదా:-'ఈ నల్లని కత్తి యా తెల్లని కీర్తిని కన్నది;ఇట కారణ వర్ణమునకు కార్యవర్ణము విరుద్ధము గదా ?నలుపునకు,తెలుపువిరుద్ధముగాదా?

 

28)కావ్యలింగము :

'సమర్ధనీయ స్వార్థస్య కావ్యలింగం సమర్థనమ్'

సమర్ధనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగమని శ్లోకార్థము. సమర్ధింపదగిన కార్యమును కారణ వాక్యముచేత సమర్ధించుట.

ఉదా:--ఓయీ!కందర్పా!నా హృదయమున ఫాలలోచనుడున్న కారణమున  నీవు జయింప బడితివి.

 

29) సంభావనాలంకారము:

'సంభావనం యదిత్సం స్యా దిత్యూహాఒన్యస్య సిద్దయే'

ఒకానొకటి సిద్ధించుటకై ,ఇట్లగునేని అని సంభావించుట సంభావనాలంకారము

ఉదా:-ఓ రాజా! శంభుడు కవియైనచో ,నీ సకల గునముల్యు వర్ణన సిద్ధించును';ఇట సకల గుణ వర్ణన సిద్ధికి శంభుడు కవి యగుట సంభావింప బడినది.

No comments:

Post a Comment